శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల్ని అనుమతించాల్సిందే.. అనుమతించకపోవటం రాజ్యాంగ విరుద్ధం - సుప్రీంకోర్టు తీర్పు

ఫొటో సోర్స్, Getty Images
శబరిమల అయ్యప్ప ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.
ప్రస్తుతం రుతుస్రావం కారణాలతో 10 నుంచి 50 ఏళ్ల వయసు మహిళలకు ఆలయంలో ప్రవేశం నిషేధించారు.
కేవలం రుతుస్రావం కారణాలతోనే మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుందని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది.
వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ పూజ చేసేలా ఆచారాలు, సంప్రదాయాలు తప్పక అనుమతించాలని కోర్టు ఆదేశించింది.
పురాతన ఆచారాలతో కొనసాగేందుకు శబరిమల ఆలయం ఒక మత సంప్రదాయం కాదని జస్టిస్ నారిమన్ చెప్పారు.
ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పుతో న్యాయమూర్తులు నారిమన్, చంద్రచూడ్ ఏకీభవించారు. అయితే, జస్టిస్ ఇందూ మల్హోత్రా వ్యతిరేకించారు.
జీవ సంబంధ కారణాలతో పూజ చేసే హక్కును నిరాకరించలేరని నారిమన్ చెప్పారు.
మహిళలను నిషేధించే ఆచారం రాజ్యాంగ విరుద్ధం అన్నారు.
సమాన హక్కులను ఆస్వాదించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.
నైతికత కేవలం కొందరు పురుషుల అభిప్రాయాలకు లోబడి ఉండకూడదన్నారు.
హక్కు వల్ల అవమానం కలుగుతుందని మహిళకు పూజించే హక్కును నిరాకరించకూడదని స్పష్టం చేశారు.
వ్రతం చేయకూడదంటూ మహిళలను మతపరమైన పూజలకు శతాబ్దాల నుంచీ వేరు చేశారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం.
రుతుచక్రాన్ని మహిళ వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే స్థితిగా చెప్పడం ఒక విధంగా అంటరానితనమే అవుతుంది.
ఈ నియమం పూర్తిగా అవమానకరం అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మత విశ్వాసాల్లో కోర్టు జోక్యం చేసుకోకూడదు’ - జస్టిస్ ఇందూ మల్హోత్రా
కాగా, మరో న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. మత విశ్వాసాల్లో కోర్టు జోక్యం చేసుకోకూడదన్నారు. దానివల్ల ఇతర ధార్మిక క్షేత్రాలపైనా ప్రభావం పడుతుందన్నారు.
ఈ ఆచారాన్ని కొనసాగించాలా వద్దా అనేది మత సమాజాలు చూసుకోవాలని అన్నారు.
లౌకిక ప్రజాస్వామ్యంలో.. అది హేతుబద్ధమైనదైనా, కాకపోయినా ప్రజలు తమ విశ్వాసాలను పాటించాలని అన్నారు.
ఆరాధించేవారి మత ఆచారాలను న్యాయస్థానం ప్రశ్నించలేదని అన్నారు.
శబరిమలలో పూజలు చేయడం అనేది ఒక మత సంప్రదాయమని, దానిని కాపాడాలని తెలిపారు.
ఆచారం ప్రకారం పూజ చేసే హక్కును సమానత్వ సిద్ధాంతం అధిగమించలేదని వెల్లడించారు.
ఈ కేసు ఎవరు వేశారు? ఎందుకు వేశారు?
రుతుస్రావం కారణంగా 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళలు కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై నిషేధం ఉంది. లింగసమానత్వానికి అది విరుద్ధమంటూ 2006లో మహిళా న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
అయ్యప్ప స్వామి 'బ్రహ్మచారి' అని అందుకే ఈ ఆచారాన్ని పాటిస్తూ, పీరియడ్స్ వచ్చే అమ్మాయిలను, మహిళలను ఆలయంలోకి అనుమతించడంలేదని దేవస్థానం అధికారులు గతంలో తెలిపారు.
శబరిమల దేవస్థానం మహిళలపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ 2006లోనే కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై 2016లో విచారణ జరిగింది.
ప్రభుత్వం ఏం చెప్పింది?
అయితే, ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని 2016లో వ్యతిరేకించిన కేరళ ప్రభుత్వం, 2017 నవంబర్‌లో జరిగిన విచారణ సమయంలో మాత్రం ఆ పిటిషనర్లకు మద్దతు తెలిపింది. అన్ని వయసుల మహిళలనూ మందిరంలోకి అనుమతించేందుకు తాము సిద్ధమేనని చెప్పింది.
విశ్వాసాలు, కట్టుబాట్ల పేరుతో మహిళలు వివక్షకు గురిచేస్తున్నారని, పురుషుల్లాగే మహిళలు కూడా ఆలయంలోకి వెళ్లి పూజలు చేసుకునే అనుమతివ్వాల్సిందే అని పిటిషన్ వేసిన లాయర్ల సంఘం ప్రతినిధి ఇందిరా జైసింగ్ అన్నారు.
శబరిమల ఆలయంలోకి మహిళలను నిషేధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందా? లేదా అది "తప్పనిసరిగా పాటించాల్సిన మతపరమైన ఆచారం" కిందకు వస్తుందా? అన్నది పరిశీలించేందుకు 2017లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
శబరిమల ఆలయం ప్రాముఖ్యత ఏంటి?
దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే యాత్రికులు 18 పవిత్ర మెట్ల మీది నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
అత్యంత నిష్ఠతో 41 రోజుల పాటు ఉపవాసం చేయకుండా ఆ 18 మెట్లను దాటలేరని భక్తుల నమ్మకం.
మందిరంలోకి ప్రవేశించేముందు భక్తులు కొన్ని కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఉపవాసం సమయంలో అయ్యప్ప భక్తులు నలుపు రంగు దుస్తులు (మాల) మాత్రమే ధరించాలి, అన్ని రోజులూ గడ్డం చేసుకోకూడదు. రోజూ ఉదయాన్నే చన్నీటితో స్నానం చేసి, పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- 'ప్యాడ్ మ్యాన్’ తెలుసు.. మరి ‘ప్యాడ్ వుమన్’ తెలుసా?
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- #UnseenLives: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా?
- ఈ ఇంజెక్షన్ తీసుకుంటే 3 నెలలు గర్భం రాదు
- #BBCShe విశాఖ: 'పెద్ద మనిషి' అయితే అంత ఆర్భాటం అవసరమా?
- అభిప్రాయం: ప్రకృతి వైపరీత్యానికీ శబరిమల దేవుడికీ ఎలా ముడిపెడతారు?
- ఇష్టపూర్వక వివాహేతర సంబంధం నేరం కాదు : సుప్రీం కోర్టు
- ప్రపంచంలో ‘పవిత్రమైన’ ఏడు మొక్కలు
- యూకేలో ప్రజలకు ఎలాంటి గుర్తింపు కార్డులూ ఉండవు... ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








