అభిప్రాయం: కోర్టు తీర్పుల అమలు ఆచరణ సాధ్యం కాకపోతే పరిస్థితి ఏమిటి?

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టంకశాల అశోక్
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

కొన్ని కేసులలో కోర్టులు ఇచ్చే తీర్పులు న్యాయబద్ధమైనవని పలువురు భావించినప్పటికీ, ఆ తీర్పుల అమలు ఆచరణరీత్యా సాధ్యం కానప్పుడు పరిస్థితి ఏమిటి? ఆ తీర్పులను అడ్డుకునేది ఒక్కోసారి సమాజం కావచ్చు లేదా ప్రభుత్వాలో, రాజకీయ పార్టీలో, ఏవైనా ప్రయోజనాలు గల శక్తులో కావచ్చు. అటువంటప్పుడు కోర్టులు, న్యాయం, ఇంకా చెప్పాలంటే సామాజిక పురోగతి ముందుకు పోవటం ఎలా?

ఇవి నిజానికి పాత ప్రశ్నలే. వాటికి సమాధానం చెప్పడం తేలిక కాదు. అటువంటి కోర్టు తీర్పులను అనుకూలించేవారు చెప్పలేరు, వ్యతిరేకించేవారు చెప్పలేరు, తటస్థులు కూడా చెప్పలేరు. అందులో ఇమిడి ఉన్న వివిధాంశాలు అంత క్లిష్టమైనవి.

ఇందుకు తాజా దృష్టాంతం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలోకి 10-50 సంవత్సరాల మధ్యవయసుగల మహిళల ప్రవేశంపై సెప్టెంబర్ చివరలో సుప్రీంకోర్టు 4-1 మెజారిటీతో ఇచ్చిన తీర్పు.

ఆ విషయంలో ఒకవైపు వందల సంవత్సరాల మత విశ్వాసాలు, సంప్రదాయం, మరోవైపు స్త్రీలకు సమానహక్కులనే ఆధునిక యుగ భావన ముడిపడి ఉన్నాయి. రెండూ బలమైన భావనలే. ఆ వివరాల్లోకి ఇక్కడ వెళ్లటం లేదు గానీ, రెండు వైపుల వాదనలను విన్న ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం చివరకు మహిళల సమాన హక్కులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ, అది ఆచరణలో అమలు కాగల అవకాశం లేదని గత అయిదు వారాల్లో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.

శబరిమల

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలందరూ వెళ్లొచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ కేరళలో ఆందోళనలు జరిగాయి.

ఆ తీర్పును మహిళల్లో కొందరితో పాటు విస్తృత సమాజంలోనూ పలువురు బలపరిచారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం సానుకూల వైఖరి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తటస్థంగా ఉండిపోయింది. కానీ, కేవలం ఇదే సమాజంలోని అధిక సంఖ్యాకులు వ్యతిరేకించటం వల్ల తీర్పు అమలు కాలేదు.

అమలుకు వీలు లేకుండా తాము ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసినట్లు కేరళ బీజేపీ అధ్యక్షుడు పీ.ఎస్.శ్రీధరన్ పిళ్లై ఈ నెల 5న అన్న మాటలు మరొక కోణాన్ని ముందుకు తేవటాన్ని అట్లుంచినా, యథావిధంగా కేరళ సమాజంలో సుప్రీంకోర్టు తీర్పు పట్ల వెల్లడైన తీవ్ర వ్యతిరేకత కాదనలేనిది.

ఇటువంటి స్థితిలో న్యాయం, చట్టం, ఆధునికీకరణ, సమానత్వ సాధన, మూఢ విశ్వాసాల పరిహరణ ఏ విధంగా జరగాలన్నది ప్రశ్న. పైకి కనిపించేది సుప్రీంకోర్టు విషయం. కానీ, అది ఈ అంశాలన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తున్నది.

