మెంగ్ హాంగ్వే నిర్బంధం: ఇంటర్‌పోల్ చీఫ్ లంచం తీసుకున్నారని ప్రకటించిన చైనా

ఫొటో సోర్స్, Getty Images
కొద్దిరోజులుగా సంచలనంగా మారిన ఇంటర్‌పోల్ చీఫ్ మెంగ్ హాంగ్వే నిర్బంధంపై చైనా పెదవి విప్పింది. లంచాలు తీసుకున్నందుకే ఆయన్ను నిర్బంధించామని చైనా ప్రకటించింది.
సెప్టెంబరు చివరి వారంలో ఫ్రాన్స్‌లోని ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయం నుంచి చైనా బయలుదేరిన ఆయన ఆ తరువాత కనిపించకుండాపోయారు. ఆయన భార్య ఫ్రాన్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కనిపించకుండా పోయిన రోజునే ఆయన కత్తి ఎమోజీని తనకు మెసేజ్ చేశారని భార్య తెలిపారు. దీంతో ఆయన ప్రమాదంలో ఉన్నట్లు గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించారు.
చైనాలో అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా జరుపుతున్న విచారణల్లో ఇటీవల లక్ష్యంగా చేసుకున్నవారిలో హాంగ్వేను పెద్ద తలకాయగా చెప్పుకోవాలి.
చైనా జాతీయుడైన ఆయన సొంత దేశంలోనూ కీలక పదవిలో ఉన్నారు. అక్కడ ప్రజాభద్రతా విభాగంలో వైస్ మినిస్టర్ హోదాలో ఉన్నారాయన.
హాంగ్వేపై దర్యాప్తుకు సంబంధించి చేసిన ప్రకటనలో చైనా భద్రతా మంత్రిత్వ శాఖ.. 'ఈ విచారణ సరైనదే. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రభుత్వం కొనసాగిస్తున్న అవినీతి వ్యతిరేక కార్యక్రమ నిబద్ధతకు ఇది గీటురాయి' అని పేర్కొంది.
మెంగ్ హాంగ్వే అదృశ్యమైన సంగతి బయట ప్రపంచానికి తెలిశాక ఆయన్ను చైనాయే నిర్బంధించిందన్న ఊహాగానాలు వెలువడ్డాయి. చైనాలో ఇటీవల కాలంలో చాలామంది అధికారులు, సంపన్నులు, ప్రముఖులు ఇలానే కనిపించకుండాపోయారు.
జులైలో కనిపించకుండా పోయిన నటి ఫాన్ బింగ్‌బింగ్ గతవారం బయటకొచ్చి పన్నుల ఎగవేత, ఇతర నేరాలకు పాల్పడినట్లుగా అంగీకరిస్తూ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆమెకు సుమారు 12.9 కోట్ల డాలర్ల జరిమానా విధించింది చైనా ప్రభుత్వం.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటర్‌పోల్ ఏమంటోంది..?
మెంగ్ హాంగ్వే తన పదవికి రాజీనామా చేసినట్లు ఇంటర్‌పోల్ ఆదివారం(2018, అక్టోబరు 7) ట్విటర్‌లో వెల్లడించింది.
దీంతో ఆయన స్థానంలో దక్షిణ కొరియా దేశస్థుడైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ యాంగ్‌ను యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది.
వచ్చే నెలలో దుబయిలో నిర్వహించనున్న ఇంటర్‌పోల్ సర్వసభ్య సమావేశంలో కొత్త ప్రెసిడెంట్‌ను ఎన్నుకోనున్నట్లు ఇంటర్‌పోల్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, AFP
హాంగ్వే భార్య ఏమంటున్నారు?
తాజా పరిణామాల నేపథ్యంలో ఫ్రెంచ్ ప్రభుత్వం హాంగ్వే భార్య గ్రేస్ మెంగ్‌కు గట్టి భద్రత కల్పించింది.
హాంగ్వే తమ నిర్బంధంలో ఉన్నట్లు చైనా ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త ప్రమాదంలో ఉన్నారని అన్నారు. ఆయన ఆచూకీ కనుగొని రక్షించడానికి ప్రపంచ దేశాల సహాయాన్ని అర్థించారు.
తాను కూడా ప్రమాదంలో ఉండడతో తననెవరూ గుర్తించడానికి వీల్లేకుండా మీడియా కెమేరాలకు ఆమె ముఖం చూపించలేదు. వెనక్కు తిరిగి మాట్లాడి వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, AFP
హాంగ్వేకు పోలీసింగ్‌లో నలభయ్యేళ్ల అనుభవం
ఇంటర్‌పోల్ ప్రెసిడెంట్‌గా 2016 నవంబరులో ఎన్నికైన మెంగ్ హాంగ్వేకు చైనాలో క్రిమినల్ జస్టిస్, పోలీసింగ్‌లో 40 ఏళ్ల అనుభవం ఉంది.
ఈ పదవికి ఎన్నికైన తొలి చైనీయుడు హాంగ్వేనే. ఈ పదవిలోకి రాకముందు ఆయన చైనాలో మాదకద్రవ్యాల నిరోధం, ఉగ్రవాద నిరోధం, సరిహద్దు భద్రత విషయాల్లో కీలకంగా పనిచేశారు.
అయితే, ఆయన ఈ పదవికి ఎన్నికైన తరువాత మానవ హక్కుల సంస్థలు ఒకింత ఆందోళన వ్యక్తంచేశాయి. ఆయన్ను అడ్డంపెట్టుకుని చైనా.. దేశాంతరంలో ఉంటూ తన ప్రభుత్వంపై నిరసన గళం వినిపించేవారిని వేటాడేలా ఆయనపై ఒత్తిడి పెంచే ప్రమాదం ఉందని మానవ హక్కుల సంస్థలు అప్పట్లో ఘోషించాయి.

ఫొటో సోర్స్, Getty Images
చైనాపై ఎలాంటి ప్రభావం పడనుంది?
హాంగ్వే చట్టాలను అతిక్రమించడంతో ఆయనపై దర్యాప్తు చేస్తున్నామని చైనాలోని అవినీతి నిరోధక సంస్థ 'నేషనల్ సూపర్‌విజన్ కమిషన్' చెబుతోంది.
అయితే, పార్టీ నియమాలను ఉల్లంఘించారని మాత్రం హాంగ్వే విషయంలో చైనా చెప్పలేదు. సాధారణంగా అత్యున్నత స్థాయుల్లో ఉన్నవారిని నిర్బంధించినప్పుడు ఈ అభియోగం కూడా ఉంటుంది.
పార్టీ అధినాయకత్వంతో పొసగని మరో సీనియర్ నేతతో ఉన్న సత్సంబంధాల కారణంగానూ హాంగ్వేను నిర్బంధంలోకి తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం హాంగ్వే విషయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇకముందు చైనా అధికారులను కీలక స్థానాల్లో నియమించేందుకు వెనుకాడేలా చేయొచ్చన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతతం ఐరాస, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల్లో చైనీయులు కీలక స్థానాల్లో ఉన్నారు.
అయితే, బీజింగ్‌లోని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు చెందిన టామ్ రాఫర్టీ తాజా పరిణామాలపై మాట్లాడుతూ.. భవిష్యత్ నియామకాలపై హాంగ్వే విషయంలో చోటుచేసుకున్న పరిణామాలేవీ ప్రభావం చూపకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా చైనా ఇమేజ్‌కు ఇదేమీ నష్టదాయకం కాదనీ టామ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








