అభిప్రాయం: పండగ సీజన్‌లో ఆన్‌లైన్ దుకాణాల జోరు... వీధి మార్కెట్లు బేజారు

ఈకామర్స్ వార్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శిశిర్ సిన్హా
    • హోదా, బీబీసీ కోసం

డిజిటల్ దుకాణాలు మళ్లీ సందడి చేస్తున్నాయి, మొబైల్ డిస్కౌంట్లు, టీవీ సేల్స్, బట్టల ఆఫర్లతో హోరెత్తిస్తున్నాయి.

దసరా జోష్ వచ్చేసింది, పూజలు, హోమాలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. హోమాల్లో పిడకలు కూడా కావాలి. అవెక్కడ దొరుకుతాయి? పక్కన షాపులో ఉంటాయా? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో కనిపిస్తాయా? బహుశా దొరకవేమో..?

డిజిటల్ షాప్ అమెజాన్‌లోకి వెళ్లి సెర్చిలో 'కౌ డంగ్ కేక్' అని కొడితే చాలు... ఆవు పేడతో తయారు చేసిన స్వదేశీ ఆర్గానిక్ పిడకలు మీ ముందుకొస్తాయి. చేతి ముద్రలున్న పిడకల నుంచీ మెషిన్‌తో తయారైన గుండ్రంగా ఉన్న పిడకలు కూడా దొరుకుతాయి. కాస్త రేటెక్కువే అయినా, అద్భుతమైన ప్యాకింగ్‌తో ఇంటికే వస్తాయి.

అయినా, డిజిటల్ షాపుల్లో ఉన్న చాంతాడంత జాబితా కూడా అందర్నీ ఊరిస్తుంది. ఇక డిస్కౌంట్లు, రాయితీలు, ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నప్పుడైతే, ఏదో ఒకటి కొనేద్దాం అనిపిస్తుంది.

పండగల సీజన్ వస్తే ఆ ఉత్సాహం ఇనుమడిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేవ్ వరకూ ఇంటర్నెట్‌లో పెద్ద పెద్ద షాపింగ్ సైట్లన్నీ భారీ ఆఫర్లతో సందడి చేస్తున్నాయి.

ఈకామర్స్ వార్

ఫొటో సోర్స్, Getty Images

ఆన్‌లైన్-ఆఫ్ లైన్ యుద్ధం

అటు మొబైల్ ఫోన్, ఇటు టీవీ, ఇంకో వైపు వాషింగ్ మషిన్, బట్టలు అన్నీ ఒకే చోట దొరికేస్తున్నాయి. దుర్గాదేవి, వినాయకుడి విగ్రహాల నుంచి... జీడిపప్పు, స్వీట్లు కావాలన్నా లభిస్తాయి. అంటే ఇంట్లో కూచునే కావాలనుకున్నది కొనేయచ్చు.

ఇక్కడ మరో విషయం కూడా ఉంది. కొన్ని బ్యాంకుల డెబిట్ కార్డ్ ఉపయోగిస్తే, 'క్యాష్ బ్యాక్' అంటే చెల్లించిన మొత్తంలో కొంత భాగం వాపసు కూడా వస్తుంది. బాగుంది కదా?

అందరికీ బాగానే ఉంటుంది, కానీ ఇటుకలతో కట్టిన షాపుల్లో కూచున్న వ్యాపారులకే అసలు కష్టాలు. ఏడాదిలో ఎక్కువ అమ్మడానికి వాళ్లకు వచ్చిన ఒకే ఒక్క అవకాశం కూడా పాపం దూరమైపోయింది.

వ్యాపారులు ఇప్పటికే బెదిరిపోయి ఉన్నారు. గత కొన్నేళ్లుగా డిజిటల్ షాపులు ఆ కష్టాలు మరింత పెంచాయి. టెక్నాలజీ భాషలో చెప్పాలంటే ఇది ఆన్‌లైన్ వర్సెస్ ఆఫ్‌లైన్ యుద్ధంలా మారిపోయింది.

అయినా భారతదేశంలో వినియోగదారులు ఏవైనా కావాలంటే, చాలా షాపులు తిరిగి, విండో షాపింగ్ ఆనందం ఆస్వాదించి, ఆ వస్తువులను తాకి, బేరసారాలు ఆడిన తర్వాతే కొంటారని అంటారు.

ఆన్ లైన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

వేగంగా పెరుగుతున్న ఈ-కామర్స్

కానీ ఆ ఫీలింగ్ కోసం ఇప్పుడు సంప్రదాయ షాపులకు వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఉదాహరణకు డిజిటల్ షాపింగ్‌ ద్వారా వస్తువులు తెప్పించుకోవచ్చు, తాకి చూడచ్చు, ఆ అనుభూతి పొందచ్చు, నచ్చలేదనుకో, ఏం ఫర్వాలేదు.. తిరిగిచ్చేస్తే, మొత్తం డబ్బు వాపస్, దాని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.

