"సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు": తెలుగు నేలపై సాగుతున్న వివాదం

కంచ ఐలయ్య సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు టంకశాల అశోక్ kancha ilaiah Social smugglers Baniyas Komatollu Tankasala Ashok

ఫొటో సోర్స్, Bhoomi Publications

‘'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పేరుతో కంచ ఐలయ్య రాసిన పుస్తకంలోని అంశాలను చూసినా, దానిపై ప్రస్తుతం సాగుతున్న వాదోపవాదాలను గమనించినా, స్వయంగా రచయిత ఉద్దేశించిన లక్ష్యాలు ఇందువల్ల నెరవేరే అవకాశం కన్పించడం లేదు. పైగా వాతావరణం వికటించి ఆ లక్ష్యాలకు హాని కలిగే సూచనలున్నాయి. ఇందుకు ఒక కారణం తన పుస్తకంలో ఐలయ్య చేసిన సూత్రీకరణలు కాగా, రెండవది ఈ వివాదంపై ఆయన స్పందిస్తున్న తీరు’’ - అంటున్నారు సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్. ఐలయ్య పుస్తకంపై అశోక్‌ అభిప్రాయం. ఆయన మాటల్లోనే..

ఒక విషయంపై పరిశోధించి తన అభిప్రాయం చెప్పేందుకు ఏ రచయితకైనా పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అటువంటి అభిప్రాయంతో ఇతరులు ఏకీభవిస్తారా? లేక విభేదిస్తారా? అనే ప్రశ్నతో తనకు నిమిత్తం ఉండనక్కర్లేదు. అటువంటి ప్రశ్నలు ముందే వేసుకుంటే పరిశోధకుడు స్వేచ్ఛగా ఆలోచించలేడు. ఆవిధంగా చూసినపుడు ఏ వృత్తి తీరు తెన్నుల గురించి ఏమనాలనేదీ తన స్వేచ్ఛ అనే ఐలయ్య వాదనను కాదనలేం. అదేవిధంగా తన విశ్లేషణతో విభేదించేవారు తమ వాదనలు చేయవచ్చునని, వాటిని పుస్తక రూపంలో తేవచ్చునని, అంతే తప్ప తనపై బలప్రయోగం చేయగలమనటం సరికాదని ఆయన అంటున్నది కూడా సరైనదే.

ఐలయ్యకు వేదసాహిత్యం, కుల వ్యవస్థ, దళిత-బహుజనుల పరిస్థితుల గురించి కొన్ని అభిప్రాయాలున్నాయి. ఆ ప్రకారం తను చేసిన రచనలలో కొన్ని గతంలోనూ వివాదస్పదమయ్యాయి. వాటితో కొందరు బలంగా ఏకీభవించగా కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. కాని ప్రస్తుత వాదోపవాదాలు ఎన్నడూ లేనంత తీవ్రస్థాయికి చేరాయి. యథాతథంగా చర్చలు, వాటి తీవ్రతలు ఆందోళన చెందవల్సినవేమీ కావు. కానీ భావజాల రంగంలోని ఒక ఆలోచనను భావజాల సంఘర్షణతోనే ఎదుర్కోవాలి తప్పితే భౌతిక దాడుల బెదిరింపులకు దిగడం సరైనది కాదు. అభ్యుదయ భావాలు కలిగిన వారిపై హిందూత్వ శక్తుల దాడి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్న వాతావరణంలో తనపై దాడులకు తలపడవచ్చునన్నది ఐలయ్య అంటున్న మాట. ఏది ఏమైనా అటువంటిది జరిగితే అందుకు బాధ్యత పూర్తిగా వైశ్యులదే కాగలదని ప్రకటించారాయన. మొత్తానికి గత వివాదాల కన్నా ప్రస్తుత వివాదం ఇటువంటి రూపం తీసుకోవటమన్నది గమనించవల్సిన విషయం.

