జికా వైరస్: ఎక్కడ పుట్టింది? ఎలా వ్యాపిస్తుంది? దాని నుంచి తప్పించుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం జైపూర్‌ను జికా వైరస్ వణికిస్తోంది. దాన్ని అడ్డుకోకపోతే ఇతర ప్రాంతాలకు వైరస్ విస్తరించే ప్రమాదం ఉంది. జికా ఫీవర్‌కు ఇప్పటిదాకా ఎలాంటి మందులూ, వ్యాక్సిన్లూ లేవు. నివారణ ఒక్కటే మార్గం.
ఏడిస్ జాతి దోమల ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది. డెంగీ, చికున్ గన్యాలు కూడా ఈ దోమల ద్వారానే వ్యాపిస్తాయి.
యుగాండాలోని జికా అనే అడవి పేరు ఈ వైరస్‌కు పెట్టారు. మొట్టమొదటగా 1947లో యుగాండాలోని ఆ అడవిలోని కోతుల్లోనే ఈ వైరస్ కనిపించింది. ఆ తరువాత 1952లో మనుషుల్లోనూ వీటిని గుర్తించారు.
జికా వైరస్ సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్లు చర్మం ఎర్రబారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 2-7 రోజుల పాటు ఇవి కొనసాగితే, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించొచ్చు.
గర్భిణుల నుంచి పుట్టబోయే బిడ్డకూ ఇది సంక్రమించవచ్చు. దానివల్ల పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. గర్భస్రావం జరిగే ప్రమాదమూ ఉంది.
రక్త, మూత్ర, లాలాజల పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధరిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
2015లో బ్రెజిల్‌లో అనేక జికా వైరస్ కేసులు బయటపడ్డాయి. భారత్‌లో గుజరాత్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లోనూ ప్రజలు జికా వైరస్ బారిన పడ్డారు.
జికా వైరస్ నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం ఎలాంటి మందులు, వ్యాక్సిన్లు లేవు. దోమల్ని నియంత్రించడమే దీన్నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం.
పొడవాటి, లేత రంగు దుస్తుల్ని ధరించడం, పరిసరాల్లో నీళ్లు నిల్వలేకుండా చూడటం లాంటి కొన్ని చర్యల ద్వారా దోమల్ని నివారించొచ్చు.
ఇవి కూడా చదవండి
- జైపూర్‌లో జికా వైరస్... బాధితురాలికి పుట్టిన బిడ్డ పరిస్థితి ఏమిటి?
- ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిన్నారుల అమ్మకం
- క్వీన్ నేని: ఆమెను గెలవలేక బ్రిటిషర్లు చేతులెత్తేశారు
- చరిత్ర: "నన్ను మీరు మభ్య పెట్టలేరు, నేను ఆయన శరీరంలో 34 బుల్లెట్లు దించాను"
- #MeToo: ‘గుళ్లో దేవతలను పూజిస్తారు, ఇంట్లో మహిళలను వేధిస్తారు’ - మహేష్ భట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









