బిగ్ బాస్ 2: ‘ఒక సైకలాజికల్ ప్రెషర్ కుక్కర్’

బిగ్ బాస్ -2

ఫొటో సోర్స్, Babu Gogineni

    • రచయిత, బాబు గోగినేని
    • హోదా, బీబీసీ కోసం

"భలేవారే! నేను BIGG BOSSకు రావడం ఏమిటీ? మీరు ఆహ్వానించే సినిమా స్టార్స్‌తో, గాయకులతో, డ్యాన్సర్లతో నేను ఆ ఇంట్లో ఉండడమేమిటీ? వచ్చి కూడా నేను అక్కడ ఏమి చేస్తాను? నాకు ఆ విద్యలు ఏవీ రావు. నేను తెలుగు, హిందీ సినిమాలు దాదాపు చూడను. నాకు పాటలు రావు, మా ఆవిడ కూడా నాతో ఇప్పటివరకు డ్యాన్స్ వేయించలేకపోయింది. నేను పెర్ఫార్మర్‌ను కాను. నాకు ఉన్నవే మహా అయితే ఒక 4 జతల బట్టలు, వాళ్లేమో రోజుకి మూడు సార్లు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు, ముఖానికి పిండి పూసుకుంటారు. నాకు అవి అలవాటు లేవు! అయినా, నన్నెవరు చూస్తారండీ? నేను జుట్టు దువ్వుకొని ఎన్ని ఏళ్లయిందో తెలుసా? ఇప్పటివరకు నేను మీ షో హిందీలో కానీ, తెలుగులో కానీ చూడలేదు. నేను ఎలా ఇమడతానండీ మీ షో లో?" అని అడిగాను ఆశ్చర్యంగా.

"ఏమీ ఫరవాలేదండీ, మీరు అవేమీ చేయనక్కరలేదు, మీరు మీలాగానే ఉండవచ్చు. ఈ షో ఉద్దేశమే అది. మీరు అలా అంటున్నారు కానీ, ఇక్కడ ఈ చిన్న కేఫ్‌లో మనం ఉన్న 2 గంటలలో ఎంతమంది మీతో సెల్ఫీలు తీసుకోలేదు? తప్పకుండా మీపట్ల బయట చాలా ఆసక్తి ఉంది. మీరు మాతో ఎలా మాట్లాడుతున్నారో అలానే అక్కడ కూడా మాట్లాడవచ్చు. మీరు మానవవాదిగా, హేతువాదిగానే అక్కడ ఉండవచ్చు."

"మీరు మళ్లీ తెలివిగా ఏ జోతిష్కుడినో, నాతో రోజూ తగవు పెట్టుకునే ఇంకెవరినో తీసుకురారు కదా ఇంట్లోకి?" నేను నాకున్న ఏకైక అనుమానాన్ని వ్యక్తం చేసేసాను.

"మీరు కోరితే తప్పకుండా ఆ ఏర్పాట్లు కూడా చేస్తాము" అన్నారు కొంటెగా, నన్ను ఆహ్వానించడానికి వచ్చిన, కొత్తగా పరిచయమైన ఆ ముంబై మిత్రులు.

"అయితే Let's Go!" అన్నాను, కరచాలనం చేస్తూ!

బాబ గోగినేని

ఫొటో సోర్స్, BabuGogineniHumanist/fb

ఫొటో క్యాప్షన్, బాబు గోగినేని

మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి, మీ వంట మీరే చేసుకోవాలి

"మరి, షోలో నిబంధనలు ఏమిటో మీకు చెప్పాలి: ముందస్తుగా, ఈ షోలో మీరు పాల్గొంటున్నారన్న విషయంలో గోప్యత పాటించాలి. మీరు ఈ షోలో ఉన్నట్లు మీ సన్నిహిత మిత్రులు కూడా మిమ్మల్ని టీవీలో చూసి మాత్రమే తెలుసుకోవాలి. మొత్తం 106 రోజులకు కావాల్సిన మీ బట్టలు, మీ మందులు మేము ఇచ్చే 2 సూట్ కేసులలో మాత్రమే తెచ్చుకోవాలి. సబ్బులు ఇస్తాం, కానీ మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి, మీ వంట మీరే చేసుకోవాలి. ఫోన్, టీవీ, పేపర్ ఉండవు. సిగరెట్టు అలవాటు ఉన్నవారు ఇంటికి కొంచెం ఎడంగా ఒక ప్రత్యేకమైన గదిలో మాత్రమే స్మోకింగ్ చేయవచ్చు. మద్యం నిషిద్ధం. ఎవరిపైనా చేయి చేసుకోవడానికి వీల్లేదు. ఈ ఆట ప్రధానమైన నియమం ఏమిటంటే... BIGG BOSS ఇంటి నుంచి బయటకి ఎటువంటి సంకేతాలు పంపడానికి వీలు లేదు, బయట నుంచి మీకు ఎటువంటి సమాచారం రావడానికి వీల్లేదు. మీ మీద ఎక్కడా కట్టడి ఉండదు; మీరు ఏమి మాట్లాడాలో మేము స్క్రిప్ట్ ఇవ్వడం జరగదు. మీరు ఇంట్లో ఎన్ని రోజులు ఉంటారు అన్నది కేవలం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. అందరూ అనుకుంటున్నట్లుగా ఇది జైలు కాదు. మీరు బయటకి వెళ్లి పోవాలి అనుకుంటే ఎప్పుడైనా వెళ్లి పోవచ్చు, కానీ కొన్ని నిబంధనలు మాత్రం ఉంటాయి. ఇంటి బయట ఒక డాక్టర్ ఉంటారు, ఒక అంబులెన్స్ కూడా. ఏదయినా ఎమర్జెన్సీ ఉంటే తప్పకుండా తెలియ చేస్తాము. సాధారణ విషయాలు మీకు తెలిపే అవకాశం లేదు".

