కువైట్ దౌత్యవేత్త పర్సు కొట్టేసిన పాకిస్తాన్ ఉన్నతాధికారి

ఫొటో సోర్స్, youtube
కువైట్ దౌత్యసిబ్బంది పర్సును దొంగిలించిన పాకిస్తాన్ ఉన్నతాధికారి ఒకరు ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు. జరార్ హైదర్ ఖాన్ అనే అధికారి ఆ పర్సును దొంగిలిస్తుండడం సీసీ కెమేరాల్లో రికార్డవడంతో సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది.
జరార్ హైదర్ ఖాన్ పాకిస్తాన్ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి వెల్లడించారు.
పాకిస్తాన్ సివిల్ సర్వీసెస్‌లో ఉన్నతమైనదిగా చెప్పే బీ-20 స్థాయి అధికారి ఆయన. వేరే దేశానికి చెందిన ఒక దౌత్యాధికారి పర్సును దొంగిలించడంతో అంతర్జాతీయంగా పరువుపోయిందని.. జరార్ హైదర్ ఖాన్‌ను సస్పెండ్ చేశారని ఇస్లామాబాద్‌కు చెందిన పత్రిక 'ది న్యూస్' పేర్కొంది.

ఫొటో సోర్స్, PAkistan government
సీసీ టీవీ ఫుటేజిలో ఏముంది?
ఆరు సెకండ్ల ఆ సీసీ టీవీ ఫుటేజి క్లిప్లింగ్‌లో జరార్ హైదర్ ఖాన్ పర్సును దొంగిలించినట్లు స్పష్టంగా కనిపించిందని 'డాన్' పత్రిక వెల్లడించింది. ఆర్థిక వ్యవహారాల విభాగంలో ఒక టేబుల్‌పై ఉన్న పర్సును ఆయన అటూఇటూ చూసి తన కోటు జేబులో పెట్టుకుని మెల్లగా నడుచుకుంటూ వెళ్లడం అందులో కనిపిస్తుంది.
పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కువైట్ నుంచి ఒక ప్రతినిధి బృందం వచ్చింది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పెంపొందించుకునే లక్ష్యంతో ఈ పర్యటన సాగింది.
ఇందులో భాగంగా పాక్-కువైట్ అధికారుల మధ్య ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యాలయంలో జాయింట్ మినిస్టీరియల్ కమిషన్ భేటీ జరిగింది. సమావేశం ముగిశాక కువైట్ అధికారి ఒకరు తన పర్సును అక్కడే ఓ టేబుల్‌పై పెట్టి మర్చిపోయారు. కొద్దిసేపటి తర్వాత పర్సు కోసం వెనక్కు రాగా అక్కడ కనిపించలేదు. దీంతో సీసీ కెమేరా ఫుటేజి చూడగా అసలు విషయం బయటపడింది.
దీనిపై కువైట్ బృందం ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దొంగిలించిన పర్సులో కాస్త ఎక్కువ మొత్తంలోనే కువైట్ దీనార్లు ఉన్నట్లు డాన్ పత్రిక రాసింది. ఈ ఘటనతో కువైట్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారని పాక్ పత్రికలు రాశాయి.
మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ఫొటో
అయితే, పాకిస్తాన్‌లో ప్రధాన ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో మాత్రం జరార్ హైదర్ ఖాన్‌కు బదులుగా పొరపాటున వేరే వ్యక్తి ఫొటోలు ప్రచురించాయి. అమెరికాలో నివసించే జియాద్ హైదర్ అనే సంబంధం లేని వ్యక్తి ఫొటోను ప్రచురించాయి.
జియాద్ హైదర్ వాషింగ్టన్ డీసీలో రిస్క్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌కు నష్టం తప్పదా?
ఈ చోరీపై కువైట్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పత్రికలు రాస్తున్నాయి. అయితే, సత్వర విచారణతో దోషిని పట్టుకుని కువైట్ ఆగ్రహాన్ని తగ్గించాలని పాక్ అనుకుంటోంది.
పాక్‌లో పెట్టుబడులు పెట్టాలనుకున్న కువైట్ ఇప్పుడు ఆ ఆలోచన మానుకోవచ్చని టైమ్స్ పత్రిక రాసింది.
ఇటీవలే గద్దెనెక్కిన ఇమ్రాన్ ఖాన్ అత్యున్నతాధికారుల స్థాయిలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేస్తానని చెబుతున్నప్పటికీ ఇలాంటి ఘటనలు ఆ ప్రతిజ్ఞలను నగుబాటు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- బిగ్ బాస్ 2: ‘ఒక సైకలాజికల్ ప్రెషర్ కుక్కర్’
- బిగ్ బాస్: పోటీదారులను హౌజ్‌లోకి ఎలా తీసుకెళ్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
- వీళ్లు ‘దెయ్యం’తో సెల్ఫీకి ప్రయత్నించారు
- #HisChoice: నేను పెళ్లి చేసుకోలేదు.. ఒంటరిగానే ఉంటా.. ఈ సమాజానికేంటి నష్టం?
- ఇతను ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవుడు
- #లబ్‌డబ్బు: ఒంటరి మహిళలు ఎంత ఆదా చేయాలి?
- డెన్మార్క్‌లో ఐవీఎఫ్‌కు ఎందుకంత ఆదరణ?
- ప్రధాని మోదీ మాట నిజమేనా? మిగతా వారికన్నా ఎక్కువ విమానాశ్రయాలు కట్టించారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