కంచ ఐలయ్య సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు టంకశాల అశోక్ kancha ilaiah Social smugglers Baniyas Komatollu Tankasala Ashok

ఫొటో సోర్స్, Kranti Tekula

ఫొటో క్యాప్షన్, వైశ్యులు ఆ విధంగా సంపాందించిన సొమ్మునంతా గుప్త నిధుల రూపంలో దాచిపెట్టారని, పరిశ్రమలలోగాని, ఇతర ఉత్పాదక రంగాలలోకానీ వినియోగించలేదన్నది ఐలయ్య వాదనలోని మరొక అంశం. కాని ఇందుకు ఆయన తగిన వివరణలు ఇవ్వలేదు.

ఇది ఏ విధంగా చూసినా వాంఛనీయం కాదని వేరే చెప్పనక్కర్లేదు. ఆ మాట అనుకుంటూనే ఆ పరిధికి మించి ముందుకు వెళ్లి ఆలోచించవల్సిన విషయాలు కొన్ని ఇందులో ఉన్నాయి. స్వయంగా రచయిత, ఆయనను బలపర్చేవారు, విమర్శించే వారు కూడా ఆలోచించవల్సినవి అవి. వైశ్యులను సామాజిక స్మగ్లర్లు అనటం తను సృష్టించిన కొత్త కాన్సెప్ట్ అని పదేళ్ల పరిశోధన ఫలితంగా తాను అటువంటి అభిప్రాయానికి వచ్చానని ఐలయ్య అంటున్నారు. ఒక కొత్త కాన్సెప్ట్ ను సృష్టించే హక్కు తనకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. అటువంటి హక్కు ఎవరికైనా తప్పక ఉంటుంది. కాని అందుకు సమర్థనగా తగిన వాదనలను, ఆధారాలను ఇవ్వవల్సిన బాధ్యత కూడా ఆ పరిశోధకునిపైనే ఉంటుంది. ఆ పని చేయనపుడు తన సూత్రీకరణ ఇతరులను మెప్పించదు సరికదా, అటువంటి సూత్రీకరణ, రెచ్చగొట్టే శీర్షికతో వారిని మెప్పించాలనే తన లక్ష్యమూ నెరవేరదు. అపుడు అది విఫల ప్రయత్నం అవుతుంది.

సామాజిక స్మగ్లింగ్ అనే మాటకు ఐలయ్య ఒక నిర్వచనం చెప్పి, దానిని వైశ్యులకు వర్తింపజేయ చూశారు. దేనినైనా రహస్యంగా, నిబంధనలకు విరుద్ధంగా తీసుకోవటం, తరలించటం స్మగ్లింగ్ అవుతుందనే నిఘంటవు నిర్వచనాన్ని ఆయన పేర్కొంటూ భారతదేశంలో ఇది భిన్నంగా జరిగిందన్నారు. ''ఇక్కడి కులవ్యవస్థలో బ్రాహ్మణులు వైశ్యులకు వ్యాపారంపై ప్రత్యేక హక్కులు ఇచ్చారు. దానిని ఉపయోగించుకుని వైశ్యులు రకరకాల పద్ధతులు, మోసాలతో ఉత్పత్తి కులాల నుంచి సంపదను కాజేశారు. ఆ సంపదను గుప్తధనంగా దాచి పెట్టారు తప్ప తిరిగి ఉత్పత్తి కార్యంలోకి పెట్టుబడిగా పెట్టలేదు. వారు స్వయంగా ఉత్పత్తిదార్లు కారు. తాము, బ్రాహ్మణులు కలిసి అనుభవించారు'' అన్నది ఆయన మాట. కనుక ఇది సామాజిక స్మగ్లింగ్ అని సూత్రీకరించారు.