చికెన్ ఉంటుందా, ఉండదా?

"ఇదంతా బాగానే ఉంది కానీ, చికెన్ ఉంటుందా, ఉండదా?" నా ప్రశ్న.

"సాధారణంగా కోడి గుడ్లు ఉంటాయి కానీ, మీరు కొన్ని యాక్టివిటీస్‌లో అంటే టాస్క్‌లలో విజేతలుగా అయితేనే మాంసాహారం ఇస్తారు!".

అలా అయితే ఇక మనం పప్పుతో సరిపెట్టుకోవాలి అని అర్థం అయ్యింది నాకు!

కష్టమైన నిబంధనలు కాదులే అనుకున్నాను.

హీరో నాని

ఫొటో సోర్స్, maatv/Facebook

ఆబ్జెక్షన్ యువర్ హానర్!

"బాగానే ఉంది! అసలు, మీరెలా ఇముడుతారు ఆ ఆటలో? అది పూర్తిగా నెగటివ్ గేమ్. ఇంట్లో సభ్యులందరూ ఎవరో ఒకరిని బయటకు పంపాలని కుట్రలు చేస్తూ ఉండాలి. బయటకు దొంగ ప్రేమ నటిస్తూ, వారానికి ఒకరిని 'నామినేషన్' అని, 'ఎలిమినేషన్' అని ఇంటి బయటకు పడేసే గేమ్ ఇది!" నా భార్య సహన అసహనంగా అన్న మాటలు.

"ఒక్క నిమిషం! మరి మన అరుణ్ ఈత పోటీకి వెళ్లి మెడల్ తెస్తాడు. తను గెలిచాడు అంటే మిగతా వారు ఎలిమినేట్ అయ్యారు అనే కదా? అక్కడ లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకు?" అప్పటివరకూ ఒక్క ఎపిసోడ్ కూడా చూడని, అజ్ఞానంతో కూడిన నా ప్రశ్న అది.

"రెండూ ఒకటి కాదు, మన ఆటల పోటీలలో బాగా ఆడినవారిని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ బాగా ఆడలేని వారిని బయటకు పంపిస్తారు. తేడా ఉంది కదా?".

నిజమే, చిన్నప్పటినుంచి పోటీ జీవితానికి దూరంగా ఉన్న నేను, అధ్యాపకుడిగా బాగా చదువురాని వారికే నా సమయం అంతా కేటాయించే నేను, ఈ విషయం అప్పటి దాకా పరిగణలోకి తీసుకోలేదు.

"మమ్మా, don't worry! మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, లాప్టాప్ లేకుండా, పెన్నూ పేపరు లేకుండా పప్పా(నాన్న) అక్కడ ఉండలేరు. వారం రోజులలో తిరిగి వస్తారు!" మా పుత్ర రత్నం ముందస్తు అంచనా!

"అలా కూడా కాదు నాన్నా! పప్పా గురకకి ఇంట్లో వాళ్లే అందరూ వారం రోజులలో బయటకు పారిపోతారు. ఇంకా ఏమిటంటే, పప్పా గనక పాట పాడితే, ఏకంగా బిగ్ బాసే ఇల్లు వదిలి పారిపోతాడు!" చాన్సు దొరికిందిగా, ఇద్దరూ ఏసుకున్నారు!

బిగ్ బాస్

ఎందుకెళ్లాలి?

నేను నా టీవీ షో 'ది బిగ్ క్వశ్చన్ విత్ బాబు గోగినేని'లో కాలెండర్ కథ సిరీస్‌లో ఒక ఎపిసోడ్‌లో ఫ్రెంచ్ శాస్త్రవేత్త మిషెల్ సీఫ్ర్ చేసిన ప్రయోగాల గురించి ఒక సారి వివరించాను.

ఆయన ఒక శాస్త్రజ్ఞుడు. ఆల్ప్స్ పర్వతాలలో ఒక లోతైన గుహలోకి వెళ్లి స్వచ్ఛందంగా బందీ అయి, 63 రోజులపాటు బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా, గడియారం లేకుండా, పగలూ రాత్రి తెలియకుండా గడిపాడు.

ఆ ప్రయోగం చివరిలో వాస్తవ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా కొన్ని రోజులు చాలా విచిత్రంగా ప్రవర్తించాడట సీఫ్ర్!

