‘టెస్ట్ ట్యూ బ్‌లలో చెట్లు’.. ఎప్పుడైనా విన్నారా?

టెస్ట్ ట్యూబ్‌లో పెరుగుతున్న మినీ సింధూర వృక్షం

ఫొటో సోర్స్, Royal Botanic Gardens Kew

ఫొటో క్యాప్షన్, టెస్ట్ ట్యూబ్‌లో పెరుగుతున్న మినీ సింధూర వృక్షం
    • రచయిత, హెలెన్ బ్రిగ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లేబరేటరీలోని టెస్ట్ ట్యూబులో ఒక చిన్న సింధూర వృక్షం మొలకెత్తుతోంది.

ఈ విత్తనం అసాధారణమైన పరిస్థితుల మధ్య మొలకెత్తింది.

అటవీ వృక్షాల విత్తనాల పరిరక్షణలో భాగంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇలాంటి వృక్షాలను ఉత్పత్తి చేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి.

ప్రపంచంలో అనేక చెట్ల జాతులు వేగంగా అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న చెట్లలో ఐదింట ఒకటి అంతరించిపోయే ప్రమాదం ఉంది.

దీంతో శాస్త్రవేత్తలు వాటిని పరిరక్షించడంపై దృష్టి సారించారు. దానిలో భాగమే ఇలా టెస్ట్ ట్యూబుల్లో చెట్లను పెంచడం.

సింధూర వృక్షం

ఫొటో సోర్స్, Getty Images

ఈ టెస్ట్ ట్యూబ్ చెట్ల విధానం ఇన్సూరెన్స్ పాలసీలాంటిదని బ్రిటన్‌లోని వెస్ట్ ససెక్స్‌లో ఉన్న క్యూస్ మిలీనియం సీడ్ బ్యాంక్‌లో పని చేస్తున్న డాక్టర్ జాన్ డికీ తెలిపారు.

ఇక్కడ ఉన్న రేడియేషన్ ప్రూఫ్ నేల మాళిగల్లో అంతరించి పోయే ప్రమాదమున్న విత్తనాలను భద్రపరుస్తున్నారు.

2020 నాటికి అంతరించిపోయే ప్రమాదం ఉన్న వృక్షాల్లో కనీసం 75 శాతం వృక్ష జాతులను పరిరక్షించడం వీరి లక్ష్యం.

Cryopreservation క్రయోప్రిజర్వేషన్

ఫొటో సోర్స్, Royal Botanic Gardens Kew

ఫొటో క్యాప్షన్, క్రయోప్రిజర్వేషన్ ద్వారా బీజాలను భద్రపరుస్తారు

నేచర్ ప్లాంట్స్ పత్రిక ప్రకారం మొత్తం చెట్లలో 33 శాతం, ఔషధ సంబంధమైన మొక్కల్లో 10 శాతం అంతరించి పోయే ప్రమాదం ఉంది.

''మేం సీడ్ బ్యాంక్‌లోని ఫ్రీజర్‌లో భద్రపరిచినట్లు, అన్ని రకాల మొక్కల విత్తనాలనూ ఎండబెట్టి భద్రపరచడం సాధ్యం కాదు'' అని మిలీనియం సీడ్ బ్యాంక్‌లో క్రయోప్రిజర్వేషన్‌(అతిశీతలీకరణ ద్వారా చెట్ల పరిరక్షణ)పై పని చేస్తున్న డేనియల్ బాలెస్టెరోస్ తెలిపారు.

''ఉదాహరణకు సింధూర వృక్షం లేదా చెస్ట్‌నట్ విత్తనాలు చాలా సున్నితమైనవి. వాటిని ఎండబెడితే వాటి నుంచి చెట్లు రావు'' అని డేనియల్ తెలిపారు.

ఇలా భద్రపరచడం కష్టమైన విత్తనాలను.. ఉదాహరణకు కాఫీ, చాకొలేట్, అవొకాడో, సింధూర వృక్షం లాంటి విత్తనాల పరిరక్షణ కోసం క్రయోప్రిజర్వేషన్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు.

క్రయోప్రిజర్వేషన్‌లో మొక్క బీజాన్ని విత్తనం నుంచి వేరు చేసి, దాన్ని ద్రవరూప నైట్రోజన్‌లో అతి శీతల ఉష్ణోగ్రత వద్ద ఘనీభవింపజేస్తారు.

అయితే ఇలాంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు, ఉన్న దానిని మరింత మెరుగుపరిచేందుకు ఇంకా భారీస్థాయిలో పెట్టుబడులు అవసరం.

బ్రిటన్‌లో పచ్చిక బయళ్లు తగ్గిపోతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిటన్‌లో పచ్చిక బయళ్లు తగ్గిపోతున్నాయి

ప్రస్తుతం మిలీనియం సీడ్ బ్యాంక్‌లో 40 వేల అటవీ మొక్కల జాతులను మైనస్ 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద భద్రపరిచారు.

ప్రపంచంలోని మరికొన్ని ప్రాంతాలలో వరిలాంటి ఇతర జాతులను పరిరక్షించే ప్రయత్నం జరుగుతోంది.

మిలీనియం సీడ్ బ్యాంక్‌లో పని చేసే జనేట్ టెర్రీ టాంజానియా నుంచి తీసుకొచ్చిన విత్తనాలను పరిరక్షించే పనిలో ఉన్నారు.

''మనం పరిరక్షించే విత్తనాలలో మనకు అవసరమైనవి ఏం ఉన్నాయో మనకు తెలియదు. కానీ, పర్యావరణ మార్పుల నేపథ్యంలో అవి నశించి పోవడానికి ముందే మేం వాటిని భద్రపరుస్తున్నాం. భవిష్యత్తులో మనం వాటిని మనకు అవసరమైన విధానంలో ఉపయోగించుకోవచ్చు’' అని ఆమె తెలిపారు.

ఇలాంటి సీడ్ బ్యాంకుల ఉపయోగం ఇప్పటికే కనిపిస్తోంది.

బ్రిటన్‌లో అంతరించిపోతున్న పచ్చికబయళ్లను సీడ్ బ్యాంక్‌లో భద్రపరచిన విత్తనాల ద్వారా పరిరక్షించే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)