అంతర్జాతీయ ఎన్జీఓలకు పాకిస్తాన్ ప్రభుత్వ ఆదేశం - 60 రోజుల్లో దేశం విడిచి వెళ్లండి

పాకిస్తాన్ ఎన్జీఓల సహాయం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ‘‘కష్టపడి సంపాదించుకున్న ప్రజాస్వామ్యం’’ ఇలాంటి చర్యలతో ప్రమాదంలో పడుతోందని యాక్షన్ ఎయిడ్ సంస్థ చెప్పింది
    • రచయిత, సికిందర్ కిర్మానీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అంతర్జాతీయ ఎన్జీఓలన్నీ తమతమ కార్యకలాపాలను ముగించాలని, 60 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వ ఆదేశాలు చాలా ఎన్జీఓలపై ప్రభావం చూపనున్నాయి. దాతృత్వ సంస్థల్లో ఒకటైన యాక్షన్ ఎయిడ్ ఈ సందర్భంగా స్పందిస్తూ.. ఈ ఆదేశాలు ''పౌర సమాజంపై ఈ మధ్య కాలంలో పెరిగిన దాడులను మరింత పెంచే'' చర్యల్లో భాగమని చెప్పింది.

కాగా, ఈ వ్యవహారంపై స్పందించేందుకు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరాకరించింది.

అయితే, యాక్షన్ ఎయిడ్‌కు రాసిన లేఖలో మాత్రం.. ''ఆరు నెలల్లోపు రిజిస్ట్రేషన్ కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు'' అని పేర్కొంది.

దేశంలో మొత్తం 18 ధార్మిక సంస్థలను ప్రభుత్వం బహిష్కరించిందని యాక్షన్ ఎయిడ్ సంస్థ బీబీసీకి తెలిపింది.

ఒకపక్క దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛపై మానవ హక్కుల కార్యకర్తలు, పత్రికా స్వేచ్ఛ ఉద్యమకారులు ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా.. అదే సమయంలో ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

2011వ సంవత్సరంలో ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకునే పథకంలో భాగంగా అమెరికాకు చెందిన నిఘా సంస్థ సీఐఏ పాకిస్తాన్‌లో నకిలీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వం గుర్తించినప్పటి నుంచి ఎన్జీఓలపై పాకిస్తాన్ నిఘా సంస్థల అనుమానాలు పెరిగాయి.

''సేవ్ ది చిల్డ్రన్'' అనే స్వచ్ఛంద సంస్థ ఈ పథకంలో ప్రముఖ పాత్ర వహించిందని అప్పట్లో అధికారులు ఆరోపించారు. కానీ, ఈ దాతృత్వ సంస్థ మాత్రం ఆ ఆరోపణలను నిరాకరించింది.

పాకిస్తాన్ ఎన్జీఓల సహాయం

ఫొటో సోర్స్, Getty Images

వాస్తవానికి యాక్షన్ ఎయిడ్ సహా మిగతా ఎన్జీఓలను దేశం వదిలి వెళ్లాలని పాకిస్తాన్ 2017 డిసెంబర్‌లోనే ఆదేశించింది. కానీ, పాశ్చాత్య దేశాల ప్రభుత్వాల నుంచి ఒత్తిళ్లు రావటంతో ఆయా ఎన్జీఓలన్నీ కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలపై అవి అప్పీలు చేశాయి.

తాము చేసిన అప్పీళ్లు విఫలమయ్యాయంటూ అధికారికంగా లేఖలు అందాయని యాక్షన్ ఎయిడ్, ప్లాన్ ఇంటర్నేషనల్ సంస్థలు ధృవీకరించాయి. అయితే, అప్పీళ్లు ఎందుకు విఫలమయ్యాయో కారణాలను పేర్కొనలేదని వెల్లడించాయి.

దాతల సహాయాన్ని మోసుకెళ్తున్న మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

యాక్షన్ ఎయిడ్ సంస్థకు పాకిస్తాన్‌లో తాత్కాలిక డైరెక్టర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ ఖాలిద్ బీబీసీతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలపై మరొకసారి అప్పీలు చేసుకునేందుకు ఎలాంటి అవకాశం ఇక లేదని భావిస్తున్నట్లు చెప్పారు. తమ ద్వారా సహాయం పొందుతున్న వేలాది మంది పేద ప్రజలపై పడే ప్రభావం గురించే తాము ఆందోళన చెందుతున్నామని ఆయన తెలిపారు.

పాకిస్తాన్‌లో 16 లక్షల మంది చిన్నారులకు ప్రస్తుతం తాము సహాయం అందిస్తున్నామని, ప్రభుత్వ ఆదేశాలు విచారకరమని ప్లాన్ ఇంటర్నేషనల్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)