ఎంజే అక్బర్ రాజీనామా: ఇది #మీటూ విజయం - ఎన్ రామ్

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర మంత్రి ఎమ్.జె.అక్బర్ రాజీనామా, '#మీటూ' ఉద్యమ విజయం అని ‘ద హిందూ’ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్ అన్నారు.
ఆయన మీటూ ఉద్యమ భవిష్యత్తు గురించి బీబీసీతో మాట్లాడారు.
''తనపై ఆరోపణలు వచ్చిన మరుక్షణమే అక్బర్ రాజీనామా చేసుండాల్సింది. ఆయనపై లైంగిక ఆరోపణలు చాలా వచ్చాయి. అలాంటి సందర్భంలో ఇక మంత్రి పదవిలో కొనసాగే అవకాశమే లేదు'' అని రామ్ అన్నారు.
''తన రాజీనామాను ఆలస్యంగా ప్రకటించి, అక్బర్ #మీటూ ఉద్యమాన్ని ఇంకా బలపరచారు. ఆయన మొదటే రాజీనామా చేసివుంటే, ఈ మొత్తం వ్యవహారాన్ని నెమ్మదిగా మరిచిపోయేవారు. అంతేకాకుండా, ఇలాంటి ఆరోపణల పట్ల రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకునే అవకాశం కూడా ఇప్పుడు కలిగింది'' అని ఎన్.రామ్ వివరించారు.
''ప్రధాని మోదీ ఈ విషయమై ఇంతవరకూ నోరు మెదపలేదు. బీజేపీ అధికార ప్రతినిధి కూడా ఈ విషయంలో అక్బర్‌ను సమర్థించనూ లేదు, వ్యతిరేకించనూ లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా వేగంగా, తీవ్రంగా స్పందించి ఉండాలి.''
తనపై ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టుపై అక్బర్ క్రిమినల్, పరువునష్టం కేసు వేయడం కూడా అనవసరం! అలా చేయడం వల్ల ఆ కేసుపై పలు రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.'' అని రామ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఇది #మీటూ ఉద్యమ విజయం'
''అక్బర్ రాజీనామా #మీటూ ఉద్యమం సాధించిన విజయమనే చెప్పాలి. కానీ ఈ విజయంతో #మీటూ ఉద్యమం ఎంతవరకూ మనుగడ సాగిస్తుందో వేచి చూడాల్సిందే.’’ అని రామ్ అభిప్రాయపడ్డారు.
''#మీటూ ఉద్యమం సంపన్న శ్రేణి మహిళలకు చాలా ఉపయోగపడింది. కానీ సాధారణ మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపులను వెల్లడించే అవకాశాలు చాలా తక్కువ.'' అని అన్నారు.
''లైంగిక వేధింపుల వార్తలకు ప్రాధాన్యమిస్తూ, ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మీడియా ప్రయత్నించాలి.'' అని సూచించారు.
ఇలాంటి సందర్భాల్లో కొందరిపై తప్పుడు ఆరోపణలు చేయడానికి అవకాశం లేకపోలేదు. కానీ వారు చేసిన ఆరోపణలు ఏమేరకు నమ్మదగినవో సులభంగానే అర్థం చసుకోవచ్చు'' అని రామ్ అన్నారు.

ఈవిషయమై మహిళా జర్నలిస్టు లక్ష్మీ సుబ్రమణ్యన్ మాట్లాడుతూ..
''తనపై ఆరోపణలు చేసిన మహిళను బెదిరించడానికి, మాట్లాడనివ్వకుండా చేయడానికే ఆక్బర్ ప్రియా రమణిపై క్రిమినల్ పరువునష్టం కేసు వేశాడు'' అని అన్నారు.
''కానీ తనపై వస్తున్న వరుస ఆరోపణలకు, #మీటూ ఉద్యమ ధాటికి అక్బర్ రాజీనామా చేయకతప్పలేదు. గత ఆదివారం నుంచి బుధవారం వరకు జరిగిన రాజకీయ పరిణామాలు అక్బర్ రాజీనామా దిశగా సాగాయి'' అని లక్ష్మీ సుబ్రమణ్యన్ అన్నారు.

ఫొటో సోర్స్, CHANDAN KHANNA
ఉద్యమానికి ఇది శుభారంభం
''లైంగిక దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళాలోకానికి #మీటూ ఉద్యమం, అక్బర్ రాజీనామా రెండూ.. మానసిక విజయాన్ని అందించాయి.''
''కానీ పేద, నిరక్ష్యరాస్య మహిళలకు #మీటూ ఉద్యమం పట్ల అవగాహన ఉండదు. అంతేకాక, తమపై జరిగిన లైంగిక దాడుల గురించి వెల్లడించే అవకాశాలు కూడా వారికి లేకపోవచ్చు.''
కొందరు అమాయకులపై తప్పుడు ఆరోపణలు చేసే అవకాశాల గురించి ప్రస్తావించినపుడు లక్ష్మీ సుబ్రమణ్యన్ స్పందిస్తూ..
''అవును.. కొన్ని అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. కొందరు '#మీటూ'ను దుర్వినియోగం చేయొచ్చు. కానీ 90% కేసుల్లో వాస్తవం ఉంటుంది'' అని అన్నారు.
ఇవి కూడా చదవండి
- నేను నిత్యం పూజించే అయ్యప్పపై నాకు కోపం వచ్చింది.. ఎందుకంటే
- పాకిస్తాన్ దేశ చరిత్రలోనే కటిక చీకటి రాత్రి
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
- #HisChoice: ‘నేను మగ సెక్స్ వర్కర్‌ను... శరీరంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే...’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








