ఈజిప్ట్ చరిత్ర: "నన్ను మీరు మభ్య పెట్టలేరు, నేను ఆయన శరీరంలో 34 బుల్లెట్లు దించాను"

ఫొటో సోర్స్, ALAIN MINGAM/GAMMA-RAPHO VIA GETTY IMA
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అక్టోబర్ 6, ఈజిఫ్ట్ మాజీ అధ్యక్షుడు అన్వర్ సాదాత్ జీవితంలో చాలా ముఖ్యమైన తేదీ.
ఇజ్రాయెల్ నుంచి ఎన్నోసార్లు ఎదురుదెబ్బలు తిన్న సాదాత్ 1973లో అదే రోజు సూయజ్ కాలువ దాటి మొదటి సారి తన సైనికులను మోహరించారు.
ఆ క్షణం అందుకున్న విజయం ఆయన సైన్యంలో చాలా ఆత్మవిశ్వాసం నింపింది. ఆయన మొదటిసారి ఈజిప్ట్ ప్రజల ముందు తలెత్తుకుని నిలబడగలిగారు.
ఆ తేదీతో ఆయనకు కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. 1973లో అదే రోజు ఆయన తన తమ్ముడిని కోల్పోయారు.
ఆయన సోదరుడు ఈజిఫ్ట్ వైమానిక దళంలో పైలట్‌గా ఉండేవారు. ఇజ్రాయెల్‌పై దాడి జరిపినప్పుడు ఆయన విమానాన్ని కూల్చేశారు.

ఫొటో సోర్స్, ALAIN MINGAM/GAMMA-RAPHO VIA GETTY IMA
ఫీల్డ్ మార్షల్ స్టిక్ మర్చిపోవడం అపశకునం
ఆ రోజు మిగతా రోజుల్లాగే ఉంది. సాదాత్ ఉదయం ఎనిమిదిన్నరకు లేచారు. కాసేపు వ్యాయామం చేశారు. మాలిష్ చేయించుకున్నారు. టిఫిన్ చేసిన తర్వాత స్నానం చేయడానికెళ్లారు.
ఈజిఫ్టు ప్రముఖ జర్నలిస్ట్ మహమ్మద్ హీకాల్ తన ప్రముఖ పుస్తకం 'ఆటమ్ ఆఫ్ ఫ్యూరీ: ద అసాసినేషన్ ఆఫ్ సాదాత్'లో "కొన్ని రోజుల ముందే లండన్‌లోని దర్జీ ఆయనకు ఒక కొత్త సైనిక యూనిఫాం కుట్టించి పంపించారు" అని రాశారు
"సాదాత్ తన కోటు కింద బులెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోలేదనే విషయాన్ని భార్య జెహాన్ గుర్తించారు. అది వేసుకుంటే తన కొత్త యూనిఫాం సరిగా కనిపించదు అని ఆయన ఆమెకు సర్దిచెప్పారు"
ఆమెకు గుర్తొచ్చింది. అంతకు ముందు జెరూసలెం యాత్ర చేసినప్పుడు సాదాత్ బులెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నారు. దానివల్ల ఆయన కాస్త లావుగా కనిపించారు.
"ఆయన పరేడ్ కోసం వెళ్లే ముందు టేబుల్‌పై ఉన్న తన ఫీల్డ్ మార్షల్ స్టిక్ తీసుకోవడం మర్చిపోయారు. తర్వాత అలా మర్చిపోవడం అపశకునం అని జెహాన్ అన్నారు".

