జపాన్ పిల్లల ఆత్మహత్యలు: ఏడాదిలో 250 మంది మృతి – 30 ఏళ్లలో ఇదే అత్యధికం

ఫొటో సోర్స్, Getty Images
జపాన్‌లో బాలల ఆత్మహత్యలు గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగాయని ఆ దేశ విద్యాశాఖ వెల్లడించింది.
2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి వరకు 250 మంది పాఠశాల విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదిక చెబుతోంది. 1986 నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఇదే అత్యధికం.
అంతకు ముందటి ఏడాది అంటే 2015/16లో 245 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు.
కుటుంబ సమస్యలు, భవిష్యత్తు పట్ల ఆందోళన, బెదిరింపులు వంటివి ఈ ఆత్మహత్యలకు కారణాలుగా పేర్కొన్నారు.
అయితే, వారిలో 140 మంది ఎందుకు చనిపోవాలనుకుంటున్నారో చెబుతూ ఎలాంటి లేఖలూ రాయలేదని పాఠశాలలు తెలిపాయి.

బలవన్మరణాలకు పాల్పడిన వారిలో ఎక్కువగా హైస్కూల్ వయసు వారే ఉంటున్నారు. సాధారణంగా జపాన్‌లో 18 ఏళ్ల వయసు వచ్చేవరకు చదువుకుంటారు.
1972 నుంచి 2013 వరకు దేశంలో జరిగిన ఆత్మహత్యల గణాంకాలకు సంబంధించిన నివేదికను 2015లో జపాన్ కేబినెట్ కార్యాలయం విడుదల చేసింది.
ఏటా సెప్టెంబర్ ఆరంభంలో అత్యధికంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆ నివేదికలో వెల్లడైంది.
జపాన్‌లో పాఠశాలలు ఏప్రిల్‌లో తెరుచుకుంటాయి. మొదటి విడతలో జూలై 20 వరకు తరగతులు నడిచిన తర్వాత వేసవి సెలవులు ఇస్తారు. తిరిగి సెప్టెంబరు 1 నుంచి రెండో విడత ప్రారంభమవుతాయి.

వయసుతో నిమిత్తం లేకుండా చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015 గణాంకాల ప్రకారం, అత్యధికంగా ఆత్మహత్య కేసులు నమోదవుతున్న దేశాల్లో జపాన్ ఒకటి.
అయితే, గత కొన్నేళ్లుగా ప్రభుత్వం చేపడుతోన్న నివారణా చర్యలతో పరిస్థితి మారుతోందని అధికారులు చెబుతున్నారు.
2003లో దేశవ్యాప్తంగా 34,500 మంది, 2015లో 25,000 మంది ప్రాణాలు తీసుకున్నారు.
2017లో ఆ సంఖ్య 21,000కు తగ్గిందని పోలీసులు తెలిపారు. మొత్తం సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. కానీ, బాలల ఆత్మహత్యల రేటు మాత్రం పెరుగుతోంది.
"విద్యార్థుల బలవన్మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇది ఆందోళనకరమైన విషయం. ఆత్మహత్యల నివారణ కోసం తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది" అని జపాన్ విద్యాశాఖ అధికారి నోరియాకి కిటజాకి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'బూటు'లో మిఠాయి: జపాన్ ప్రధానికి ఇజ్రాయెల్ వింతైన విందు!
- జపాన్: ఇక కోకా కోలా మద్యం
- దీపావళి హరిత టపాసులు: ‘ధర తక్కువ.. మోత ఎక్కువ.. పైగా కాలుష్యం లేకుండా’
- జపాన్ తీరంలో 'ఘోస్ట్ షిప్స్’.. ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- ఇది మ్యాన్ హోల్ అంటే నమ్మగలరా?
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- అభిప్రాయం: కాంగ్రెస్ - టీడీపీ కలయికను ఎలా అర్థం చేసుకోవచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









