అవతార్ సీక్వెల్: నాలుగు కొత్త సినిమాల పేర్లు ఇవేనా?

అవతార్

ఫొటో సోర్స్, 20th Century Fox

ఫొటో క్యాప్షన్, ఒరిజినల్ అవతార్ చిత్రంలో జాక్ సల్లీగా సామ్ వర్తింగ్టన్, నెయ్‌తిరిగా జో సల్దన నటించారు
    • రచయిత, లిజో మింబా
    • హోదా, ఎంటర్‌టైన్‌మెంట్ కరస్పాండెంట్, బీబీసీ న్యూస్

జేమ్స్ కామెరాన్ చిత్రం అవతార్. 2009లో విడుదలైన ఈ సినిమా.. దశాబ్ధం తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన చిత్రంగా కొనసాగుతోంది. ఈ చిత్రం వసూలు చేసిన మొత్తం 2.8 బిలియన్ అమెరికన్ డాలర్లు. (సుమారు రూ.2,04,55,40,00,000)

సామ్ వర్తింగ్టన్, సిగర్నీ వీవర్, జో సల్దానాలు నటించిన ఈ త్రీడీ భారీ హంగుల చిత్రం.. సుదూరంలోని పండోరా అనే గ్రహంపై నివశించే నావి తెగ గ్రహాంతరవాసుల కథ. ఈ తెగ ప్రజల శరీరం నీలం రంగులో ఉన్నట్లు, వారు భారీ కాయులు అన్నట్లుగా చిత్రీకరించారు.

ఈ చిత్రానికి సీక్వెల్‌ చిత్రాలు వస్తాయని, వాటి పేర్లు.. అవతార్ 2, అవతార్ 3, అవతార్ 4, అవతార్ 5 అంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే, ఈ సీక్వెల్ చిత్రాలకు సంబంధించిన సమాచారంపై (పండోరా గ్రహంపై లభించే అత్యంత విలువైన ఖనిజంగా ప్రాచుర్యం పొందిన) అన్‌అబ్‌టైనియమ్ కంటే ఎక్కువ అస్పష్టత ఉంది.

అవతార్ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన డాక్యుమెంట్ల ప్రక్రియను బీబీసీ న్యూస్ చూసింది. నాలుగు నిర్దిష్టమైన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఆ డాక్యుమెంట్లలో ఉన్నాయి.

రాబోయే అవతార్ సీక్వెల్ సినిమాల పేర్లు.. అవతార్: ది వే ఆఫ్ వాటర్, అవతార్: ది సెకండ్ బేరర్, అవతార్: ది టుల్కున్ రైడర్, అవతార్: ది క్వెస్ట్ ఫర్ ఐవా అని ఆ డాక్యుమెంట్ల ప్రకారం తెలుస్తోంది.

ది వే ఆఫ్ వాటర్

అవతార్ తదుపరి చిత్రం పండోరా గ్రహంపై ఉన్న సముద్రాలను అన్వేషిస్తుందని జేమ్స్ కామెరాన్ చెప్పారు. ‘అవతార్ 2, అవతార్ 3 సినిమాల్లో భారీ స్థాయిలో నీళ్లకు సంబంధించిన పనులు ఉంటాయి’ అని ఆయన గతేడాది కొల్లిడర్ డాట్‌కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

వానిటీ ఫెయిర్‌కు ఇచ్చిన మరొక ఇంటర్వ్యూలో కామెరాన్ మాట్లాడుతూ.. అవతార్ సిరీస్‌ సినిమాల్లో హాలీవుడ్ హీరోయిన్ కేట్ విన్‌స్లెట్ కూడా భాగం అవుతారని చెప్పారు. కామెరాన్ తీసిన మరో చిత్రం ‘టైటానిక్’లో విన్‌స్లెట్ హీరోయిన్. అవతార్ సిరీస్‌లో ఆమె సముద్ర ప్రజలకు సంబంధించిన క్యారెక్టర్ చేస్తున్నారని కామెరాన్ తెలిపారు.

కేట్ విన్‌స్లెట్, జేమ్స్ కామెరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మరోసారి.. టైటానిక్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కేట్ విన్‌స్లెట్ ఇప్పుడు అవతార్ సీక్వెల్‌లో సముద్ర ప్రజల పాత్ర పోషిస్తోంది

ది క్వెస్ట్ ఫర్ ఐవా చిత్రంలో ఐవా అంటే.. పండోరా గ్రహంపై నివశించే నావి తెగ ప్రజలు ఆరాధించే దేవత.

అవతార్ మొదటి చిత్రం విడుదలైన వెంటనే కామెరాన్ మాట్లాడుతూ.. తదుపరి చిత్రాన్ని అవతార్ 2 అని తాను పిలవదల్చుకోలేదని చెప్పారు. దానికి కారణం అందులోని ప్రధాన పాత్ర చిత్రం చివర్లో అవతార్ నుంచి నావి తెగలోకి మారిపోతుంది.

ఈ సిరీస్ చిత్రాలను నిర్మిస్తున్న ట్వంటీయెత్ సెంచరీ ఫాక్స్ స్టూడియో మాత్రం.. ఈ సినిమాల పేరులో అవతార్ అన్న పదాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఎందుకంటే.. ఆ పేరు ఇప్పటికే అందరికీ పరిచయమైపోయింది.

అయితే, సినిమా ప్రణాళికలకు సంబంధించిన డాక్యుమెంట్లలో మాత్రం తదుపరి చిత్రాల పేర్లు అవతార్ పదంతో కలిపి, ఆ పదం లేకుండా కూడా ఉన్నాయి.

అవతార్ మొదటి చిత్రంలో డాక్టర్ గ్రేస్ ఆగస్టీన్ పాత్ర పోషించిన సిగర్నీ వీవర్ అక్టోబర్ నెలాఖరులో హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ.. ‘‘మేం ఇప్పుడే (అవతార్) 2, 3 షూటింగ్ పూర్తి చేశాం’’ అని చెప్పారు. ఇకపై తాను అవతార్ 4, 5 చిత్రాలను చేయడంలో బిజీగా ఉంటానని తెలిపారు.

ఈ నాలుగు అవతార్ సీక్వెల్ సినిమాలు వరుసగా.. డిసెంబర్ 2020, డిసెంబర్ 2021, డిసెంబర్ 2024, డిసెంబర్ 2025ల్లో విడుదల కావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)