శబరిమల: నేను నిత్యం పూజించే అయ్యప్పపై నాకు కోపం వచ్చింది.. ఎందుకంటే

భక్తురాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, కృతికా కన్నన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేను చిన్నప్పట్నుంచీ ఆరాధిస్తున్న దేవుడిపైన నాకు తొలిసారి కోపమొచ్చింది. అప్పుడు నా వయసు 17. శబరిమలలో ఉండే అయ్యప్పే ఆ దేవుడు. నాపైన మా ఇంట్లో వాళ్లు వివక్ష చూపడమే దేవుడి పైన నా కోపానికి కారణం.

ఆ సమయంలో మా ఇంట్లో మగవాళ్లు అయ్యప్ప మాల ధరించి ఉపవాస దీక్షలో ఉన్నారు. నాకు నెలసరి సమయంలో ఇంటికి దూరంగా బంధువుల ఇంట్లో ఉండమని చెప్పారు.

నెలసరి సమయంలో మహిళలు అపవిత్రంగా ఉంటారని భావిస్తారు. దీక్షలో ఉన్న మగవాళ్లు వారికి దూరంగా ఉండాలని చెబుతారు. ఆ సమయంలో మహిళలు అయ్యప్ప దీక్ష ధరించిన వాళ్ల ముందుకు రాకూడదని, వారితో మాట్లాడకూడదని, వారి గొంతు మాల ధారుల చెవులకు వినిపించకూడదని అంటారు.

మా అమ్మ నాతో చెప్పిన విషయాలివి. వీటన్నింటినీ నా చిన్నప్పట్నుంచీ మా అమ్మ పాటిస్తూనే ఉంది. నెలసరి సమయంలో మేం వేరే ఇంట్లో ఉండకపోతే, మగవాళ్ల దీక్షకు భంగం కలుగుతుందని ఆమె చెప్పేది.

మా నాన్న అయ్యప్ప స్వామికి పెద్ద భక్తుడు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా 48 రోజులపాటు ఆయన అయ్యప్ప దీక్ష చేస్తారు.

మద్యం, ధూమపానం, మాంసాహారం, శృంగారం, సినిమాలకు దూరంగా ఉండటం, రోజూ రెండు సార్లు స్నానం, పూజలు లాంటి క్రతువులన్నీ చేస్తారు.

నెలసరి సమయంలో ఉన్న మహిళలతో మాట్లాడరు. ఇలా ఆ రోజుల్లో మహిళలకు దూరంగా ఉండటం కేవలం అయ్యప్పదీక్ష ధరించినప్పుడు మాత్రమే కాకుండా ఇతర సందర్భాల్లో కూడా మా ఇంట్లో పాటిస్తారు.

అయ్యప్ప

ఫొటో సోర్స్, Getty Images

నెలసరి రోజుల్లో ఎవరినీ ముట్టుకోకుండా మా ఇంట్లో మహిళలు ఒక మూలన కూర్చొని ఆ రోజులను భారంగా గడపడం నాకు తెలుసు.

ఆ సమయంలో వాళ్ల గిన్నెలు, బకెట్లను కూడా వేరుగా ఉంచేవారు. బట్టలను కూడా వేరుగా ఉతికేవారు. వాళ్లు ఏ వస్తువునూ ముట్టుకోవడానికి వీల్లేదు. వాళ్లను కూడా ఎవరూ తాకకూడదు.

నేను ఇది సరికాదని చెప్పాను. మా తల్లిదండ్రులతో ఈ విషయంలో పోరాడాను. కానీ, ఇంట్లో నాపైన సంప్రదాయమే గెలిచింది. నేనూ ఆ సంప్రదాయాన్నే అనుసరించేలా బలవంతం చేశారు.

కానీ, నేను ఇప్పుడు వేరే నగరంలో ఉద్యోగం చేస్తూ స్వతంత్రంగా బతుకుతున్నాను. నా రూల్స్ నాకున్నాయి. నేను ఆ రోజుల్లో శుభ్రంగా ఉంటాను. అలాగని ఎలాంటి వివక్షనూ నా దగ్గరకు రానివ్వను.

నాటి రోజులను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ బాధగా ఉంటుంది. ఆ రోజుల్లో బంధువుల ఇంట్లో ఉండేదాన్ని. అక్కడ కూడా నేను ఏ వస్తువునూ తాకకూడదు. ఎవ్వరూ నన్ను ముట్టుకునేవాళ్లు కాదు.

ఓసారి అలానే రాత్రి పూట నేను బంధువుల ఇంటికి వెళ్లాల్సొచ్చింది. ఒక్కదాన్నే ఉండటంతో ఆటో డ్రైవర్ నన్ను ఖాళీగా ఉన్న ఓ వీధివైపు తీసుకెళ్లాడు. నాకు విషయం అర్థమై ఆటో ఆపమని గట్టిగా అరిచాను. అతడి చేతిలో డబ్బులు పెట్టేసి దూరంగా వెలుతురు కనిపిస్తున్న ప్రదేశానికి వేగంగా పరుగెత్తాను.