ఫొటో సోర్స్, ALAIN MINGAM/GAMMA-RAPHO VIA GETTY IMA
పరేడ్ కవర్ చేస్తున్న బీబీసీ విలేఖరి
అదే సమయంలో బాబ్ జోబిన్స్ కైరోలో బీబీసీ ప్రతినిధిగా పనిచేస్తున్నారు.
ఏ పరేడ్ జరిగినా విలేఖరులు దానిని కవర్ చేయడం సాధారణం. అయినా ఆయన ఆ పరేడ్‌కు వెళ్లారు. ఎందుకంటే తన కొడుకు, అతడి స్నేహితులకు అది చూపించాలని బాబ్ అనుకున్నారు.
"ఆ పరేడ్ కొన్ని గంటలపాటు నడిచింది. ఈజిఫ్ట్ సైన్యం చాలా పెద్దది. అక్కడ కొన్ని వందల ట్యాంకులు, మిసైళ్లు, యుద్ధ ఆయుధాలు ప్రదర్శిస్తున్నారు" అని జోబిన్స్ చెప్పారు.
"అధ్యక్షుడి కోసం పెద్ద పెద్ద అధికారులు, రాయబారులు, ఎంతోమంది సైనికులు ఎండలోనే కూర్చుని ఆ పరేడ్ చూస్తున్నారు".
"కానీ, అలాంటి పరేడ్ ఆనందాన్ని మనతోపాటు మన పిల్లలు ఉన్నప్పుడే ఆస్వాదించగలం".
"అందుకే, నేను అప్పుడు పదేళ్ల వయసులో ఉన్న నా చిన్న కొడుకు, అతడి స్నేహితులను తీసుకుని పరేడ్‌కు వెళ్లాలని అనుకున్నాను".
"ఒక జర్నలిస్టుగా చూస్తే అదంత తెలివైన నిర్ణయమేం కాదు. కానీ పరేడ్ చూస్తే తను చాలా సంతోషిస్తాడనే అనుకున్నా".
"కానీ, పరేడ్ అతడిని వణికిస్తుందని, తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని నేను అనుకోలేదు"

ఫొటో సోర్స్, HULTON ARCHIVE/GETTY IMAGES
కణతపై పిస్టల్ పెట్టి ట్రక్ ఆపేశారు
అన్వర్ సాదాత్ జరిగిన దాడికి ఈజిఫ్ట్ ఆర్మీ లెఫ్టినెంట్ ఖాలెద్ ఇస్లాంబోలీ రింగ్ లీడర్‌గా నిలిచారు.
ఆరోజు ఉదయం 3 గంటలకు లేచిన ఖాలెద్, గోడౌన్ నుంచి నాలుగు మెషిన్ గన్లు తీశారు, వాటిని లోడ్ చేశారు. తనతో ఉన్న అబ్బాస్ మహమ్మద్‌తో ఆ మెషిన్ గన్లకు ఏవైనా గుర్తులు పెట్టమన్నారు.
అబ్బాస్ తుపాకీల గొట్టాలపై గుడ్డ ముక్కలు కట్టి, వాటిని మిగతా మెషిన్ గన్లతో కలిపేశారు.
అన్వర్ సాదాత్ గురించి రాసిన పుస్తకంలో మహమ్మద్ హీకాల్ "ట్రక్ పరేడ్ వేదిక ముందుకు రాగానే ఖాలెద్ హఠాత్తుగా తన పిస్టల్ తీసి డ్రైవర్ కణతపై పెట్టి, ట్రక్ ఆపు అన్నారు" అని రాశారు.
"ట్రక్ డ్రైవర్ బ్రేక్ ఎంత గట్టిగా వేశాడంటే, ఆ ట్రక్ పక్కకు వాలిపోయింది. అది ఆగగానే ఖాలెద్ కిందకు దూకాడు, అక్కడ కలకలం సృష్టించడానికి దూరం నుంచే పరేడ్ వేదికపైకి గ్రెనేడ్ విసిరాడు".
వేగంగా అడుగులు వేస్తూ సాదాత్ వైపు వెళ్లారు. అతడు తనకు సెల్యూట్ చేయడానికి వస్తున్నాడని సాదాత్ అనుకున్నారు. ఆయనకు సెల్యూట్ చేయబోయారు.
ఇంతలో అబ్బాస్ మహమ్మద్ ట్రక్ వెనుక నుంచి అధ్యక్షుడిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు.
అబ్బాస్ తుపాకీ నుంచి వెళ్లిన మొదటి బుల్లెట్ సాదాత్ మెడకు తగిలింది. అధ్యక్షుడి అంగరక్షకులు స్పందించేలోపే అదంతా 30 క్షణాల్లో జరిగిపోయింది.

