ఆత్మహత్యకు సాయం చేస్తానని 9 మంది గొంతుకోశాడు

ఫొటో సోర్స్, AFP
''ఇక్కడ ఆత్మహత్యలకు సలహాలు, సేవలు అందించబడును..'' అంటూ హత్యలకు, ఆత్మహత్యలకు సలహాలిచ్చే వెబ్‌సైట్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వీటితోపాటు ఆత్మహత్య చేసుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి వెబ్‌సైట్లు ప్రభుత్వాలకు సవాళ్లుగా మారుతున్నాయి. ఇలాంటి వెబ్‌సైట్లను రద్దు చేయడానికి జపాన్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
జపాన్‌లో ఓ 27 సంవత్సరాల యువకుడు ఇలాంటి పనే చేశాడు. ఆత్మహత్మ చేసుకోవాలనుకున్నవారికి సలహాలిస్తాను ఇంటికి రమ్మన్నాడు. ఇంటికొచ్చాక చంపేసి ముక్కలు చేశాడు. ఇతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇంతవరకూ 9 మందిని హత్య చేసినట్టు విచారణలో ఒప్పుకున్నాడు.
టోక్యో శివారు ప్రాంతంలో నివసించే ఇతని పేరు షిరఇషి. తన ఇంటికి 'హౌస్ ఆఫ్ హార్రర్స్' అని పేరు కూడా పెట్టుకున్నాడు.
అక్టోబర్లో తన ఇంట్లో 9మంది వ్యక్తుల శరీర భాగాలు దొరికాయి. ముక్కలు చేసిన ఈ శరీర భాగాలను కూలర్స్, టూల్ బాక్సుల్లో పోలీసులు గుర్తించారు. ఇందులో 9 తలలు, చేతులు, కాళ్ల ఎముకలు కూడా ఉన్నాయి.
బాధితులను ఎలా వెతికాడంటే..
ఆత్మహత్య చేసుకోవాలనుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని తకహిరో షిరఇషి గుర్తించాడు. తాను వారికి ఆత్మహత్య చేసుకోవడంలో సహాయం చేస్తానని నమ్మించాడు.
ఒంటరిగా చావలేక చావులో కూడా తోడు వెతుక్కునే వారు తన ఇంటికి రావొచ్చని ఆహ్వానించాడు. వారు ఇంటికి రాగానే హత్య చేసి, శరీర భాగాలను ముక్కలు చేశానని చెప్పాడు.
తకహిరో షిరఇషి చంపిన 9మందీ 20 సంవత్సరాల వయసు లోపు వారే!
అందులో ముగ్గురు హైస్కూల్ విద్యార్థినులు. వీరితో పాటు 15 సంవత్సరాల అమ్మాయి, 20 సంవత్సరాల వయసున్న నలుగురు మహిళలు, మరో 20 సంవత్సరాల యువకుడు కూడా ఉన్నారు.
మరో వ్యక్తితో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిన ఓ యువతి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులకు తకహిరో షిరఇషి ఆచూకీ దొరికింది.

ఫొటో సోర్స్, Reuters
ఏమిటీ వెబ్‌సైట్ల కథ?
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారికి ఏవిధంగా ఆత్మహత్య చేసుకోవాలన్న సమాచారాన్ని ఈ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా గ్రూపులు అందిస్తాయి. ఆత్మహత్యలు చేసుకునేలా కూడా ఈ వెబ్‌సైట్లు ప్రోత్సహిస్తాయి.
తోరుఇగావా అనే స్వంచ్ఛంద సంస్థ నిర్వహకుడు స్థానిక మీడియాతో మాట్లాడుతూ - ఇంటర్నెట్ జపాన్ యువతను ఛిద్రం చేస్తోందన్నారు.
''గతంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, ఒంటరిగా చావలేక ఆ ప్రయత్నాన్ని విరమించేవారు. కానీ సోషల్ మీడియాలో ఇలాంటి వారందరూ గ్రూపులుగా తమ ఆలోచనలను పంచుకుంటున్నారు. దీంతో పరిస్థితి పూర్తీగా మారిపోయింది. చావులో కూడా ఓ తోడు దొరకడంతో ఆత్మహత్యలు పెరిగాయి.''

జపాన్ ప్రభుత్వం ముందున్న సవాళ్లు
ఆత్మహత్యలను ప్రోత్సహిస్తున్న వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలని, రోజురోజుకూ విస్తరిస్తున్న ఇలాంటి సైట్లపై అధ్యయనం చేయాలని జపాన్ ఛీఫ్ కేబినెట్ సెక్రటరీ యోషిహిదె సుగ మంత్రివర్గానికి సూచించారు. ఇలాంటి సైట్లను రద్దు చేయాలని కూడా ఆయన చెప్పారు.
''ట్విటర్ లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లపై నిఘా ఉంచడం కష్టమే. కానీ ఆత్మహత్యలు చేసుకోవాలన్న బలహీనులను హత్య చేయడం హేయమైన చర్య.''
జపాన్‌లో ఇంటర్నెట్ ఆత్మహత్యలు ఇప్పుడు కొత్తేమీ కాదు. 2003లో మొదటి ఇంటర్నెట్ ఆత్మహత్య నమోదైంది. ఆత్మహత్యలను అదుపు చేయడానికి ఆనాడే కౌన్సిలింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది జపాన్ ప్రభుత్వం. ఆత్మహత్యలకు సలహాలిచ్చే కొన్ని వెబ్‌సైట్లను కూడా రద్దు చేసింది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








