అలహాబాద్ : ఈ నగరం పేరు మార్చడమంటే ఆత్మను చంపడమే

అలహాబాద్ రైల్వే స్టేషన్

ఫొటో సోర్స్, Ankit Srinivas

    • రచయిత, వికాస్ పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నీ పేరు ఏమిటి? మీ ఊరేది?

భారతదేశంలో సర్వసాధారణంగా పరిచయాలు ఇలాగే ప్రారంభమవుతాయి. ఈ రెండో ప్రశ్నకు నా సమాధానం.. భారతదేశపు మొదటి ప్రధాని నెహ్రూ, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌లకు చెందిన అలహాబాద్ అని గర్వంగా చెప్పుకునేవాణ్ని.

కానీ, ఇక మీదట అలా చెప్పుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే, అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చేశారు.

అలహాబాద్ బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో ఉంది. హిందువుల ప్రముఖ తీర్థయాత్రా స్థలంగా దాని పేరును పునరుద్ధరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.

435 ఏళ్ల క్రితం ఒక ముస్లిం పాలకుడు ఈ నగరానికి ఆ పేరు పెట్టాడన్న కారణంతో బీజేపీ పాలకులు దాని పేరును మార్చారు.

కుంభమేళాకు వచ్చిన సాధువులు

ఫొటో సోర్స్, Ankit Srinivas

ఫొటో క్యాప్షన్, వేలాది మంది సాధువులు కుంభమేళాలో పాల్గొంటారు

అలహాబాద్ - రాజకీయ, సాంస్కృతిక కేంద్రం

నిజమే. 16, 17వ శతాబ్దాలలో భారతదేశం, పాకిస్తాన్‌లలో చాలా భాగాన్ని ఏలిన మొఘల్ పాలకుడు అక్బర్ అలహాబాద్‌కు ఆ పేరు పెట్టారు. మొఘల్ సామ్రాజ్యంలో అది పాలనకు, మిలటరీ, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉండేది.

బ్రిటిష్ పాలనలో కూడా ఆ పరంపర కొనసాగింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా అలహాబాద్ ఉత్తర భారతదేశంలోని ప్రధానమైన రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా ఉంది.

హిందూ మతంలో అలహాబాద్‌కు చాలా ఉన్నతస్థానం ఉంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి అక్కడ గంగ, యమున సంగమ ప్రాంతంలో కుంభమేళా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ కుంభమేళా ప్రపంచంలోనే అతి పెద్ద భక్తుల సమూహం అని పేర్కొంటారు.

కుంభమేళా సందర్భంగా భక్తులను ఆహ్వానించడానికి ఇక్కడికి అన్ని మతాలకు చెందిన వారు వస్తారు. ఉచిత భోజనాన్ని అందించడం కోసం ఇక్కడ వందలాది శిబిరాలు ఏర్పాటవుతాయి.

హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అలహాబాద్ చరిత్రను సమానంగా పంచుకుంటారు.

అలహాబాద్‌లోని ప్రతి మూలకు ఒక చరిత్ర ఉంది.

అలహాబాద్

ఫొటో సోర్స్, Ankit Srinivas

ఫొటో క్యాప్షన్, అలహాబాద్‌లో గంగ, యమున కలుస్తాయి

మరి ఇప్పుడు పేరును మార్చడం ఎందుకు?

''అవి రాజకీయాలు'' అన్నారు అలహాబాద్ యూనివర్సిటీలో చరిత్రను బోధించే హేరంభ్ చతుర్వేది. ''2019లో సాధారణ ఎన్నికలు వస్తున్నాయి. నగరంలో మెజారిటీగా ఉన్న హిందువులను సంతృప్తి పరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది.''

ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇది మొదటిసారి కాదు.

ఇటీవల ప్రభుత్వం చరిత్రాత్మక బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్ మొఘల్ సరాయ్‌కు బీజేపీ సైద్ధాంతిక మార్గదర్శకుడు దీనదయాల్ ఉపాధ్యాయ అని పేరు పెట్టింది.

ముస్లిం పేర్లతో ఉన్న నగరాలు, పట్టణాల పేర్లను మార్చాలన్న బీజేపీ విధానంలో భాగంగానే అలహాబాద్ పేరును మార్చారని చాలా మంది భావిస్తున్నారు.

జవహర్ లాల్ నెహ్రూ

ఫొటో సోర్స్, Ankit Srinivas/Anand Bhawan

ఫొటో క్యాప్షన్, జవహర్ లాల్ నెహ్రూ

బీజేపీ మాత్రం అలహాబాద్ పేరు మార్చడం వెనుక ఎలాంటి రాజకీయాలూ లేవని, నిజానికి ఈ నగరం పేరు ప్రయాగరాజే అని అంటోంది. ప్రయాగరాజ్ పేరును అక్బరే 1583లో అలహాబాద్‌గా (అల్లా నివసించే ప్రదేశం) మార్చాడని, అందువల్ల తాము దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని చెబుతోంది.

అయితే ప్రయాగరాజ్ అనేది ఎన్నడూ ఒక నగరంగా లేదని అలహాబాద్ యూనివర్సిటీ మాజీ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌ఆర్ ఫారూఖీ స్పష్టం చేశారు.

''ప్రయాగ్‌ను కొన్ని పుస్తకాలలో ఝాన్సీ ప్రయాగ్‌గా పేర్కొన్నారు. అది ఒక సుప్రసిద్ధ పుణ్యస్థలం. అనేక హిందూ గ్రంథాలలో కూడా దాని గురించి పేర్కొన్నారు. కానీ అది ఎన్నడూ ఒక నగరం కాదు'' అని ఫారూఖీ తెలిపారు.