ఫొటో సోర్స్, MARWAN NAAMANI/AFP/GETTY IMAGES
బెదిరిపోయిన అంగరక్షకులు
బాబ్ జోవిన్స్ కూడా అదే విషయం స్పష్టం చేశారు. సాదాత్ అంగరక్షకుల కాల్పులు జరపడంలో కాస్త ఆలస్యం అయ్యిందన్నారు.
"చాలా మంది సైనికుల దగ్గర ఏ ఆయుధాలూ లేవు. అక్కడ చాలా మందికి అసలు ఏం జరుగుతోందో తెలీడం లేదని నాకు అనిపించింది" అని జోవిన్స్ చెప్పారు.
"సైనికులు సెక్యూరిటీ కోసం తమ ఆటోమేటిక్ ఆయుధాల్లో లైవ్ మేగజీన్లు పెట్టుకోడానికి కూడా అక్కడ అనుమతించలేదు".

ఫొటో సోర్స్, YA"AKOV SA"AR/GPO VIA GETTY IMAGES
కుర్చీలు విసిరి సాదాత్‌ను కాపాడే ప్రయత్నం
ఈజిఫ్ట్ వైమానిక దళ విమానాల ప్రదర్శన తర్వాత ఫిరంగి దళం రావాలి. అప్పుడే ఒక ట్రక్ హఠాత్తుగా పరేడ్ మార్గం నుంచి పక్కకు వచ్చి ఆగింది. అక్కడ స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులందరూ, అది పాడయ్యిందేమో అనుకున్నారు.
"వాళ్లు గాల్లో రెండు గ్రెనేడ్లు విసరడం చూడగానే, వారికి మొదటిసారి అక్కడ ఏదో గందరగోళం జరుగుతోందని అనిపించింది" అని మహమ్మద్ హీకాల్ తన పుస్తకంలో రాశారు.
"మీరు కిందకు వంగండి, అని అరుస్తూ మేం అధ్యక్షుడి వైపు పరిగెత్తాం, కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది" అని సైనికులు తర్వాత విచారణ అధికారులకు చెప్పారు.
ఖాలెద్, అబ్దుల్ సలామ్ ఇద్దరి పొట్టలోకి బుల్లెట్లు వెళ్లాయి. గాయపడినా వాళ్లు పరేడ్ వేదికపైకి కాల్పులు జరుపుతూనే ఉన్నారు.
మాజీ ప్రధానమంత్రి, గతంలో పోలీస్‌గా పనిచేసిన మామదూ సలేమ్ వెంటనే అన్వర్ సాదాత్ ఉన్న దగ్గరికి కుర్చీలు విసిరారు. ఆయనకు బుల్లెట్లు తగలకుండా అవి అడ్డుకుంటాయని అనుకున్నారు.
సాదాత్ పక్కనే కూచున్న ఉపాధ్యక్షుడు హోస్నీ ముబారక్‌కు మాత్రం చిన్న గాయం కూడా కాలేదు. కానీ, సాదాత్ ఎడీసీ జనరల్ హసన్ ఆలమ్, ఆయన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్, బిషప్ శామ్‌విల్ చనిపోయారు.

ఫొటో సోర్స్, GENEVIEVE CHAUVEL/SYGMA/SYGMA VIA GETTY IMAGES
పరేడ్‌కు హాజరైన సాదాత్ భార్య
పరేడ్ వేదికపై కాల్పులు జరుగుతున్నప్పుడు బాబ్ జోవిన్స్ నేలపై పడుకున్నారు.
"నేను నా తలను కిందకు వంచేశాను. కానీ అంత అవసరం లేదనిపించింది. ఎందుకంటే తూటాలన్నీ ప్రధాన వేదిక వైపే దూసుకువెళ్లాయి. చాలా సేపటి వరకూ కాల్పులు జరిగినట్టు అనిపించింది" అని ఆయన చెప్పారు.
అటు, సాదాత్ భార్య జెహాన్ సాదాత్ కూడా పెరేడ్ వేదిక పైన ఉన్న కిటికీలోంచి సైన్యం విన్యాసాలు చూస్తున్నారు.
"కాల్పులు మొదలైనప్పుడు నా బాడీగార్డులు నన్ను పక్కకు నెట్టేశారు. ఎందుకంటే బుల్లెట్లు కిటికీ వైపు వస్తున్నాయి. ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నాను" అని ఆమె బీబీసీకి తెలిపారు.
"సైనికులు ఇది మా డ్యూటీ మేడమ్, మిమ్మల్ని రక్షించడం మా పని అన్నారు. బుల్లెట్లు రావడం ఆగగానే, అక్కడ ఏం జరుగుతోందో చూడ్డానికి నేను కిటికీ వైపు పరిగెత్తాను".
"కానీ అక్కడ ఆయన కనిపించలేదు. తర్వాత నేరుగా ఆస్పత్రికి వెళ్లాను. డాక్టర్లతో నన్ను నా భర్త దగ్గరకు తీసుకెళ్లండి అన్నాను".
"వాళ్లు నాతో మేం మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లలేం అన్నారు. వాళ్లలా చెప్పగానే ఏం జరిగిందో నాకు అర్థమైంది".

