ఆసియా బీబీ: దైవదూషణ కేసులో పాకిస్తాన్ జైలు నుంచి విడుదల

ఫొటో సోర్స్, HANDOUT
దైవదూషణ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డ పాకిస్తాన్ క్రైస్తవ మహిళ ఆసియా బీబీ జైలు నుంచి విడుదలయ్యారని ఆమె న్యాయవాది చెబుతున్నారు.
ఆసియా బీబీని విమానంలో పాకిస్తాన్ నుంచి పంపించేశారని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. కానీ ఆమె ఎక్కడకు వెళ్లారనేది ఇంకా స్పష్టంగా తెలీడం లేదు.
దైవదూషణ ఆరోపణల్లో ఆసియా బీబీకి కింది కోర్టు మరణ శిక్ష విధించింది. శిక్ష పడిన 8 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా తేల్చింది.
సుప్రీంకోర్టు తీర్పుతో పాకిస్తాన్‌లోని అతివాద ముస్లింలు తీవ్ర ఆందోళనలు చేపట్టారు. దీంతో ఆసియాబీబీని దేశం వదిలి వెళ్లనివ్వబోమని పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆసియా బీబీని దేశం వదిలి వెళ్లకుండా అడ్డుకోడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న పాకిస్తాన్ ప్రభుత్వం ఆందోళనకారులను శాంతింపజేయడానికి ప్రయత్నించింది.
దీంతో, తన కుటుంబం ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, తమకు ఆశ్రయం కల్పించాలని ఆసియా బీబీ భర్త చాలా దేశాలను కోరారు. కొన్ని దేశాలు ఆయన కుటుంబానికి ఆశ్రయం ఇస్తామని కూడా చెప్పాయి.
ఈ నేపథ్యంలో ముల్తాన్ నగరంలోని జైలు నుంచి ఆసియా బీబీని విడుదల చేశారని ఆమె తరఫు వకీల్ సయీఫ్-ఉల్-ములూక్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
ఆసియా బీబీ కేసు ఏమిటి?
2010లో ఆసియా బీబీ తోటి మహిళలతో ఘర్షణ సందర్భంగా మహమ్మద్ ప్రవక్తను దూషించారనే కేసులో ఆమెను దోషిగా తేల్చారు. అయితే తాను నిర్దోషినని ఆమె నాటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పటివరకు ఆమె ఎనిమిదేళ్లకు పైగా ఏకాంత కారాగార శిక్షను అనుభవించారు.
పాక్తిస్తాన్‌లో తమకు గిట్టని వారిని దైవదూషణ నేరం మోపి వారిపై కక్ష తీర్చుకుంటున్నారనే విమర్శలు ఎన్నాళ్లుగానో వినిపిస్తున్నాయి.
దైవదూషణకు సంబంధించిన ఆరోపణలపై కఠినంగా వ్యవహరించే పాకిస్తాన్‌లో ఆమె కేసుపై భిన్నవాదనలు వినిపించాయి.
ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ విజ్ఞప్తి చేసిన ఒక పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్‌ను ఆయన సొంత అంగరక్షకుడే కాల్చి చంపడంతో ఆసియా బీబీ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా బీబీపై వచ్చిన ఆరోపణలు
2009లో ఆసియా బీబీ లాహోర్‌కు సమీపంలోని ఒక తోటలో పళ్లు కోస్తుండగా వివాదం తలెత్తింది.
ఆసియా బీబీ ఒక కప్పులో నీళ్లు తాగడంతో తోటి మహిళలు దాని వల్ల ఆ కప్పు మలినమైందని ఆరోపించారు. దాని తదనంతరం తలెత్తిన వివాదంలో తోటి మహిళలంతా ఆసియా బీబీని ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి తెచ్చారు.
ఆ సందర్భంగా ఆసియా బీబీ దైవదూషణ చేశారని వారు ఆరోపించారు. పోలీసు విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.
అయితే తాను తన తోటి మహిళలతో వాదించిన మాట వాస్తవమే కానీ, తానేమీ దైవదూషణ చేయలేదని ఆసియా బీబీ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళనలు
ఆసియా బీబీ కేసులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని అంతర్జాతీయంగా ఆరోపణలు వెల్లువెత్తాయి.
దైవదూషణ కేసులో మరణశిక్ష నుంచి విముక్తి పొందిన క్రైస్తవ మహిళ తరఫున వాదించిన లాయర్ ప్రాణభయంతో పాకిస్తాన్ నుంచి పారిపోయారు.
ఆసియా బీబీ తరఫున నిలబడాలంటే తాను దేశం నుంచి వెళ్ళిపోక తప్పదని లాయర్ సయీఫ్ ములూక్ ఏఎఫ్‌పి వార్తా సంస్థతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విదేశీ ఆశ్రయం కోసం భర్త వినతి
ఆసియా బీబీ భర్త ఆషిక్ మసీహ్ తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ లేదా అమెరికాలో తమకు ఆశ్రయం కల్పించాలని కోరారు.
ఒక వీడియో మెసేజ్ పంపిన ఆషిక్ మసీహ్ అందులో "మాకు సాయం చేయాలని నేను బ్రిటన్ ప్రధానమంత్రిని వేడుకుంటున్నాను" అని తెలిపారు.
ఇలాగే తనకు సాయం చేయాలని కెనెడా, అమెరికా నేతలకు కూడా వీడియో సందేశాలు పంపించారు.
అంతకు ముందు జర్మన్ బ్రాడ్‌కాస్టర్ డీడబ్ల్యుకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాసీహ్ ఎప్పుడు ఏం జరుగుతుందోనని తన కుటుంబం భయపడుతోందన్నారు.
అడ్డుకోడానికి పాకిస్తాన్ ప్రభుత్వం, అతివాద ఇస్లామిక్ పార్టీలతో ఒక ఒప్పందం చేసుకుని ఆసియా బీబీని దేశం వదిలి వెళ్లడానికి అనుమతించకపోవడం తప్పు అని మాషిక్ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆసియా బీబీ: విదేశీ ఆశ్రయం కోసం భర్త వీడియో మెసేజ్
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- గాంధీ కథ చెప్పిన రచయిత గుజరాత్లో ఎందుకు చదువు చెప్పలేకపోయారు?
- 96 ఏళ్ల వయసులో మూడో తరగతి పాసైన కేరళ బామ్మ
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
- రూపాయి విలువ పడిపోతే దేశానికి ఏమవుతుంది? మీకేమవుతుంది?
- 'రఫేల్ డీల్‌ను ప్రశంసించాలి' : బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్
- ఫేక్ న్యూస్‌పై సమరం: ‘సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