మతం, సంప్రదాయం, సంస్కృతి పేరిట అవాంఛనీయమైన వాటిని అదే విధంగా వదిలివేయటమా, లేక ఆ చట్రాన్ని క్రమంగా బలహీనపరిచే మార్గాల కోసం అన్వేషించటమా అన్నది విచారించవలసిన విషయం.

పినరయి విజయన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు తీర్పును అమలు పరుస్తామని కేరళ ప్రభుత్వం చెప్పింది.

మనం కాలంలో వెనకకు పోయినాకొద్దీ సమాజంలోని మతాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, అప్పటి పరిస్థితులను బట్టి ఒక విధంగా కన్పిస్తాయని తెలిసిందే. అవి ఆ తర్వాత పరిస్థితుల ప్రకారం దశలు దశలుగా మారుతూ వస్తున్నాయి. అవి మారకుండా ఉండేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నించగా, మార్పును తెచ్చేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నించాయి. ఇరువురు కూడా తమతమ ప్రయోజనాలకోసమే ఆ పనిచేశారు. ఈ రెండు సామాజిక శక్తుల మధ్య ఘర్షణ నిరంతరాయంగా మారి నేటికీ సాగుతున్నది. ఇందులో ప్రభుత్వాలు, కోర్టుల వంటి ఏజెన్సీలు తిరిగి తమ ప్రయోజనాల కోసం ఈ పక్షమో, ఆ పక్షమో వహిస్తూ వచ్చాయి. కానీ, క్రీస్తు పూర్వపు నుంచి గల ఈ పరిణామక్రమాలను మదింపు చేసినప్పుడు, మార్పులు అన్నవే పురోగమన మార్గంలో ఉన్నట్లు అర్థమవుతుంది. అందుకు మధ్యమధ్య ప్రతికూలతలు ఎదురైనా, మార్పు మాత్రం ఆగలేదు.

వేల సంవత్సరాల విశ్వాసాలకు కేంద్రమైన శబరిమల విషయమై అసలు మహిళలలో కొందరైనా తమ ప్రవేశపు హక్కును కోరుకుంటారని, గత విశ్వాసాలను ప్రశ్నిస్తారని స్థానిక ప్రభుత్వం వారికి మద్దతునిస్తుందని, దేశ అత్యున్నత న్యాయస్థానం అనుకూలమైన తీర్పు చెప్తుందని, మొత్తం దేశంలోని విస్తృత సమాజంలో గణనీయభాగం సానుకూలమైన వైఖరి తీసుకుంటుందని కొతకాలం క్రితం వరకు ఊహించనైనా ఊహించగలిగే వారమా? కనుక, ప్రశ్నను సుప్రీంకోర్టు తీర్పు అమలు కావటం, కాకపోవటం అనే పరిమిత దృష్టితో చూడనక్కరలేదు. అది ముఖ్యమైనదే. కానీ, పురోగమన పరిణామక్రమం అనే మొత్తం చిత్రంలో అది ఒక భాగం మాత్రమే. మహిళల ప్రవేశం, వారి హక్కులు అన్నవి వేల ఏళ్ల సంప్రదాయిక సంస్కృతిని ఛేదించుకుని ప్రశ్నలుగా మారటమన్నదే ఒక సంస్కరణాత్మకమైన ఘనత.

రాజీవ్ గాంధీ

ఫొటో సోర్స్, HULTON ARCHIVE/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమైన అర్డినెన్స్‌ను అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకువచ్చింది.

విస్తృత దృశ్యాన్ని గమనించినప్పుడు, ఇటువంటి ఉదాహరణలు మరికొన్నింటిని పేర్కొనవచ్చు. వాటిలో పురోగమనమైనవి, తిరోగమనమైనవి కూడా ఉన్నాయి. ఒక దానిని గమనిద్దాం. అది 1978 నాటి షా బానో మనోవృత్తి కేసు. అప్పుడు ఆమెకు ఒక స్త్రీగా ఉన్న హక్కులను కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, 1973లోని సెక్షన్ 123 బలపరచింది. కానీ, ముస్లిం పర్సనల్ లా విభేదించింది. రెండింటినీ పరిశీలించిన సుప్రీంకోర్టు షా బానోకు అనుకూలమైన తీర్పు ద్వారా ఆ కమ్యూనిటీలో సంప్రదాయాన్ని, సంస్కృతిని పురోగామి దృష్టిలో భంగపరచింది.

