రష్యా వర్సెస్ పశ్చిమ దేశాలు.. ‘ఇది నూతన ప్రచ్ఛన్న యుద్ధం’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దావూద్ అజామి
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
తాలిబాన్‌కు మద్దతు ఇవ్వటం ద్వారా అఫ్ఘానిస్తాన్‌ను అస్థిరపరచటానికి రష్యా ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. తాలిబాన్ మిలిటెంట్లకు రష్యా ఆయుధాలు కూడా సరఫరా చేస్తోందని అమెరికా సీనియర్ అధికారులు కొన్ని నెలలుగా చెప్తున్నారు.
అయితే.. చారిత్రకంగా శత్రువులైన రష్యా, తాలిబన్.. ఇరువరూ ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్నారు. ‘‘నూతన ప్రచ్ఛన్న యుద్ధం’’ అని కొందరు పరిశీలకులు అభివర్ణిస్తున్న పరిణామాల్లో ఈ ఆరోపణలు, ఖండనలు వినిపిస్తున్నాయి. మరి అమెరికా ఆరోపణల్లో ఎంత నిజముంది?

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
అమెరికా ఆరోపణలు ఏమిటి?
రష్యా ఆయుధాలను తజకిస్తాన్ సరిహద్దు ద్వారా స్మగుల్ చేస్తూ తాలిబాన్‌కు అందిస్తున్నారని.. అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా బలగాల కమాండర్ జనరల్ జాన్ నికోల్సన్ మార్చి చివర్లో బీబీసీ ఇంటర్వ్యూలో ఆరోపించారు.
‘‘అఫ్ఘాన్ నాయకులు మాకు కొన్ని ఆయుధాలు తెచ్చి ఇచ్చారు. వాటిని రష్యా వాళ్లు తాలిబాన్‌కు ఇచ్చినట్లు చెప్పారు. తాలిబాన్ చర్యలను సమర్థించటం, వారికి కొంత మద్దతు అందించటం కోసం.. అఫ్ఘాన్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్ల సంఖ్యను రష్యా చాలా అధికంగా చూపుతోంది’’ అని ఆయన పేర్కొన్నారు.
రాత్రివేళ చీకట్లో చూసేందుకు ఉపయోగించే గాగుల్స్, మీడియం, హెవీ మెషీన్ గన్లు, చిన్నపాటి ఆయుధాలు వంటి రష్యా సైనిక పరికరాలు ఆ ఆయుధాల్లో ఉన్నాయని అఫ్ఘాన్ పోలీసు, సైనిక అధికారులు బీబీసీకి చెప్పారు.
ఈ ఆరోపణలతో ఏకీభవిస్తున్నది ఎవరు?
తాలిబాన్‌కు రష్యా మద్దతు అందిస్తోందని అమెరికా ఏడాది కాలం పైనుంచే ఆరోపిస్తోంది. రష్యా, ఇరాన్‌లు తాలిబాన్‌తో సంబంధాలు నెలకొల్పుకుని ప్రోత్సహిస్తున్నాయని 2016 డిసెంబర్‌లో జనరల్ నికోల్సన్ ఆరోపించారు.
అప్పటి నుంచీ అమెరికా ఉన్నతస్థాయి అధికారులు పలువురు, ముఖ్యంగా సైనికాధికారులు ఇటువంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే.. అమెరికా, నాటో అధికారులు కొందరు మరింత జాగ్రత్తగా స్పందిస్తున్నారు.
అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ విన్సెంట్ ఆర్ స్టివార్ట్ 2017 మేలో అమెరికా సెనేట్‌లో వాంగ్మూలం ఇస్తూ.. ‘‘ఆయుధాలు లేదా డబ్బు బదిలీ చేస్తున్నట్లుగా నేను నిజమైన భౌతిక సాక్ష్యాలేవీ చూడలేదు’’ అని పేర్కొన్నారు.
తాలిబాన్‌కు రష్యా మద్దతు ఏ స్థాయిలో ఉందనే అంశంపై తాను మరిన్ని ఆధారాలు చూడాల్సి ఉందని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ 2017 అక్టోబర్‌లో హౌస్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీకి చెప్పారు.
