'బూటు'లో మిఠాయి: జపాన్ ప్రధానికి ఇజ్రాయెల్ వింతైన విందు!

ఫొటో సోర్స్, segevmoshe
- రచయిత, బీబీసీ మానిటరింగ్
- హోదా, ------
ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధానమంత్రి షింజో అబే తన భార్యతో కలిసి ఆ దేశ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు అధికారిక నివాసంలో రాత్రి భోజనానికి వెళ్లినప్పుడు ఓ వింత అనుభవం ఎదురైంది.
మే 2న ఇచ్చిన ఆ విందులో వారికి ఒక 'బూటు'లో డెజర్ట్ (తీపి పదార్థం) సర్వ్ చేశారు.
అద్భుతంగా సాగిన ఆ విందు చివరలో ప్రధానమంత్రి వ్యక్తిగత షెఫ్ కూడా అయిన ఇజ్రాయెలీ సెలెబ్రిటీ షెఫ్ సెగేవ్ మోషే ఓ మేలి రకం చాక్లెట్ సర్వ్ చేశారు. లోహంతో తయారైన ఓ 'బూటు'లో దాన్ని సర్వ్ చేయడంతో అది చర్చకు తావిచ్చింది.
సమస్య ఏంటంటే, జపాన్ సంస్కృతిలో బూటును చాలా అవమానకరమైందిగా భావిస్తారు.
అయితే అబే మాత్రం తనకు సర్వ్ చేసిన డెజర్ట్‌ను ఎలాంటి తడబాటు లేకుండా లాగించేశారు. కానీ ఇది జపాన్, ఇజ్రాయెల్ దౌత్య అధికారులకు మాత్రం మింగుడుపడలేదు.
జపాన్ ప్రధానికి బూటులో భోజనం వడ్డించడంపై జపాన్ వ్యవహారాల నిపుణులు దిగ్భ్రాంతి చెందారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
జపాన్ సంస్కృతిలో బూటు
జపాన్‌లో సుదీర్ఘకాలం పని చేసిన ఓ సీనియర్ దౌత్యవేత్త ఇజ్రాయెలీ దినపత్రిక యెదియోత్ అహ్రానోత్‌తో మాట్లాడుతూ, "ఇదొక అసంబద్ధమైన, మూర్ఖపు నిర్ణయం" అని వ్యాఖ్యానించారు.
"జపాన్ సంస్కృతిలో బూటుకన్నా తుచ్ఛమైంది మరొకటి ఏదీ లేదు. జపాన్‌లో ఇళ్లలోకే కాదు, కార్యాలయాల్లోకి వెళ్లేప్పుడు కూడా బూట్లు బయట విడుస్తారు. ప్రధానమంత్రి, ఇతర మంత్రులు సైతం బూట్లు తొడుక్కొని పార్లమెంటులోకి, తమ కార్యాలయాలలోకి వెళ్లరు. ఇది ఎలాంటి మూర్ఖత్వం అంటే, ఒక యూదు చుట్టానికి పంది ఆకారంలో భోజనం వడ్డించడం లాంటిదే" అని ఆయనన్నారు.
ఒక జపాన్ దౌత్యవేత్త యెదియోత్‌తో మాట్లాడుతూ, "ఏ సంస్కృతిలోనైనా బూట్లను టేబుల్ మీద పెట్టరు. అసలా షెఫ్ మెదడులో అప్పుడు ఉన్నదేంటో. ఒకవేళ ఇది వేళాకోళం అయితే, మాకస్సలే నచ్చలేదు. మా ప్రధాని పట్ల ఇలా జరిగినందుకు మాకు బాధగా ఉంది" అని చెప్పారు.
మరోవైపు షెఫ్ సెగేవ్ తన సోషల్ మీడియా ప్రొఫైల్‌పై ఈ డిన్నర్‌కు సంబంధించిన ఫొటోల్ని షేర్ చేశారు. ఇందులో బూటులో సర్వ్ చేసిన డెజర్ట్ ఫొటో కూడా ఉంది.

ఫొటో సోర్స్, AFP
ఈ ఫొటోపై స్పందిస్తూ ఒక యూజర్, "మీరు చాలా పెద్ద తప్పు చేశారు" అని కామెంట్ రాశారు.
"ఈ దేశం ఈ విషయాన్ని ఎన్నటికీ మర్చిపోదు. సెగేవ్, నేను నిన్ను బాగా ప్రేమించేవాడిని. కానీ ఇప్పుడు నీ పట్ల సిగ్గు పడుతున్నా" అని మరో యూజర్ కామెంట్ చేశారు.
ఎన్నో అవార్డులు గెల్చుకున్న షెఫ్ సెగేవ్ ఇజ్రాయెల్‌లోని ఒక ప్రముఖ రెస్టారెంట్ యజమాని కూడా. ఆయన అనేక పుస్తకాలు రాశారు. ఆయనో టీవీ సెలబ్రిటీ కూడా. ఈఎల్ఏఎల్ ఎయిర్‌లైన్స్‌లో కూడా ఆయన ప్రధాన షెఫ్‌గా ఉన్నారు.
2015లో షింజో అబే తొలిసారి ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ఆ దేశంలో పర్యటించిన తొలి జపాన్ ప్రధాని అయ్యారు. మొన్నటి సమావేశంలో ఇద్దరు ప్రధానుల మధ్య ఉత్తర కొరియా, ఇరాన్ అణు ఒప్పందం, ఇజ్రాయెల్-పాలస్తీనా శాంతి చర్చలు తదితర అంశాలపై చర్చలు జరిగాయి.
(ప్రపంచవ్యాప్తంగా టీవీ, రేడియో, వెబ్, ప్రింట్ మాధ్యమాల్లో ప్రసారమయ్యే వార్తలను బీబీసీ మానిటరింగ్ రిపోర్ట్ చేస్తుంది, విశ్లేషిస్తుంది. బీబీసీ మానిటరింగ్ వార్తలను మీరు ట్విటర్, ఫేస్‌బుక్‌లపై కూడా చదవొచ్చు.)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








