ఐఎస్ కిల్లర్: నేను 100 మందికి పైగా చంపాను!

చేతుల్లో రైఫిల్

ఫొటో సోర్స్, Getty Images

ఏడేళ్లుగా సిరియాలో భీకర అంతర్యుద్ధం జరుగుతోంది. బషర్ అల్-అసద్ ప్రభుత్వం ఒకవైపు తిరుగుబాటు గ్రూపులతో పోరాడుతోంది. మరోవైపు ఇస్లామిక్ జిహాదీలతో తలపడుతోంది. ఉత్తర సిరియాలోని రక్కా నగరం.. ఈ సంఘర్షణలో చాలా వర్గాలకు రణరంగం. ఒక యువకుడు శాంతియుతంగా నిరసన తెలిపాడు. అతడు ఈ రక్తపాతంలో చిక్కుకున్నాడు? దయాదాక్షిణ్యాలు లేని కిల్లర్‌గా ఎలా మారాడు? ఆ కథ ఇది.

హెచ్చరిక: ఈ కథనంలో చిత్రహింసల వివరణ ఉంటుంది. అది కొందరు పాఠకులను ఆందోళనకు గురిచేయవచ్చు. ఇందులో కొన్ని పేర్లను మార్చటమో, తొలగించటమో జరిగింది.

ఖలీద్ అకస్మాత్తుగా ఒక రోజు నిద్ర లేచి.. రక్కాలో చావు, విధ్వంసాలను చూసి.. కిల్లర్‌గా మారిపోవాలని నిర్ణయించుకోలేదు.

అతడికి ప్రత్యేక ఆహ్వానం అందింది.

అలెప్పోలోని ఎయిర్‌ఫీల్డ్‌కు రావాలని ఆరుగురు యువకులకు ఆదేశాలు అందాయి. అక్కడ.. పిస్టళ్లు, సైలెన్సర్ అమర్చిన తుపాకులు, స్నైపర్ రైఫిళ్లతో చంపటమెలాగో ఒక ఫ్రెంచ్ శిక్షకుడు శిక్షణ ఇస్తాడు.

ఖైదీలుగా పట్టుకున్న సైనికులను టార్గెట్లుగా వాడుకుంటూ.. వారిని ఒక పద్ధతిగా చంపటమెలాగో నేర్చుకున్నారు.

‘‘బందీలుగా చిక్కిన ప్రభుత్వ సైనికులను టార్గెట్లుగా పెట్టుకుని మేం ప్రాక్టీస్ చేశాం’’ అని ఖలీద్ చెప్పాడు.

‘‘వారిని కష్టమైన ప్రదేశంలో ఉంచుతారు. వారిని షూట్ చేయాలంటే స్నైపర్లు కావాలి. లేకపోతే.. కొంత మంది ఖైదీలను ఒకేసారి వదిలిపెడతారు. వారిలో టార్గెట్‌గా ఎంచుకున్న వ్యక్తిని మిగతా వారికి బులెట్ తగలకుండా షూట్ చేయాలని మాకు నిర్దేశిస్తారు.’’

‘‘ఈ హత్యలు ఎక్కువగా మోటార్‌బైక్ మీద వెళుతూ చేయాల్సి ఉంటుంది. బైక్ నడపటానికి మరో వ్యక్తి అవసరం. అతడి వెనుక నేను కూర్చుంటాను. టార్గెట్‌గా పెట్టుకున్న వ్యక్తి నడుపుతున్న కారు పక్కకి బైక్ నడుపుకుంటూ వెళతాం. అప్పుడు అతడిని షూట్ చేస్తాం. ఇక అతడు తప్పించుకోలేడు.’’

ఖలీద్ (అసలు పేరు కాదు) మనుషుల్ని ఫాలో అవటం ఎలాగో నేర్చుకున్నాడు. తాను దగ్గరకు వెళ్లలేని టార్గెట్లను ఆ వ్యక్తులకు సన్నిహితంగా ఉండే వారి నుంచి ‘‘కొనటం’’ ఎలాగో నేర్చుకున్నాడు. ఒక టార్గెట్‌ను షూట్ చేయటానికి కార్ల కాన్వాయ్ దృష్టి మళ్లించటం ఎలాగో నేర్చుకున్నాడు.

అది రక్తసిక్తమైన అమానవీయ శిక్షణ. 2013 మధ్యలో రక్కా నుంచి సిరియా సైన్యం ఉపసంహరించుకున్నపుడు.. ఆ నగరాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని తలచిన అషర్ అల్-షామ్ నాయకులు.. తమ శత్రువులను నిర్మూలించే లక్ష్యంతో ఈ శిక్షణ ఆరంభించారు.

