పెద్ద నోట్ల రద్దు: ‘రాజకీయంగా అది మాస్టర్ స్ట్రోక్’

- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
2016వ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించి, తన కేబినెట్ సహచరులతో పాటు మొత్తం దేశప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రధాని ఆ రోజు రాత్రి 8 గంటలకు చేసిన ప్రసంగంలో.. రాత్రి 12 గంటల నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లుబాటు కావని తేల్చి చెప్పారు.
తనకు 50 రోజులు గడువు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.
''నేను మీ నుంచి కేవలం 50 రోజుల గడువును కోరుతున్నాను. నాకు డిసెంబర్ 30 వరకు గడువు ఇవ్వండి. డిసెంబర్ 30 తర్వాత నా తప్పు ఉందని తేలితే, మీరు నన్ను ఏ చౌరస్తాలోనైనా నిలబెట్టి, ఏ శిక్ష విధించినా భరిస్తాను'' అన్నారు.
దేశప్రజలకు శరాఘాతంగా పరిణమించిన తన నిర్ణయాన్ని ఆయన నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యగా చెప్పుకున్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై అది సర్జికల్ స్ట్రైక్ అని ప్రకటించారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ సమాజంపై వైపు ఒక పెద్ద ముందడుగు అని తెలిపారు.
నోట్లు రద్దు చేసిన ఉద్దేశాలన్నీ నెరవేరినట్లు 2018లో మోదీ ప్రభుత్వం చెప్పింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. 500, 1000 నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణ జరిగిందని.. పన్ను వసూళ్లు పెరిగాయని, అభివృద్ధి రేటు కూడా పెరిగిందని ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
నల్లధనం ఏదీ?
కానీ రద్దు చేసిన నోట్లలో 99.3 శాతం 2017లో తిరిగి వ్యవస్థలోకి వచ్చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
రిజర్వ్ బ్యాంక్ ప్రకారం నోట్లను రద్దు చేసినపుడు రూ.15,41,000 కోట్ల విలువైన 500, 1000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి.
దానిలో రూ.15,31,000 కోట్లు తిరిగి వ్యవస్థలోకి వచ్చేశాయి.
అంటే కేవలం 10 వేల కోట్లు మాత్రం తిరిగి రాలేదు. ఇంకా నేపాల్, భూటాన్‌ల నుంచి తిరిగి రావాల్సిన నోట్లు బాకీ ఉన్నాయి.
"ప్రజలు నల్లధనం భయంతో నగదును ఇంట్లో పెట్టుకుంటారని అనుకోవడం మూర్ఖత్వం. నల్లధనం రూపంలోని నగదును రియల్ ఎస్టేట్ మొదలైన వాటిలో పెట్టుబడులు పెడతార"ని ఆర్థిక నిపుణులు ప్రియ రంజన్ డాష్ అభిప్రాయపడ్డారు.
"పెద్ద నోట్ల రద్దు ఒక తుగ్లక్ నిర్ణయం. దీని వల్ల దేశానికి ,ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం జరిగింది. దీని కారణంగా జీడీపీ 2 శాతం తగ్గిపోయింది. ఆర్థిక వ్యవస్థకు సుమారు 3-3.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
నోట్ల రద్దు నిర్ణయం విఫలమైనా, రాజకీయ వర్గాలకు మాత్రం ప్రయోజనం చేకూరిందని ఎకనమిక్ టైమ్స్ ఎడిటర్ టీకే అరుణ్ అన్నారు.
''నిజానికి బీజేపీ ధనికులు, చిన్న వ్యాపారుల పార్టీ కాదు.. సామాన్యుల పార్టీ అని తెలియజేయడం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం నల్లధనాన్ని అంతం చేయాలనుకుంటోంది అని వెల్లడించడం కూడా ఒక అంశం'' అని అరుణ్ వివరించారు.
ప్రజలు దీన్ని విశ్వసించి, రోజుల తరబడి క్యూలలో నిలబడి మరీ నోట్లను మార్చుకున్నారు.
''అలా నిలబడి నోట్లను మార్చుకోవడం ద్వారా తాము ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామని వాళ్లు భావించారు'' అంటారాయన.

ఫొటో సోర్స్, NurPhoto
ఆర్థిక వ్యవస్థపై సర్జికల్ స్ట్రైక్స్
చాలామంది నోట్ల రద్దును మోదీ మూర్ఖత్వంగా పేర్కొంటారు కానీ, అరుణ్ మాత్రం అది ఆయన మాస్టర్ స్ట్రోక్ అని అంటారు.
''మోదీ కాదు, సాధారణ ప్రజలు మూర్ఖులు. ప్రభుత్వం వాళ్ల మూర్ఖత్వాన్ని అలుసుగా తీసుకుని తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంది'' అన్నారాయన.
