మరాఠ్వాడా కరవు: 'నా పంట పోయింది... బతుకుతెరువు కోసం ఊరు విడిచి వెళ్లాలి' : BBC Ground Report

మహారాష్ట్రలో కరవు

ఫొటో సోర్స్, Rahul Ransubhe

    • రచయిత, రాహుల్ రాన్సుభే, శ్రీకాంత్ బంగాలే
    • హోదా, బీబీసీ మరాఠీ

''ఎక్కడికైనా వెళ్లాలి... ఏదో ఒక చోటుకి.. బహుశా ఉల్లికోతకు నారాయణ్‌గావ్‌కో మరో చోటుకో వెళతానేమో. కానీ బతుకుతెరువు కోసం నేను ఈ ఊరు వదిలిపెట్టాలి'' అంటున్నారు బహీనాబాయి తాప్సే. కరవు వల్ల ఆమె కలవరపడుతున్నారు.

అరవై ఐదేళ్ల బహీనాబాయిది మహారాష్ట్ర, హింగోలీ జిల్లాలోని సతాంబా గ్రామం.

ఈ గ్రామంలోని దాదాపు అన్ని వ్యవసాయ కుటుంబాలూ.. ఒక సీజన్‌లో రెండు సార్లు నాట్లు వేయాల్సి వస్తోంది.

మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో నెలకొన్న కరవు పరిస్థితులను పరిశీలించేందుకు బీబీసీ బృందం వెళ్లింది.

సాధారణంగా అక్టోబర్ మాసంలో ఇక్కడ ఏ గ్రామంలోకి అడుగుపెట్టినా ఎవరూ కనిపించరు. చాలా మంది పంట కోతల కోసం పొలాల్లో ఉంటారు. కానీ, ఈసారి సతాంబా గ్రామంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.

చాలా మంది ఊర్లోనే ఉన్నారు. తీవ్రమైన కరవు వల్ల వ్యవసాయం కుంటుపడింది. పనులు దొరకట్లేదు. దాంతో చాలామంది తమ ఇళ్ల ముందు అరుగుల మీద దిగులుగా కూర్చుని ఉన్నారు.

గ్రామంలోని ప్రధాన కూడలికి వెళ్లిన తర్వాత మేం జనంతో మాట్లాడటం మొదలుపెట్టాం.

మహారాష్ట్రలో కరవు

ఫొటో సోర్స్, Rahul Ransubhe

''వాళ్లు కరవు పరిస్థితి ఎలా ఉందో చూడాలనుకుంటే.. నా పొలానికి రమ్మని చెప్పండి. అసలు కరవంటే ఏమిటో వాళ్లకి నేను చూపిస్తా'' అన్నారు అటుగా వచ్చిన బహీనాబాయి.

ఆమెతో కలిసి మేము ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి పొలానికి వెళ్లాం.

నడుస్తూనే ఆమెతో మాట్లాడాం. నాట్ల గురించి అడిగాం. ఆమె చెప్తూ ఉన్నారు...

''మేమిప్పుడు మూడోసారి నాట్లు వేయాలా?''

''మాకు అయిదెకరాల పొలం ఉంది. సోయాబీన్, కంది పంటలు వేశాం. ముందు వర్షం వస్తుందనుకున్నాం. కానీ వర్షపు చుక్క జాడ లేదు. రెండోసారి నాట్లు వేశాం. వాన వస్తుందని 15 రోజులు వేచిచూశాం. కానీ ఫలితం లేదు. ఇప్పుడు అంతా పోయింది. పైరు మాడిపోయింది.''

బహీనాబాయి మాట్లాడుతున్నపుడు పొలం మీదకు మా కళ్లు మళ్లాయి. సోయాబీన్ పంట ఎండిపోయి వాలిపోయి కనిపిస్తోంది. బహీనాబాయి చెప్తున్న దానికి ఈ పొలం పరిస్థితే సాక్ష్యం.

