ఒడిశా: పార్సల్ బాంబు నిందితుణ్ని అతడి ఉత్తరమే పట్టించింది

- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏప్రిల్ ప్రారంభంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉన్న రోజున ఆ ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని పంపిన గుర్తు తెలియని వ్యక్తి దాని మీద 'ముఖ్యమైన ఉత్తరం' అని రాసి, ఒడిశాలోని బాలంగీర్ జిల్లా పోలీస్ చీఫ్‌కు పంపారు.
అది చాలా వింత ఉత్తరం. ఉత్తరంలో ఒక తెల్ల కాగితంపై 130 పదాలు ఉన్నాయి. దానిలో ఇటీవల జిల్లాలో ఒక పెళ్లి సందర్భంగా పేలిన పార్సల్ బాంబు గురించిన సమాచారం ఉంది.
ఆ ప్రమాదంలో 26 ఏళ్ల వరుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సౌమ్య శేఖర్ సాహు మరణించగా, 22 ఏళ్ల వధువు రీమా తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరిలో వారి పెళ్లి జరిగిన అయిదు రోజుల అనంతరం వారికి బహుమానంగా ఒక పార్సల్ వచ్చింది. దాన్ని తెరవడంతోనే అది పేలిపోయి సాహు మృతి చెందారు.
పట్నాగఢ్‌లో జరిగిన ఆ ప్రమాదంలో సాహు కుటుంబానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు కూడా మరణించారు.
ఆ పార్సల్‌ను పక్క రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ నుంచి ఎస్కే శర్మ అనే వ్యక్తి పంపినట్లు పోలీసులు తెలిపారు. అయితే పేరు, చిరునామా రెండూ కూడా తప్పుడువే అని పోలీసుల విచారణలో తేలింది.
బాలంగీర్ పోలీస్ అధికారికి అందిన ఉత్తరంలో, ఆ ఉత్తరాన్ని ప్రత్యేక దూత ద్వారా పంపుతున్నట్లు పేర్కొన్నారు.
పార్సల్ బాంబును పంపింది ఎస్కే సిన్హా కాదనీ, ఆర్కే శర్మ అనీ దానిలో పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రాజెక్టును ముగ్గురు వ్యక్తులు పూర్తి చేశారని, వాళ్లు పోలీసులు చేరుకోలేని చోట దూరంగా ఉన్నారని ఉత్తరంలో రాసి ఉంది.
ఆ పేలుడుకు కారణం పెళ్లికొడుకు చేసిన కోట్లాది రూపాయల మోసం అని పేర్కొన్నారు. ఆ ఉత్తరం పంపిన వ్యక్తి, ''మొత్తం కుటుంబాన్ని చంపినా మాకు కలిగిన నష్టం భర్తీ కాదు'' అని రాశారు.

ఫొటో సోర్స్, ORISSA POLICE
ఉత్తరంతో అనుమానం ప్రారంభం
ఈ పేలుడుకు సంబంధించి పోలీసులు నాలుగు నగరాల్లో వంద మందికి పైగా సాక్షులను విచారించారు. వేల మొబైల్ ఫోన్ రికార్డులను, వధూవరులకు చెందిన ల్యాప్‌టాప్‌లను పరిశీలించారు.
మృతి చెందిన వరునికి ఎంగేజ్‌మెంట్ తర్వాత ఒక బెదిరింపు కాల్ వచ్చిందని విచారణలో గుర్తించారు. ఆ వ్యక్తి వధువును ప్రేమించాడని, అందుకే ఇలా బెదిరించాడని గుర్తించారు. అయితే ఈ పేలుడుతో అతనికి ఎలాంటి సంబంధమూ లేదని తేల్చుకున్న మీదట అతణ్ని వదిలేశారు.
ప్రజలు, మీడియా నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం ఈ కేసును క్రైం బ్రాంచ్‌కు అప్పగించింది.
అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న క్రైం బ్రాంచ్ చీఫ్ అరుణ్ బొత్రాకు వాట్సాప్‌లో ఆ ఉత్తరాన్ని స్కాన్ చేసి పంపారు.
''ఆ ఉత్తరాన్ని నేను కొన్ని వందలసార్లు చదివాను. దాని చూస్తూ రాత్రీ పగలూ ఆలోచించాను. ఆ ఉత్తరం అనేక విషయాలు వెల్లడించింది'' అని బొత్రా అన్నారు.
''ఉత్తరాన్ని పంపిన వ్యక్తి వేరే వ్యక్తి ద్వారా ఈ ఉత్తరాన్ని పంపుతున్నా అని చెప్పడం ద్వారా ఈ నేరంలో స్థానిక వ్యక్తి ప్రమేయం లేదని చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ ఉపాయం వెనక ముగ్గురు ఉన్నారని చెప్పడం అతని ఉద్దేశం. మేం చేసిన ఒక తప్పును ఎత్తి చూపడం ద్వారా అతను తనను గుర్తు పట్టకుండా చేయాలని ప్రయత్నించాడు'' అని బొత్రా తెలిపారు.