యథాతథంగా దీనిని సామాజిక స్మగ్లింగ్ అనవచ్చునా అన్నది ప్రశ్న. ప్రాచీన భారతదేశంలో హిందూమతం, బ్రాహ్మణులు కులవ్యవస్థను సృష్టించి అందులో భాగంగా వేర్వేరు వారికి వేర్వేరు పనులు అప్పగిస్తూ, వైశ్యులకు వ్యాపారపు బాధ్యతను ఇవ్వడమంటే అప్పటి వ్యవస్థలో అదే చట్టం. అన్ని కులాలు అందులోని మంచిచెడులు సహా వ్యవస్థను లేదా చట్టాన్ని పాటించాయి. అటుంటి స్థితిలో వైశ్యులు ఏ చట్టాన్ని ఉల్లంఘించి స్మగ్లర్లు అయ్యారు? ఇది మొదటి ప్రశ్న కాగా, సమర్థించగల విధంగానో, సమర్థించలేని విధంగానో ఇతరుల శ్రమ సంపదలను సంగ్రహించటం ఆ కాలంలో వైశ్యులే కాదు బ్రాహ్మణులు, క్షత్రియులు కూడా చేసారు. తర్వాత దశలలో శూద్రులలోని ఉన్నతులూ చేశారు. అట్లా సంగ్రహించే రూపం వ్యాపారం మాత్రమే కాదు ఇతర రూపాలలోనూ జరిగింది. అటువంటప్పుడు వైశ్యులు మాత్రమే దోషులు ఎట్లా అవుతున్నారు? స్మగ్లింగ్ అనే మాటను ఉపయోగించదలిస్తే, మొత్తం వ్యవస్థకే అటువంటి స్మగ్లింగ్ స్వభావం ఉంటున్నది. దానినట్లుంచి, ఇటువంటి పనికి చిరకాలంగా ఉపయోగిస్తున్న మాట దోపిడీ అని. ఆ పనికి స్మగ్లింగ్ అనే కొత్తమాట వాడ చూడటం, దానిని వైశ్యులకు మాత్రమే వర్తింపజేయటంలో సరైన తర్కం ఏమీ కన్పించదు. అప్పటి నుంచి ఇప్పటి మల్టీనేషనల్స్ వరకు ఏ దేశంలో ఏ వ్యాపారులు, మరే వృత్తుల వారు, ఎవరితోనైనా చేసే వస్తువులు, సర్వీసెస్ ట్రాన్సాక్షన్లలోనైనా లాభ దృష్టి , కొంత మోసం ఉంటుంది.

వైశ్యులు ఆ విధంగా సంపాందించిన సొమ్మునంతా గుప్త నిధుల రూపంలో దాచిపెట్టారని, పరిశ్రమలలోగాని, ఇతర ఉత్పాదక రంగాలలోకానీ వినియోగించలేదన్నది ఐలయ్య వాదనలోని మరొక అంశం. కాని ఇందుకు ఆయన తగిన వివరణలు ఇవ్వలేదు. సంపాదనను తాము, బ్రాహ్మణులు అనుభవించారన్నారు. వ్యాపారుల వద్ద క్షత్రియులు ధనం తీసుకోవటం తెలిసిందే. ఆ విధంగా ధనం తిరిగి సమాజంలోకి వస్తూనే ఉంది. అంతకు మించి ధనం గలవారు, అప్పటికి ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థలు లేనందున, ఒక మేరకు గుప్తంగా దాచి ఉండొచ్చు. కానీ ఆ పని చేసింది కొద్దిమంది వ్యక్తులా లేక మొత్తం కులస్తులా? మరొక విషయమేమంటే ధనాన్ని ఆ విధంగా దాచినవారు వైశ్యులలోనే కాదు, క్షత్రియులలో, బ్రాహ్మణులలోనూ ఉన్నారు. కోటలు, రాజప్రసాదాలు, పురాతన ఆలయాలలో అవి ఇప్పటికీ తరచూ బయటపడుతున్నాయి. అటువంటి స్థితిలో వైశ్యులను మాత్రమే గుప్తధనకర్తలు అని ఆరోపించదలచుకుంటే అందుకు తగిన ఆధారాలు చారిత్రకంగా చూపాలి. ఐలయ్య ఆ పని కనీసం ఈ రచనలలోనైనా చేయలేదు.

