గులాబీ ఆత్మ ఘోష !

    News imageNews image
    గులాబీ పేరెత్తగానే గుర్తొచ్చే ఊరిది.. ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్. నాలుగు దశాబ్దాలుగా ఈ నగరం
    గులాబీ సుగంధాలను విరజిమ్ముతోంది. ఇక్కడ తయారయ్యే అత్తరుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ నగరం నిన్నమొన్నటి దాకా తన ప్రత్యేకతను కాపాడుకుంటూ వచ్చింది.

    కానీ రోజులు మారుతున్నాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన గులాబీ పరిశ్రమ ఇపుడు సంక్షోభంలో పడింది. ఆధునిక టెక్నాలజీతో తయారయ్యే సెంట్లు దీనికి సవాల్ విసురుతున్నాయి. కన్నౌజ్ కళ తప్పుతోంది. ఎన్నో అత్తరు తయారీ కేంద్రాలు క్రమంగా మూతపడుతున్నాయి.
    News image

    అత్తరు పరిశ్రమతో గుర్తింపు పొందిన ఈ నగరాన్నిసందర్శించే పర్యాటకులంతా ఇప్పుడిలా ఎందుకవుతోందని ఆశ్చర్యపోతున్నారు. ఎన్నో కార్లు, లారీలు, వాహనాలతో నిండిన ఇక్కడి రోడ్లపై ఎప్పుడో ఒకప్పుడు కానీ పూల బండి కనిపించదు.

    ఇరవై ఏళ్ల కిందట కన్నౌజ్లో 700 అత్తరు తయారీ కేంద్రాలుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 100 కన్నా తక్కువ. దీన్నిబట్టి ఈ పరిశ్రమ ఎంత సంక్షోభంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తయారీ కేంద్రాలలో గులాబీ పూలు, మల్లె పూలు, గోరింటాకులతో రక రకాల అత్తర్లు తయారు చేస్తారు.

    కన్నౌజ్‌లో అత్తరు తయారీ విధానం చాలా ప్రత్యేకం. ఇక్కడ కిలో గులాబీ అత్తరు తయారీకి నాలుగు టన్నుల పూలను వాడతారు.

    సూర్యోదయానికి ముందు ఈ పూలను కోసి తయారీ కేంద్రాలకు తరలిస్తారు. వాటిని అదే రోజు అత్తరు తయారీకి ఉపయోగిస్తారు.

    ఆ పూలను పెద్దపెద్ద రాగి పాత్రల్లో వేసి అందులో చల్లటి నీళ్ళు పోస్తారు.

    తర్వాత ఆ పాత్రలను పొయ్యిపై పెట్టి 4-6 గంటల పాటు వేడి చేస్తారు. ఆ వేడి ఆవిరి గులాబీ పూల పరిమళాలను వెదజల్లుతుంది. ఆ పరిమళాలను ద్రవ రూపంలో మార్చి వెదురుకర్రల ద్వారా మరో పాత్రలోకి పంపిస్తారు.

    ఇదంత సులువేమీ కాదు. రాగి పాత్ర ఎక్కువ వేడెక్కితే ఆ అత్తరు ద్రవం నుండి పొగవాసన వస్తుంది. అందువల్ల గులాబీలను ఎంతసేపు వేడిచేయాలనేది తెలుసుకోవడమే పెద్ద సవాల్. కానీ ఇక్కడున్నవారు సులభంగా తయారు చేసేస్తారు. తరతరాలుగా ఈ వృత్తి లోనే ఉండటం వల్ల ఆ విద్య వారికి వంటబట్టింది.

    అత్తరు రేటు చాలా ఎక్కువ. ఎందుకు ఎక్కువో చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. అత్త‌ర్ల‌ను కొనుగోలు చేసేది ఆ త‌క్కువ మందే.’’

    వేవ్ భ‌వ్ పాఠ‌క్, మేనేజ‌ర్, మౌనా లాల్ అండ్ స‌న్స్ అత్త‌ర్ల త‌యారీ కేంద్రం.

    గంధపు చెక్క కొరత పెరుగుతుండటం కూడా అత్తరు ధరలు భారీగా పెరగడానికి కారణమవుతోంది. గంధపు తైలాన్ని అత్తరు తయారీకి ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల గంధపు తైలంలో రోజ్ వాటర్ కలిపి అత్తరు తయారు చేస్తారు.

    ఇంతకీ గంధపు చెక్క కొరత ఎందుకు పెరుగుతుంది? అడవులను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం గంధపు చెట్ల నరికివేతను నిషేధించింది. అందుకే గంధపు చెక్క దొరకడం లేదని పాఠక్ తెలిపారు.