అలహాబాద్

ఫొటో సోర్స్, Ankit Srinivas

ఫొటో క్యాప్షన్, ఖుస్రో బాగ్‌లో అనేక మంది మొఘల్ ప్రముఖులను సమాధి చేశారు

ఇలాహాబాస్ నుంచి ప్రయాగరాజ్ వరకు

అక్బర్ 1574లో ఒక నగరానికి పునాది వేసి, దానికి ఇలాహాబాస్ అని పేరు పెట్టారు. అక్కడే ఒక పెద్ద కోటను నిర్మించి దానిని ఉత్తర భారతదేశంలో పాలనా నిర్వహణ, మిలటరీ కేంద్రంగా ఉపయోగించుకున్నారు.

ఆ తర్వాత వచ్చిన మొఘల్ పాలకులు దానిని 'ఇలహాబాద్' అని పిలిచేవారు. చివరికి బ్రిటిష్ పాలకులు పలికేందుకు సులభంగా ఉందని దాన్ని 'అలహాబాద్' అని పిలవడం ప్రారంభించారు.

కానీ నేటికీ స్థానిక హిందూ, ఉర్దూ భాషలలో దానిని ఇలాహాబాద్ అనే పిలుస్తారు.

అలహాబాద్‌లోని పబ్లిక్ లైబ్రరీ

ఫొటో సోర్స్, Ankit Srinivas

ఫొటో క్యాప్షన్, అలహాబాద్‌లోని పబ్లిక్ లైబ్రరీ

1584-2018 మధ్య కాలంలో ఆ నగరం ఎన్నో చారిత్రక ఘట్టాలను చూసింది.

మొఘల్ పాలకుల సమయంలో అది స్థానిక అధికార కేంద్రంగా ఉండేది. నెహ్రూ నివాసం ఆనంద్ భవన్ స్వాతంత్ర్య పోరాట యోధులకు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యాలయంగా ఉండేది.

స్వాతంత్ర్యం సిద్ధించిన మొదటి కొన్ని దశాబ్దాల పాటు అలహాబాద్ ప్రధానమైన సాంస్కృతిక, రాజకీయ కేంద్రంగా విలసిల్లింది.

ఈ నగరానికి చెందిన అనేక మంది హిందీ రచయితలు, రాజకీయవేత్తలు, నటులు, శాస్త్రవేత్తలు తమ తమ రంగాలలో కీర్తిని ఆర్జించారు.

ఆనంద్ భవన్

ఫొటో సోర్స్, Ankit Srinivas

ఫొటో క్యాప్షన్, అలహాబాద్‌లోని ఆనంద్ భవన్

అలహాబాద్ అనేది ఒక సెంటిమెంట్

''ఇంత చిన్న నగరం ఇంత మంది ప్రముఖులను దేశానికి ఇవ్వడం చాలా ఆశ్చర్యకరం. అది అందరికీ గర్వకారణం. ఆ ప్రముఖులు హిందువా, ముస్లిమా అన్నది అనవసరం'' అని ప్రొఫెసర్ చతుర్వేది తెలిపారు.

''మీరు దీనిని అలహాబాద్ అని పిలుస్తారా లేక ప్రయాగరాజా అన్నది అప్రస్తుతం. ఇది హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రంగా కొనసాగుతుంది. కానీ అలహాబాద్ పేరును మార్చడమంటే దాని ఆత్మను చంపడమే'' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రొఫెసర్ ఫారూఖీ కూడా ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు.

''మీరు 500 ఏళ్ల చరిత్రను తుడిచేయలేరు. అలహాబాద్ అనేది కేవలం ఒక పేరు కాదు. అది ఈ నగరంలో పెరిగిన ప్రతి ఒక్కరిలోనూ ఉన్న భావన'' అన్నారాయన.

అది నగరంలోని ప్రతి ఒక్కరి సెంటిమెంట్.

గంగా నదిలో భక్తుల స్నానాలు

ఫొటో సోర్స్, Ankit Srinivas

ఫొటో క్యాప్షన్, గంగా నదిలో భక్తుల స్నానాలు

ప్రభుత్వం మంచి పనే చేసింది..

అయితే మరికొందరు మాత్రం అలహాబాద్ పేరును మార్చాలన్న బీజేపీ అభిప్రాయంతో ఏకీభవించారు. ప్రొఫెసర్ రాజేష్ కుమార్ సింగ్ వారిలో ఒకరు.

''ఈ నగరం సాంస్కృతిక గుర్తింపును పునరుద్ధరించడం చాలా మంచి విషయం. ప్రయాగరాజ్ అన్న పేరు అది ఒక ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రం అన్నదాన్ని ప్రతిఫలిస్తుంది. ప్రభుత్వం మంచి పని చేసిందని చాలా మంది భావిస్తున్నారు'' అన్నారు రాజేష్ కుమార్.

అయితే నగరంలోని చాలా మంది మాత్రం ప్రభుత్వ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తాము అలహాబాదీలు అని చెప్పుకోవడాన్ని వాళ్లు గర్వంగా భావించేవాళ్లు.

ప్రముఖ హిందీ కవుల్లో ఒకరు తనను తాను అక్బర్ ఇలాహాబాదీ అని చెప్పుకునేవారు.

ఆయనను ఇప్పుడు 'అక్బర్ ప్రయాగరాజ్' అని పిలవాలా?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)