కంచ ఐలయ్య సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు టంకశాల అశోక్ kancha ilaiah Social smugglers Baniyas Komatollu Tankasala Ashok

ఫొటో సోర్స్, Bhoomi Book Trust

ఆయన పుస్తకంలో పరస్పర విరుద్ధమైన విషయం కూడా ఒకటుంది. స్వయంగా ఆయనే ఒక చోట, భారత రాజకీయాలలో గాంధీ కేంద్ర స్థానంలో ఉండినపుడు 1920ల నుంచి 1948 వరకు వైశ్యుల విస్తరణ జరిగిందన్నారు. ఆ కాలంలో వారి గుప్తధనం తమ సమకాలికులైన పార్శీలతో పోటీపడుతూ పారిశ్రామిక పెట్టుబడిగా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. బిర్లాలు, గోయెంకాలు, మఫత్ లాల్ల వంటి వారిని ఆయన ఉదాహరించారు. అది సోషల్ స్మగ్లర్లు సోషల్ ఇన్వెస్టర్లుగా మారే క్రమం అంటూ వ్యాఖ్యానించినప్పటికీ ఒక ముఖ్యమైన మలుపును అయితే ఆయనే గుర్తించారు. ఇది 80-90 సంవత్సరాల కిందటి మాట. ప్రస్తుత చర్చలో పాల్గొంటూ ఒక చోట ఆయన ఇపుడు పెట్టుబడులు, సంపదలలో 45 శాతం వైశ్యులదే అన్నారు. అనగా 80-90 ఏళ్ల కిందట మొదలైన మార్పు ఇపుడు గణనీయమైన స్థాయికి చేరింది.

ఇటువంటి విషయం గురించి ఒక పరిశోధకుడు ఇపుడున్న సమాజానికి చెప్పదలచినపుడు అదెట్లుండాలి? ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉందని గతంలోకి వెళ్లినట్లు అయితే మొత్తం వ్యవస్థ పలానా విధంగా ఉండేదని, అందులో భాగంగా వైశ్యుల పాత్ర ఇదని చెప్పాలి. అది చారిత్రక దృష్టితో జరగాలి. అట్లా వేర్వేరు సామాజిక వర్గాలు, దశలు, వ్యవస్థల గురించి ఇతరులు చేసిన అధ్యయనాలు అనేకం ఉన్నాయి. వాటిని పాఠకులు ఒక చరిత్రగా, ఒక వర్తమానంగా తీసుకుంటారు. ఎవరైనా అందుకు భిన్నంగా ఉద్రేకపడితే అందుకు విలువ ఉండదు. ఆ పరిశోధనకు మాత్రం అధ్యయనపు విలువ ఉంటుంది.

ఐలయ్య రాసిన ఈ పుస్తకంలో తాను చేసిన సూత్రీకరణకు సమర్థనీయమైన నిర్వచనంగానీ తర్కంగానీ, పునాదులుగానీ లేవు. స్వయంగా ప్రస్తావించిన ఆధునిక మార్పులకు తానే విలువ ఇవ్వలేదు. గతంలో జీవించి, గతం గురించి మాత్రమే నొక్కి చెప్పి, ఆ స్థితిని వర్తమానానికి సైతం వర్తించే సూత్రీకరణగా మార్చారాయన.

లోపం ఇక్కడుంది. అందుకే పుస్తకం శీర్షిక ఈ లోపాలన్నింటినీ ప్రతిఫలింపజేసే విధంగా తయారైంది. లోపభూయిష్టమైన కాన్సెప్ట్ తో వైశ్యులను స్మగ్లర్లు అనటం, సామాజిక స్మగ్లర్లు అనటం, ఒక వేళ అది సరైన ప్రయోగం అని మాట వరసకు అనుకున్నా అదే చారిత్రక పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతున్నదనే భావన కలిగించటం (అది కూడా 1920ల నుంచి పరిస్థితి మారుతున్నట్లు స్వయంగా అంగీకరిస్తూ) రచయిత చేసిన ఒక విధమైన పొరపాట్లు. వైశ్యులను 'కోమటోళ్లు' అంటూ ఈసడింపుగా సంబోధిస్తూ, అందుకు సమర్థనగా తెలంగాణలో ఇట్లాగే అంటారనే వాదన చేయటం మరొక విధమైన పొరపాటు. అటువంటిది కనీసం సామాజిక లేదా అకడమిక్ అధ్యయనాలలో ప్రదర్శించ కూడని ఈసడింపు.