బహీనాబాయి భర్త విఠల్ తాప్సే.. హింగోలీలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 80,000 రుణం తీసుకున్నారు.

మహారాష్ట్రలో కరవు

ఫొటో సోర్స్, Rahul Ransubhe

ఈ కరవు పరిస్థితుల వల్ల ఆ రుణం తిరిగి తీర్చే దారేదన్న ఆందోళన బహీనాబాయిని పీడిస్తోంది.

''ఇక్కడ కరవు తాండవిస్తోంది. మా పొట్టలు నింపుకోవటానికి మేం ఏదో ఒకటి చేయాలి. ఎక్కడికైనా వెళ్లాలి. ఉల్లి కోతకు నారాయణ్‌గావ్ కానీ, మరో చోటకు కానీ.. బతుకుతెరువు కోసం వెళ్లాలి...'' అని ఆమె చెప్పారు.

ఖరీఫ్ పంట పోయింది. మరి రబీ పంట ప్రణాళికలేమిటని మేం వారిని అడిగాం. ''రబీ పంటలు ఎలా వేయగలం? మూడోసారి నాట్లు వేయాలా? ఇప్పటికే రెండుసార్లు వేశాం. కానీ, పంట చేతికి రాలేదు. ఇప్పుడు మూడోసారి నాట్లు ఎలా వేయగలం?'' అని ఆమె ప్రశ్నించారు.

బహీనాబాయి కుటుంబంలో ఆరుగురు సభ్యులున్నారు. అందరూ వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. వారి పొలంలో బావి లేదు. పంటకు నీళ్లందించే మరో మార్గమే లేదు. వాళ్ల వ్యవసాయం పూర్తిగా వర్షపు నీటిపై ఆధారపడిందే.

బహీనాబాయితో కలిసి నడుస్తూ.. సోయాబీన్ పంటలను కరవు ఏవిధంగా కాల్చేసిందో మేం చూశాం.

ధనాజీ ఘ్యార్ అనే మరో గ్రామస్తుడు కూడా మాతో ఉన్నారు.

''పుణె లేదా ముంబయిలో పని వెతుక్కోవాలి''

''మాకు ఐదెకరాల పొలం ఉంది. ఈసారి వర్షం తగినంతగా లేకపోవటంతో నాట్లు సరిగా వేయలేకపోయాం. పెట్టుబడి కోసం అప్పులు చేశాం. మరోసారి విత్తనాలు, ఎరువులు కొనుక్కొచ్చి రెండోసారి విత్తనాలు వేశాం. కానీ వర్షం పడలేదు. ఇప్పుడు మాకు ఏమీ మిగలలేదు'' అని దీనంగా చెప్పారు ధనాజీ.

ధనాజీ ఘ్యార్ వయసు మళ్లిన వ్యక్తి. అందువల్ల వర్షం కోసం వేచి చూడటం మినహా ఆయనకు వేరే దారి లేదు. కానీ గ్రామంలోని విఠల్ ఘ్యార్ వంటి యువ రైతులు ఊరు వదిలి వెళ్లాలని ఆలోచిస్తున్నారు.

''మేం రెండు పర్యాయాలు విత్తనాలు వేసినా ఫలితం లేదు. రబీ సీజన్‌లో ప్రకృతి దయ చూపుతుందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. ఇప్పుడు మేమేం చేయాలి? ఈ ఊరు వదిలిపెట్టి ఏదైనా పని వెతుక్కుంటూ పుణె లేదా ముంబై వెళ్లాలి. మా పాత అప్పులు ఇంకా మాఫీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు అప్పు తీసుకోవాలన్న ఆలోచన కూడా మేం చేయలేం. బతకడం ఎలా? మా పిల్లలని చదివించుకోవడం ఎలా? ఈ ప్రశ్నలు మాకు నిద్ర లేకుండా చేస్తున్నాయి'' అంటున్న విఠల్ మాటలు కరవు ప్రభావాన్ని వివరిస్తున్నాయి.