తాము ఎలాంటి ఆధారాలూ చూడలేదని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ 2017 జూలైలో అధికారికంగా వ్యాఖ్యానించారు.
ఇక రష్యా ఆయుధాలను తాలిబాన్‌కు చేరవేరుస్తామంటూ తమపై చేసిన ఆరోపణలను తజకిస్తాన్ తిరస్కరించింది. జనరల్ నికోల్సన్ ఆరోపణలు నిరాధారమని అభివర్ణించింది.

ఫొటో సోర్స్, EPA
అఫ్ఘాన్ అధికారుల అభిప్రాయం ఏమిటి?
అఫ్ఘాన్ అధికారులు కూడా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు.
తాలిబాన్‌కు రష్యా సైనిక సాయం అందిస్తోందని ప్రాంతీయ అధికారులు బలంగా చెప్తున్నారు. కానీ అఫ్ఘాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధికార ప్రతినిధి మాత్రం.. అందుకు ఆధారాలేవీ లేవని 2017 మేలో పేర్కొన్నారు.
అయితే.. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ గత అక్టోబర్‌లో బహిరంగంగా మాట్లాడుతూ రష్యా నుంచి తుపాకులు తీసుకుంటున్నారని తాలిబాన్‌ను ఎద్దేవా చేశారు.
మళ్లీ.. ఆ మరుసటి నెలలో ఆఫ్ఘాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ అటువంటి వార్తలన్నీ ‘‘వదంతులే’’నని, ‘‘మా దగ్గర ఆధారాలు లేవు’’ అని పేర్కొన్నారు.
రష్యా, తాలిబాన్ ఏం చెప్తున్నాయి?
తామిద్దరమూ కలిసి పనిచేస్తున్నామన్న అమెరికా ఆరోపణలను రష్యా, తాలిబాన్‌లు తిరస్కరిస్తున్నాయి. జనరల్ నికోల్సన్ బీబీసీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను రష్యా, తాలిబాన్ వేర్వేరుగా ఖండించాయి. ఆయన వద్ద ఆధారాలేవీ లేవని పేర్కొన్నాయి.
కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం అటువంటి ఆరోపణలు ‘‘నిరాధారం, ఊసుపోని కబుర్లు’’ అని అభివర్ణిస్తూ కొట్టివేసింది.
‘‘మాకు ఏ దేశం నుంచీ సైనిక సాయం అందలేదు’’ అని తాలిబాన్ అధికార ప్రతినిధి ప్రకటించారు.
అఫ్ఘానిస్తాన్‌లో విఫలమవుతున్న అమెరికా, నాటోలు.. ఆ దేశంలో భద్రతా పరిస్థితులు దిగజారుతుండటంతో తమను నిందించాలని ప్రయత్నిస్తున్నాయని రష్యా పదే పదే విమర్శిస్తోంది.
అఫ్ఘానిస్తాన్‌లో ఐఎస్‌కు అమెరికా, నాటోలు మద్దతిస్తున్నాయని కూడా రష్యా అధికారులు, రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. వీటిని అమెరికా తీవ్రంగా ఖండిస్తుండగా చాలా మంది పరిశీలకులు అవి నిరాధార ఆరోపణలని చెప్తున్నారు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
రష్యా, తాలిబాన్ మధ్య సంబంధాలున్నాయా?
తాలిబాన్ మిలిటెంట్లకు సాయం చేస్తున్నామన్న ఆరోపణలను రష్యా తిరస్కరిస్తోంది. అయితే.. తాలిబాన్‌తో ‘‘సంబంధాలు’’ ఉన్నాయని ఒప్పుకుంటోంది.
రష్యాకు, తాలిబాన్‌కు మధ్య దాదాపు దశాబ్దం కిందటే - అమెరికా 2001లో తాలిబాన్‌ను అధికారం నుంచి కూలదోసిన తర్వాత - ఒక సంప్రదింపుల మార్గం (కమ్యూనికేషన్ చానల్) ఏర్పడిందని తాలిబాన్ వర్గాలు చెప్తున్నాయి.