అదే రాత.. అవే పదాలు..
బొత్రా ఆ కేసు రికార్డును పరిశీలించగా ఆ పార్సల్ పంపిన వారి పేరు అస్పష్టంగా ఉందని గుర్తించారు. పోలీసులు దానిని ఎస్కే శర్మ అని భావించినా, అది శర్మా లేక సింగా అని ఆయనకు అనుమానం కలిగింది. అయితే అది నకిలీ పేరని భావించడంతో ఎవరూ దానికి ప్రాధాన్యం ఇవ్వలేదు.
"నాకు హంతకుడే ఈ ఉత్తరాన్ని పంపించి ఉండవచ్చని అప్పుడు అనుమానం కలిగింది. అతను చాలా పెద్ద తప్పు చేశాడు. ఆ ఉత్తరమే విచారణలో కీలకంగా మారింది" అని బొత్రా తెలిపారు.
ఆ ఉత్తరాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా దానిపై అస్పష్టమైన వేలిముద్రలు కనిపించాయి. ఆ కవర్‌ను అతికించడానికి నిందితుడు తన లాలాజలాన్ని వాడి ఉండవచ్చనే అనుమానంతో దానిని కూడా పరిశీలించారు కానీ ప్రయోజనం లేకపోయింది.
పోలీసులు ఆ ఉత్తరాన్ని పరిశీలించమని మృతుడి తల్లిదండ్రులకు పంపారు. అప్పుడు మృతుడి తల్లి ఆ ఉత్తరాన్ని మళ్లీ మళ్లీ పరిశీలించారు.
''దాన్ని చూసి ఆమె తన కాలేజీలో కొలీగ్ ఒకరు రాసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. అతను కూడా అదే విధమైన రాత, అదే విధమైన పదాలు ఉపయోగిస్తారని ఆమె తెలిపారు. తన కొలీగ్ తరచుగా 'ప్రాజెక్టును పూర్తి చేయడం' అన్న పదాలను ఉపయోగిస్తాడని ఆమె ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు.''

పదోన్నతితో వివాదం
పేలుడు జరిగిన తర్వాత మృతుడి తల్లికి సహోద్యోగి అయిన 49 ఏళ్ల పూంజీ లాల్ మెహర్‌ను పిలిచి ప్రశ్నించారు. గత ఏడాది కాలేజీ ప్రిన్సిపల్‌గా అతని స్థానంలో బాధ్యతలు స్వీకరించాక అతను తనను వేధించాడని మృతుడి తల్లి తెలిపారు.
''అయితే అవి కేవలం కాలేజీలో గొడవలనీ, దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేదని భావించాం'' అని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
ఫేస్‌బుక్ పోస్టుల్లో కూడా మెహర్ సూట్లు, బ్లేజర్‌లలో చాలా గౌరవప్రదమైన వ్యక్తిగా కనిపిస్తారు. అతని వ్యక్తిగత సమాచారంలో 1996లో అతను కాలేజీలో చేరినట్లు, 2004లో ప్రిన్సిపల్ అయినట్లు ఉంది. ఆయన ట్విటర్ అకౌంట్‌లో కూడా అనుమానాస్పద కామెంట్లు ఏమీ కనిపించలేదు.
అయితే ఎందుకైనా మంచిదని, అతణ్ని విచారించాలని బొత్రా భావించారు.