    ఇతర తయారీదారులు ఎంచుకొనే మార్గాన్నే మున్నా లాల్ అండ్ సన్స్ అనుసరిస్తోంది. అంటే చౌక పారఫ్ఫిన్ ఆధారిత అత్తర్లను తయారు చేస్తోంది. కానీ అసలైన అత్తర్లు ఎలా ఉంటాయో తెలిసినవాళ్ళు మాత్రం ఇలాంటి అత్తర్లను కొనుగోలు చేయరు.

    ఇంతటి అరుదైన అత్తర్ల తయారీ మార్కెట్ లో ఇంకో ప్రత్యేక ఉత్పత్తి రూహుల్ గులాబ్. కవితాత్మకమైన పేరు. తెలుగులో చెప్పుకుంటే గులాబీ ఆత్మ.
    News image

    ఒక కిలో గులాబీ పువ్వు ద్రవాన్ని మరింత శుద్ధి చేస్తూ చిక్కగా మార్చి, మరే పదార్ధం అందులో లేకుండా చేస్తారు. అంటే ఈ ద్రవాన్ని అసలయిన పూల అత్తరుగా మార్చుతారు.

    మొఘల్ చక్రవర్తి జహంగీర్ (1569-1627) తన స్వీయచరిత్ర "తాజూకి జ‌హంగిరీ"లో అత్తరు గురించి రాస్తూ "మనసుకు హాయినిచ్చే.. ఆత్మను ఉత్తేజపరిచే ఈ సువాసన కన్నా శ్రేష్ఠమైన సువాసన మరేదీ లేదు" అని అన్నారు.

    జ‌హంగీర్ పెయింటింగ్

    జ‌హంగీర్ పెయింటింగ్

    కిలో రూహుల్ గులాబ్ తయారీకి 8 టన్నుల గులాబీలు కావాలి. మున్నా లాల్ అండ్ సన్స్ లో దీని ఖరీదు 11.52 లక్షల రూపాయలు. భారత్‌లో ఇప్పటికీ ఇలాంటి ఖరీదైన అత్తర్లు కొనుగోలు చేసేవారున్నారు.

    అత్తర్లకు ఆదరణ తగ్గడంతో.. కన్నౌజ్ ఇప్పుడు పొగాకు పరిశ్రమకు కేంద్రంగా మారింది. పొగాకు నమలడం కన్నా అసలయిన రోజ్ వాటర్ ఉంటే ఓ చుక్క నోట్లో వేసుకోవడమే ఆరోగ్యానికి మంచిది.

    భారత్‌లోనే కాదు.. గల్ఫ్‌లోనూ అత్తర్లకు మంచి డిమాండ్ ఉంది. భారీ రాగి పాత్రల్లో తయారు చేసిన అత్తర్లకు అక్కడ మంచి గిరాకీ ఉంది.

    2014లో సౌదీలో 9 వేల కోట్ల రూపాయల విలువైన అత్తర్ల వ్యాపారం జరిగింది. ఇక్కడ సగటు కొనుగోలుదారుడు అత్తర్ల కోసం నెలకు 44 వేల రూపాయలు ఖర్చు చేస్తాడు.

    "రూహుల్ గులాబ్ రాసుకుంటే గులాబీ తోటలో ఉన్నట్లుంటుంది. ఇలాంటి సువాసన కేవలం తాజా అత్తరు వల్లే వస్తుంది "అని కువైట్ కు చెందిన ముప్పై ఏళ్ల హాసా అత్ తమీమి తెలిపింది.

    ఇటువంటి అత్తర్లను ముస్లిములు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఎందుకంటే వారు అల్కహాల్ ఉన్న అత్తర్లను వినియోగించరు.

    గల్ఫ్‌లో పాత కాలపు అత్తర్లకు భారీ గిరాకీ ఉంది. అందుకే అక్కడ పెళ్లి వంటి శుభకార్యాల్లో పెళ్లికూతురికి బంగారంతో పాటు "దెజ్జా" అనే చెక్క డబ్బా లో విలువైన అత్తరు పెట్టి ఇస్తారు. ఈ సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది.

    "మా నాన్న ఆయన పెళ్లి సమయంలో.. అమ్మ కోసం భారతదేశానికి వచ్చి అత్యంత ఖరీదైన అత్తరును కొనుగోలుచేశారు." అని కువైట్ కు చెందిన దలాల్ ఆస్ సాని తెలిపారు. ఇప్పటికీ ఆ అత్తరు వాళ్ల అమ్మ దగ్గరే ఉందనీ, తన పెళ్లి సమయంలో వారసత్వంగా వస్తుందని దలాల్ తెలిపారు.

    పెళ్లికూతురే కాదు.. మగవారు కూడా అత్తర్లను వినియోగిస్తారు. గల్ఫ్ లో అయితే రోజ్ వాటర్ వాడకాన్ని పురుషత్వానికి నిదర్శనంగా భావిస్తారు.

