టాస్క్‌ఫోర్స్ కార్యాలయ పేలుడు కేసు: తలకిందులైన ఇద్దరి జీవితాలు

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
"నాకింకా రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు, అరెస్టు తర్వాత నా జీవితం మొత్తం తలకిందులైపోయింది. నాకు భార్య కావాల్సిన అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సొంతిల్లు, సొంత వ్యాపారం అనే కలలు చెదిరిపోయాయి."
- అబ్దుల్ కలీమ్, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయ పేలుడు కేసులో నిర్దోషిగా విడుదలైన నిందితుడు
కలీమ్ పరిస్థితే కాదు, ఇదే కేసులో నిర్దోషిగా విడుదలైన మహ్మద్ అబ్దుల్ జాహెద్ పరిస్థితి కూడా అలాగే ఉంది.
‘‘నేను ఒకప్పుడు మొబైల్ టెక్నీషియన్‌ని. పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఆపరేషన్‌ను కనీసం అర్థం చేసుకోలేకపోతున్నా. జీవితంలో చాలా వెనుకబడిపోయాను’’ అని జాహెద్ బాధపడుతున్నాడు.
2005 అక్టోబరు 12 దసరా రోజున ఒక వ్యక్తి హైదరాబాద్ బేగంపేటలోని పోలీసు టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో తనను తాను పేల్చుకున్నాడు. అతను బంగ్లాదేశీయుడని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనలో ఒక హోంగార్డు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు.
పేలుడులో బంగ్లాదేశ్‌కు చెందిన హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ) సంస్థ పాత్ర ఉందని, ఆత్మాహుతి దాడికి పాల్పడింది డాలిన్ అనే వ్యక్తనీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అభియోగపత్రంలో పేర్కొంది.
ఇందులో మొత్తం 20 మంది పేర్లు ఉన్నాయి. మహ్మద్ అబ్దుల్ జాహెద్, అబ్దుల్ కలీమ్, షకీల్, సయ్యద్ హాజి, అజ్మల్ అలీ ఖాన్, అజ్మత్ అలీ, మహ్మూద్ బరూద్ వాలా, షేక్ అబ్దుల్ ఖాజా, నఫీస్ బిశ్వాస్‌లతోపాటు బంగ్లాదేశ్ పౌరుడైన బైలలుద్దీన్‌ను కూడా అరెస్ట్ చేశారు.
దాదాపు పన్నెండేళ్ల తర్వాత, కలీమ్, జాహెద్‌లతోపాటు మరో ఎనిమిది మంది నిందితులను హైదరాబాద్‌లోని అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఆగస్టు 10న నిర్దోషులుగా ప్రకటించింది.
సరైన సాక్ష్యాధారాలు లేవంటూ వీరందరిపై ఉన్న ఆరోపణలు కొట్టేస్తూ జడ్జి టి.శ్రీనివాసరావు 65 పేజీల తీర్పు ఇచ్చారు.
"ఆత్మాహుతి చేసుకున్న వ్యక్తికీ, నిందితులకూ మధ్య పేలుడు కుట్రలో సంబంధముందనే అభియోగాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది" అని తీర్పులో ఉంది.
పని వెతుక్కుంటున్న కలీమ్
కలీమ్ ప్రస్తుతం పని కోసం వెతుకుతున్నాడు. అయితే జైల్లో ఉండగా వచ్చిన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ ఆయన్ను పనిచేయనివ్వడం లేదు.
34 ఏళ్ల జాహెద్ జీవితంలో 12 ఏళ్ళు జైల్లోనే గడిచిపోయాయి. హైదరాబాద్ మూసారాంబాగ్‌లోని ఓ ఇరుకైన గల్లీలో ఉండే జాహెద్.. ఇప్పుడు జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టాలనుకొంటున్నాడు.
"నేనిప్పుడు స్థిరపడాలనుకుంటున్నా. త్వరలోనే వ్యాపారం మొదలుపెట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నాకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు" అని అతడు చెప్పాడు