రక్కాతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న సాయుధ తిరుగుబాటుదారులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2013 మార్చిలో రక్కా పూర్తిగా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వచ్చింది

ఈ అతివాద ఇస్లామిక్ గ్రూపు కమాండర్లలో ఖలీద్ ఒకడు. రక్కా సెక్యూరిటీ ఆఫీస్ ఇన్‌చార్జ్ కూడా.

కానీ.. 2011లో సిరియా తిరుగుబాటు మొదలయినపుడు తాను శాంతికాముకుడిగానే ఉండేవాడినని ఖలీద్ బీబీసీతో చెప్పాడు.

‘‘కొంచెం మతభావనలు ఉండేవి. కానీ అంత కఠినంగా పాటించేవాడిని కాదు. తీర్థయాత్రికులను పర్యవేక్షించే ఉద్యోగం చేసేవాడిని’’ అని పేర్కొన్నాడు.

‘‘అప్పుడున్న స్వాతంత్ర్యం.. ప్రభుత్వమంటే కాస్త భయం.. చాలా అద్భుతంగా అనిపించేది’’ అని ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో కదం కలిపిన తొలి రోజును గుర్తు చేసుకున్నాడు.

‘‘మా దేశానికి సాయం చేయటానికి ఏదో చేస్తున్నామని మేమనుకున్నాం. స్వాతంత్ర్యం సాధిస్తామనుకున్నాం. అసద్ కాకుండా మరొకర్ని అధ్యక్షుడిగా ఎన్నుకునే పరిస్థితులు తేవచ్చనుకున్నాం. మాది చిన్న బృందం. పాతిక, ముప్పై మందిమి ఉన్నాం.’’

మొదట నిరసనలు ప్రారంభించినపుడు ఆయుధాలు చేపట్టే ఆలోచన ఎవరికీ రాలేదని ఖలీద్ చెప్పాడు. ‘‘అంత ధైర్యం మాకు లేదు’’ అంటాడు. అయితే భద్రతా బలగాలు నిరసనకారులను అరెస్ట్ చేసి చితకకొట్టాయి.

ఒక రోజు వారు ఖలీద్‌ను నిర్బంధించారు.

‘‘నన్ను వాళ్లు ఇంట్లో నుంచి పట్టుకెళ్లారు. క్రిమినల్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌కి తీసుకెళ్లారు. ఇతర చోట్లలోనూ తిప్పారు. పొలిటికల్ సెక్యూరిటీ, స్టేట్ సెక్యూరిటీ.. చివరికి సెంట్రల్ ప్రిజన్‌కు తీసుకెళ్లారు. నెల రోజులు అక్కడ ఉంచిన తర్వాత విడుదల చేశారు.’’

‘‘కానీ నన్ను సెంట్రల్ ప్రిజన్‌కు తీసుకెళ్లేటప్పటికి నేను అసలు నడవలేని పరిస్థితిలో ఉన్నాను. వీపు నొప్పితో నిద్రకూడా వచ్చేది కాదు.’’

2011 ఆరంభంలో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొన్న పౌరులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2011 ఆరంభంలో సిరియాలోని డేరాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు మొదలయ్యాయి.. త్వరలోనే దేశమంతా నిరసనలు పెల్లుబికాయి

క్రిమినల్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లో ఒక గార్డు తనను చాలా కిరాతకంగా హింసించాడని ఖలీద్ చెప్తాడు. అధ్యక్షుడు అసద్ ఫొటో ముందు తనను మోకరిల్లేలా చేసి.. ‘‘నా దేవుడు చచ్చిపోతాడు.. నువ్వు చచ్చిపోవు. దేవుడికి మరణం ఉంది.. అసద్‌కు లేదు’ అని చెప్పాలని హింసించేవాడు’’ అని వివరించాడు.

‘‘ఆ గార్డుకి రోజు మార్చి రోజు షిఫ్ట్ ఉండేది. అతడు వచ్చాడంటే నన్ను చిత్రహింసలకు గురిచేస్తాడని నాకు తెలుసు.’’

‘‘నా చేతులను పైకప్పునకు కట్టేసి వేలాడదీసేవాడు. నా బట్టలు విప్పేయించేవాడు. ‘ఎగిరే కార్పెట్’ మీద నన్ను పడుకోబెట్టి వీపు మీద కొరడాతో కొట్టేవాడు. ‘‘నువ్వు చావాలి’’ అని అనేవాడు.

