ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించకూడదు: బ్రిటన్

ఫొటో సోర్స్, EPA
ఇరాన్‌తో కుదుర్చున్న అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళనలను తగ్గించేందుకు తాను కొన్ని ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు అమెరికాలో బ్రిటన్ రాయబారి కిమ్ డెరోక్ తెలిపారు.
ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఈ ఒప్పందాన్ని రద్దుచేస్తూ ఆయన ఏ సమయంలోనైనా ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు.
ఒప్పందాన్ని రద్దు చేయకుండా అమెరికాను నిరోధించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మార్గాల్ని అన్వేషిస్తున్నాయని కిమ్ డెరోక్ వెల్లడి చేశారు.
"ఈ విషయంలో మా అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. ట్రంప్ ఆందోళనలను దూరం చేయడానికి మా సహచర దేశాలైన ఫ్రాన్స్, జర్మనీలతో కలిసి పని చేస్తున్నాం. ఈ ఒప్పందాన్ని ఇరాన్ పాటిస్తున్నంత కాలం ఒప్పందం ఉనికిలో ఉండాలనేదే మా ప్రయత్నం" అని ఆయన చెప్పారు.
కానీ ట్రంప్ మాత్రం "ఈ ఒప్పందంలో ఉన్న వినాశకరమైన లోపాలను సరిదిద్దడానికి" దీనిపై సంతకాలు చేసిన దేశాలు అంగీకరించకపోతే అమెరికా ఇందులోంచి వైదొలుగుతుందని హెచ్చరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Alamy
'ఇరాన్ పాత బాటే పట్టొచ్చు'
ఈ ఒప్పందాన్ని అమెరికా రద్దు చేస్తే ఇరాన్ తన అణు కార్యక్రమం వైపు మళ్లీ మళ్లే అవకాశం ఉందని గతంలో అమెరికాలో బ్రిటిష్ రాయబారిగా పనిచేసిన పీటర్ వెస్ట్‌మెకాట్ అభిప్రాయపడ్డారు.
"ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమం వైపు వెళ్లడమే ప్రయోజనకరమని అక్కడి ఛాందసవాదులు, ముఖ్యంగా రెవల్యూషనరీ గార్డులు, ఇంకా పశ్చిమ దేశాలతో ఒప్పందాలు చేసుకోవద్దని గట్టిగా భావించే మరికొందరు ఇరాన్ సర్వోన్నత నేత ఆయతుల్లా ఖమెనీని ఒప్పించే అవకాశం కూడా ఉంది" అని ఆయనంటారు.
అంతకుముందు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఈ విషయంపై మాట్లాడుతూ, ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేసుకుంటే అమెరికా ఈ చారిత్రక తప్పిదానికి భవిష్యత్తులో పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ వద్ద ఏమున్నాయి?
అణు ఒప్పందం విషయంలో అమెరికా, ఇరాన్ చేస్తున్న ప్రకటనలకు అర్థం ఏంటి?
"అమెరికా ఈ ఒప్పందాన్ని రద్దుచేసుకోకూడదని అన్ని వైపుల నుంచీ చెబుతున్నారు. ఇరాన్ వద్ద వనరులున్నాయి. జ్ఞానం ఉంది. ఇరాన్ తన దేశంలో సాగుతున్న అణు పరిశోధన కార్యక్రమ వేగాన్ని పెంచెయ్యగలదు" అని వాషింగ్టన్‌కు చెందిన డాక్టర్ ఎహసాన్ ఎహరారీ చెప్పారు.
"ఇరాన్‌పై సైనిక చర్య చేపడతానంటూ ట్రంప్ చేస్తున్నవి బెదిరింపులు మాత్రమే కాదు. జార్జ్ బుష్ హయాంలో ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌పై చేపట్టినట్టుగా అమెరికా ఇరాన్‌పై సైనిక చర్యకు ఉవ్విళ్లూరుతోంది" అని ఇరాన్ వ్యవహారాల నిపుణుడు కూడా అయిన ఎహసాన్ అన్నారు.
ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలివీ: అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్. ఒప్పందాన్ని అట్లాగే కొనసాగించాలని అమెరికా మినహా ఈ దేశాలన్నీ కోరుకుంటున్నాయి.
ఈ ఒప్పందం మూడేళ్ల క్రితం ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగింది.
ఈ ఒప్పందం తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేసింది. దానికి ప్రతిస్పందనగా, ఇరాన్‌పై అమలవుతున్న ఆర్థిక ఆంక్షలను అమెరికా సడలించింది.
ట్రంప్ అమెరికా అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఈ ఒప్పందం భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








