కాలిఫోర్నియా బార్‌లో కాల్పులు: ‘నిందితుడు మానసిక రోగి’

ఫొటో సోర్స్, cbs
కాలిఫోర్నియా థౌజెండ్ ఓక్స్ నగరంలోని ఒక బార్‌లో కాల్పులు జరిపిన నిందితుడిని అమెరికా మాజీ సైనికుడుగా గుర్తించారు.
ఈ దాడిలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్టు ధ్రువీకరించారు. కాల్పుల్లో మరో 10 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు.
కాల్పులు జరిపిన వ్యక్తి అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
28 ఏళ్ల నావికాదళ మాజీ సైనికుడు ఇయాన్ డేవిడ్ లాంగ్ ఈ దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. అతడు డిప్రెషన్‌లో ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా డేవిడ్ లాంగ్‌ను చాలాసార్లు కలిశామని పోలీసులు చెబుతున్నారు. ఇదే ఏడాది ఏప్రిల్లో లాంగ్ తన ఇంట్లో గందరగోళం సృష్టించినపుడు పోలీసులు అతడిని పిలిపించారు.

ఫొటో సోర్స్, EPA
డిప్రెషన్‌లో నిందితుడు
లాంగ్ సమ్మతి లేకుండా అతడిని మానసిక ఆరోగ్య కేంద్రంలో ఉంచడం సరికాదని మానసిక నిపుణులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు.
ఆ సమయంలో లాంగ్‌ను ఇంటర్వ్యూ చేసిన మానసిక నిపుణులు అతడు బహుశా పీటీఎస్‌డీ( పోస్ట్ ట్రామెటిక్ స్ట్రెస్ డిజార్డర్) బాధితుడు కావచ్చని తెలిపారు.
పీటీఎస్‌డీ ఒకరకమైన మానసిక వ్యాధి. ఏదైనా ఘటన దానికి మూలం అవుతుంది.
"ఏవైనా బాధాకరమైన ఘటనలను చూసినవారు ఆ బాధ లేదా విషాదంలో ఉండిపోతారు. డిప్రెషన్‌లో పడిపోతారు. లేదంటే వారిలో అపరాధ భావం, కోపం ఉంటుంది. అదే పీటీఎస్‌డీకి కారణం అవుతుంది" అని వైద్యులు తెలిపారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
డేవిడ్ 2008 నుంచి 2013 వరకూ నావికా దళంలో గన్నర్‌గా తమతో పనిచేశాడని, కార్పొరల్ ర్యాంక్ వరకూ చేరుకున్నాడని యుఎస్ మెరైన్ కార్ప్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.
సైన్యం వీడిన తర్వాత లాంగ్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో 2013 నుంచి 2016 మధ్య చదువుకున్నాడు.
2010-11 మధ్య అఫ్గానిస్తాన్‌లో సైన్యం మోహరించిన సమయంలో డేవిడ్ లాంగ్‌కు మెరైన్ కార్ప్స్ తరఫున గుడ్ కాండక్ట్ మెడల్, అఫ్గానిస్తాన్ క్యాంపెయిన్ మెడల్, గ్లోబల్ వార్ ఆన్ టెర్రరిజం సర్వీస్ మెడల్ కూడా ఇచ్చారు.
డేవిడ్ ఈ దాడికి పాయింట్ 45 క్యాలిబర్ గ్లాక్ సెమీ ఆటోమేటిక్ హ్యాండ్ గన్ ఉపయోగించినట్టు పోలీసులు చెబుతున్నారు.
అతడి దగ్గర అప్గానిస్తాన్ మేగజీన్ కూడా ఉందని, దానిని ఉంచుకోవడం కాలిఫోర్నియాలో చట్టవిరుద్ధం అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- జపాన్ పిల్లల ఆత్మహత్యలు: ఏడాదిలో 250 మంది మృతి – 30 ఏళ్లలో ఇదే అత్యధికం
- ఆసియా బీబీ: దైవదూషణ కేసులో పాకిస్తాన్ జైలు నుంచి విడుదల
- తెలంగాణ ఎన్నికలు: ‘పాతబస్తీ అభివృద్ధి గాలిబ్ ప్రేయసి వాగ్దానంలా ఉంది’
- మూఢనమ్మకం: దీపావళి రోజున గుడ్లగూబను బలిస్తే సంపద రెట్టింపు అవుతుందా?
- విరాట్ కోహ్లీ: 'మీకు విదేశీ ఆటగాళ్లు ఇష్టమైతే భారత్‌లో ఉండకండి'
- నోట్ల రద్దుకు రెండేళ్లు: ‘రాజకీయంగా అది మాస్టర్ స్ట్రోక్’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