ఇంతకూ ఈ రచనలో ఐలయ్య లక్ష్యం ఏమిటి? ఇది సామాజికంగా, చారిత్రకంగా అధ్యయనం జరగవలసిన విషయాలే. ఆ పని మన దేశంలో ఇంత వరకు జరిగింది చాలా కొద్ది అయినందున ఆ దిశలో జరిగే ఏ ప్రయత్నమైనా ఆహ్వానించ దగ్గదే అవుతుంది. కానీ అది హేతుబద్ధంగా, మెప్పించే విధంగా ఉండాలి. నూటికి నూరు మందిని కాకపోయినా విస్తృత స్థాయిలో. రాసింది వైశ్యుల గురించి అయితే వారికి కూడా ఆ చారిత్రక-సామాజిక-ఆర్థిక-మత వ్యవస్థల గతాన్ని, అవి మారుతున్న తీరును, వర్తమానాన్ని వివరించాలి. విజ్ఞానాన్ని, చైతన్యాన్ని కల్పించ చూడాలి. ఆ వాస్తవాలు, తర్కంలోని బలం వారి మేధస్సులను, మనస్సులను ఒప్పించే పద్ధతిలో సాగాలి. అందరినీ కాకున్నా విస్తృతస్థాయిలో. అంతకన్నా ముందు ముఖ్యంగా అసలు రచయిత దృష్టి, పద్ధతి, లక్ష్యం ఆ విధంగా ఉండాలి. ఒక మేధావి, పరిశోధకుడు చేయవలసిన పని అది. అపుడే తన సమాజానికి, చరిత్ర రచనకు, భవిష్యత్తుకు, ప్రగతిశీలమైన రీతిలో ఆ కులం భవిష్యత్తుకు మేలు చేసిన వాడవుతాడు. అదే మేలు విస్తృత సమాజానికి కూడా కలుగుతుంది.

కంచ ఐలయ్య సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు టంకశాల అశోక్ kancha ilaiah Social smugglers Baniyas Komatollu Tankasala Ashok

ఫొటో సోర్స్, Kancha Ilaiah

లక్ష్యం అదవుతే ఆయన తీరు, దాని శీర్షిక కూడా అదే ధోరణిలో ఉంటాయి. ఇది ఐలయ్య వంటి మేధావికి ఎవరూ చెప్పనక్కర్లేదు. కానీ రచన, శీర్షిక, అందుకు భిన్నంగా ఉండటాన్ని బట్టి తన లక్ష్యం మరేదైనా కావచ్చునా? అందుకు సరిపడేందుకు రచన ఇట్లా జరిగిందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. కొద్ది విషయాలు గమనించండి. సామాజిక స్మగ్లర్లు అన్నది విడి రచన కాదు. 'హిందూ-అనంతర భారతదేశం' పేరుతో

ఆయన పుస్తక రచన 2007 చివరిలో పూర్తయింది. అది ఇంగ్లీషులో 2009లో, తెలుగులో 2011లో వెలువడింది. అందులో ఆయన, భారతదేశంలో పీడక కులాలకు, పీడిత కులాలకు మధ్య అంతర్యుద్ధం (సివిల్ వార్) పరిస్థితులు ఇంచుమించు ఏర్పడిపోయాయాని, ఆ యుద్ధం ఫలితంగా హిందూ వ్యవస్థ కుప్పకూలిపోనున్నదని రాసారు. హిందూమతం స్థానంలో క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం వంటి మతాలను పీడిత కులాలు స్వీకరిస్తాయన్నారు. వాటిలోనూ క్రైస్తవానికి ఎక్కువ ఆకర్షణీయత ఉన్నట్లు పరోక్ష సూచన చేశారు. అటువంటి పుస్తకంలో వేర్వేరు కులాలతోపాటు వైశ్యుల గురించి ఒక భాగం ఉంది. ఆ భాగం ఇపుడు విడి పుస్తకం రూపంలో వెలువడింది.

'హిందూ-అనంతర భారతదేశం ' అంటూ ఒక ప్రాతిపదికను తయారుచేబూనినపుడు, అందుకోసం పీడక హిందూ కులాలకు, పీడిత హిందూ కులాలకు మధ్య అంతర్యుద్ధం అనే ఆలోచనను ముందుకు తేవలసి ఉంటుంది. పీడక కులాలను అందుకు తగిన పద్ధతిలో చిత్రీకరించాలి. ఆ చిత్రీకరణలో మార్పుల దశను (1920లు మొదలుకొని), వర్తమానాన్ని విస్మరించి లేదా తక్కువ చేసి చూపి గతాన్నే ప్రధానం చేసి చూపటం అంతర్యుద్ధ ఆలోచనకు అనుగుణమవుతుంది. కనుక ఐలయ్య ఆ పని చేసి ఉండాలి.