డిజిటల్ షాప్ ఏజెంటు ఇంటికి వచ్చి మరీ అన్నీపూర్తి చేసి తీసుకెళ్తాడు. ఇక క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించకూడదని అనుకున్నా ఫర్వాలేదు, ఇంటికి వచ్చి డబ్బు తీసుకుని వస్తువులు అందిస్తారు.

దుర్గాపూజ నుంచి దీపావళి సీజన్ వరకూ ఏవైనా కొత్త వస్తువులు కొనే సంప్రదాయం ఏళ్ల నుంచీ ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ద్వారా అదే ట్రెండ్ కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈకామర్స్ వార్

ఫొటో సోర్స్, Alamy

అయినా ఏడాదంతా ఈ కంపెనీలు రకరకాల ఆఫర్ల ద్వారా అందరినీ ఊరిస్తుంటాయి. ఇప్పుడు వీటన్నిటి ద్వారా వినియోగదారులు లబ్ధి పొందుతుంటే, ఈ-కామర్స్ మొత్తం పరిశ్రమ పెరుగుతోంది. ఇక ముందు కూడా వేగంగా వృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది.

2017లో 38.5 బిలియన్ డాలర్లు ఉన్న ఈ-కామర్స్ మార్కెట్ 2026లో 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ చెబుతోంది.

ఇక రీటైల్ అమ్మకాల విషయానికి వస్తే ఈ ఏడాది ఇవి 31 శాతం వృద్ధితో 23.7 బిలియన్ డాలర్ల వరకూ చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. డిజిటల్ షాపింగ్ వల్ల జరిగే అమ్మకాలలో సుమారు సగం(48 శాతం) అమ్మకాలతో ఎలక్ట్రానిక్ వస్తువులు( మొబైల్, టీవీ లాంటివి) అగ్ర స్థానంలో ఉన్నాయి. 29 శాతం అమ్మకాలతో బట్టలు రెండో స్థానంలో ఉన్నాయి.

ఇప్పుడు ఇంటర్నెట్ ఉపయోగించేవారి సంఖ్య కూడా 50 కోట్లకు చేరింది. మరో మూడేళ్లలో ఈ సంఖ్య 82 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంటే డిజిటల్ షాపింగ్ చేసే వినియోగదారులు మరింత పెరుగుతారు.

ఈకామర్స్ వార్

ఫొటో సోర్స్, Science Photo Library

సంప్రదాయ దుకాణాల్లో ఆశలు

అయినా, ఇంకొక విషయం ఉంది. సంప్రదాయ దుకాణాల్లో వ్యాపారులు తమ వైపు నుంచి చాలా కష్టపడుతున్నారు. 'ఒకటి కొంటే ఒకటి ఉచితం' అని కొందరు, లక్కీ డ్రాలో బంగారు-వెండి కాయిన్స్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు వరకూ ఇస్తామని మరికొందరు చెబుతుంటారు.

వీటిలో డిస్కౌంట్లు కూడా ఉంటాయి. అందుకే, ఈసారి దీపావళి అయినా చాలా బాగా ఉంటుందని వ్యాపారులు ఆశగా చూస్తున్నారు. కానీ, ఒక వైపు మార్జిన్ ఒత్తిడి, ఇంకో వైపు రాయితీలతో లాభాల కోత.. ఈ వ్యాపారులను వేధిస్తున్నాయి.

అంతేకాదు, సంప్రదాయ దుకాణదారుల నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి. అలాంటప్పుడు డిజిటల్ షాపింగ్‌కు పోటీగా రాయితీలు, లేదా అంతకంటే ఎక్కువ ఆఫర్లు ఇవ్వడం అంత సులభం కాదు. అంటే, సంప్రదాయ వ్యాపారులకు సవాళ్లు పెరిగాయి.

అయితే, సంప్రదాయ వ్యాపారుల ఆశలు సజీవంగా నిలిపే విషయం ఒకటుంది. ఇప్పటికీ దేశంలో 90 శాతం పైగా నగదు లావాదేవీలే జరుగుతున్నాయి. సమాజంలో చాలా ఎక్కువ మంది డిజిటల్ షాపింగ్‌ సమయంలో తమ కార్డు లేదా బ్యాంక్ వివరాలు ఇవ్వడానికి వెనకాడుతున్నారు.

ఈకామర్స్ వార్

ఫొటో సోర్స్, GAURAV

అలాంటి వారి కోసం 'క్యాష్ ఆన్ డెలివరీ' ఉందనేది మరో విషయం. కానీ, వీటన్నిటి ద్వారా మార్కెట్లో షాపింగ్ చేసే ఆ అనుభూతి ఎలా లభిస్తుంది.

'షాపింగ్ వెళ్లాలి' అనే వినియోగదారుల ఆలోచనపై సంప్రదాయ వ్యాపారులు భారీ ఆశలు పెట్టుకుని ఉన్నారు. అలాంటి ఆలోచనలతో, తమ ప్రయత్నాలతో బిగ్ బిలియన్ డేస్ లేదా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌తో పోటీపడగలమని అనుకుంటున్నారు.

ఎవరు ఏం చేసినా, ఇక్కడ వినియోగదారుడే రాజు. అతడి మెప్పు పొందడమే కీలకం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)