చరిత్ర: మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు. ఆ యుద్ధంలో భారత సైనికుల త్యాగాలు తెలుసా?

మొదటి ప్రపంచ యుద్ధం సైనికులు

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి సరిగ్గా వంద సంవత్సరాలు పూర్తి కావస్తోంది. నాటి బ్రిటిష్ ఇండియా నుంచి దాదాపు 13 లక్షల మంది సైనికులు బ్రిటన్ తరపున ఆ సంగ్రామంలో పాల్గొన్నారు. ఫ్రాన్స్‌లోని నర్వ్ షాపెల్ వద్ద జరిగిన పోరులో దాదాపు నాలుగువేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారి జ్ఞాపకార్థం అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. దాన్ని సందర్శించి బీబీసీ అందిస్తున్న కథనం.

ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్‌షైర్‌ ప్రాంతానికి చెందిన వైద్యుడు ఇర్ఫాన్ మాలిక్‌ తన పూర్వీకుల చరిత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఆయన ముత్తాతలు సుబేదార్ మహ్మద్ ఖాన్, కెప్టెన్ ఉలార్ మహ్మద్ మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడారు.

"మా పూర్వీకులది బ్రిటిష్ ఇండియాలోని ఓ చిన్న ఊరు. ఆ గ్రామం నుంచి 400 మందికిపైగా సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. వారి చరిత్రను పరిశోధించడం కోసం నాలుగేళ్లు పనిచేశాను. ఆ యుద్ధంలో వారు ఎన్‌ఫీల్డ్ రైఫిల్స్‌ను కూడా వినియోగించారని తెలిసింది" అని ఇర్ఫాన్ మాలిక్ చెప్పారు.

"ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హాంలో పుట్టిపెరిగిన నాకు మా పూర్వీకుల గురించి పెద్దగా తెలియదు. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ ప్రధాన పాత్ర తెల్లవాళ్లదే అనుకునేవాణ్ని. కానీ, నాటి బ్రిటిష్ ఇండియా, ఆఫ్రికా, వెస్టీండీస్ వంటి కామన్ వెల్త్ దేశాలు ఆ యుద్ధాల్లో ఎంతో కీలక పాత్ర పోషించాయి. దానిపై గతంలో నాకు అవగాహన లేదు. అందుకే భావితరాలకు మా ఘనమైన చరిత్రను చెప్పాలనుకుంటున్నాను" అని ఆయన వివరించారు.

బ్రిటిష్ ఇండియా సైనికులు 1915లో తొలి పోరాటంలో పాల్గొన్నారు. ఆ యుద్ధంలో మరణించిన దాదాపు 4,000 మంది పేర్లతో ఒక స్మారక చిహ్నాన్ని నెర్వ్ షాపెల్‌ గ్రామంలో ఏర్పాటు చేశారు.

బ్రిటిష్ సైన్యంలో దక్షిణాసియా నుంచి పది లక్షల మందికి పైగా ఆ యుద్ధంలో పాల్గొన్నారు. యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో జరిగిన యుద్ధాలలో సుమారు డెబ్బై నాలుగువేల మంది మరణించారు. కానీ, వారి త్యాగాలకు సరైన గుర్తింపు లభించలేదు.

వీడియో క్యాప్షన్, మొదటి ప్రపంచయుద్ధం: భారతీయుల త్యాగాల ఫలితమే బ్రిటన్ విజయం

భారత స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న మహాత్మా గాంధీ ఆ యుద్ధానికి మద్దతిచ్చారు. అయితే యుద్ధం ముగిశాక... భారత స్వాతంత్ర్య పోరాటం ఆ సైనికుల వీరోచిత పోరాటాన్నీ, వారి త్యాగాలనూ మసకబార్చింది.

"రెండు పక్షాలూ కావాలనే కొన్ని విషయాలను విస్మరిస్తున్నాయని నా అభిప్రాయం. స్వాతంత్ర్యం కోసం భారతదేశం బ్రిటన్‌తో పోరాడింది. అయితే, ఇప్పుడు ఇటు బ్రిటన్, అటు భారత్ రెండూ పరిపక్వత గల ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్నాయి. నిజానికి ఆనాటి త్యాగాలను మళ్లీ కొత్తగా కనుగొంటున్నాం. అటువంటి ప్రయత్నమే ఖాదీ పాపీ. గాంధీకి ఎంతో ఇష్టమైన ఖద్దరు వంటి నూలుతో ఈ పాపీలను తయారు చేశారు. భారతదేశ స్వావలంబనకు ఇవి అసలైన ప్రతీకలు. ఒక శతాబ్దం ముగిసింది. రెండో శతాబ్దంలో కూడా సైనికుల త్యాగాలను స్మరించుకోవాలి. తర్వాతి తరాలు ఈ త్యాగాలను గుర్తుంచుకోవాలంటే ఖాదీ పాపీలు ఓ చక్కని మార్గం" అని రాయల్ బ్రిటిష్ లెజియస్ అంబాసిడర్ లార్డ్ గాదియా అన్నారు.

మొదటి ప్రపంచ యుద్ధం సైనికులు

నాటింగ్‌హాంలో డాక్టర్ మాలిక్ నేటి సముదాయాల మధ్య అంతరాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

"నేను యువకుడిగా ఉన్నప్పుడు స్మారక ఉత్సవాలను, కార్యక్రమాలను చూస్తూ ఉండేవాడిని. వాటితో నాకు సంబంధం లేదనుకునేవాన్ని. కానీ గత నాలుగేళ్ల నా పరిశోధనతో మనకు అక్కడ స్థానం ఉందని గ్రహించాను. నేనూ వెళ్లి స్మారక స్థూపం వద్ద పూలతో నివాళి అర్పిస్తున్నాను" అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, వీడియో: రంగుల్లో మొదటి ప్రపంచ యుద్ధం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)