ఇస్రో గూఢచర్యం కేసు: పరిహారం కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న క్యాన్సర్ పేషెంట్ శర్మ

ఇస్రో గూఢచర్యం కేసు

ఫొటో సోర్స్, S K SHARMA FAMILY / BBC

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

కన్నీటి సుడుల్లోకి జారిపోతున్న ఓ 62 ఏళ్ల తండ్రిని సముదాయించటానికి.. 26 ఏళ్ల కుమార్తె ఆయన చేయి పట్టుకునే ఉంది.

ఆ తండ్రి పేరు ఎస్.కె. శర్మ. ఆయన కొద్ది గంటల కిందటే ఆస్పత్రిలో అన్నవాహిక క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని వచ్చారు. ఆ క్యాన్సర్ ఇప్పుడు ఆయన వెన్నెముకకు కూడా విస్తరించింది.

శారీరకంగా బలహీనంగా ఉన్నారు. మానసికంగా కుంగిపోయారు. కూతురు మోనిషా ఇంకా నడక నేర్వకముందు, కేరళ పోలీసులు తనను ఇస్రో గూఢచర్యం కేసులో ఎలా పట్టుకెళ్లారో వివరిస్తున్నారు.

ఆ కేసులో పోలీసులు ఆరోపణలు మోపిన ఆరుగురిలో, ఇస్రో శాస్త్రవేత్తలు డాక్టర్ నంబి నారాయణ్, డి.శశికుమరన్, ఇద్దరు మాల్లీవుల మహిళలు, వ్యాపారవేత్త చంద్రశేఖర్‌లతో పాటు శర్మ కూడా ఉన్నారు.

ఇస్రో గూఢచర్యం కేసు

ఫొటో సోర్స్, S K SHARMA FAMILY / BBC

వీరందరికీ సుప్రీంకోర్టు గతంలో క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ కోర్టు గత నెలలో డాక్టర్ నారాయణన్‌కు రూ. 50 లక్షల పరిహారం కూడా ప్రకటించింది.

తన మీద ఆ తప్పుడు కేసు బనాయించకుండా ఉన్నట్లయితే గత 20 ఏళ్లలో నెలకు నాలుగైదు లక్షలు చొప్పున ఆదాయం సంపాదించేవాడినని శర్మ కన్నీటి మధ్య బీబీసీకి వివరించారు.

అయినప్పటికీ.. తన మీద తప్పుడు కేసు పెట్టినందువల్ల జరిగిన నష్టానికి మత్రమే పరిహారం కోరుతున్నారాయన.

ఆ గూఢచర్యం కేసుకు ఎలాంటి ఆధారం లేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) స్పష్టం చేసిన తర్వాత ఆయన కేరళ ప్రభుత్వం నుంచి రూ. 55 లక్షలు పరిహారం కోరారు. అది 1998లో.

ఇస్రో గూఢచర్యం కేసు

ఫొటో సోర్స్, S K SHARMA FAMILY / BBC

అప్పటి నుంచీ తనకు న్యాయం జరుగుతుందని ఆయన నిరీక్షిస్తూనే ఉన్నారు.

''ఈ కేసును విచారించాలని సుప్రీంకోర్టు రెండేళ్ల కిందట దిగువ కోర్టుకు చెప్పింది. అప్పటి నుంచీ ఎటువంటి పురోగతీ లేదు'' అని శర్మ తరఫు న్యాయవాది టోమీ సెబాస్టియన్ బీబీసీకి తెలిపారు.

న్యాయం కోరుతూ శర్మ వేసిన పిటిషన్ మీద 1998 నుంచీ వచ్చిన కదలిక ఇది మాత్రమేనని సెబాస్టియన్ పేర్కొన్నారు.

''బెంగళూరు కోర్టులో కేసు ఫైల్ చేశాం. కేరళ పోలీసులకు రెండు నెలల నోటీస్ పిరియడ్ ఇవ్వనందున.. ఈ కేసును తిరస్కరించాలని వారు తొలుత దరఖాస్తు చేశారు. ఆ తర్వాత బెంగళూరు కోర్టుకు విచారణ పరిధి లేదన్నారు. ఆ రెండు దరఖాస్తులనూ తిరస్కరించారు' అని ఆయన చెప్పారు.