అయితే.. గత మూడేళ్లలో - ప్రత్యేకించి 2015 జనవరిలో అఫ్ఘానిస్తాన్‌లో ‘‘ఐఎస్ ఖొరాసాన్’’ ఏర్పాటైన తర్వాత రష్యా, తాలిబాన్ మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగయ్యాయి.
రష్యాలో ఆ దేశ అధికారులు, ‘ఇతర’ దేశాల అధికారులను తమ ప్రతినిధులు పలుమార్లు కలిశారని తాలిబాన్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.
ఈ కొత్త సంబంధాల్లో భాగంగా.. రష్యా నుంచి అత్యాధునిక ఆయుధాలు అందుతాయని, దానివల్ల అఫ్ఘాన్ యుద్ధం తమకు అనుకూలంగా మారుతుందని తాలిబాన్ ఆశిస్తోంది.
గగనతలంలో అమెరికా సంపూర్ణాధిక్యాన్ని సవాల్ చేయగల యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్లు, మిస్సైళ్లు.. 1980ల్లో సోవియట్ - అఫ్ఘాన్ యుద్ధ కాలంలో అఫ్ఘాన్ తిరుగుబాటుదారులకు అమెరికా అందించిన భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే స్టింగర్ మిస్సైళ్ల వంటివి - తమకు అందుతాయని తాలిబాన్ ఆశలు పెట్టుకుంది.
అయితే ఇప్పటివరకూ ఇది కేవలం ఆశగానే మిగిలివుంది.
దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి.
1) అటువంటి ఆయుధాలతో సులభంగా వాటి మూలాలు ఏమిటో తెలిసిపోతుంది.
2) అలాగే.. ఇటువంటి నాటకీయ చర్య అవసరమయ్యేంతగా అమెరికా - రష్యా సంబంధాలు దెబ్బతినలేదు.

ఫొటో సోర్స్, Reuters
రష్యా నుంచి తాలిబాన్‌కు లభించే ప్రయోజనం ఏమిటి?
రష్యా నుంచి తమకు అందుతున్నట్లుగా చెప్తున్న చిన్నపాటి ఆయుధాలు అఫ్ఘాన్‌లో విస్తారంగా లభిస్తాయని, పరిసర దేశాల్లో నల్లబజారులోనూ దొరుకుతాయని తాలిబాన్ అంటోంది. అటువంటి వాటికన్నా గానీ.. ఒక ప్రధాన ప్రాంతీయ శక్తి నుంచి నైతిక, రాజకీయ మద్దతు తాలిబాన్‌కు చాలా ముఖ్యం.
చైనా, ఇరాన్‌లతోనూ సంబంధాలను నెలకొల్పుకునే స్థాయికి తాలిబాన్ దౌత్య కార్యకలాపాలు విస్తరించాయి.
అఫ్ఘాన్ నుంచి అమెరికా సారథ్యంలోని బలగాలను తిరగగొట్టం కోసం తాము చేస్తున్న పోరాటం ‘ధర్మసమ్మతమైనద’న్న తాలిబాన్ విశ్వాసాన్ని ఇది బలోపేతం చేయటంతో పాటు వారికి మరింత ధైర్యాన్ని అందించింది.
తాలిబాన్ మిలిటెంట్లు ఒక్క పాకిస్తాన్ మీద మాత్రమే ఆధారపడి ఉన్నారన్న వివరణను.. వారికి రష్యా, ఇరాన్‌లు మద్దతిస్తున్నాయన్న ఆరోపణలు ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ఒకప్పటి శత్రువలు ఇప్పుడు మిత్రులయ్యారా?
అఫ్ఘాన్ తాలిబాన్ విషయంలో రష్యా వైఖరి మెత్తబడటం నాటకీయమే కాదు.. అనూహ్యమైన మార్పు కూడా.
తాలిబాన్ వ్యవస్థాపక సభ్యుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ.. 1980ల్లో అఫ్ఘాన్‌ను సోవియట్ యూనియన్ ఆక్రమించటానికి వ్యతిరేకంగా పోరాడిన ముజాహిదీన్ ఉద్యమంలో భాగస్వాములే. ఆ యుద్ధంలో తాలిబాన్ వ్యతిరేక గ్రూపులకు రష్యా ఆర్థిక, సైనిక మద్దతునందించింది. అనంతర కాలంలో రష్యా అఫ్ఘాన్ నుంచి ఉపసంహరించుకుంది.