అక్కడున్న వారి సాయంతో బంధువుల ఇంటికి చేరుకున్నాను. నేను ఆటోలో నుంచి పరుగెత్తకపోయుంటే ఏం జరిగుండేదో తలచుకుంటేనే ఏడుపొచ్చింది.

నాకు దేవుడిపైన రెండోసారి కోపమొచ్చిన సందర్భం అది.

భక్తి

ఫొటో సోర్స్, Getty Images

ఇలాంటి ఘటనలు ఎవరికైనా ఎదురవుతాయి, దానికి దేవుడిని ఎందుకు నిందించడం అనిపించొచ్చు. కానీ, నేను ఇష్టపడే దేవుడికి సంబంధించిన సంప్రదాయాల కారణంగానే నేను వివక్ష ఎదుర్కొన్నాను. ఆ కారణంగానే నాకు ఆ పరిస్థితి వచ్చింది.

నాకు పదేళ్ల వయసులో మా నాన్నతో కలిసి శబరిమల వెళ్లే అవకాశం వచ్చింది. నేను చిన్న పిల్లను కావడంతో 10రోజులు మాత్రమే దీక్ష చేయమని నాన్న చెప్పారు. ఆ తరువాత ఇరుమడి కట్టుకొని నాన్నతో కలిసి శబరిమల బయల్దేరాను.

నగరానికి దూరంగా అడవి మధ్యలో చాలా దూరం నడిచిన ఆ రోజుని ఎప్పటికీ మరచిపోలేను. అయ్యప్ప దర్శనం కూడా బాగా జరిగింది.

తిరిగొచ్చాక మా స్నేహితులకు ఆ యాత్రకు సంబంధించిన బోలెడు విశేషాల్ని చెప్పా. కానీ, దీక్ష గుర్తొచ్చినప్పుడల్లా ఆ ఆటోలో వెళ్లిన రోజు కూడా గుర్తొస్తుంది. చాలా ప్రశ్నలు వేధిస్తాయి. అందరినీ ఒకేలా చూసే దేవుడు, మహిళలను ఆ సమయంలో ఎందుకు వేరుగా ఉండమని అడుగుతాడో... అనిపించేది.

తరువాతి ఏడాది నేను మా అన్నతో పోట్లాడా. ‘నువ్వు అయ్యప్ప దీక్ష చేస్తే... నా నెలసరి సమయంలో వెళ్లి ఉండటానికి నువ్వు వేరే ఇల్లు చూసుకో. నేను మాత్రం ఇల్లు వదిలి వెళ్లను. నువ్వే వెళ్లు’ అని గట్టిగా చెప్పా.

కారును అడ్డుకుంటున్న మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శబరిమల వైపు వెళ్లే వాహనాలను మహిళలు అడ్డుకొని అందులో 10-50ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఉన్నారేమోనని తనిఖీలు చేశారు

ఇది జరిగిన చాలా ఏళ్ల తరువాత సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. మహిళందరూ శబరిమలకు వెళ్లొచ్చని కోర్టు చెప్పింది.

ఇప్పుడు మహిళలే రెండు వర్గాలుగా విడిపోయి తమ గొంతు వినిపిస్తున్నారు.

ఇదంతా రాయడానికి ముందు నేను మా అన్నయ్యతో చాలా సేపు మాట్లాడాను. మహిళలను శబరిమలకు ఎందుకు రానివ్వరో వివరిస్తూ అతడు చాలా కారణాలు చెప్పాడు.

దేవుడు మహిళల గురించి ఆలోచించి ఉంటే, 10-50ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఉపవాస దీక్ష సమయాన్ని 15రోజులకు తగ్గించి గుడిలోకి అనుమతించేవాడని నేను అన్నాను. దానికి అతడు సమాధానం చెప్పలేదు.

ఇప్పటివరకూ కోర్టు తీర్పు గురించి నేను ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నా. శబరిమల అయ్యప్ప మా ఇలవేల్పు.

అందుకే మహిళలను ఆలయంలోకి అనుమతించాలా లేదా అనే దానిపై నేను సమాధానం చెప్పలేకపోతున్నా.

మరి ఈ విషయంపై సరైన సమాధానం చెప్పేది ఎవరు?

రేప్పొద్దున్న 10-50ఏళ్ల మధ్య వయసున్న మహిళ ఎవరైనా శబరిమలకు వెళ్లాలనుకుంటే, ఆ నిర్ణయం ఆ మహిళ మాత్రమే తీసుకుంటే సరిపోదు. ఆమె కుటుంబంతో పాటు సమాజం కూడా దాన్ని అంగీకరించాలి.

మరి మన సమాజం దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉందా?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)