‘‘అతడి జైలు నుంచి నన్ను మార్చేసమయానికి నా కాళ్లూ చేతులూ పడిపోయాయి. నన్ను సెంట్రల్ ప్రిజన్‌కు తరలించేటపుడు నన్ను చూసి జైలులోని ఖైదీలు ఏడుస్తున్నారు. నన్ను స్ట్రెచర్ మీద తీసుకొచ్చారు.’’

‘‘దేవుడు నన్ను రక్షిస్తే.. ఆ గార్డు ఎక్కడున్నా చంపేస్తానని నేను డిసైడయ్యాను. వాడు డమాస్కస్ వెళ్లినా నేను చంపేస్తాను.’’

ఇంటి తలుపు గొళ్లేనికి వేసివున్న తాళం
ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్న ఖలీద్‌ను వీడియోలో ఎవరో గుర్తించటంత ఆయనను నిర్బంధించారు

జైలు నుంచి విడుదలయ్యాక ఖలీద్ ఆయుధం చేపట్టాడు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈశాన్యంలో మోహరించిన 17వ రిజర్వ్ డివిజన్ నుంచి 35 మంది సిరియా సైనికులు ఫిరాయించేందుకు తాను ‘‘సాయం’’ చేసినట్లు అతడు చెప్పాడు.

గన్స్ కొనడానికి డబ్బుల కోసం అతడు కొందరిని కిడ్నాప్ చేసి.. వారి వస్తువులు, ఆస్తులను విక్రయించాడు.

కొన్నిసార్లు.. ‘‘నిరసనకారులకు హాని చేస్తారని పేరున్న వారిని’’ ప్రలోభ పెట్టటానికి ఆకర్షణీయమైన మహిళలను ప్రయోగించి పెళ్లి ఆఫర్లు ఇచ్చేవాడినని అతడు వివరించాడు.

వారిని ప్రాణాలతో వదిలిపెట్టేవాడు. కానీ.. వారు సైన్యం నుంచి తిరుగుబాటుదారుల్లోకి ఫిరాయించినట్లు వీడియోలు చిత్రీకరింపచేసేవాడు. తద్వారా వాళ్లు మళ్లీ అధ్యక్షుడు అసద్ కోసం పనిచేసే వీలు లేకుండా చేసేవాడు.

అతడు మొదట పట్టుకున్న బందీకి బదులుగా.. 15 కలష్నికోవ్ రైఫిళ్లు లేదా వాటికి సమాన విలువ గల నగదు వసూలు చేశాడు.

కానీ.. ఒక వ్యక్తికి మాత్రం అటువంటి క్షమ లభించలేదు. అతడు.. ఖలీద్‌ను హింసించిన గార్డు.

‘‘సెంట్రల్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన (గార్డు) వ్యక్తి గురించి నేను ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను. ఒక రోజు అతడి ఆచూకీ దొరికింది. అతడ్ని రహస్యంగా అనుసరిస్తూ అతడి ఇంటికి వెళ్లాం. పట్టుకున్నాం.

‘‘నేను జైలులో ఉన్నపుడు.. ‘ఈ జైలు నుంచి నువ్వు ప్రాణాలతో బయటపడి నన్ను పట్టుకుంటే.. నా మీద దయ చూపొద్దు’ అని అతడు నాతో చెప్పాడు. ఆ విషయాన్ని అతడికి గుర్తు చేశాను. ఆ పనే చేశాను.’’

‘‘అప్పటికి మేం విముక్తం చేసిన సెంట్రల్ ప్రిజన్ సమీపంలోని ఒక పొలానికి అతడిని తీసుకెళ్లాను. మాంసం నరికే కత్తితో అతడి చేతులు నరికివేశాను. అతడి నాలుక బయటకు లాగి కత్తెరతో కత్తిరించాను. అయినా నాకు సంతృప్తి కలగలేదు.

‘‘అతడు తనను చంపేయాలని ప్రాధేయపడ్డాడు. నేను చంపేశాను. నేను ప్రతీకారం తీర్చుకోవటానికి వచ్చాను. అందుకే భయపడలేదు.’’

సైనిక దుస్తుల్లోని వ్యక్తి చేతుల్లో ఎ.కె.47 తుపాకులు

ఫొటో సోర్స్, MARCO LONGARI/AFP

ఫొటో క్యాప్షన్, ఖలీద్ తను కిడ్నాప్ చేసిన వారిలో ధనవంతులను.. కలష్నికోవ్ రైఫిళ్ల కోసం మార్పిడి చేసుకునేవాడు

‘‘అతడిని అన్ని రకాలుగా హింసించినప్పటికీ.. నాకు విచారంగా కానీ బాధగా కానీ లేదు. ఒకవేళ అతడు ఇప్పుడు మళ్లీ బతికివచ్చినా.. మళ్లీ అదే పని చేస్తా.’’

‘‘అతడు ఖైదీలను కొడతాడని, హింసిస్తాడని, అవమానిస్తాడని ఫిర్యాదు చేయటానికి ఏదైనా అధికార వ్యవస్థ ఉన్నట్లయితే.. అతడిని ఇలా చేసేవాడిని కాదు. కానీ ఫిర్యాదు చేయటానికి ఎవరూ లేరు. అతడిని ఆపే ప్రభుత్వం ఏదీ లేదు.’’

తిరుగుబాటు మీద ఖలీద్ విశ్వాసం కోల్పోయాడు. ప్రతి రోజూ తన మనుగడ కోసం యుద్ధం చేయటం మీదే అతడి దృష్టి కేంద్రీకృతమైంది. సిరియా ఆటవిక సంఘర్షణలో.. అతడు త్వరలోనే ఇంకా కిరాతకమైన పాత్ర పోషించబోతున్నాడు. జిహాదీ గ్రూపు అయిన ఇస్లామిక్ స్టేట్ (ఐస్) కోసం అసాసిన్ (హంతకుడు)గా పనిచేయబోతున్నాడు.

‘‘ఐస్‌కి స్నేహితుడిలా నటించాను.. ఆ తర్వాత వారిని చంపాను...’’

స్నేహం, వంచన.. ఎత్తుగడలపై గొడవలు.. బలాబలాల్లో హెచ్చుతగ్గులు... సిరియా తిరుగుబాటుదారులు చాలా మంది వైరి పక్షాల మధ్య అటూ ఇటూ మారుతుండటానికి కారణమయ్యాయి. కొన్నిసార్లు ఈ ఫిరాయింపులు పదే పదే జరుగుతుండేవి.

ఈ నేపథ్యంలోనే.. తనకు కిల్లర్‌గా శిక్షణనిచ్చిన అహ్రార్ అల్-షామ్‌ను ఖలీద్ విడిచిపెట్టాడు. అల్-నుస్రా ఫ్రంట్‌లో చేరాడు. అప్పుడది సిరియాలో అల్-ఖైదీ అధికారిక అనుబంధ సంస్థ.

ఏదో కొద్ది మంది సభ్యులున్న లెక్కలోకి రాని గ్రూపు అంటూ తాను, ఇతరులూ ఎద్దేవా చేసిన.. ఐఎస్ 2014 ఆరంభానికి రక్కా నుంచి తిరుగుబాటు ముఠాలను తరిమివేసింది. ఆ నగరం ఐఎస్ ‘‘ఖలీఫా’’కు అనధికారిక రాజధానిగా మారింది.

ఐఎస్ తన పట్టును బిగించటంతో రక్కా అంతటా నల్లటి జిహాదీ జెండాలు కనిపించాయి

ఫొటో సోర్స్, AFP

మిలిటెంట్లు.. తలనరికివేతలు, సిలువ వేయటాలు, చిత్రహింసలు పెట్టటం వంటి చర్యలతో సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.

‘‘ఐఎస్.. జనాన్ని అతి చిన్న కారణాలతో చంపేసేది. ఖైదు చేసేది. వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేది’’ అని ఖలీద్ తెలిపాడు.

‘‘ఓ.. మొహమ్మద్’ అంటే.. దైవ దూషణ చేశారంటూ చంపుతారు. ఫొటోలు తీసినా మొబైల్ ఫోన్లు వాడినా శిక్షలుంటాయి. పొగతాగితే జైలులో పెడతారు. హత్యలు, లూటీలు, అత్యాచారాలు.. అన్నీ చేస్తారు.’’

‘‘ఒక అమాయక మహిళ మీద అక్రమ సంబంధం ఆరోపణ చేస్తారు. ఆమె పిల్లలు చూస్తుండగానే ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు. నేను నా తమ్ముళ్ల ముందు కనీసం కోడిని కూడా కోయను.’’

తిరుగుబాటు దారుల్లో సీనియర్ నాయకులను జిహాదిస్టులు డబ్బుతో, పెద్ద పదవులతో కొనేశారు. ఖలీద్‌కు ‘‘సెక్యూరిటీ చీఫ్’’గా జాబ్ ఆఫర్ చేశారు. అతడికి ఒక ఆఫీస్, ఐఎస్ ఫైటర్ల మీద అధికారం ఇస్తామన్నారు. దానిని తిరస్కరిస్తే.. తన చావుకు వారెంట్ మీద సంతకం చేసినట్లేనని ఖలీద్‌కు అర్థమైంది. దీంతో అతడు వ్యక్తిగతంగా భయంకరమైన రాజీ పడ్డాడు.

‘‘నేను ఒప్పుకున్నాను. కానీ.. అల్-నుస్రా సీనియర్ నాయకుడు అబు అల్-అబ్బాస్ అనుమతితో నేను డబుల్ ఏజెంట్‌గా మారాను. ఐఎస్‌కి స్నేహితుడిగా నటించాను. కానీ నేను వారి సభ్యులను రహస్యంగా కిడ్నాప్ చేసి, ఇంటరాగేట్ చేసేవాడిని. వారిని చంపేవాడిని.’’

‘‘మొట్టమొదటిగా నేను కిడ్నాప్ చేసిన వ్యక్తి.. ఒక సిరియా పౌరుడు. ఐఎస్ శిక్షణ శిబిరం ఇన్‌చార్జ్.’’

అబు అల్-అబ్బాస్ కోరుకున్న విషయాలని నేను ఐఎస్‌కి లీక్ చేసేవాడిని. ఐఎస్ నన్ను విశ్వసించేలా చేయటానికి కొన్ని వాస్తవాలు లీక్ చేసేవాడిని. అదే సమయంలో వారి నుంచి రహస్యాలు కూడా రాబట్టేవాడిని.’’

ఐఎస్ మీద గూఢచర్యం చేయటానికి అల్-నుస్రా ఫ్రంట్‌కి తన కారణాలు తనకున్నాయి. ఐఎస్ నాయకుడు అబు బకర్ అల్-బగ్దాదీ 2013లో చేసిన విలీనం ప్రకటనను అల్-నుస్రా ఫ్రంట్ తిరస్కరించింది. ఇతర తిరుగుబాటు బృందాలతో చేతులు కలిపింది.

ఖలీద్ నిర్ణయం అతడికి ప్రాణాంతకమైన నిర్ణయంగా కనిపిస్తుంది. కానీ చనిపోయింది ఇతరులు. ఐఎస్ కోసం తాను దాదాపు 16 మందిని చంపినట్లు ఖలీద్ చెప్తాడు. వారిని వారి ఇళ్లలో సైలెన్సర్ అమర్చిన పిస్టల్‌తో షూట్ చేసినట్లు తెలిపాడు.

‘‘వాళ్లు డబ్బు కోసం మతాన్ని అమ్మేశారు. అహ్రార్ అల్-షామ్‌ - ఫ్రీ సిరియన్ ఆర్మీ కూటమిని వంచించారు.’’ ప్రభుత్వ నియంత్రణ నుంచి రక్కాను తొలుత స్వాధీనం చేసుకున్నది.. పశ్చిమ దేశాల మద్దతున్న ఈ కూటమే.

ఐఎస్ కొందరిని రహస్యంగా హత్య చేయటానికి తనను పంపించేదని ఖలీద్ చెప్తాడు (ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, BULENT KILIC/AFP

ఫొటో క్యాప్షన్, ఐఎస్ కొందరిని రహస్యంగా హత్య చేయటానికి తనను పంపించేదని ఖలీద్ చెప్తాడు (ఫైల్ ఫొటో)

ఖలీద్ చేతుల్లో చనిపోయిన వారిలో అల్-బాబ్‌కు చెందిన ఇస్లామిక్ స్కాలర్ ఒకరు. ‘‘నేను తలుపు తట్టాను. అతడు తెరిచాడు. నేను వెంటనే అతడి తలకి తుపాకీ గురిపెట్టి ఇంట్లోకి వెళ్లాను. అతడి భార్య కేకలు వేయటం మొదలుపెట్టింది. నేను అతడిని చంపటానికి వచ్చానని అతడికి తెలుసు.’’

‘‘నేను మాట్లాడకముందే.. ‘నీకేం కావాలి? డబ్బా? ఇది నా డబ్బు.. నీకేం కావాలన్నా తీసుకో’ అని అతడు నాకు చెప్పాడు. నాకు డబ్బు అవసరం లేదని నేనన్నాను. అతడి భార్యను వేరొక గదిలో పెట్టి తలుపు గడియవేశాను.