హింగోలీ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది సతాంబా గ్రామం. ఊరి జనాభా 1,200 మంది. ఊర్లో రోడ్డు పక్కన ఒక బోరు బావి ఉంది. మేం దానిని కొట్టినపుడు పైనుంచి నీళ్లు వచ్చాయి.

ఈ బోరు నుంచి నీళ్లు వస్తాయా అని దగ్గర్లో ఆడుకుంటున్న పిల్లల్ని అడిగాం మేము. ''అవును. తాగటానికి మాకు ఇంకా నీళ్లున్నాయి'' అని వాళ్లు బదులిచ్చారు.

మహారాష్ట్రలో కరవు

ఫొటో సోర్స్, Rahul Ransubhe

‘‘క్షేత్రస్థాయి వాస్తవా పరిశీలన పూర్తయింది’’

''రెండోసారి కరవు బారిన పడిన జిల్లాలు, తహశీళ్లు'' శీర్షికతో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 12వ తేదీన ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

తీవ్ర, మధ్యస్థ కరవును ఎదుర్కొంటున్న తహశీళ్ల జాబితా ఆ నోటిఫికేషన్‌లో ఉంది. మొత్తం 32 జిల్లాల్లోని 172 తహశీళ్లు అందులో ఉన్నాయి. వీటిలో 112 తహశీళ్లు తీవ్ర కరవును ఎదుర్కొంటుండగా.. 60 తహశీళ్లు మధ్యస్థ కరవు బారిన పడ్డాయి.

జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు తక్షణమే.. కరవు ముప్పు ఎదుర్కొంటున్న గ్రామాల్లో పంటల మీద క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని ఆ నోటిఫికేషన్ స్పష్టంగా చెప్తోంది.

ఈ జాబితా ప్రకారం.. కరవు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో హింగోలి జిల్లాలోని కొన్ని తహశీళ్లు ఉన్నాయి.

''హింగోలి జిల్లాలోని హింగోలి, కాల్మానురి, సేన్గావ్ తహశీళ్లు.. రాష్ట్ర ప్రభుత్వ కరవు నోటిఫికేషన్ జాబితాలో ఉన్నాయి. ఈ మూడు తెహశీళ్లలో క్షేత్రస్థాయి వాస్తవ పరిశీలన పూర్తయింది. నివేదికను మేం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. ఆ తర్వాత కరవు ప్రభావిత తహశీళ్ల తుది జాబితాను ప్రకటిస్తారు'' అని హింగోలి జిల్లా కలెక్టర్ అనిల్ భండారి చెప్పారు.

‘‘నివేదిక లేకపోతే మేం తుది నిర్ణయం ఎలా తీసుకోగలం?’’

అక్కడ కరవు నెలకొందా లేక కరవు తరహా పరిస్థితి ఉందా అన్నది చెప్తూ తుది జాబితాను అక్టోబర్ 31వ తేదీన ప్రకటించటం జరుగుతుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు.

కరవు విషయంలో అధికార ప్రకటన ప్రక్రియ గురించి అడిగినపుడు.. ''కరవు ప్రభావిత గ్రామాల గురించి అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి మరో రెండు రోజుల్లో మాకు నివేదికలు వస్తాయి. దానిప్రకారం తుది జాబితా రూపొందించటం జరుగుతుంది. అది తయారైన తర్వాత సంబంధిత తహశీళ్లకు మేం అదనపు నిధులు ఇస్తాం'' అని వ్యవసాయ శాఖ మంత్రి సదాభావ్ ఖోట్ చెప్పారు.

కరవు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే చర్యల గురించి మాట్లాడుతూ.. ''నీటి కొరత ఎదుర్కొంటున్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని మేం ఆదేశాలిచ్చాం. ఈ గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి హామీ పథకం కింద పని కల్పించటం జరుగుతుంది. విద్యార్థులకు విద్యా ఫీజుల్లో రాయితీలు ఇస్తాం. వీరికి ఎస్‌టీ కార్పొరేషన్ ఉచిత పాసులు అందిస్తుంది'' అని ఆయన తెలిపారు.