ప్రియ రంజన్ డాష్ కూడా ఆయన వాదనతో ఏకీభవించారు. ''ఇవి ఆర్థిక వ్యవస్థపై సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి. అవి ఒక పెద్ద రాష్ట్రం (ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు) ఎన్నికలకు ముందు జరిగాయని గుర్తుంచుకోవాలి'' అన్నారు
నోట్ల రద్దు వెనుక ఉన్న అసలైన కారణం ఇదే అనేది ఆయన అభిప్రాయం.
కాంగ్రెస్ పార్టీ నోట్ల రద్దును మోదీ సృష్టించిన విపత్తుగా పేర్కొంది.
''నోట్లను తిరిగి ఇవ్వలేని వారి ద్వారా 4 లక్షల కోట్ల లాభం చేకూరుతుందని ప్రధాని భావించారు. కానీ దానికి బదులుగా కొత్త నోట్ల ప్రచురణకు రూ.21 వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు'' అని కాంగ్రెస్ పేర్కొంది.
గతంలో ఆర్‌బీఐ నుంచి రూ.3.61 లక్షల కోట్లను కోరడం వెనుక నోట్ల రద్దు నిర్ణయం ఉందని ప్రియ రంజన్ డాష్ అంటారు.
''నోట్లను ఇవ్వలేకపోయిన వారి వల్ల ఆర్‌బీఐకి రూ.4 లక్షల కోట్లు లాభం వస్తుందని.. దానిలోంచి 3-3.5 లక్షల కోట్లు తీసుకోవచ్చని ప్రధాని భావించారు. అయితే అది జరగలేదు. అందువల్లే ప్రభుత్వం బ్యాంకులకు సాయం చేస్తామన్న నెపం మీద ఆర్బీఐను రూ.3 లక్షల కోట్లు ఇవ్వాలని కోరుతోంది'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదంలో ఆర్‌బీఐ స్వతంత్ర ప్రతిపత్తి
అయితే నోట్ల రద్దుకు దీనితో ఎలాంటి సంబంధమూ లేదని అరుణ్ అంటారు.
''ప్రపంచంలోని ఇతర సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్నదానికన్నా, ఆర్‌బీఐ వద్ద ఎక్కువ నగదు ఉందని నోట్ల రద్దు నిర్ణయానికి ముందే ప్రధాని ఆర్థిక సలహాదారు అరుణ్ సుబ్రమణియన్ తన నివేదికలో తెలిపారు.
"దీనిని ప్రభుత్వానికి బదిలీ చేస్తే, ప్రభుత్వం దానిని ఉపయోగించుకుని ఏవైనా మంచి పనులు చేయొచ్చు'' అని అరుణ్ అన్నారు.
ప్రభుత్వానికి ఇలా డబ్బు ఇవ్వడానికి కొందరు నిపుణులు అంగీకరించడం లేదు.
అయితే ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి మధ్య జరుగుతున్న పోరాటంలో చివరికి ఆర్‌బీఐ పట్టు సడలించక తప్పదు. ఆర్‌బీఐ ప్రభుత్వానికి డబ్బు ఇవ్వక తప్పదనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
వారి అభిప్రాయం ప్రకారం ఆర్‌బీఐలాంటి సంస్థలకు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి. నోట్ల రద్దు సందర్భంగా ప్రభుత్వం ఆర్‌బీఐ సలహా తీసుకోకపోవడం చూస్తే, ప్రభుత్వానికి దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడం ఇష్టం లేదని తెలుస్తోంది.
ఆర్‌బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని ప్రభుత్వం నుంచి వేరు చేసి చూడడం తగదని అరుణ్ అంటారు.
ఆర్‌బీఐ అన్నది ఆర్థిక శాఖలో ఒక భాగం. ప్రభుత్వానికి సొమ్ము ఇవ్వడం మినహా ఆర్‌బీఐకి వేరే దారి లేదంటారు ఆయన.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఎన్నికలు : ఏ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు?
- అమెరికా: మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. సభలో డెమొక్రాట్ల విజయం
- ఇంట్లో వాయు కాలుష్యం: గాలి నాణ్యతను పెంచుకునే ఐదు మార్గాలు
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- అభిప్రాయం: కోర్టు తీర్పుల అమలు ఆచరణ సాధ్యం కాకపోతే పరిస్థితి ఏమిటి?
- ఎల్ చాపో గజ్మన్: ప్రపంచంలోనే అత్యంత పేరుమోసిన నేరస్తుడి గురించి 4 నిజాలు
- రూపాయి విలువ పడిపోతే దేశానికి ఏమవుతుంది? మీకేమవుతుంది?
- రూపాయి పతనం: సామాన్యుడు ఆర్‌బీఐ నుంచి ఏం ఆశించవచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










