రష్యా ‘ఫీనిక్స్’లా నిలబడింది: అధ్యక్షుడు పుతిన్

ఫొటో సోర్స్, Reuters
గతంలో ఎదురుదెబ్బలు తగిలినా రష్యా తట్టుకొని నిలబడిందని, 'ఫీనిక్స్' పక్షిలా తిరిగి యథాపూర్వ స్థితికి చేరుకుందని, ప్రగతి పథంలో సాగుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు.
అధ్యక్షుడిగా ఆయన సోమవారం మాస్కోలో నాలుగోసారి ప్రమాణం చేశారు. రష్యా అధినేతగా దేశ బలాన్ని, సంపదను భారీగా పెంచేందుకు తాను చేయగలిగినదంతా చేస్తానని ఆయన చెప్పారు.
అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని, కొత్త వాటిని, అత్యంత ఆధునికమైన వాటిని స్వీకరించగల స్వేచ్ఛా సమాజంతోనే ఇది సాధ్యమని ఆయన తెలిపారు.
ఇప్పటివరకు మూడుసార్లు అధ్యక్షుడిగా, ఒకసారి ప్రధానిగా మొత్తం 18 ఏళ్లపాటు పుతిన్ అధికారంలో కొనసాగారు. ఆయనకు ఇప్పుడు 65 ఏళ్లు.

ఫొటో సోర్స్, AFP
ఆయన 2000 మార్చిలో తొలిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి అధ్యక్షుడయ్యారు. రష్యాలో ఎవరైనా వరుసగా రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడయ్యేందుకు వీల్లేదనే నిబంధన ఉంది.
ఈ నేపథ్యంలో, 2008లో పుతిన్ సన్నిహితుడైన దిమిత్రీ మెద్వెదేవ్ అధ్యక్ష పీఠం ఎక్కారు. పుతిన్ ప్రధాని పదవి చేపట్టారు. 2012లో తిరిగి అధ్యక్షుడయ్యారు.
అధ్యక్షుడి పదవీకాలాన్ని నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచుతూ కొత్త చట్టం వచ్చింది.
ఈ ఏడాది మార్చిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 76 శాతానికి పైగా ఓట్లతో పుతిన్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఇదే ఆయనకు అత్యధిక మెజారిటీ.
ఎన్నికల్లో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని కొందరు అంతర్జాతీయ పరిశీలకులు ఆరోపించారు. గత ఎన్నికల్లోనూ రిగ్గింగ్, ఇతర ఆరోపణలు వచ్చాయి.
సోమవారం అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి దాదాపు ఐదు వేల మంది హాజరయ్యారు.
రష్యా ప్రధాని దిమిత్రీ మెద్వెదేవ్, జర్మనీ మాజీ ఛాన్సలర్, రష్యా ఇంధన సంస్థ గ్యాజ్‌ప్రోమ్ శాఖల్లో ఒక శాఖ బాధ్యతలు చూసే గెర్హార్డ్ ష్రోడర్ ముందు వరుసలో కూర్చున్నారు.
అధ్యక్షుడిగా పుతిన్ పదవీకాలం 2024లో ముగియనుంది.

ఫొటో సోర్స్, Reuters
19 నగరాల్లో వెయ్యి మంది నిరసనకారుల అరెస్టు
శనివారం 19 నగరాల్లో పుతిన్ వ్యతిరేక ప్రదర్శనల్లో వెయ్యి మందికి పైగా నిరసనకారులను అధికారులు అరెస్టు చేశారు.
వీరిలో దాదాపు సగం మందిని రాజధాని మాస్కోలోనే అరెస్టు చేశారు.
2012లోనూ పుతిన్ ప్రమాణ స్వీకారానికి ముందు తీవ్రస్థాయిలో నిరసనలు జరిగాయి.
'ఈ జార్‌ను జైల్లో పెట్టాలి'
ఒకప్పుడు రష్యాను పాలించిన చక్రవర్తులను జార్‌లుగా వ్యవహరిస్తారు. మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరాల్లో జరిగిన ర్యాలీల్లో, 'జార్' అనే మాటను ప్రయోగిస్తూ పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు గుప్పించారు. ''ఈ జార్‌ను జైల్లో పెట్టాలి'', ''పుతిన్ లేని రష్యా కావాలి'' అని డిమాండ్ చేశారు.
రష్యాలో ప్రజాస్వామ్యాన్ని పుతిన్ దెబ్బతీస్తున్నారని, సిసలైన ప్రతిపక్షాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు, ఆయన, తన మిత్రపక్షాలు శాశ్వతంగా అధికారంలో కొనసాగేందుకు వీలుగా ఆయన ఇలా చేస్తున్నారని స్వదేశంలోని ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు.
అవినీతి కేసులో దోషిగా తేలారంటూ, మొన్నటి ఎన్నికల్లో పోటీచేయకుండా విపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. తనపై ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడినవని నావల్నీ ఆరోపించారు.
శనివారం మాస్కోలో ప్రభుత్వ అనుమతి లేకుండా చేపట్టిన ఒక నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు ప్రయత్నించడంతో నావల్నీని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి, తర్వాత విడిచిపెట్టారు.

ఫొటో సోర్స్, AFP
పుతిన్ విశేషాలు
పుతిన్ 1952 అక్టోబరు 7న లెనిన్‌గ్రాడ్(నేటి సెయింట్‌పీటర్స్‌బర్గ్)లో జన్మించారు. న్యాయశాస్త్రం చదివారు. విశ్వవిద్యాలయంలో చదువు పూర్తిచేసుకున్న తర్వాత సోవియట్ యూనియన్ భద్రతా, గూఢచార సంస్థ కేజీబీలో చేరారు. కమ్యూనిస్టు తూర్పు జర్మనీలో రష్యా గూఢచారిగా పనిచేశారు.
1990ల్లో సెయింట్ పీటర్స్‌బర్గ్ మేయర్ బృందంలో ముఖ్య బాధ్యతలు చేపట్టారు.
1997లో రష్యా తొలి అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్ యంత్రాంగంలో స్థానం దక్కించుకున్నారు.
అనంతరం కేజీబీ స్థానంలో వచ్చిన సంస్థల్లో ఒకటైన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ సారథిగా నియమితులయ్యారు.
1999లో ప్రధాని అయ్యారు. బోరిస్ యెల్ట్సిన్ రాజీనామా నేపథ్యంలో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
2000, 2004లలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
2008లో ప్రధాని పదవి చేపట్టారు.
2012లో, 2018లలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








