శబరిమల: మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు... పలువురి అరెస్ట్... పరిస్థితి ఉద్రిక్తం

- రచయిత, ప్రమీలా కృష్ణన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి.
ఆలయంలో అయ్యప్ప దర్శనం కోసం వస్తున్న మహిళలను ఆందోళనకారులు అడ్డుకుంటుండడంతో పంబ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
అయ్యప్ప ఆలయం తలుపులు తెరిచిన అర్చకులు పూజాధికాలు నిర్వహించారు. భక్తులను దర్శనానికి అనుమతించారు.
అయ్యప్ప దర్శనం కోసం భక్తులు భారీగా వరుసలు కట్టారు.
శబరిమల వైపు వెళ్తున్న మహిళలను బీజేపీ మద్దతుదారులు అడ్డుకుంటుండడంతో పంబ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు.
చాలా మంది నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పంబలో అదనపు బలగాలను మోహరించారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్టు ప్రత్యేక భద్రతాధికారి బీబీసీకి ధృవీకరించారు.
శబరిమల ఆలయంలో మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, కేరళలో ఒక వర్గం మాత్రం ఆ తీర్పు అమలయ్యే దారిలో ఒక అడ్డు గోడ కట్టినట్టు కనిపిస్తోంది.
ఆలయంలోకి మహిళలు ప్రవేశించకుండా నిషేధించడం రాజ్యాంగంలోని సెక్షన్ 14 ఉల్లంఘంచినట్లేనని సుప్రీంకోర్టు చెప్పింది.
రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ సమయంలో రాజ్యాంగం ఎవరిపై, ఎలాంటి భేదభావాలూ చూపకుండా ఆలయంలో పూజ చేయడానికి అనుమతించాలని చెప్పింది.
దేశవ్యాప్తంగా ఎంతోమంది యువతులు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అయ్యప్ప దర్శనం కోసం కేరళ చేరుకుంటున్నారు.

కానీ బీజేపీ మద్దతుతో కొన్ని మహిళా బృందాలు వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్నాయి. శబరిమల ఆలయం వరకూ చేరుకున్న వారిని అడ్డుకుంటున్నాయి. వస్తున్న వాహనాలు కూడా ఆపి తనిఖీలు చేస్తున్నాయి.
గట్టిగా అయ్యప్ప నినాదాలు చేస్తున్న మహిళలు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వాటిలో పది నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలు కనిపిస్తే, వారిని ఆలయం దగ్గరకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
ఆలయం సమీపంలో ఉన్న నీలకల్ గ్రామంలో సుమారు వంద మంది మహిళలు, పురుషులు గుమిగూడారు. మహిళల ఆలయ ప్రవేశానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఆపేదిలేదని అంటున్నారు.

బీజేపీ మద్దతుదారుల ప్రదర్శనలు తీవ్రం
నీలాకల్ గ్రామం సమీపంలో కాషాయ జెండాలు కనిపిస్తున్నాయి. బీజేపీ మద్దతు ఉన్న హిందూ సంస్థలు స్థానిక మహిళలు, పురుషులను తమ వ్యతిరేక ప్రదర్శనల్లో చేర్చుకుంటున్నాయి.
అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కావడం వల్ల నెలసరి వచ్చే మహిళలను ఆలయంలోకి ప్రవేశించడం మంచిది కాదని వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్న మహిళలు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ఆందోళనకారులు పట్టుబడుతున్నారు.
కానీ, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మాత్రం తమ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తుందని, రివ్యూ పిటిషన్ వేయమని ప్రకటించారు.
"మేం ఆలయం వైపు వచ్చే వాహనాలన్నీ చెక్ చేస్తాం, పది నుంచి 50 ఏళ్ల మధ్య ఎవరైనా మహిళలు కనిపిస్తే వారిని ఆలయంలో దర్శనానికి అనుమతించం. ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగాలని మేం భావిస్తున్నాం. ఆలయంలో దర్శనం చేసుకోవాలని అనుకునే యువతులు, వారికి 50 ఏళ్లు వచ్చేవరకూ ఆగాలి" అని ఆందోళనకారుల్లో ఒకరైన లలితమ్మ అన్నారు.
ప్రైవేటు వాహనాల నుంచి ప్రభుత్వ బస్సుల వరకూ అన్నిటింనీ ఆందోళనకారులు దారిలోనే ఆపేస్తున్నారు.