కానీ ఒకవేళ ఆలోచన ఇదే అవుతే, అందులోనూ సమస్యలున్నాయి. భారతదేశంలో పీడకులు-పీడిత వర్గాల మధ్య సంఘర్షణ బుద్ధుని కన్నా ముందు నుంచి ఉంది. వేరువేరు స్థాయిలు, రూపాలలో, వేర్వేరు దశలలో అది నేటి వరకు కొనసాగుతూనే ఉంటుంది. పీడిత కులాలు ఇతర మతాలను స్వీకరించి హిందూ అధిష్టానంపై వత్తిడి సృష్టించటం కూడా తరచు జరుగుతూ వస్తున్నదే. కాని 'హిందూ-అనంతర' అని నిజంగా అనదగ్గ స్థితి ఎపుడూ ఏర్పడలేదు. హిందూ మతంలోనే అంతర్గత ఘర్షణలు, సంస్కరణలు, చీలికలు, పాయలు, బ్రాహ్మణీయ హిందూవాద-జానపద హిందూవాద ధోరణులు, తిరుగుబాట్లు అనేకం కన్పించినవే. వాస్తవానికి ఈ బహుముఖీన సంఘర్షణ సమాజం-ఆర్థికం-రాజకీయం ఆధునికం అవుతున్న కొద్దీ తగ్గుతున్నది. పీడకులు, పీడితులలోనూ మార్పులు వస్తున్నాయి. పీడకులు వెనుకటివలె కోరలకు బదులు కౌగిలింతలను ఉపయోగించగలుగుతున్నారు. పీడితులు సాంస్క్రిటైజేషన్తో నైతేనేమి, ఇతరత్రా అందుకోగలుతున్న అవకాశాల వల్లనైతేనేమి క్రమంగా ఆ కౌగిలింతలలో చేరి పరవశిస్తున్నారు. ఇపుడు తాము కూడా ఏదో ఒక మేరకు వ్యవస్థలో స్టేక్ హోల్డర్స్ కాగలుగుతున్నట్లు లేదా కావాలన్నట్లు వ్యవహరిస్తున్నారు.

మరి సివిల్ వార్ ఎక్కడ? అంతెందుకు.. ఐలయ్య ఈ రచనను ముగించిన 2007 నుంచి ఈ 2017 వరకు 10 సంవత్సరాల కాలంలో సివిల్ వార్ వాతావరణం ఒకవేళ 2007లో ఉండేది అనుకున్నప్పటికీ ఇప్పుడెక్కడికి చేరినట్లు? విచిత్రమేమిటంటే, తన ఇంగ్లీషు రచన ఉపోద్ఘాతం చివర్లో స్వయంగా ఆయనే దళిత-బహుజనులలో అటువంటి వర్గం ఇంకా తగినంత ఏర్పడలేదని అంగీకరిస్తున్నారు.! కనుక, లేని సివిల్ వార్ ను ఊహించి, అందుకోసం వైశ్యులను ఒక డమ్మీ శత్రువు నిలబెట్ట చూడటం వల్ల పీడిత కులాలు సివిల్ వార్ సైన్యంగా మారుతాయా? హిందూమత అంతర్గత ఘర్షణల పరిధిని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆధునిక యుగంలో దాటిపోయి ఇతర మతాలలో చేరుతాయా? ఐలయ్య ఒకపుడు వర్గపోరాట వాది. ఆ చర్చ తర్వాత కులపోరాటలకు మారింది. అందుకు సమాంతరంగా కుల-వర్గ పోరాట దృక్పథం ఒకటి ముందుకు వచ్చింది. ఐలయ్య కుల పోరాటం ద్వారా హిందూ అనంతర భారతదేశ సృష్టిని కోరుతున్నారు. అందుకు కూడా ఈ రచన ఉపయోగపడక పోవచ్చు.

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌‌లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేసుకోండి.