మీరట్‌: "చాక్లెట్‌ ఇస్తానని చెప్పి చిన్నారి నోటిలో అంటించిన టపాకాయ పెట్టాడు"

టపాసులు

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, షాహబాజ్ అన్వర్
    • హోదా, బీబీసీ కోసం

టపాకాయను నోట్ల పెట్టి పేల్చాలని ఎవరైనా ప్రయత్నిస్తారా? చాక్లెట్ ఇస్తానని ఆశ పెట్టి ఇంత దారుణానికి పాల్పడతారా?

పెద్ద పిల్లలకే టపాకాయలు దూరంగా ఉండి కాల్చమని మనం సలహా ఇస్తాం. కానీ మీరట్‌ సర్ధనా జిల్లాలోని మిలక్ గ్రామంలో ఎవరూ నమ్మలేని ఒక ఘటన వెలుగులోకి వచ్చింది.

గ్రామంలోని ఒక మధ్య వయస్కుడు చాక్లెట్ ఇస్తానని మభ్య పెట్టి మూడేళ్ల చిన్నారి నోట్లో అంటించిన టపాకాయ పెట్టాడు. కాసేపటికే అది పాప నోట్లోనే పేలింది.

నోట్లో టపాసు పేలడంతో పాప నోరు తీవ్రంగా కాలిపోయింది. గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

టపాసు నోట్లో పెట్టారు

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR

ఘటన ఎప్పుడు, ఎలా జరిగింది?

నోట్లో టపాసు పేలడంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆరుషి తల్లి జ్యోతి ఆ ఘటన గురించి వివరించారు.

"ధంతేరస్ సాయంత్రం పాప, మిగతా పిల్లలతో కలిసి ఇంటి బయట ఆడుకుంటోంది. హఠాత్తుగా ఆరుషి అరుపులు వినిపించాయి. నేను బయటికెళ్లి చూసేసరికి పాప నోరు చీలిపోయి కనిపించింది. తన నోట్లో నుంచి రక్తం వస్తోంది" అన్నారు.

ఏమైందో మొదట తనకు అర్థం కాలేదని, అక్కడ ఉన్న మిగతా పిల్లలను అడిగేసరికి వాళ్లు జరిగిందంతా చెప్పారని జ్యోతి తెలిపారు.

"గ్రామంలోని హరియా చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆరుషి నోట్లో అంటించిన టపాసు పెట్టాడు. అది నోట్లోనే పేలిపోయింది" అని పిల్లలు చెప్పారు.

కాసేపట్లోనే ఈ ఘటన గురించి గ్రామం అంతా తెలిసిపోయింది. దాంతో జనం అక్కడికి భారీగా తరలివచ్చారు.

"మా పాప ఏం మాట్లాడలేకపోయింది. మేం చూసినప్పుడు తన నోటి నుంచి రక్తం వస్తోంది. మాకేం అర్థం కాలేదు. హరియా అలా ఎందుకు చేశాడో, మాకు తనతో ఏ శత్రుత్వం లేదు. కానీ హరియా నా కూతురిని చంపడానికి ప్రయత్నించాడు అనేది మాత్రం కచ్చితంగా తెలిసింది" అని ఆరుషి తండ్రి శీష్‌పాల్ చెప్పారు.

నోట్లో టపాసు పెట్టారు

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR

మాట్లాడలేకపోతున్న చిన్నారి

చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి నోట్లో టపాసు పెట్టిన ఘటనపై సర్ధానా పోలీసులు కేసు నమోదు చేశారు.

"టపాకాయ పేలడంతో పాప తీవ్రంగా గాయపడిన మాట నిజమే. కానీ చాక్లెట్ ఆశపెట్టే దానిని చిన్నారి నోట్లో పెట్టారా? అనేది తెలుసుకోడానికి దర్యాప్తు చేస్తున్నాం. నిందితుడు హరియాపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశాం. అతడి కోసం గాలిస్తున్నాం" అని స్టేషన్ ఆఫీసర్ ప్రశాంత్ కపిల్ తెలిపారు.

ఆరుషి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తీవ్రంగా గాయపడడంతో మాట్లాడలేకపోతోంది, ఏమీ తినలేకపోతోంది.

"ఆరుషి గాయాన్ని చూస్తే ఆమె నోట్లో టపాసు పెట్టి పేల్చినట్టు తెలుస్తోంది. టపాకాయలోని మందు కణాలు కూడా పాప నోట్లో ఉండవచ్చు. చిన్నారి నోరు చీలడం వల్ల చాలా కుట్లు పడ్డాయి. పాపను అబ్జర్వేషన్‌లో ఉంచాం" అని చికిత్స చేస్తున్న వైద్యుడు సునీల్ త్యాగి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)