"ఉద్యోగులతో మూత్రం తాగించి, బొద్దింకలు తినాలని ఒత్తిడి తెచ్చిన చైనా సంస్థ"

మూత్రం తాగించారు

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్, సేల్స్ టార్గెట్ అందుకోకుంటే, బొద్దింక తినాల్సిందే

చైనాలో అమ్మకాల టార్గెట్లు అందుకోలేకపోయిన ఉద్యోగులతో మూత్రం తాగించి, బొద్దింకలు తినిపించిన ఒక సంస్థ మేనేజర్లను పోలీసులు అరెస్టు చేశారు.

బెల్టుతో దెబ్బలు తింటున్న కొందరు పసుపు రంగులో ఉన్న ద్రవాన్ని తాగుతున్నట్టు ఉన్న కొన్ని వీడియోలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

"టార్గెట్ చేరుకోలేకపోయిన ఉద్యోగులు బొద్దింకలు తినాలని సంస్థ ఆదేశించినట్లు" సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు.

ఉద్యోగులతో మూత్రం తాగించిన ఘటనతో ముగ్గురు మేనేజర్లను జున్యి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది.

మూత్రం తాగారు

ఫొటో సోర్స్, PEARVIDEO.COM

ఫొటో క్యాప్షన్, చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఉద్యోగులకు దారుణమైన శిక్షలు

చైనా సోషల్ మీడియా సైట్ వీబోలో వైరల్ అయిన వీడియోలో మధ్యలో నిలబడిన ఒక ఉద్యోగిని బెల్టుతో కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

వీరందరూ గ్వీజో నగరంలో ఇళ్లను రిపేర్ చేసే కంపెనీలో పనిచేసే ఉద్యోగులని చెబుతున్నారు.

వీరిలో కొందరు ముక్కు మూసుకుని ప్లాస్టిక్ కప్పుల్లో ఉన్న పసుపు ద్రవాన్ని తాగడం వీడియోలో కనిపిస్తోంది.

పనితీరు సరిగా లేని ఉద్యోగులు బొద్దింకలను కూడా తినాల్సి వస్తుందని మేనేజర్లు బెదిరిస్తున్నట్టు ఈ వీడియోలో ఉంది.

మూత్రం తాగారు

ఫొటో సోర్స్, PEARVIDEO.COM

ఫొటో క్యాప్షన్, సోషల్ మీడియాలో ఈ పసుపు ద్రవాన్ని మూత్రం అంటున్నారు

ఉద్యోగం పోతుందని సిబ్బంది భయం

స్థానిక మీడియా కథనాల ప్రకారం టాయిలెట్‌లోని నీళ్లు లేదా వినెగర్ తాగించడం, గుండు కొట్టించడం లాంటి శిక్షలు కూడా ఈ సంస్థలో అమలు చేస్తున్నారు.

ఈ సంస్థ గత రెండు నెలలుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. లోపల వేస్తున్న శిక్షల గురించి బయట చెబితే, పనిలోంచి తీసేస్తారని, జీతం ఇవ్వరని సిబ్బంది భయపడిపోతున్నారు.

చైనా సంస్థలు తమ ఉద్యోగులను శిక్షించడం, అవమానించడం లాంటి ఘటనలు గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి.

గతంలో కొన్ని సంస్థలు ఉద్యోగులను శిక్షించడం, లేదా టీమ్ స్పిరిట్ పేరుతో ఇలాంటి చాలా దారుణాలకు పాల్పడ్డాయి. వీటిలో ఒకరితో ఇంకొకరికి చెంపదెబ్బలు వేయించడం, మోకాళ్లపై నడిపించడం, చెత్తకుండీలకు ముద్దు పెట్టించడం లాంటి కేసులు కూడా నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)