అభిప్రాయం: కాంగ్రెస్ - టీడీపీ కలయికతో కోస్తాంధ్ర సమాజానికి ముగిసిన ప్రాంతీయ పరిమితులు

రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాన్‌సన్ చోరగుడి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీరప్ప మొయిలీ అక్టోబర్ 31న హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. యూపీఏలోకి రమ్మని తెలుగుదేశం పార్టీని ఆహ్వానించారు.

ప్రతిపక్ష పార్టీలు అన్నిటినీ ఒక తాటి మీదకు తెచ్చి.. ఐక్యంగా బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కూటమిని ఎదుర్కోవడమే తమ పార్టీ ఉద్దేశమని మొయిలీ పీటీఐతో అన్నారు.

ఇది జరిగిన 24 గంటల్లో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిల్లీలో రాహుల్‌గాంధీ వద్ద ఉన్నారు.

దక్షణాదిన తమిళనాడు తర్వాత, కాంగ్రెస్ వంటి ఒక జాతీయ పార్టీపై ఫిర్యాదుతో 80వ దశకం ఆరంభంలో ఎన్.టి.రామారావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏర్పడిన పార్టీ - టీడీపీ.

అది 70 ఏళ్ళ స్వాతంత్రానంతర కాలంలో 35 ఏళ్ళ పాటు గెలుపు ఓటములు ఎదుర్కొని నిలిచింది. భారత ప్రభుత్వం 1991లో ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణలను దక్షణాదిన ప్రభావంతంగా అమలు చేసింది.

ఎన్‌టీఆర్

ఫొటో సోర్స్, Getty Images

ఇంత పెద్ద విశాలమైన దేశంలో ఒక పెద్ద పరిపాలనా యూనిట్ జాతీయ పార్టీ చేతుల్లో నుంచి ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో.. ఇప్పటివరకు తెలుగునాట అదే జరిగింది. మరో కొత్త రాష్ట్రం ఏర్పడడానికి, రెండు కొత్త ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి, వాటి క్రియాశీలతకు అది కారణమయింది.

సోనియాగాంధీ పార్టీ అధ్యక్షురాలు అయ్యాక సుమారు పదిహేనేళ్ళ కిందట ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంగా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో నామమాత్రంగా మిగిలింది.

మరో జాతీయ పార్టీ బీజేపీ అయితే రెండు రాష్ట్రాల్లోనూ ఉనికి పోరాటానికే పరిమితమంది.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఓడిపోయిన ప్రతిసారీ కాంగ్రెస్ గెలవడం జరిగేది. అయితే టీడీపీ ఆవిర్భవించిన 20 ఏళ్ళకు.. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, మరో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ఆవిర్భవించింది.

చంద్రబాబు, కేసీఆర్

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ వచ్చింది, కానీ పాత ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీ ఉనికి అక్కడ ప్రమాదంలో పడింది. అది అక్కడ బలహీనపడి తన ఉనికిని కోల్పోగా, కాంగ్రెస్ ప్రతిపక్షం అయింది.

ఇది జరిగిన ఐదేళ్లలోనే టీడీపీ మరింత బలహీనపడి తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి గాను చివరిగా అక్కడ కాంగ్రెస్ను ఆశ్రయించ వలసివచ్చింది!

ఇలా తెలుగునాట ఏర్పడిన మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ తన సుదీర్ఘ ప్రస్థానం తర్వాత.. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వద్దకు చేరడం ఆసక్తి కలిగిస్తున్న పరిణామం.

ఎననభయ్యో దశకం మొదట్లో ఆ పార్టీ పుట్టుకలో ఎంతో గంభీరంగా వినిపించిన ‘తెలుగు వారి ఆత్మ గౌరవం' వంటి నినాదాలు ఇప్పుడు క్రమంగా కనుమరుగయ్యాయి.

వివిధ పార్టీల నాయకులతో ఎన్‌టీఆర్

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రం చిన్నదై, ఆ పార్టీ ప్రభుత్వం ఒకనాటి నైజాం నవాబు జమానా నుంచి బయటపడి.. దాన్ని విడిచి రాజధాని అంటూ అది తన 'పుట్టిల్లు' అయిన కృష్ణా మండలం వద్దకు చేరేసరికి, ఇప్పుడు ఇక్కడ కొత్తగా వినిపిస్తున్న 'నార్మన్ ఫోస్టర్ డిజైన్లు' వంటి పదాలు, మారిన దాని ఆత్మగౌరవ స్వభావంలో కొత్తగా కనిపిస్తున్న 'అంతర్జాతీయ' దృష్టికి ప్రతీక.