ఇస్రో గూఢచర్యం కేసు

ఫొటో సోర్స్, S K SHARMA FAMILY / BBC

కేరళ పోలీసులు కర్నాటక హైకోర్టుకు అప్పీలు చేశారు. అది దిగువ కోర్టుతో ఏకీభవించింది. ఈ అంశం ఆరేడేళ్ల పాటు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆ తర్వాత ఈ అంశాన్ని దిగువ కోర్టుకు రిఫర్ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

''నేను నా భార్య, ముగ్గురు కూతుళ్లతో సంతోషంగా ఉండేవాడిని. అకస్మాత్తుగా వాళ్లు వచ్చి నన్ను పట్టుకెళ్లారు. నేను చేయని తప్పుకు జైల్లో పెట్టారు. నా పేరుపై మచ్చపడింది. నాకు రెండు కార్లు ఉండేవి. న్యాయవాదులకు ఫీజులు కట్టటానికి, బెంగళూరు - కేరళ మధ్య తిరగటానికి నా భార్య వాటిని అమ్మేసింది'' అని శర్మ వివరించారు.

''నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత స్కూటర్ కొనుక్కున్నాను. నేను బయటకు వెళ్లిన ప్రతిసారీ.. జనం నన్ను ద్వేషిస్తున్నారని నాకు అనిపించేది. నా కూతుళ్లు అవమానాలకు గురయ్యేవారు. అందుకని వారిని స్కూల్ మానిపించాల్సి వచ్చింది'' అని ఆయన కన్నీళ్లతో చెప్పారు.

పోలీసు కస్టడీలో నేరాభియోగాలను అంగీకరింపచేయటం కోసం శర్మ మీద థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించారు. ఇదే కేసులో నిందితులుగా చేర్చిన ఇద్దరు మాల్దీవుల మహిళల్లో ఒకరి కుమార్తెకు.. తనకు తెలిసిన వ్యక్తి ప్రిన్సిపల్‌గా ఉన్న స్కూల్‌లో చేర్పించడానికి సాయం చేసినందుకు ఆయనను అరెస్ట్ చేశారు.

ఇస్రో గూఢచర్యం కేసు

ఫొటో సోర్స్, S K SHARMA FAMILY / BBC

''చంద్రశేఖర్ నా స్నేహితుడు. ఆ స్కూల్లో ఆ చిన్నారికి అడ్మిషన్ ఇప్పించాలని నన్ను కోరాడు. వాళ్లు (కేరళ పోలీసులు) నన్ను అరెస్ట్ చేసినపుడు నాకసలు ఇస్రో అంటే పూర్తి పేరు ఏమిటో కూడా తెలియదు. డాక్టర్ నంబి నారాయణన్ నాకు తెలియదని వారికి చెప్పాను. నేను శారీరకంగా బలంగా ఉండేవాడిని. అందువల్ల వాళ్లు హింసించినా నేను తట్టుకోగలిగాను'' అని శర్మ చెప్పారు.

డాక్టర్ నారాయణన్‌ను తాను తొలిసారి జైలులోనే కలిశానని ఆయన తెలిపారు. ''రెండు వారాల కిందట చంద్రశేఖర్ చనిపోయారు'' అంటూ శర్మ మళ్లీ కన్నీటిపర్యంతమయ్యారు.

చంద్రశేఖర్‌లా కాకుండా.. తనపై వచ్చిన ఆరోపణలన్నిటి నుంచీ సుప్రీంకోర్టు విముక్తి కల్పించటం ఒక్కటే శర్మకు లభించిన ఉపశమనం. గత నెలలో కోర్టు తీర్పు రావటానికి కేవలం అర గంట ముందు చంద్రశేఖర్ కన్నుమూశారు.

''వైద్యానికి అయిన ఖర్చులు చెల్లించటానికి.. కుటుంబానికి ఎంతోకొంత ఇచ్చిపోవటానికి'' పరిహారం కోసం శర్మ నిరీక్షిస్తున్నారు.

''ఇప్పుడు నేను రోజులు లెక్కబెట్టుకుంటున్నాను.. అంతే...'' అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)