రెండో ప్రపంచ యుద్ధం నాటి ‘జర్మన్ గర్ల్స్’కు నార్వే ప్రధాని క్షమాపణ

పిల్లలతో సహా నార్వే నుంచి జర్మనీకి వెళుతున్న మహిళలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అనేక మంది నార్వే మహిళలను వారి పిల్లలతో సహా జర్మనీకి తరిమేశారు

రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జర్మనీ సైనికులతో సంబంధాలు పెట్టుకున్న మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడంపై నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్ అధికారికంగా క్షమాపణలు చెప్పారు.

రెండో ప్రపంచ యుద్ధంలో తటస్థంగా ఉన్న నార్వేపై 1940 ఏప్రిల్‌లో నాజీ బలగాలు దాడి చేశాయి.

ఆ సమయంలో సుమారు 50 వేల మంది నార్వే మహిళలు జర్మనీ సైనికులతో సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్నారు.

నాజీలు ఆక్రమించిన సమయంలో ఓస్లోలో ఎగురుతున్న స్వస్తికా జెండా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాజీలు ఆక్రమించిన సమయంలో ఓస్లోలో ఎగురుతున్న స్వస్తికా జెండా

ఆర్య జాతి కోసం..

జర్మనీ సైనికులు నార్వే మహిళలతో కలిసి పిల్లలు కనడాన్ని ఎస్‌ఎస్ నేత హెన్రిచ్ హిమ్లర్ ప్రోత్సహించారు.

అడాల్ఫ్ హిట్లర్ పాలనలో అత్యంత శక్తివంతమైన వారిలో ఒకరైన హిమ్లర్.. నాజీల ఆర్య జాతి భావనను ముందుకు తీసుకెళ్లేందుకు నార్వే మహిళలను ఉపయోగించుకోవాలనుకున్నారు.

అలా 1941లో జర్మనీ పాలన కింద ఉన్న లెబెన్స్‌బార్న్‌లో అనేక మాతృత్వ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో అనేక మంది నార్వే-జర్మనీ పిల్లలు జన్మించారు.

యుద్ధం ముగిసాక, జర్మనీ సైనికులతో సంబంధాలున్న నార్వే మహిళలను 'జర్మన్ గర్ల్స్' అని ఎగతాళిగా పిలిచేవారు. దేశద్రోహానికి పాల్పడ్డారంటూ వాళ్లను అవమానించేవారు. వారికి మామూలు ప్రజలకు ఉండే హక్కులను నిరాకరించడమే కాకుండా, వారిని నిర్బంధించడం లేదా పిల్లలతో సహా జర్మనీకి తరిమేశారు.

అయితే దీనిపై నార్వేలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది.

నార్వేను ఆక్రమించినపుడు జర్మనీ అక్కడ అనేక మాతృత్వ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నార్వేను ఆక్రమించినపుడు జర్మనీ అక్కడ అనేక మాతృత్వ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది

అమానవీయ ప్రవర్తన

బుధవారం ఐక్యరాజ్యసమితి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన 70వ వార్షికోత్సవం నేపథ్యంలో సోల్బర్గ్, ''జర్మనీ సైనికులతో సంబంధాలు కలిగిన లేదా కలిగి ఉన్నట్లు అనుమానం ఉన్న నార్వే బాలికలు, యువతుల విషయంలో చాలా అమానవీయంగా ప్రవర్తించారు'' అని పేర్కొన్నారు.

''నార్వే పౌరులెవరూ చట్టప్రకారం విచారణ జరగకుండా ఎలాంటి శిక్షను అనుభవించరాదు అన్న ప్రాథమిక హక్కును అధికారులు ఉల్లంఘించినట్లు మేం భావిస్తున్నాం.''

''చాలామందికి అది కేవలం టీనేజీ ప్రేమ. కొందరు బతికి బట్టకట్టడానికి శత్రు దేశపు సైనికులతో కలిశారు. అలాంటి అమాయకపు ప్రేమ వ్యవహారం వారి జీవితాలపై చెరిగిపోని ముద్ర వేసింది. ప్రభుత్వం తరపున అలాంటి వారందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను'' అన్నారు సోల్బర్గ్.

నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్

ఇటీవల నార్వే సెంటర్ ఫర్ హోలోకాస్ట్ అండ్ మైనారిటీ స్టడీస్ అనే సంస్థ నార్వేలో రెండో ప్రపంచ యుద్ధానంతరం జరిగిన సంఘటనలపై నివేదిక వెలువరించిన నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు.

సోల్బర్గ్ ప్రకటనపై ప్రతిస్పందిస్తూ ఆ సెంటర్ ప్రధానాధిపతి గురి జెల్ట్‌నెస్, ''మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణలకు చాలా శక్తి ఉంటుంది'' అన్నారు.

ఈ సమావేశానికి హాజరైన రైడార్ గాబ్లర్ అనే వ్యక్తి ఈ క్షమాపణలు తమ కుటుంబానికి చాలా మేలు చేస్తాయన్నారు.

రైడార్ తల్లి ఎల్స్ హూత్ 22 ఏళ్ల వయసులో ఒక జర్మన్ సైనికునితో ప్రేమలో పడ్డారు.

''ఆనాడు అమానవీయ ప్రవర్తనను ఎదుర్కొన్న వారెవరూ ఇప్పుడు మనతో లేరు. కానీ వారి కుటుంబాలకు, పిల్లలకు ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది'' అని రైడార్ అన్నారు.

నార్వే యువతులు, జర్మనీ సైనికుల మధ్య సంబంధాల కారణంగా సుమారు 10-12 వేల మంది పిల్లలు జన్మించారు. జర్మనీపై ప్రతీకారం తీర్చుకోవడంలో అలాంటి పిల్లలు లక్ష్యంగా మారారు.

2007లో అలాంటి కొందరు పిల్లలు యూరోపియన్ కోర్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్‌లో నార్వేపై కేసు వేశారు. అయితే ఆ నేరాలు జరిగి చాలా కాలమైనందున ఆ కేసులను స్వీకరించలేమంటూ కోర్టు వాటిని తోసిపుచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)