#AadhaarFacts: ఆధార్ అంత మంచిదైతే ఇన్ని సమస్యలెందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మిషి చౌదరి
- హోదా, బీబీసీ కోసం
ఆధార్.. మొత్తం భారతీయులందరి వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ గుర్తింపు కార్డును ప్రవేశపెట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సేవల కోసం దీన్ని ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది.
ఒక్క సంఖ్య ఆధారంగా ఓ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్నంతా సులువుగా సేకరించే సౌకర్యాన్ని ఆధార్ కల్పిస్తుంది.
మరి నిజంగా ఆధార్ అంత మంచి విధానమైతే, దానిపైన ఇన్ని విమర్శలు ఎందుకొస్తున్నాయి? సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇలాంటి విధానాన్ని తమ ప్రజల కోసం ఎందుకు ప్రవేశపెట్టట్లేదు?
నిజానికి ఈ ‘సింగిల్ టోకెన్ ఐడెంటిటీ’ విధానం ఆచరణకు అంత మంచిది కాదని యూరప్, ఉత్తర అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన చాలామంది కంప్యూటర్ రంగ శాస్త్రవేత్తలు, విధానకర్తలు అభిప్రాయపడతారు.
2010లో బ్రిటన్ కూడా ఆధార్ లాంటి ‘నేషనల్ బయోమెట్రిక్ ఐడెంటిటీ కార్డ్’ను రద్దు చేసింది. ఇజ్రాయెల్‌లో గుర్తింపు కోసం స్మార్ట్ కార్డు విధానం ఉన్నా దానిపైన వేలిముద్రలు ఉండవు. ఆ డేటా కూడా కేవలం కార్డుపైనే ఉంటుంది తప్ప ఎలాంటి డేటాబేస్‌లోనూ ఆ సమాచారం నిక్షిప్తం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని కాలిఫోర్నియా, కోలరాడో రాష్ట్రాల్లో మాత్రమే వేలిముద్రలను లైసెన్స్ దరఖాస్తులో భాగం చేశారు. అంతకుమించి జాతీయ స్థాయిలో అమెరికాకు అలాంటి కార్డుల విధానం లేదు.
చాలా దేశాలు పర్యాటకుల నుంచి మాత్రమే బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరిస్తాయి తప్ప, తమ దేశ పౌరుల నుంచి అలాంటి సమాచారం తీసుకోవు.
బ్యాంకు ఖాతాలు, ఓటర్ గుర్తింపు కార్డులకు బయోమెట్రిక్ సమాచారాన్ని అనుసంధానించే విధానం చైనా, ఆఫ్రికా, వెనెజువెలా, ఇరాక్, ఫిలిప్పీన్స్ లాంటి కొన్ని దేశాల్లో తప్ప మరెక్కడా కనిపించదు.
భద్రతకు విఘాతం!
ప్రభుత్వ నియంత్రణలో ఉండే డేటాబేస్‌లలో బయోమెట్రిక్, జీనోమిక్ సమాచారాన్ని పొందుపరచడమంటే ఓ రకంగా వ్యక్తుల సామాజిక భద్రతను రిస్క్‌లో పెట్టడమే. ఒకవేళ ఆ సమాచారం లీకైతే ఆ నష్టాన్ని పూడ్చడానికి అవకాశం ఉండదు.
ఏ ప్రభుత్వమైనా తమ దగ్గరున్న సమాచారం ఎప్పటికీ లీకవ్వదని చెబితే, అది నిజంగా అద్భుతమే. కానీ ఆచరణలో అది సాధ్యం కాదు.
ఆధార్ విషయంలో ప్రామాణిక సాంకేతిక భద్రతా విధానాలను అమలు చేసిన దాఖలాలు కనిపించట్లేదు. ఆధార్‌ని ఓ ఉత్తమమైన విధానంగా చూపించేలా ప్రచారం జరుగుతుందే తప్ప దాని గోప్యత, భద్రతకు సంబంధించిన విషయాలు బయటకు రావట్లేదు.

ఫొటో సోర్స్, Getty Images
దుర్వినియోగం
ప్రస్తుత ప్రమాణాలతో ఆధార్ డేటా దుర్వినియోగం కాకుండా నివారించడం కూడా సాధ్యం కాదు. అలా దుర్వినియోగం కాకూడదంటే దాని ప్రమాణాలను మరింత ఉన్నత స్థితికి చేర్చాలి.
చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో అలాంటి పకడ్బందీ విధానమే కొనసాగుతోంది. అక్కడ 12 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న అందరి డీఎన్‌ఏ, వేలిముద్రలు, ఐరిస్, బ్లడ్ గ్రూప్ వివరాలన్నింటినీ సేకరిస్తారు. వాటిని స్థానిక రిజిస్ట్రేషన్ కార్డులకు అనుసంధానిస్తారు. విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణం లాంటి ప్రభుత్వ పరమైన ప్రయోజనాల కోసం ఆ సమాచారాన్ని ఉపయోగిస్తారు.
ముఖాన్ని గుర్తించే పరిజ్ఞానం, సీసీటీవీ కెమెరాల్లో నమోదైన చిత్రాలు, బయోమెట్రిక్ సమాచారం.. ఇలా అన్నింటినీ అనుసంధానించి ఉపయోగించడం వల్ల జిన్‌జియాంగ్‌లో అనుసరిస్తున్న విధానానికి చాలా కట్టుదిట్టమైందిగా గుర్తింపు దక్కింది. సాంకేతికంగా ఆ దేశం ఎదుగుతున్న తీరుకి ఈ విధానమే ఓ ఉదాహరణ.
కానీ ఇప్పటికే ఆధార్‌పైన వస్తున్నవార్తలు, ‘ఆన్‌గ్రిడ్’ లాంటి కొన్ని సంస్థలు అందిస్తున్న సేవలు కూడా ఆధార్ సమాచారం దుర్వినియోగం అవుతుందేమోననే భయాలకు బలం చేకూరుస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అమలులో లోపాలు
ఆధార్ లేని కారణంగా రేషన్ ఆగిందనో, సబ్సిడీలు అందలేదనో వార్తలు చూస్తూనే ఉంటాం. నిజానికి అర్హులకు అన్ని ప్రయోజనాలూ అందాలన్నదే ఆధార్ వెనకున్న ఉద్దేశం. అలాంటిది ఆధార్ కారణంగానే కొందరికి ఆ ప్రయోజనాలు దక్కట్లేదు.
ఇలాంటి కారణాల వల్లే యూరోప్, ఉత్తర-అమెరికా ప్రాంతాల్లో గుర్తింపు కోసం వివిధ రకాల కార్డులను ఉపయోగిస్తారు. ఒకే ఒక్క కార్డును ఉపయోగించడం వల్ల తలెత్తే రిస్కుని అరికట్టడానికే అనేక దేశాలు ఈ విధానానికి దూరంగా ఉంటున్నాయి.
సుప్రీంకోర్టులో ఇప్పటికే ఆధార్ విషయంలో అనేక పిటిషన్లు విచారణలో ఉన్నాయి. వాటి విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఎలాంటి తీర్పును వెలువడిస్తుందో వేచి చూడాలి.
(రచయిత టెక్నాలజీ లాయర్, సాఫ్ట్‌వేర్ ఫ్రీడం లా సెంటర్ లీగల్ డైరెక్టర్)
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