మునుపు చెప్పినదాని నుంచి జరిగిన ఈ 'బదిలీ' (షిఫ్ట్) ముందుగా మనకు అర్ధం కావాలి.. మొదట అది స్పష్టమవ్వాలి.

ఈ పరిణామ క్రమంలో ఉపరితలంలో ఎవరికయినా కనిపిస్తున్నది, ఒక రాజకీయ పార్టీ పుట్టుక - ఎదుగుదల - విస్తరణ - లక్ష్య సాధన వంటివి.

అయితే కనిపించకుండా అంతర్గతంగా వున్నవి అందుకు భిన్నమైనవి. అవి - దాన్ని ఆశ్రయించి వున్న సామాజిక శ్రేణుల ఏకీకరణ - విస్తరణ - ప్రకృతి వనరులు, సాంకేతికత, 'గ్రోత్ ఇంజన్ల' మీద అవి సాధించే నియంత్రణ, ఆ క్రమంలో మానవ వనరుల మీద అది సాధించే పట్టు, మారిన దాని అవసరాలు ప్రాంతీయ దశను దాటి జాతీయ, అంతర్జాతీయం కావడం ఇటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి.

ఎన్‌టీఆర్, చంద్రబాబు

ఫొటో సోర్స్, TDP/Facebook

తెలుగునాట నెలకొన్న ప్రస్తుత ఈ కొత్త పరిస్థితిని దేశ జాతీయ రాజకీయ పరిణామాల మధ్య చూడవలసి వచ్చినప్పుడు.. అందుకోసం మనం ఒక కొత్త 'విండో' ను ఇక్కడ అనివార్యంగా తెరవక తప్పడం లేదు.

అది - 'కులం'.

ఎందుకు కులం అనే ఈ కొత్త 'విండో' ఇప్పుడు అంటే.. భవిష్యత్తులో స్వతంత్ర్య భారతదేశ తొలి శతాబ్ది చరిత్ర రచనలో తెలుగునాట ఈ 35 ఏళ్ళ కాలాన్ని- కేవలం ఒక ప్రాంతీయ పార్టీ రాజకీయ దృష్టి నుంచి చూస్తే చాలదు.

దక్షిణ భారతదేశంలో ఒక ప్రాంత ప్రజల సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, అభివృద్ధి పరిణామ క్రమ దృక్పథంలో నుంచి చూడ్డం, మూల్యాంకనం చేయడం అవశ్యం.

చంద్రబాబు, ఎన్‌టీఆర్

ఫొటో సోర్స్, Getty Images

అయితే ఇందుకు మొదటి నుంచీ మనకు ఉన్న ఒక ఇరకాటం.. మధ్య తరగతి మర్యాద!

ఉత్తర భారత రాజకీయాల్లో కుల సమీకరణాల గురించి సూక్ష్మ విశ్లేషణలతో ఇక్కడ మనం ఎంత బహిరంగంగా మాట్లాడుకుంటున్నప్పటికీ, తెలుగునాట కుల రాజకీయాలు గురించి రాయడం గాని మాట్లాడడానికి గాని వచ్చేసరికి మనం అంత స్వేఛ్చ తీసుకోవడం లేదు.

అందుకు కారణం.. ఇక్కడ మన మీద వున్న వామపక్ష ప్రగతిశీల భావజాల ప్రభావం అయితే కావచ్చు.

అయితే.. కులం అనేది ఎప్పుడు గణాంకాలతో (స్టాటిస్టిక్స్) కలిసి వుంటుంది. స్టాటిస్టిక్స్ ఒక 'సైన్స్' కనుక, ఇక్కడ కులం గురించి మాట్లాడుకోవడం కూడా 'సైన్స్' అయినప్పుడు, దాని గురించి మాట్లాడడం కూడా సహేతుకమే అవుతున్నది.

