#మీటూ: ఏది వేధింపు? ఏది కాదు?

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లైంగిక వేధింపులు మహిళలకు ఎక్కడైనా ఎదురుకావొచ్చు. ప్రస్తుతం భారత్‌లో కొందరు మహిళా పాత్రికేయులు కూడా అలాంటి వేధింపులు తమకూ ఎదురయ్యాయని చెబుతున్నారు. #MeToo... అంటే ‘నేను కూడా’ అన్న హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో మహిళా పాత్రికేయులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

డబుల్ మీనింగ్ జోకులు, బలవంతంగా తాకే ప్రయత్నం చేయడం, సెక్స్ చేయమని కోరడం, జననాంగాల ఫొటోలు పంపించడం... ఇలా ఇతరుల నుంచి తమకు ఎదురైన పరిణామాల గురించి వాళ్లు వివరిస్తున్నారు.

కానీ, ఇప్పటికీ బయటకు రాని మహిళలు చాలామందే ఉన్నారు. తమకు ఎదురైన వేధింపుల గురించి కేవలం తమ స్నేహితులతో మాత్రమే పంచుకుంటున్నారు.

#MeToo లాంటి క్యాంపైన్లు జోరుగా సాగుతున్నప్పటికీ బహిరంగంగా మాట్లాడటానికి భయపడుతూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో అసలు ఏవి లైంగిక వేధింపులు, ఏవి కాదు అనే అంశంపై చర్చ జరుగుతోంది.

సిలోటీ

ఏది వేధింపు?

ఒకే చోట పనిచేస్తున్న ఆడవాళ్లు, మగవాళ్ల మధ్య స్నేహపూర్వక బంధాలు ఏర్పడటం సాధారణం. ఈ క్రమంలో వాళ్ల మధ్య జరిగే సంభాషణలు శ్రుతి మించే అవకాశమూ ఉంటుంది. అలాగని శ్రుతి మించిన ప్రతి మాటా వేధింపు కిందకు వస్తుందని చెప్పలేం.

ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైంది ‘పరస్పర అంగీకారం’. ఇద్దరికీ ఇబ్బంది లేనప్పుడు జోక్స్, పొగడ్తలతో పాటు ‘సెక్సువల్’ భాష వల్ల కూడా ఎలాంటి సమస్యా లేదు. కానీ, మహిళ అభ్యంతరం చెప్పాక కూడా అవతలి వ్యక్తి అలానే వ్యవహరిస్తే అది లైంగిక వేధింపు కిందకే వస్తుంది.

షేక్ హ్యాండ్ ఇవ్వడం, భుజం మీద చేయి వేయడం, పలకరింపుగా కౌగిలించుకోవడం, ఆఫీసు బయట టీ, కాఫీ లేదా మద్యం సేవించడం... అవతలి వ్యక్తికి ఇబ్బంది లేనప్పుడు ఇవేవీ తప్పు కాదు.

కానీ, సోషల్ మీడియాలో #MeToo పేరుతో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేస్తున్న మహిళలంతా, తమకు అవతలి వ్యక్తిని అడ్డుకునే స్వేచ్ఛ లేదని చెబుతున్నారు.

వేధించే వ్యక్తి ఆఫీసులో తమకంటే పై స్థాయిలో ఉన్నవాడైతే, వాళ్లపై ఫిర్యాదులు తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు. అందుకే వారు ధైర్యంగా ‘నో’ చెప్పలేకపోతున్నారు.

ఒక్కోసారి అవతలి వ్యక్తి ఏదైనా చేస్తాడనే భయంతో కూడా మహిళలు మౌనంగా ఉండిపోతున్నారు.

ఆఫీస్

ఫొటో సోర్స్, Getty Images

చట్టం ఏం చెబుతోంది?

పని చేసే చోట లైంగిక వేధింపులను నిరోధించేందుకు 2013లో ఓ చట్టం అమల్లోకి వచ్చింది. అందులో ఏవి లైంగిక వేధింపులో స్పష్టంగా పేర్కొన్నారు.

‘అవతలి వ్యక్తి నుంచి అభ్యంతరం వ్యక్తమైనప్పటికీ... పని చేసే చోట మహిళలను ముట్టుకోవడం, సెక్స్‌ను కోరడం, పోర్నోగ్రఫీ చూపించడం, అసభ్య పదాలను ఉపయోగించడం మొదలైన చర్యలను లైంగిక వేధింపులుగా పరిగణించాలి’ అని ఆ చట్టం చెబుతోంది.

పని చేసే చోటంటే కేవలం ఆఫీసు మాత్రమే కాదు. ఆఫీసు పని కోసం వెళ్లే ఏ చోటైనా అది పని ప్రదేశం కిందకే వస్తుంది. ఈ చట్టం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు వర్తిస్తుంది.

వేధింపులు జరిగాయని ఎవరు నిర్థరిస్తారు?

చట్ట ప్రకారం చూస్తే పది మందికన్నా ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి సంస్థా ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ని ఏర్పాటు చేయాలి. దానికి ఓ సీనియర్ మహిళా ఉద్యోగి నాయకత్వం వహించాలి. అందులో సగానికి పైగా మహిళా సభ్యులుండాలి. మహిళల కోసం పనిచేసే ఏదో ఒక ఎన్జీవో ప్రతినిధికి కూడా అందులో సభ్యత్వం ఉండాలి.

పదిమందికంటే తక్కువ సిబ్బంది ఉన్న సంస్థల్లో ఎవరైనా మహిళా ఉద్యోగి వేధింపులకు గురైతే, జిల్లా స్థాయి ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేయాలి.

తరువాత ఆ కమిటీలే విచారించి, ఆ ఫిర్యాదు నిజమో కాదో తేలుస్తాయి. ఒకవేళ ఫిర్యాదు రుజువైతే అంతర్గతంగా చర్య తీసుకోవాలా లేక పోలీసులకు ఫిర్యాదు చేయాలా అనే విషయాన్నీ కమిటీలే నిర్ణయిస్తాయి.

ఒకవేళ ఫిర్యాదులో పేర్కొనే విషయాలు అబద్ధమైతే, దానిపైన చర్య తీసుకునే అధికారం సంస్థకే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)