వ్యతిరేక ప్రదర్శనల్లో స్థానికులు
"నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఎప్పుడూ ఈ ఆలయంలోకి వెళ్లలేదు. కానీ మా ఇంట్లోని పురుషులు ఆలయంలోకి వెళ్లారు. ఇక్కడ్నుంచి ఆలయం దగ్గరకు వెళ్లడానికి చాలా దారులున్నాయి. కానీ నేనెప్పుడూ ఆలయంలోకి వెళ్లలేదు. ఎందుకంటే అది ఇక్కడ సంప్రదాయం. యువతులు ఆలయంలోకి వెళ్లకుండా మేం వాహనాలన్నీ ఆపేస్తాం" అని సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్న యువతి నిషా అన్నారు.
యువతులను ఎవరైనా ఆలయంలో ప్రవేశించడానికి అనుమతిస్తే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని కూడా కొంతమంది ఆందోళనకారులు చెబుతున్నారు.
సామూహిక ఆత్మహత్యల హెచ్చరిక
నీలాకల్ గ్రామం దగ్గర ఒక షాపు పెట్టుకున్న జైసన్ తాము ఉంటున్న ప్రాంతం వివాదాస్పదం కావడం, ఆందోళనలు తీవ్రం అవుతుండడంతో కాస్త కంగారు పడుతున్నారు.
"ఇక్కడ చాలా మంది ఆ తీర్పును వ్యతిరేకిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచీ మహిళలకు ఈ ఆలయంలో ప్రవేశించడానికి అనుమతి లేదు. కానీ ఇప్పుడు వారికి అనుమతి ఇచ్చారు. కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు కూడా. ఆలయంలోకి వెళ్లి పూజలు చేయాలనుకుంటున్న భక్తులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని మేం అనుకుంటున్నాం" అన్నారు.

ఫొటో సోర్స్, SABARIMALA.KERALA.GOV.IN
అక్టోబర్ 17న ఆలయం తెరవగానే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు శబరిమల వచ్చి దర్శనం చేసుకోవాలని అనుకున్నారు.
అయితే, మహిళా భక్తులకు ఆలయం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న పంబ వరకూ చేరుకుని వినాయకుడిని పూజించడానికి అనుమతి ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆందోళనకారులు మహిళలను పంబ దాటి రానివ్వడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తల్లీకొడుకులను ఆందోళనకారులు పంబ నుంచి వెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతో పోలీసులు 50 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కానీ భయపడిపోయిన తల్లీకొడుకులు తిరిగి వెనక్కు వెళ్లిపోయారు.
ఆందోళన చేస్తున్న బృందాల అరెస్టులు కొనసాగుతున్నాయి.
ఇటు కేరళ మహిళా కమిషన్‌కు చెందిన ఎ.సి.జోసఫీన్ మహిళలను ఆలయంలోకి వెళ్లడాన్ని అడ్డుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం అని స్థానిక మీడియాకు చెప్పారు. దీనిపై మహిళలు నుంచి వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వంలో రాజీనామాలు ఎందుకు జరగవు?
- ఆరేళ్ల బాలిక జైనబ్‌ను రేప్ చేసి చంపిన వ్యక్తిని ఉరితీసిన పాకిస్తాన్
- #MeToo: ‘సోషల్ మీడియా లేకుంటే నా గోడు ఎవరూ వినేవారు కాదు’
- అమెరికా మధ్యంతర ఎన్నికలు: డోనల్డ్ ట్రంప్ భవిష్యత్తుకు ఇవెంత కీలకం?
- మొఘలుల పాలనలో నవరాత్రి వేడుకలు ఎలా జరిగేవి?
- బీబీసీ సర్వే: 16-24 ఏళ్ళ యువతలో పెరుగుతున్న ఒంటరితనం
- జికా వైరస్: ఎక్కడ పుట్టింది? ఎలా వ్యాపిస్తుంది? దాని నుంచి తప్పించుకోవడం ఎలా?
- #HisChoice: పాపకు తల్లిగా మారిన ఒక తండ్రి కథ
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