‘‘అప్పుడతడు.. ‘ఈ డబ్బు తీసుకో - నా భార్య కావాలనుకుంటే నా ముందే ఆమెతో పడుకోవచ్చు. కానీ నన్ను చంపొద్దు’ అని అతడు అన్నాడు. ఆ మాటతో అతడిని చంపాలన్న నా ఉద్దేశం మరింత బలపడింది.’’

రక్కాలోని ఐఎస్ అధికారులు కొత్తదనాన్ని కోరుకునేవారు. తాము లంచం ఇచ్చి నియమించిన వారి స్థానంలో కొత్త వారిని నియమించటానికి.. పాత వారిని తరచుగా చంపుతుండేవారు. వారి చావులకు అమెరికా సారథ్యంలోని సంకీర్ణానికి చెందిన యుద్ధ విమానాలే కారణమని ఆరోపించేవారు. కొన్నిసార్లు అదికూడా పట్టించుకునేవారు కాదు. ఐఎస్ ఉద్యోగంలో చేరిన నెల రోజులకే.. వాళ్లు త్వరలోనే తననూ చంపేస్తారని ఖలీద్‌కి తేలిపోయింది.

అతడు తన ప్రాణాలు కాపాడుకోవటానికి పారిపోయాడు. మొదట కారులో దేర్ అల్-జోర్ వెళ్లాడు. అక్కడి నుంచి టర్కీ వెళ్లాడు.

ఖలీద్ ఛాయ
ఫొటో క్యాప్షన్, బీబీసీ డాక్యుమెంటరీ ‘సిరియా: ద వరల్డ్స్ వార్’లో ఖలీద్

ఈ పనులన్నిటి విషయంలో ఎప్పుడైనా పశ్చాత్తాపం కానీ.. ఒక రోజే బోనులో పెట్టి విచారిస్తారని ఆలోచన కానీ వచ్చిందా? అని అడిగితే అతడు ఇలా సమాధానం చెప్తాడు:

‘‘నేను తప్పించుకోవటం ఎలా? బతికుండటం ఎలా? అనే ఆలోచించాను.

‘‘అది నేరం కాదు. నేను చేసింది నేరం కాదు. ఎవరైనా తుపాకీ గురిపెట్టి మన తండ్రిని కొడుతున్నపుడు.. మన సోదరుడ్నో బంధువులనో చంపుతున్నపుడు చూసి.. ఏం చేయకుండా ఉండలేం. ఏ శక్తీ మనల్ని ఆపలేదు. నేను చేసిందంతా ఆత్మ రక్షణ కోసమే.

‘‘పాలకపక్షం మీద, ఐఎస్ మీద యుద్ధాల్లో నేను వంద మందికి పైగా మనుషుల్ని చంపాను. దానికి నాకు పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే దేవుడికి తెలుసు.. నేనెప్పుడూ ఒక సాధారణ పౌరుడిని కానీ అమాయక వ్యక్తిని కానీ చపంలేదు.’’

‘‘నన్ను నేను అద్దంలో చూసుకున్నపుడు నన్నొక యువరాజుగా భావిస్తాను. రాత్రి పూట బాగా నిద్రపోతాను. ఎందుకంటే.. వాళ్లు చంపాలని నాకు చెప్పిన ప్రతి ఒక్కరూ చనిపోయే అర్హత వాళ్లే.’’

‘‘నేను సిరియా విడిచి వచ్చిన తర్వాత మళ్లీ పౌరుడిగా మారాను. ఇప్పుడు ఎవరైనా నాతో మొరటుగా మాట్లాడితే.. నేనిచ్చే సమాధానం... ‘మీ ఇష్టం’’.

‘సిరియా: ద వరల్డ్స్ వార్’ డాక్యుమెంటరీ కోసం ఖలీద్‌ను గత ఏడాది ఇంటర్వ్యూ చేశాం. ఇది మే 3, 4 తేదీల్లో రాత్రి 9:00 గంటలకు బ్రిటన్‌లో ‘బీబీసీ 2’లో ప్రసారమైంది. ఈ డాక్యుమెంటరీ మే 26, తిరిగి జూన్ 6 తేదీల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘బీబీసీ వరల్డ్ న్యూస్’లో ప్రసారమవతుంది.

వీడియో క్యాప్షన్, వీడియో : ప్రమాదంలో పసిపిల్లలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)