చంద్రబాబు, వాజపేయి

ఫొటో సోర్స్, Getty Images

'నీరు పల్లమెరుగు...' మన నానుడి. నిజమే అధికారం కూడా అంతే.

జాతీయ కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి 'టర్న్' కోస్తాకు వచ్చిన మూడు సార్లు.. అది రెడ్డి కులస్థుల వద్దకే వెళ్ళింది కానీ, కమ్మ కులస్తులను పట్టించుకోలేదు.

గోగినేని రంగనాయకులు (ఎన్.జి.రంగా) 1926 నాటికే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో బి.లిట్ డిగ్రీ తీసుకుని వచ్చి- ఆకడమిక్స్‌లో కొంత కాలం పనిచేసిన తర్వాత.. గుంటూరు కేంద్రంగా రాజకీయ క్షేత్రంలోకి ప్రవేశించారు.

అప్పటికి 1962 జనరల్ ఎన్నికల నాటికే సి.రాజగోపాలాచారి స్థాపించిన స్వతంత్ర పార్టీ పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉంది. దాని జాతీయ నాయకుడుగా ఎన్.జి.రంగా గుంటూరును కేంద్రంగా చేసుకుని జాతీయ రాజకీయాలు నడుపుతున్నారు.

వివిధ పార్టీల నాయకులతో చంద్రబాబు

ఫొటో సోర్స్, Getty Images

అయితే అటు దాన్నిగాని, ఆ తర్వాత రంగా కాంగ్రెస్‌లోకి వచ్చి సుదీర్ఘ కాలం ఉన్నా కులం కోణంలో నుంచి కాంగ్రెస్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

దాంతో 'ఎన్ జి.రంగా ఫ్యాక్టర్' కొంతకాలానికి మరింత చిక్కపడి, అది 'లిబరల్-గ్లామరస్' రూపం తీసుకుని 'ఎన్‌టీఅర్' తెలుగుదేశం పేరుతో బయటకొచ్చి, కాంగ్రెస్‌కు వైరి శిబిరంగా జాతీయ రాజకీయ వేదిక మీద తన ప్రాంతీయ ముద్ర వేసింది.

దీని కొనసాగింపు లోతుల్ని అర్ధం చేసుకోవడానికి టీడీపీ అధికార కేంద్రం చుట్టూ అప్పట్లో ఏర్పడ్డ స్వీయ సామాజిక కార్యక్షేత్రాన్ని.. అందులోకి వచ్చిన వివిధ 'ప్రొఫెషనల్స్' శ్రేణి విస్తృతిని చూసిన తర్వాత గాని, బయట ప్రపంచానికి విషయం అర్ధం కాలేదు.

ఏమని? 'ఎన్‌టీఅర్' రాజకీయ నాయకుడిగా బయటకు రావడానికంటే చాలా ముందు నుంచి కూడా.. నివురుగప్పిన నిప్పులా ఇక్కడ 'ఎన్.జి. రంగా ఫ్యాక్టర్' వుందని.

అది ఒక్కటే కాదు.. కోస్తా కమ్మ కులస్తులకు అప్పటికే ఆ విషయం స్పష్టంగా తెలుసనీ, అనువైన సమయం ఆసన్నమయినప్పుడు, దాన్ని తాము 'టేకోవర్' చేయాల్సి ఉంటుందని అప్పటికే వారు సర్వసన్నద్దంగా వున్నారని!

వివిధ పార్టీల నాయకులతో చంద్రబాబు

ఫొటో సోర్స్, Getty Images

ఈ కాలంలో వామపక్షాలు తరుచూ ఈ పార్టీతో జతకట్టడం కూడా వీరి ఆత్మగౌరవం నినాదాన్ని పసిగట్టడానికి వీల్లేని అవరోధం అయింది.

అయితే ఈ మొత్తానికి కీలకం - 'భూమి'. నిజమే భూములు ఎప్పటికీ ఎక్కడివి అక్కడే ఉంటాయి, మారేదల్లా వాటి యాజమాన్యం, ఇంటి పేర్లు మాత్రమే.

కానీ మార్కెట్‌లో అవి సృష్టిస్తున్న వర్చువల్ విలువ, ఆ కులం మొత్తాన్ని పైకి లాగడానికి ఒక 'హ్యాండ్ హోల్డింగ్' అయింది. జారి పడినా కాపు కాచే 'సేఫ్టీ నెట్' అయింది.