ఇలాంటి కేసుల విచారణలో జాప్యాన్ని తగ్గించేందుకు వీటిని ప్రత్యేక కోర్టులకు అప్పగించాలని డిఫెన్స్ న్యాయవాది ఎం.ఎ. అజీమ్ అంటున్నారు.
"తీర్పు ఏదైనా కావచ్చు, కానీ ఇలాంటి కేసులకు ప్రత్యేక కోర్టులుంటే వేగవంతమైన తీర్పులను ఆశించవచ్చు" అని ఆయన చెప్పారు.
ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు చేయనున్నట్టు సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) డీసీపీ అవినాశ్ మొహంతి తెలిపారు. ‘‘సాక్ష్యాధారాలను తగిన స్థాయిలో పరిగణనలోకి తీసుకోలేదు. అప్పీలు చేయడానికి అన్ని అర్హతలూ ఉన్నాయి" అని చెప్పారు.
మా బాధకు బాధ్యత ఎవరిది: జాహెద్
అప్పీల్‌కు వెళ్లడానికి ప్రాసిక్యూషన్‌కు అన్ని హక్కులూ ఉన్నాయని, అయితే ఒకసారి పెట్టిన సాక్ష్యాధారాలను మాత్రం మార్చే వీల్లేదని డిఫెన్స్ లాయర్ ఎం.ఎ.అజీమ్ చెబుతున్నారు.
"ప్రాసిక్యూషన్ వాళ్లు అప్పీల్‌కు వెళ్లడం అంటే, దేశంలోని అన్ని కోర్టులూ క్లీన్ చిట్ ఇచ్చే వరకు నిర్దోషుల జీవితాలను పట్టి ఉంచడమే. ఇదెంత వరకూ న్యాయం?" అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
తమను అకారణంగా 12 ఏళ్ళు జైల్లో పెట్టినదానికి, తాము పడ్డ బాధకు బాధ్యత ఎవరిదని జాహెద్ భావోద్వేగంగా ప్రశ్నిస్తున్నాడు.
మరి కేసు హైకోర్టుకు వెళితే పరిస్థితి ఏంటని జాహెద్‌ను అడిగితే, "ప్రస్తుతానికి మమ్మల్ని ఒంటరిగా వదిలేయాలని కోరుకుంటున్నాం" అని బదులిచ్చాడు.

‘నా భర్త చావుకు కారణమెవరు?’
నాటి పేలుడులో చనిపోయిన హోంగార్డు సత్యనారాయణ భార్య మహాలక్ష్మి ఇప్పటికీ విషాదంలోనే ఉంది. తన భర్త చావుకు కారణమెవరని ఆమె ప్రశ్నిస్తోంది. భర్త మరణంతో కోడలిగా, వదినగా, ముగ్గురి పిల్లల తల్లిగా ఆమె అనేక బాధ్యతలను భుజాన వేసుకోవాల్సి వచ్చింది. ఆమెకు ఇప్పుడు 57 ఏళ్లు.

"కుటుంబాన్ని పోషించడానికి రోజంతా కుట్టుపని చేసాను. మా మరదలి పెళ్లి చేశాను. పిల్లలకు చదువు చెప్పించాను" అని ఆమె తెలిపారు.
మహాలక్ష్మి ఇప్పుడు కొడుకులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. "వాళ్లకూ కుటుంబాలున్నాయి. మా ఆయన బతికుంటే వాళ్లపై ఆధారపడాల్సిన గతి నాకుండేది కాదు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారామె.
2015 నాటి జాతీయ నేర రికార్డుల విభాగం అంచనా ప్రకారం భారత జైళ్లలోని ఖైదీల్లో 67 శాతం మంది విచారణ ఎదుర్కొంటున్నవారే.
టాస్క్ ఫోర్స్ కార్యాలయ పేలుడు కేసులో జైలు పాలై, నిర్దోషులుగా విడుదలైన ఇద్దరి జీవితాలు ఇప్పటికే తలకిందులయ్యాయి. మరోవైపు దాడి బాధితుల కుటుంబ సభ్యులు 12 ఏళ్లైనా నేటికీ విషాదంలోనే ఉన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