మహారాష్ట్రలో కరవు

ఫొటో సోర్స్, Rahul Ransubhe

అయితే, ప్రభుత్వం నీటి నిర్వహణ సక్రమంగా చేయలేదని.. అదే కరవుకు కారణమైందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు సదాభావ్ సమాధానమిస్తూ.. ''వర్షాలు తక్కువగా ఉన్నాయి. కొన్ని తహశీళ్లలో సాధారణం కన్నా 25 శాతం తక్కువ వర్షపాతముంది. కొన్ని తహశీళ్లలో 50 శాతం తక్కువ వర్షాలున్నాయి. కాబట్టి నిర్వహణ సరిగాలేదన్న ఆరోపణల్లో నిజం లేదు'' అని చెప్పారు.

రాష్ట్రంలో దాదాపు సగం తహశీళ్లు కరవు ఛాయలో ఉన్నాయని సదాభావ్ అంటున్నారు.

మరాఠ్వాడాకు 1,425 ట్యాంకర్లు అవసరం

మరాఠ్వాడా ప్రాంతంలో నీటి కొరత మీద ప్రాధమిక నివేదికను ఇటీవల రూపొందించారు. దాని ప్రకారం.. రాబోయే రెండు నెలల పాటు మరాఠ్వాడాకు 1,425 నీటి ట్యాంకర్లు అవసరం.

మరాఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో బీడ్, ఔరంగాబాద్, జల్నాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి.

సతాంబా గ్రామస్తులు తాము బతుకుతెరువు కోసం పుణె లేదా ముంబై వెళ్లాల్సి ఉంటుందని చెప్తున్నారు. వలస, వ్యవసాయ రంగ నిపుణుడైన హెచ్.ఎం.దేశార్దను బీబీసీ మరాఠీ సంప్రదించింది.

''జల్‌యుక్త్ శివర్ కింద పని జరిగినట్లయితే.. ఇంత నీటి కొరత ఎందుకు?''

''ఖరీఫ్ పంటల్లో రైతులు నష్టపోయి దెబ్బతిన్నారు. గ్రామాల్లో నీళ్లు లభించకపోవటంతో జనం ఊళ్లు వదిలి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. చెరకు కోత కార్మికుల వలస అనేది నిరంతరంగా జరుగుతున్నదే. కానీ, ఇప్పుడు రైతులు, వ్యవసాయ కార్మికులు నీళ్లు లేకపోవటం వల్ల నగరాలకు వలసపోతున్నారు. ఈ పరిణామాల వల్ల ఘర్షణలు పెరిగే అవకాశం కూడా ఉంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

''మరాఠ్వాడాలో రాబోయే ఎనిమిది నెలల వరకూ నీటి అత్యవసర పరిస్థితి ఉంటుంది. అందుబాటులో ఉన్న నీటిని ప్రభుత్వం సక్రమంగా నిర్వహించినట్లయితే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. 'జల్‌యుక్త్ శివర్' పథకం (వ్యవసాయం కోసం నీటి పరిరక్షణ పథకం) కింద 16,000 గ్రామాల్లో ఐదు లక్షల పనులు చేపట్టారు. వీటిలో 90 శాతం పనులు పూర్తయ్యాయని ప్రభుత్వం చెప్తోంది. మరి ఈ పనులు పూర్తయివుంటే.. ఇంత నీటి కరవు ఎందుకు?'' అంటూ 'జల్‌యుక్త్ శివర్' పథకం సామర్థ్యాన్ని దేశార్థ ప్రశ్నించారు.

వలసలను నివారించటానికి ఒక మార్గంగా.. ''పశువులకు తక్షణం మేత అందించటం అవసరం. ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలి. ఎక్కువ నీరు అవసరమైన పైర్లు నాటటాన్ని నియంత్రించాలి'' అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)