అమిత్ షా జాబు.. చంద్రబాబు జవాబు

ఫొటో సోర్స్, fab.com/AmitShah.Official/NCBN
- రచయిత, అంజయ్య తవిటి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోవడంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేఖ రాశారు. అందుకు చంద్రబాబు కూడా కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ప్రాజెక్టుల వివరాలను అమిత్ షా తన 9 పేజీల లేఖలో ప్రస్తావించారు.
అయితే, ఆ లేఖ తప్పుల తడకగా ఉందని చంద్రబాబు అభివర్ణించారు. అందులోని అంశాలకు అసెంబ్లీ వేదికగా సమాధానం ఇచ్చారు.
మరి అమిత్ షా లేఖలో ఏమన్నారు? అందుకు చంద్రబాబు ఏం చెప్పారు? చూద్దాం.
1. అమిత్ షా: ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడం ఏకపక్ష నిర్ణయం, దురదృష్టకరం. అభివృద్ధి అంశాల కన్నా రాజకీయ సమీకరణల ఆధారంగానే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారని నేను సందేహిస్తున్నాను.
చంద్రబాబు: రాజకీయ ప్రయోజనాలు కాదు, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం.
విభజన తర్వాత ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు, రాష్ట్రానికి కేంద్రం అండ ఉండాలన్న ఆలోచనతో ఎన్నికల్లో మీతో పొత్తు పెట్టుకున్నాం. నాలుగేళ్లు ఎదురు చూస్తే మొండిచేయి చూపించారు.
2. అమిత్ షా: ఆంధ్రరాష్ట్ర ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్రం నిర్లిప్తతతో ఉన్నదని విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని మీరు చేసిన వాదన పూర్తిగా అవాస్తవం, నిరాధారం.
చంద్రబాబు: అమిత్ షా రాసిన లేఖలో అన్నీ కట్టు కథలు, అసత్యాలే ఉన్నాయి. అందులో హుందాతనం కూడా లేదు. అది నాకు రాసిన లేఖ కాదు. రాష్ట్రాన్ని కించపరుస్తూ రాసిన లేఖ. ఆ లేఖలో చెప్పిన దానికి రాష్ట్రానికి ఇచ్చిన దానికి పొంతనే లేదన్న విషయం అందరూ తెలుసుకోవాలి.

ఫొటో సోర్స్, fb.comNcbn
3. అమిత్ షా: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమైన నిర్ణయాత్మక చర్చకి బదులుగా ప్రత్యేక హోదా అంశం పట్ల రాజకీయ పార్టీలు.. ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నాయి. ఈ పార్టీలు జరుగుతున్న అభివృద్ధిని దాచి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో సెంటిమెంటుని రగిలిస్తున్నాయి.
చంద్రబాబు: ఇది సెంటిమెంటు కాదు. బాధ, ఆవేదన. మీరు ఎక్కడో బయట కూర్చుని మాట్లాడటం సరికాదు. 40 ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తి లాక్కుని వెళ్లిపోమంటే ఎంత బాధ ఉంటుందో, అంత బాధ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తున్నారు.
4. అమిత్ షా: కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం అయిదేళ్లలో ఏపీకి చేసిన సాయం కంటే ఎన్డీఏ ప్రభుత్వం రెండింతల సాయం చేసింది.
చంద్రబాబు: కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏటా పెరుగుతుంటాయి. అందులో మీరు ఇచ్చిందేమీ లేదు.
మీరు కాంగ్రెస్ కంటే ఎక్కువ అన్యాయం, మోసం చేశారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఇది కాదనలేని సత్యం.
5. అమిత్ షా: విభజన చట్టం ప్రకారం 2022లోగా 11 విద్యాసంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 9 విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి.
చంద్రబాబు:
తిరుపతి ఐఐటీకి రూ.3150 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.100 కోట్లు ఇచ్చారు.
ఎన్‌ఐటీకి 460 కోట్లకు 50 కోట్లు ఇచ్చారు.
ఐఐఎంకి రూ.690 కోట్లు కావాలి, 80 కోట్లు ఇచ్చారు.
ఐఐఎస్‌ఈఆర్‌కి 1613కోట్లకు 99 కోట్లు ఇచ్చారు.
సెంట్రల్ యూనివర్సిటీకి 10 కోట్లు ఇచ్చారు, ట్రైబల్ యూనివర్సిటీకి 10 కోట్లు ఇచ్చారు.
మొత్తం రూ. 11672 కోట్లు కావాల్సి ఉంటే మీరు ఇచ్చింది నాలుగేళ్లలో రూ. 576 కోట్లు

ఫొటో సోర్స్, Getty Images/SpecialStatusCampaign/tdp.ncbn
6. అమిత్ షా: రూ.6,769 కోట్ల అంచనాతో విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపాం.
చంద్రబాబు: లేనిపోని కొత్త విధానాన్నితీసుకొచ్చారు. దాంతో విజయవాడ మెట్రో కథ మొదటికి వచ్చింది. మెట్రో ప్రాజెక్టు రిపోర్టు కోసం మేం దిల్లీ మెట్రో కార్పొరేషన్‌కు చెల్లించిన ఖర్చులు కూడా వెనక్కి రాకుండా చేశారు. విజయవాడ, గుంటూరు మధ్య కొత్త రైల్వే లైను ఇంకా మంజూరే కాలేదు, దానికి రూ.2,680 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

ఫొటో సోర్స్, DrSivaPrasad/YsAvinashYouth/FB
7. అమిత్ షా: కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రత్యేక ప్యాకేజీ కింద మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవడానికి ఎందుకు తొందరగా స్పందించలేదు? నాబార్డు నిధులను నేరుగా తీసుకునేందుకు వీలుపరిచే 'స్పెషల్ పర్పస్ వెహికల్'ను ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనకు ఎందుకు స్పందించలేదు? 'ఇతర' అవసరాల కోసం నిధులు మళ్లించడంలో సమస్యలు వస్తాయనదే కదా మీ సమస్య?
చంద్రబాబు: మీరు 'స్పెషల్ పర్పస్ వెహికల్' పెట్టమంటే నేనెందుకు పెట్టాలి? మీరిచ్చే రూ.14 వేల కోట్ల కోసం మేము ప్రత్యేక హోదాపై రాజీపడాలా?తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలా?
'ఇతర' అవసరాల కోసం నిధులు మళ్లించడం మీకు అలవాటు ఉందేమో.. మాకు లేదు. నీతివంతమైన, సమర్థవంతమైన, ప్రజాపరిపాలన తప్ప నాకు మరోటి తెలియదు.
8. అమిత్ షా: అమరావతిలో రాజ్‌భవన్, సచివాలయం, అసెంబ్లీ, ఇతర భవనాల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2500 కోట్లు విడుదల చేసింది. ఇందులో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన రూ.1000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 8 శాతం మాత్రమే వినియోగించింది. ఇచ్చిన నిధులను ఖర్చుచేయకుండా మరిన్ని నిధులు కోరడం సముచితమేనా?
చంద్రబాబు: అమరావతికి రూ. 1500 కోట్లు, గుంటూరుకు రూ. 500 కోట్లు, విజయవాడకు 500 కోట్లు వచ్చాయి. అన్నీ ఖర్చు చేస్తున్నాం. బిల్లులు సమర్పిస్తాం.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








