దీపావళి ప్రత్యేకం: లక్ష్మీదేవి బొమ్మలో ముఖం ఎవరిది?

ఫొటో సోర్స్, Sachin kaluskar
- రచయిత, జే మిశ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా దీపావళి సంబరాలు ప్రారంభమయ్యాయి. ధన్‌తేరస్, దీపావళికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక సంప్రదాయాలు వాడుకలో ఉన్నాయి.
దీపావళి సందర్భంగా లక్ష్మీపూజ నిర్వహించడం చాలా చోట్ల ఒక ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ, బొమ్మను కానీ పూజిస్తారు.
అయితే ఈ లక్ష్మీదేవి బొమ్మ వెనుక ఉన్న చరిత్రను పరిశీలిస్తే, దానికి భారతీయ కళారంగంతో సంబంధాలు వెలుగులోకి వస్తాయి.
ఇంతకూ లక్ష్మీదేవి అలా ఉంటుందని ఊహించి, అంత అద్భుతంగా గీసింది ఎవరు?
రాజా రవివర్మ దీనిని చిత్రించాడని చరిత్రకారులు చెబుతారు. అనేక మంది హిందూ దేవుళ్లు, దేవతల బొమ్మలను ఆయనే చిత్రించాడని భావిస్తున్నారు.
రాజా రవివర్మ గీసిన లక్ష్మీదేవి అసలు పెయింటింగ్ ఇంకా వదోదరలోని లక్ష్మీవిలాస్ రాజమందిరంలోని దర్బార్ హాలులో ఇప్పటికీ ఉంది.
వదోదరలోని ఫతేసింగ్ మ్యూజియం చరిత్రకారుడు, క్యూరేటర్ మందా హింగోరావ్.. ఈ చిత్రాన్ని రవివర్మ 1891లో గీశారని తెలిపారు.
''లక్ష్మీదేవి, సరస్వతీ దేవి చిత్రాలతో రవివర్మ చాలా ప్రఖ్యాతి చెందారు. దీనిని ఆయన అప్పట్లో వదోదర రాష్ట్రాన్ని పాలించే మూడవ సాయాజీ రావు గైక్వాడ్ కోసం చిత్రించారు'' అని ఆమె తెలిపారు.
''రవివర్మ తన చుట్టూ ఉన్నవారి ముఖాల నుంచి ప్రేరణ పొంది హిందూ దేవతల బొమ్మలను చిత్రించేవారు. ఆయన చిత్రించిన లక్ష్మీదేవి బొమ్మనే తర్వాత ముద్రణలోకి మార్చారు. దాంతో లక్ష్మీదేవి దేశంలోని ప్రతి ఇంటిలో కొలువుతీరింది'' అన్నారామె.

ఫొటో సోర్స్, Schin kaluskar
లక్ష్మీదేవి చిత్రాన్ని రవివర్మ దర్బార్ హాలులో చిత్రించారని హింగోరావు తెలిపారు. అక్కడ ఇంకా ఇతర లక్ష్మీదేవి పెయింటింగ్‌లు ఉన్నా, వాటిలో రవివర్మ పెయింటింగ్‌లో మాత్రమే జీవకళ ఉట్టిపడుతోంది. లక్ష్మీదేవికి ఆయన మానవ రూపాన్ని ఇచ్చారు.
దర్బార్ హాలులో ఉన్న రవివర్మ చిత్రంలో లక్ష్మీదేవి పక్కన రెండు ఏనుగులు కనిపిస్తాయి. అయితే ముద్రణలో మాత్రం ఒకటే కనిపిస్తుంది.
ప్రముఖ చరిత్రకారుడు, మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆర్ట్ హిస్టరీ విభాగం మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ రతన్ పరిము.. ఆ పెయింటింగ్‌లో లక్ష్మీదేవి 9 గజాల పొడవుండే మరాఠీ చీర కట్టుకున్నారని తెలిపారు.
రవివర్మకు మరాఠీ సంస్కృతితో చాలా అనుబంధం ఉంది. ఆయన చిత్రాలలో అది ప్రతిఫలిస్తుంది.