ఫొటో సోర్స్, FACEBOOK/PUNJI LAL MEHER
అయితే పోలీసుల విచారణలో మెహర్ - ఒక వ్యక్తి బాలంగీర్‌లో ఉత్తరాన్ని ఇవ్వమని తనను బెదిరించాడని, అందుకే తాను దాన్ని అక్కడ ఇచ్చినట్లు పోలీసులకు చెప్పారు.
అక్కడే పోలీసులు అతణ్ని పట్టేశారు. అతను కట్టుకథలు చెబుతున్నట్లు పోలీసులకు స్పష్టంగా తెలిసిపోయింది.
పోలీసుల విచారణలో తేలింది ఇది: తన స్థానంలో మృతుడి తల్లి ప్రిన్సిపల్ బాధ్యతలు స్వీకరించడంతో మెహర్ రగిలిపోయారు. అక్టోబర్‌లో దీపావళి వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి అతను బాణసంచాకు ఉపయోగపడే పేలుడు పదార్థాలు సేకరించడం ప్రారంభించారు. కొన్ని నెలల్లోనే సొంతంగా బాంబు తయారు చేశారు. దానిని ఒక అట్టపెట్టెలో పెట్టి, దానిపై గిఫ్ట్ రాపర్ చుట్టారు.

ఫొటో సోర్స్, FACEBOOK/PUNJI LAL MEHER
సీసీటీవీ కెమెరాలలో రికార్డు అవుతుందని..
సాహూ పెళ్లికి ముందు, ఒక రోజు కాలేజీ వదలగానే మెహర్ ఇంటికి వచ్చి పార్సల్‌ను తీసుకుని, తన బైక్ మీద దగ్గరలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లారు.
తాను ఇల్లు వదిలి వెళ్లినట్లు సాక్ష్యం లేకుండా చేయడానికి ఫోన్‌ను ఇంటిలోనే వదిలి పెట్టారు. బుకింగ్ వద్ద టికెట్ తీసుకుంటే సీసీటీవీ కెమెరాలలో రికార్డు అవుతుందని టికెట్ లేకుండానే రైలులో రాయ్‌పూర్ వెళ్లారు.
రాయ్‌పూర్‌లో ఒక రిక్షా తీసుకుని ఒక కొరియర్ సర్వీస్‌కు వెళ్లారు. అక్కడ పని చేసే మహిళ పార్సల్‌లో ఏముందని ప్రశ్నించడంతో ఆందోళన చెందిన మెహర్ పార్సల్ బుక్ చేయకుండానే వెళ్లిపోయారు.

ఆ తర్వాత మరో కొరియర్ సెంటర్‌కు వెళ్లి అక్కడ గిఫ్ట్‌లు, స్వీట్లు అని చెప్పి పార్సల్ బుక్ చేశారు. ఆ తర్వాత మళ్లీ రైలు ద్వారా ఇల్లు చేరుకున్నారు. ఆ పార్సల్ మూడు బస్సుల్లో 650 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పలువురి చేతులు మారి ఫిబ్రవరి 20న పట్నాగఢ్ చేరుకుంది. మూడు రోజుల తర్వాత సాహు ఇంటిలో బాంబు పేలింది.
అనుమానం రాకుండా ఉండడానికి సాహు పెళ్లి, అంత్యక్రియలు - రెండింటికీ మెహర్ హాజరయ్యారు.
ప్రస్తుతం మెహర్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ''నాకు కలిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయాను. కోపం, ద్వేషంతోనూ ఈ పని చేశాను'' అని మెహర్ పోలీసులతో అన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