    ‘‘మా నాన్న ఇతరులను కలిసినప్పుడు రోజ్ వాటర్ ను చేతికి రాసుకుంటారు. ప్రత్యేకించి ఇతరులతో కరచాలనం చేసినప్పుడు సువాసన కోసం ఆయన బోటనవేలికి, చూపుడు వెలికి మధ్య రోజ్ వాటర్ రాసుకుంటారు’’ అని దలాల్ చెప్పారు.

    అరబ్బు వ్యాపారులు వందల సంవత్సరాల పాటు మిర్చి, అత్తర్ల వ్యాపారం చేశారు. 1900 తర్వాత ఈ వ్యాపారం తగ్గింది.

    కువైట్ లో " సూక్ " మార్కెట్ పూర్తిగా అత్తర్ల వ్యాపారానికి ప్రత్యేకం. "అత్యబ్ అల్ మర్షూద్" షాపును సులైమాన్ అల్ మర్షూద్ 1925లో ప్రారంభించాడు. అతడు తన తండ్రితో కలిసి భారతదేశానికి నౌకలో వచ్చేవాడు. ఇప్పుడు అతడి కొడుకు వలీద్ ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. తన తాత కాలం నుండి భారత అత్తర్ల వ్యాపారులతో ఉన్నసంబంధాలను వలీద్ ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు.

    నేటికీ సూక్ మార్కెట్‌లో ఎన్నో అత్తర్ల షాపులున్నా కన్నౌజ్ "రూహ్ ఉల్ గులాబ్"కే డిమాండ్ ఎక్కువ. మొదటి నుంచీ ఇక్కడ దీనికి ఈ డిమాండ్ అలాగే ఉంది. ఒక తులం రూహుల్ గులాబ్ ధర అత్యబ్ అల్ మర్షూద్ లో 200 కువైట్ దినార్లు అంటే 42 వేల 435 రూపాయలు.

    దుబాయ్‌లో ఒక అత్త‌రు దుకాణం

    దుబాయ్‌లో ఒక అత్త‌రు దుకాణం

    ఇక్కడి వారు ఈ ఖరీదైన అత్తర్లనే అసలయిన అత్తర్లని భావిస్తున్నారు. ‘‘ఈ అత్తర్లు చాలా కష్టంతో తయారయ్యేవి కాబట్టి అవి ఎక్కువ ధర పలుకుతాయని" వలీద్ మర్షూద్ అన్నాడు.

    News image

    అయితే కన్నౌజ్లో ఈ పరిశ్రమపై గందరగోళ పరిస్ధితి నెలకొంది.

    "రాబోయే రోజుల్లో రాగి పాత్రల్లో చేసే అత్తర్లకు అంత డిమాండ్ ఉండబోదని" ప్రగతి అరోమ డిస్‌టిల్లరీ యాజమాని పుష్పరాజ్ జైన్ తెలిపాడు.

    ‘‘నేటి తరం కేవలం ఆధునిక సెంట్లపైనే ఆసక్తి కలిగి ఉంది కనుక దానికి అనుగుణంగా మేం కూడా కొత్తగా ఆలోచిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

    మున్నా లాల్ అండ్ సన్స్ లో అత్తరు తయారుచేసే ఉస్మాన్.. తాను తయారు చేసే అత్తర్ పూర్తి నాణ్యత కలిగిన అత్తరని అంటాడు.

    ఆధునిక సెంట్లకి, సహజమైన అత్తర్లకి ఉన్న తేడా మైక్రోఓవెన్ లో వండే ఆహారానికి, కట్టెలపొయ్యి పై వండే ఆహారానికి ఉండే తేడా లాంటిదని ఉస్మాన్ చెబుతున్నారు.

    ఈ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతుండటంతో.. తాను పడుతున్నకష్టాలు తన పిల్లలకు రాకూడదనే ఉద్దేశంతో ఆయన తన కొడుకులను అధిక ఆదాయం ఇచ్చే వేరే ఇతర వ్యాపారాన్ని ఎంచుకోమన్నాడు.

    కన్నౌజ్ లో ఇప్పటికే ఎన్నో తయారీ కేంద్రాలు మూతబడిపోయాయి.
    News image
    అక్కడ అల్లుకుపోయిన సాలెగూళ్లు, కిటికీల దగ్గర ఊడిన లైట్లు, ఎక్కడో పడేసిన రాగి పాత్రలు చెత్త బుట్టల్లా.. ఈ పరిశ్రమ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చాటి చెపుతున్నాయి.
    News image
    ఇక్కడ గులాబీ పూల ఆత్మ ఘోషిస్తోంది. మరి వాటి సువాసన ఎప్పటి వరకూ కొనసాగుతుందో?
    News image