కానీ అమెరికాలో 9/11 దాడుల అనంతరం.. అఫ్ఘాన్‌ను అమెరికా ఆక్రమించిన తర్వాత.. రష్యాతో కలిసి పనిచేసే అవకాశం తాలిబాన్‌కు లభించినట్లయింది.
తాలిబాన్‌ను తీవ్రమైన భద్రతా ముప్పుగా రష్యా ఇప్పుడిక భావించటం లేదు. పైగా.. అఫ్ఘానిస్తాన్‌లో విస్మరించలేని ఒక వాస్తవం తాలిబాన్ అని రష్యా విధాన రూపకర్తలు చూస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక రాయబారి జమీర్ కాబులోవ్ 2017 మార్చిలో.. అఫ్ఘాన్ నుంచి విదేశీ బలగాలను ఉపసంహరించాలన్న తాలిబాన్ డిమాండ్ ‘న్యాయమైనద’ని కూడా పేర్కొన్నారు. ఆ దేశంలో అమెరికా, నాటో బలగాలు సుదీర్ఘ కాలంగా కొనసాగటాన్నీ ఆయన విమర్శించారు.

ఫొటో సోర్స్, EPA
రష్యాకు ఒనగూరే లాభమేమిటి?
రష్యా - తాలిబాన్ సంబంధాలకు మూడు ప్రధాన కారణాలున్నాయి.
అఫ్ఘానిస్తాన్‌లో.. ప్రత్యేకించి మళ్లీ బలపడుతున్న తాలిబాన్ ఇటీవలి సంవత్సరాల్లో తమ నియంత్రణను విస్తరించిన ప్రాంతాల్లో.. రష్యా పౌరులు, రాజకీయ సంస్థల భద్రతకు ముప్పు లేకుండా చూసుకోవటం మొదటది. 2013, 2016 సంవత్సరాల్లో రష్యా హెలికాప్టర్లు అఫ్ఘాన్‌లోని తాలిబాన్ నియంత్రణలోని ప్రాంతాల్లో కూలిపోయినపుడు ఇద్దరు రష్యా పౌరులను వేర్వేరు ఘటనల్లో నిర్బంధించింది. సుదీర్ఘ చర్చల అనంతరం వారిద్దరినీ విడుదల చేశారు.
రెండోది.. అఫ్ఘానిస్తాన్‌లో ఐఎస్ పుట్టుకురావటంతో.. అది మధ్య ఆసియాకు, రష్యాకు కూడా విస్తరించవ్చన్న ఆందోళనను ఆ దేశంలో రేకెత్తించింది.
తాలిబాన్.. అఫ్ఘాన్‌లో ఐఎస్‌తో పోరాడుతోంది. ఐఎస్ లాగా కాకుండా తమ పోరాటం అఫ్ఘానిస్తాన్‌కే పరిమితమని పొరుగు దేశాలకు పదే పదే భరోసా ఇస్తోంది. ‘‘ఐఎస్‌కు వ్యతిరేక పోరాటంలో తాలిబాన్ ప్రయోజనాలు మా ప్రయోజనాలు ఒకే విధమైనవి’’ అని అఫ్ఘాన్‌లో రష్యా అధ్యక్షుడి ప్రత్యేక ప్రతినిధి జమీర్ కాబులోవ్ 2015 డిసెంబర్‌లో ప్రకటించారు.
ఒకవేళ అఫ్ఘాన్‌లో ఐఎస్ బలపడి, మధ్య ఆసియా దేశాల సుస్థిరతకు ‘‘తీవ్రమైన ముప్పు’’గా పరిణమించినట్లయితే.. సిరియాలో జరుగుతున్న తరహాలో తాము జోక్యం చేసుకునే అవకాశముందని కూడా రష్యా సంకేతాలిచ్చింది.