''రవివర్మ ట్రావెంకోర్ రాష్ట్రానికి చెందిన వాడు. ఆయనను సాయాజీరావు గైక్వాడ్ 1882లో వదోదరకు పిలిపించి, తన పట్టాభిషేక మహోత్సవాన్ని చిత్రించాలని కోరారు.''
''వదోదరలో ఉన్నపుడు రవివర్మ సాయాజీ రావు కోరిక మేరకు అనేక బొమ్మలను చిత్రించారు. వాటిలో ఈ లక్ష్మీదేవి చిత్రం ఒకటి'' అని ప్రొఫెసర్ రతన్ తెలిపారు.
ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో ఉండే ఒక ప్రింటింగ్ ప్రెస్ మొదట రవివర్మ చిత్రించిన లక్ష్మీదేవి చిత్రాలను ముద్రించడం ప్రారంభించింది.
ఆ ప్రెస్ యజమానే లక్ష్మీదేవి చిత్రంలోని రెండు ఏనుగుల స్థానంలో ఒక ఏనుగును ఉంచారు.
ముంబైలోని ఈ ప్రింటింగ్ ప్రెస్ తర్వాత కాలంలో రవివర్మ ఇతర పెయింటింగ్స్‌ను ముద్రించడం ప్రారంభించింది. ముఖ్యంగా లక్ష్మీదేవి, సరస్వతీ దేవి బొమ్మలను వేలకొద్దీ ముద్రించేవారు.
అయితే క్రమక్రమంగా లక్ష్మీదేవికి చెందిన ఇతర బొమ్మలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. కేలండర్లపై కూడా లక్ష్మీదేవి బొమ్మను ముద్రించడం మొదలైంది.
సచిన్ కలుస్కార్ వద్ద రవివర్మకు చెందిన చాలా బొమ్మలు ఉన్నాయి. రవివర్మ పెయింటింగ్స్‌లో మార్పులు చేసి ఓలియోగ్రాఫ్‌లో ముద్రించారని, నాటి నుంచి అవి దేశవ్యాప్తంగా ప్రజల ఆదరణ పొందాయని ఆయన అంటారు.
సచిన్ 2004 నుంచి రవివర్మ పెయింటింగ్స్ ఓలియోగ్రాఫ్‌లను సేకరిస్తున్నారు.
లక్ష్మీదేవి ఓలియోగ్రాఫ్ గురించి వివరిస్తూ ఆయన, ''ఇలా ఓలియోగ్రాఫ్ తీసి ముద్రించకుంటే, లక్ష్మీదేవి చిత్రాలకు ఇంత ఆదరణ లభించి ఉండేది కాదు'' అన్నారు.
రవివర్మ చిత్రించిన దేవతల చిత్రాలలో పాటు ఇతర మహిళల చిత్రాలలో ఒక మహిళ ముఖం కనిపిస్తుంది. అది సుగంధ అనే మహిళదని సచిన్ అంటారు.
''ఆయన పెయింటింగ్స్‌కు మోడల్‌గా ఉన్నది ఎవరన్న దానిపై వివాదం ఉంది. ఆయన దేవతల చిత్రాలలో కనిపించేది సుగంధ అనే మహిళ'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Sachin kaluskar
రాజా రవివర్మ- వివాదాలు
రవివర్మ జీవితం చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. ఆయన జీవితం ఆధారంగా తీసిన ఒక చిత్రం కూడా వివాదాస్పదమైంది.
'రంగ్‌రసియా' చిత్రంలో రవివర్మను సుగంధ ప్రియుడిగా చూపించారు. సుగంధపై ప్రేమతోనే ఆయన తన పెయింటింగ్స్‌లో ఆమె ముఖాన్నే చిత్రించాడని అంటారు.
రవివర్మ చిత్రించాడని చెబుతున్న అనేక దిగంబర పెయింటింగ్స్ విషయంలో కూడా చాలా వివాదం ఉంది. వాటిలో చాలా పెయింటింగ్స్ మతానికి సంబంధినవి. ఆ కారణంగా ఆయనపై ఒక కేసు కూడా నమోదైంది.
ఏదేమైనా.. రవివర్మ పెయింటింగ్స్ దేవుళ్ల రూపాలు ప్రాచుర్యం చెందడానికి ఉపయోగపడ్డాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