ఈ కులస్థుల తొలితరం విద్యాధికులు పనిచేసిన ప్రభుత్వ శాఖలు చూసినప్పుడు మనకది అర్ధమవుతుంది: నీటి పారుదల, వ్యవసాయం, విద్యుత్, పశుసంవర్థకం, సహకారం, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు వంటి వాటిలో ఎక్కువగా వీరు ఉన్నారు.

స్థానిక సంస్థల పరిపాలన మొత్తం వీటి మీద ఆధారపడి ఉండేది. ఇప్పటి 'వృద్ధి' అనే పదం లేని ఆ తొలి రోజుల్లో, అభివృద్ధి సంబంధిత శాఖలతో అలా వీరు ఆరంభంలోనే అనుసంధానం అయ్యారు.

నరేంద్రమోదీ, చంద్రబాబు

ఫొటో సోర్స్, Getty Images

అయినా విహంగ వీక్షణ దృష్టితో ఏపీ ఆధునిక చరిత్రలోకి చూసినప్పుడు - ఎన్‌టీఆర్ పాత్ర - 'స్పెషల్ పర్పస్ లాంచింగ్ వెహికల్' వంటిది.

సుదీర్ఘ సముద్ర ప్రయాణం చేసి హార్బర్‌లోకి ప్రవేశం కోసం వేచివున్న ఓడను.. కాంగ్రెస్ ఇసుక మేటలను చేధించి మరీ 'పవర్' ప్లాట్‌ఫాం మీదికి చేర్చిన జెట్టీ - ఎన్‌టీఅర్.

అయితే కాలానికి తగిన నాయకుణ్ణి ఆ కాలమే ఎంచుకుంటుంది. సెప్టెంబర్ 1996 లో టీడీపీలో జరిగిన అధికార మార్పిడి ఆధునిక - అనంతర కాల రాజకీయ సర్దుబాటు. అది - ఒకే రాజకీయ పార్టీలో రెండు తరాల మధ్య జరిగిన నాయకత్వ మార్పు.

ఇప్పుడు రాజకీయ పార్టీల జెండా లేబుళ్ళు, గుర్తులు తీసి పక్కన పెట్టి.. ఈ పార్టీల్లో అధికార కేంద్రాలకు దగ్గరగా ఉన్న సమూహాలు ఏవి? వాటి ప్రయోజనాలు ఎటువంటివి? వాటిని ఆశ్రయించిన సమూహాల కదలికలు ఎలా ఉన్నాయి? అని చూడ్డం అవసరం.

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఇతర నాయకులతో చంద్రబాబు

ఫొటో సోర్స్, Getty Images

అలా చూసినప్పుడు - ఒకనాటి అభివృద్ధి ఇప్పుడు 'వృద్ది' గా మారాక, తెలుగుదేశం పార్టీని మొదటి నుంచి ఆశ్రయించి ఉన్న సామాజిక వర్గం ప్రయోజనాలు - ప్రాంతీయం నుంచి జాతీయమై, ఇప్పుడు అవి అంతర్జాతీయం అయ్యాయి.

ఆధిపత్య కులాల విషయంలో వారికి ఒక స్థాయి దాటాక.. 'పొలిటికల్ పవర్' కాపాడుకోవడానికి గాను ఉన్న వనరులు, కాలము ఖర్చు పెట్టడం ఒక వృధా వ్యయం.

అందునా - జాతి, ప్రాంతం, బాష, కులం.. ఇవన్నీ ఒక 'కల్ట్' వంటివి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలకు కాల పరిమితి ఉంది.

అందుకే తెలుగుదేశం పార్టీ మూడున్నర దశాబ్దాలుగా తన మీద ఆధారపడిన తన స్వీయ సామాజిక వర్గాన్ని - దాని విస్తరణ నైపుణ్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా చేర్చింది.

అయితే రాజ్యం నుంచి తీసుకోవలసిన ప్రయోజనాల కోసం.. భవిష్యత్తులో అది కాంగ్రెస్ వంటి సనాతన భారతీయ పార్టీలో కలిసిపోవటానికి సన్నద్ధమవుతోందా అనే సందేహం కలుగుతోంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)