అయితే.. మధ్య ఆసియాలో తన సైనిక ప్రభావాన్ని మరింతగా పెంచుకోవటానికి, అఫ్ఘాన్‌లో జోక్యాన్ని సమర్థించుకోవటానికి.. ఐఎస్ అనే దానిని రష్యా ఒక సాకుగా ఉపయోగించుకుంటోందని అమెరికా అధికారులు అంటారు.
మూడో కారణం.. అఫ్ఘాన్ ఘర్షణకు రాజకీయ పరిష్కారం కావాలని.. సైనిక పరిష్కారం కాదని రష్యా అధికారులు ఉద్ఘాటిస్తున్నారు. 16 ఏళ్ల యుద్ధం తర్వాత కూడా అఫ్ఘాన్‌లో సుస్థిరత నెలకొనేలా చేయలేకపోయిన అమెరికా వ్యూహం, అనుమానాల పట్ల వీరు బాగా విసుగుచెంది ఉన్నారు.
శాంతి చర్చల్లో చేరేలా తాలిబాన్‌ను ప్రోత్సహించటానికి వారితో సంబంధాలు నెలకొల్పుకున్నామని రష్యా అంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
అఫ్ఘాన్ సంఘర్షణపై ప్రభావం ఏమిటి?
అధ్యక్షుడు పుతిన్ సారథ్యంలో బలపడుతున్న రష్యా.. అఫ్ఘానిస్తాన్‌లో తన ప్రభావాన్ని పెంచుకోవటానికి ప్రయత్నిస్తోంది. ఆ దేశంలో భవిష్యత్తులో ఏర్పాటుకాగల ఎటువంటి వ్యవస్థపై అయినా నిర్ణయం తీసుకునేటపుడు చర్చా వేదికలో తనకూ స్థానం కల్పించేలా చూసుకునే వ్యూహమిదని పరిశీలకులు భావిస్తున్నారు.
అమెరికా - రష్యా సంబంధాలు గణనీయంగా పడిపోయి, భౌగోళిక రాజకీయాలు వేగంగా మారుతున్న దశలో ఈ పరిణామాలు సంభవిస్తున్నాయి.
ప్రపచంలోని ఇతర ప్రాంతాల్లో.. ప్రత్యేకించి ఉక్రెయిన్, సిరియాల్లో అమెరికా - రష్యాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలకు.. రష్యా బలంగా తన ఉనికిని చాటుకోవటానికి సంబంధం ఉందని అంటున్నారు.
తాలిబాన్‌తో సంబంధాలు నెలకొల్పుకోవటం ద్వారా.. అమెరికా, నాటోల మీద ఒత్తిడి పెంచటమే కాదు.. వాటి ప్రాబల్యాన్ని తగ్గించటం రష్యా లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇదిలావుంటే.. అమెరికా - పాకిస్తాన్‌ల మధ్య విభేదాలు పెరుగుతుండగా.. శతాబ్దాల తరబడి శత్రువైఖరులతో ఉన్న రష్యా - పాకిస్తాన్‌ల మధ్య దౌత్య, సైనిక సంబంధాలు బలపడుతున్నాయి.
అఫ్ఘాన్ వ్యవహారాల్లో రష్యా పునరాగమనం.. ప్రధానంగా అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు రచించిన వ్యూహం.
నాటి ప్రచ్ఛన్న యుద్ధ శక్తులు నిరంతరం చేసుకుంటున్న పరస్పర ఆరోపణలను.. విస్తృత పరిధి గల వ్యూహంలో భాగంగా చూడాల్సి ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం.. ఆఫ్ఘాన్‌లో సంఘర్షణను మరింత జటిలం చేస్తోంది. అక్కడి పోరాట రంగంలో పాత్రధారుల సంఖ్య పెరుగుతూ పోతోంది.
ఇది ‘న్యూ గ్రేట్ గేమ్’ భయాలను మళ్లీ తెస్తోంది. అఫ్ఘానిస్తాన్ మరోసారి ప్రాంతీయ, అంతర్జాతీయ శక్తుల కదనరంగంగా మారుతుందన్న ఆందోళనను పెంచుతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఊబి నుంచి బయటపడే మార్గం ఎక్కడా కనిపించటం లేదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