ఆ విధంగా ఒక ఏజెన్సీ తన బాధ్యతను తాను నిర్వర్తించగా, మరొక ఏజెన్సీ అయిన అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం తిరోగమన శక్తి పాత్రను పోషించింది. తీర్పును అమలు జరపకపోగా అందుకు విరుద్ధమైన అర్డినెన్స్‌ను తీసుకువచ్చింది.

గమనించదగిన దేమంటే, అప్పటి నుంచి 40 సంవత్సాలు గడిచిన తర్వాత, అదే కమ్యూనిటీ స్త్రీలకు సంబంధించిన మరొక అంశం విషయమై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం అనే రెండు ఏజెన్సీలు కూడా పురోగామి వైఖరి తీసుకున్నాయి. ట్రిపుల్ తలాక్ పద్ధతి రద్దయింది.

ట్రిపుల్ తలాక్ రద్దు కోరుతూ మహిళ ఆందోళన
ఫొటో క్యాప్షన్, ట్రిపుల్ తలాక్ పద్ధతిని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో ఆర్డినెన్స్ జారీ చేసింది.

పైన అన్నట్లుగా ఈ తరహా వివిధ అంశాలలో వివిధ పాత్రధారులకు వివిధ దశల్లో ఎవరి ప్రయోజనాలు వారికుంటాయి. అందుకు వారిని వేలెత్తి చూపినా నికరమైన రీతిలో, సామాజిక దృష్టి నుంచి చూసినప్పుడు, పురోగమనం అన్నది మాత్రం విస్మరించలేనిది.

ఇటువంటి ఉదాహరణలు ఇంకా చెప్పుకోవచ్చు. కానీ, అంతకన్న ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. కోర్టు తీర్పులలో సమాజ పురోగతికి అనుకూలమైనవి, ప్రతికూలమైనవి కూడా ఉన్నాయి. వాటిలో ఆయా కాలాల ప్రభుత్వాలకు, పార్టీలకు ఆర్థిక శక్తులకు అనుకూలం అయినందున అమలైనవి, కాకపోయినుందున అమలు కానివీ ఉన్నాయి. తమకు సరిపడని తీర్పులను ప్రభుత్వాలు పార్లమెంటులో మార్చివేసినవి ఉన్నాయి.

శబరిమలలో మహిళల ధర్నా

ఫొటో సోర్స్, Getty Images

కోర్టులు క్రియాశీలంగా మారి ప్రజాప్రయోజనాల వ్యాజ్యం రూపంలో మంచి తీర్పులు చెప్పి, ప్రభుత్వాలు అమలుపరచక తప్పని పరిస్థితి సృష్టించినవి ఉన్నాయి. కోర్టులు ప్రభుత్వాలకు, బయటి ప్రాబల్య శక్తులకు లొంగిన సందర్భాలు, లొంగని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి వర్గీకరణలు ఇంకా చేస్తూ పోవచ్చు గానీ, అక్కరలేదు.

మొత్తం మీద అర్థం చేసుకోవలసింది ఏమంటే మన న్యాయస్థానాల తీర్పులు, వాటి అమలు శబరిమల, షా బానో ఉదంతాల నుంచి మొదలుకొని అన్నింటా మిశ్రమంగానే ఉన్నాయి. ఆ మిశ్రమంలో దేని పాలు ఎంతన్నది ఒకవైపు రాజకీయ- ఆర్థిక- సామాజిక శక్తుల ప్రాబల్యం పైన, మరొకవైపు ప్రజల చైతన్యంపైన ఆధారపడి ఉంటున్నది. మన వంటి వర్ధమాన సమాజాలలో ఇది ఒక వికాస(ఎవల్యూషనరీ) కార్యక్రమం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)