పగలూ, రాత్రీ లేని, తెలియని, అంతరిక్షంలోకి, గడియారం లేకుండా మనిషి రోదసీలోకి వెళ్లినప్పుడు మన శరీరం ఎలా స్పందిస్తుందో అని తెలుసుకోవడానికి చేసిన ప్రయోగం అది.

అలాగే, బిగ్ బాస్ అంతర్జాతీయ షో BIG BROTHER, 1997లో అనుకుంటా, నెదర్లాండ్స్‌లో ఆరంభమైనప్పుడు నేను ఆ దేశంలో ఉండటం తటస్థించింది. కొంత ఆ ఆట గురించి అవగాహన వచ్చింది నాకు అప్పుడు.

BIG BROTHER అన్నది ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ రచించిన '1984' పుస్తకంలోని ముఖ్య పాత్ర, ముఖ్యమైన అంశం. పుస్తకంలో BIG BROTHER అనే ఒక అదృశ్య శక్తి అందరినీ గమనిస్తూ ఉంటుంది. అది ఎవరో తెలియదు, కానీ అందరూ అప్రమత్తంగా ఉంటుంటారు.

'BIG BROTHER is watching us' అనుకుంటూ. 1948లో రాసిన ఆ పుస్తకంలో "1984 కల్లా మనం ఒక నిఘా నీడలోని సమాజంలోకి (surveillance society) నెట్టివేయబడతామనీ, మనల్ని నిత్యం గమనించే సాంకేతిక పరిజ్ఞానం, వాటి ద్వారా దొరకబుచ్చుకొన్న సమాచారాన్ని వాడుతూ కొన్ని శక్తులు మన స్వేచ్చను హరించేస్తాయి" అన్నది ఆయన హెచ్చరిక.

మరి BIGG BOSS ఇంటిలో 90 కెమెరాలు, అంతకంటే ఎక్కువ మైక్రోఫోన్లు మనను నిత్యం గమనిస్తూనే ఉంటాయి; వాటి వెనుక దాదాపు 400 మంది మన ప్రవర్తన వివరాలను, దృశ్యాలను క్రోడీకరిస్తూ ఉంటారు. అలా, స్నానాల గదిలో తప్ప ఇంకెక్కడా గోప్యత లేకుండా, అంటే ప్రైవసీ లేకుండా, జీవించడం ఎలా ఉంటుంది?

అద్దాల గదిలో, ఒక హాస్టల్ వాతావరణంలో, 16 మంది తమ తమ రంగాలలో నిష్ణాతులైన వారితో జీవించడం అనే అనుభవం ఎలా ఉంటుంది?

line
line

BIGG BOSS ఇల్లు ఒక ప్రయోగశాల

మా బిగ్ బాస్ ఇంటి జీవితంలోని 24 గంటలలో ఆ కెమెరాల వెనుక ఉన్న 400 మంది ఏ అంశాలను ఎంపిక చేసుకొని, వాటిని ఎలా రంగరించి 90 నిమిషాలలో చూపిస్తారన్నదే ముఖ్యం.

ఈ ఆట కేవలం హౌజ్‌లో ఉన్న ఆటగాళ్ల గురించి మాత్రమే కాదు, ఇది ఈ ఆట నిర్వాహకుల గురించి, చూస్తున్న, ఓట్లు వేస్తున్న ప్రేక్షకుల గురించి కూడా!

జీవితంలో బహుశా ఒకే సారి వచ్చే ఈ ప్రత్యేక అవకాశం ఎందుకు వద్దనుకోవాలి? పైగా, నన్నుహేతువాదిగా, మానవవాదిగా కదూ ఆహ్వానించింది? రోజూ కోటిన్నర మంది 90 నిమిషాల పాటు చూసే కార్యక్రమంలో మనం ఉండకపోతే ఎలా?

ఇంకొక విషయం ఏమిటంటే, తెలివిగా ఆలోచిస్తే, ఈ ఆట ఒక Behaviour Lab. ఒక Closed, Controlled వాతావరణంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు సృష్టించి, అక్కడ ఉన్న మనుషుల ఉద్వేగాలను కొన్ని ఒత్తిళ్ళకు గురి చేసి, ఆ వాతావరణంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో, అందరి దృష్టికి తీసుకురావడం!

పుస్తకాల కంటే ఇంట్లో ఉన్న ఆ 15 మంది మిత్రులనే ఇంకా బాగా చదవచ్చు కదా! ఎందుకంటే BIGG BOSS ఇల్లు నిస్సందేహంగా ఒక సైకలాజికల్ ప్రెషర్ కుక్కర్, అది మన వ్యక్తిత్వానికో పరీక్ష పెడుతుంది.

ఈ ఆటకు ఎన్నో డైమెన్షన్స్ ఉంటాయి, అవి అన్నీ explore చేయాలి. కాబట్టి, మనం ఆ ఇంట్లోకి రమ్మన్న ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించాలి.

( బిగ్ బాస్ రూల్స్ మీద మరో కథనం...బిగ్ బాస్: ''ఈక్వల్ గేమ్ ఎలా అవుతుంది' )

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)