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
సాదాత్ మృతిపై హోస్నీ ముబారక్ ప్రకటన
జోవిన్స్ పరేడ్ వేదిక నుంచి తన కారులో బీబీసీ ఆఫీసు వైపు వెళ్తున్నప్పుడు, సాదాత్ సజీవంగా ఉన్నారో, లేదో ఆయనకు తెలీదు.
కానీ కాసేపటి తర్వాత ఈజిఫ్ట్ అప్పటి ఉపాధ్యక్షుడు హోస్నీ ముబారక్ టీవీ, రేడియోలో "ఈజిఫ్ట్, అరబ్ దేశాలు, మొత్తం ప్రపంచానికి ఈ వార్త చెప్పడానికి నా గొంతు వణుకుతోంది. మా హీరో, యోధుడు అయిన అన్వర్-అల్-సాదాత్ ఇక లేరు" అని ప్రకటించారు.
సాదాత్‌ను టార్గెట్ చేయడానికి కారణం
ఒకప్పుడు అరబ్ ప్రపంచంలో హీరోగా నిలిచిన అన్వర్ సాదాత్‌ను 'ఈజిఫ్టియన్ ఇస్లామిక్ జీహాద్' టార్గెట్ చేయడం వెనుక అసలు కారణం ఏమిటి?
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలంయలో ప్రొఫెసర్ ఆఫ్తాబ్ కమాల్ పాషా అన్వర్ సాదాత్‌పై చాలా పరిశోధనలు చేశారు. "పీహెచ్‌డీ చేయడానికి, ఒక రాజకీయ పర్యటన కోసం నేను ఈజిఫ్టులో ఐదేళ్లు ఉన్నాను" అని ఆయన చెప్పారు.
"సాదాత్ హత్య జరిగిన ప్రాంతానికి నేను ఎన్నోసార్లు వెళ్లాను. అక్కడ్నుంచి వెళ్తున్నప్పుడు మొత్తం జరిగినదంతా నా కళ్ల ముందు కనిపించేది" అన్నారు.
ఈజిఫ్టులో 80 శాతం మంది ముస్లింలు, సుమారు 20 శాతం మంది కోప్టిక్ క్రైస్తవులు ఉన్నారు. అక్కడ 1926 నుంచీ 'అఖ్వానుల్ ముస్లిమీన్' అంటే 'ముస్లిం బ్రదర్ హుడ్' గ్రూప్ చురుకుగా ఉంది.
బహుళ పార్టీ వ్యవస్థ ఉన్నప్పుడు కూడా ఈ గ్రూప్ చాలా బలంగా ఉండేది. పాలస్తీనా యుద్ధం జరిగినపుడు, నాసిర్ పాలనా కాలంలో అది చాలా పాపులర్ అయ్యింది.

ఫొటో సోర్స్, MOSHE MILNER/ISRAELI GOVERNMENT PRESS OFFICE/GETTY
నాసిర్ ఆ బృందంపై కఠినంగా ఉండేవారు. ఎందుకంటే ఆయనపై అలెగ్జాండ్రియాలో ఒక దాడి జరిగింది. దాని వెనుక 'అఖ్వానుల్ ముస్లిమీన్' హస్తం ఉందని చెబుతారు.
1955 నుంచి 1970 వరకూ నాసిర్ అధికారంలో ఉన్నంత కాలం ఈ 'అఖ్వానుల్ ముస్లిమీన్' కార్యకర్తలను జైల్లో పెట్టేవారు, లేదంటే చంపేసేవాళ్లు.
సాదాత్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ సంస్థకు సంబంధించిన చాలా మందిని విడుదల చేయించారు. వామపక్షాలను బ్యాలెన్స్ చేయడానికి వాటి మద్దతు కూడా పొందారు.
అదే సంస్థ నుంచి 'ఇస్లామిక్ జీహాద్' అదే గ్రూప్ ఆవిర్భవించింది. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే దాని విధానం.
సాదాత్ ఆ దేశాలకు దగ్గరకావడం వారికి ఇష్టం లేదు. దాంతో ఆ బృందం 1981 అక్టోబర్ 6న ఆయన్ను హత్య చేసింది. అతడంటే తమకు ఎంత ద్వేషమో ప్రపంచానికి చెప్పింది.

ఫొటో సోర్స్, UNIVERSAL HISTORY ARCHIVE/GETTY IMAGES
డెత్ వారెంట్ రాసుకున్న సాదాత్
ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందంపై చేసిన సాదాత్ చేసిన సంతకం, తన డెత్ వారెంట్‌పై స్వయంగా సంతకం చేసినట్లు అయ్యిందని ఆయన భార్య జెహాన్ భావిస్తున్నారు.
"ఇజ్రాయెల్ వెళ్లి వచ్చిన తర్వాత, ఆయన ఎప్పుడూ, ఏదో ఒక సమావేశంలో పాల్గొనేవారు. బయటికి వెళ్తుండేవారు. నాకు మాత్రం ప్రతి సారీ, ఆయన సురక్షితంగా తిరిగొస్తారా, ఎవరైనా ఆయన్ను హత్య చేస్తారేమో అని భయంగా ఉండేది".
"చంపేస్తామని ఎన్నోసార్లు బెదిరింపులు వచ్చాయి. ఆయనకు వాటి గురించి తెలుసు. కానీ, వాటి గురించి నేను మాట్లాడేదాన్ని కాదు. ఎందుకంటే ఆయన ధైర్యం పోగొట్టడం నాకిష్టం లేదు."
సాదాత్ హత్యకు కుట్ర పన్ని, ఆయనపై కాల్పులు జరిపినందుకు ఐదుగురికి మరణ శిక్ష విధించారు.
అరెస్ట్ చేసిన వారిని చాలా ఘోరంగా కొట్టారు. ముఖ్యంగా సాదాత్ మృతదేహం ఉన్న ఆస్పత్రిలోనే ఖాలెద్‌ను ప్రశ్నించారు.
అతడి దగ్గర వివరాలు రాబట్టిన విచారణ అధికారులు మొదట సాదాత్ ఇంకా బతికున్నాడనే చెప్పారు. కానీ ఖాలెద్ వారి ముందు నోరు విప్పలేదు. "నన్ను మీరు మభ్య పెట్టలేరు, నేను ఆయన శరీరంలో 34 బుల్లెట్లు దించాను" అన్నారు.
జెహాన్ సాదత్ ప్రస్తుతం 85 ఏళ్ల వయసులో ఉన్నారు. ఆమెను ఈజిఫ్టులోని ప్రముఖ మానవహక్కుల కార్యకర్తల్లో ఒకరుగా భావిస్తారు.
బాబ్ జోవిన్స్ బీబీసీ ఉద్యోగం వదిలేశారు. తనతోపాటు ఆ పరేడ్ చూడడానికి వచ్చిన ఆయన కొడుకు ప్రస్తుతం ఈజిఫ్టులోనే ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- 'తిత్లీ' తుపానుకు ఆ పేరు పెట్టింది పాకిస్తాన్
- అభిప్రాయం: పండగ సీజన్లో ఆన్లైన్ దుకాణాల జోరు... వీధి మార్కెట్లు బేజారు
- #MeToo: ‘గుళ్లో దేవతలను పూజిస్తారు, ఇంట్లో మహిళలను వేధిస్తారు’ - మహేష్ భట్
- జైపూర్‌లో జికా వైరస్... బాధితురాలికి పుట్టిన బిడ్డ పరిస్థితి ఏమిటి?
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- సోయజ్ రాకెట్లో సాంకేతిక లోపం.. వ్యోమగాములకు తప్పిన ప్రమాదం
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో మరింత పేదరికంలోకి ప్రపంచం: ఐఎంఎఫ్
- జన్యుపరీక్ష: ‘రూ.4వేలతో మీకు ‘గుండెపోటు’ వస్తుందా లేదా ముందే తెలుసుకోవచ్చు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








