ఇంటర్‌పోల్ చీఫ్‌ అదృశ్యం వెనుక అసలు కారణాలేంటి? ఆయన్ను చైనా కిడ్నాప్ చేసిందా?

మెంగ్

ఫొటో సోర్స్, Getty Images

ఇంటర్‌పోల్ అధ్యక్షుడు మెంగ్ హాంగ్వే అదృశ్యం సంచలనంగా మారింది. దీనిపై ఫ్రాన్స్ దర్యాప్తు ప్రారంభించింది.

సెప్టెంబరు 25న ఆయన ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలోని ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయం నుంచి చైనాకు బయలుదేరి వెళ్లిన తరువాత కుటుంబసభ్యులతోనూ మాట్లాడలేదని అధికారులు తెలిపారు.

ఆయన ఫ్రాన్స్‌లో అదృశ్యం కాలేదని ఈ దర్యాప్తు జరుపుతున్న బృందం ద్వారా తెలిసిందని ఏఎఫ్‌ఫీ వార్తాసంస్థ తెలిపింది. మెంగ్‌ను ప్రశ్నించడం కోసం చైనాకు తీసుకెళ్లినట్లుగా 'ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' తన కథనంలో రాసింది.

చైనా ఎందుకు ఆయన్ను ప్రశ్నించాలనుకుంటుందన్న విషయంలోనూ స్పష్టత లేదని హాంగ్‌కాంగ్‌కు చెందిన పత్రికలు రాశాయి.

ఫ్రాన్స్ ఏం చెబుతోంది?

తన భర్త అదృశ్యంపై మెంగ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై దర్యాప్తు మొదలైంది. సెప్టెంబరు 29 నుంచి ఆయన నుంచి సమాచారం లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే, సెప్టెంబరు 29 కాదని.. 25 నుంచే ఆయన నుంచి సమాచారం లేదని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఆ తరువాత స్పష్టత ఇచ్చారు.

చైనా అధికారులతో దీనిపై సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

ఇంటర్‌పోల్ అధ్యక్షుడి పరిస్థితిపై, ఆయన భార్యకు బెదిరింపులు రావడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన అంతకుమించి ఏమీ చెప్పలేమన్నారు.

ఇంటర్‌పోల్ ఏమంటోంది?

మొత్తం ఇంటర్‌పోల్ వ్యవస్థకు సూచనలు అందించే, మార్గదర్శనం చేసే ఎక్జిక్యూటివ్ కమిటీని అధ్యక్షుడిగా మెంగ్ నడిపిస్తారని.. 2020 వరకు ఆయన పదవీ కాలం ఉందని ఇంటర్‌పోల్ వర్గాలు చెబుతున్నాయి.

ఆయన ఈ పదవికి ఎన్నిక కాకముందు చైనాలో ప్రజాభద్రతా విభాగానికి ఇంఛార్జిగా ఉండేవారు.

దేశాంతరంలో ఉంటూ తన ప్రభుత్వంపై నిరసన గళం వినిపించేవారిని వేటాడేలా చైనా ఆయనపై ఒత్తిడి పెంచే ప్రమాదం ఉందన్న ఆందోళనను ఆయన ఎన్నిక అనంతరం మానవ హక్కుల సంఘాలు వ్యక్తంచేశాయి.

మెంగ్ చైనాకు కోపం తెప్పించారా?

చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ అధికారుల అదృశ్యం ఘటనలకు మెంగ్ కనిపించకపోవడానికి కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. సాధారణంగా చైనాలో ఎవరినైనా నిర్బంధంలోకి తీసుకునేటప్పుడు వారు హఠాత్తుగా కనిపించకుండా పోతారు. ఆ తరువాత పార్టీ.. 'ఆయన దర్యాప్తులో ఉన్నారు' అని చెబుతూ ఒక ప్రకటన విడుదల చేస్తుంది. ఆ తరువాత క్రమశిక్షణ చర్యల పేరిట ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపిస్తారు. చివరకు ఆయన్న జైలులో వేస్తారు.

జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన తరువాత 2012 నుంచి ఇప్పటివరకు సుమారు 10 లక్షల మందిని ఏదో రకంగా ఇలాగే జైలుకు పంపించారు.

ఈ పరిణామాలపై బీబీసీ ఆసియా ఎడిటర్ సెలియా హాటన్ మాట్లాడుతూ.. ''మెంగ్ విషయానికొస్తే ఆయన కనిపించకుండాపోయిన కొద్దిరోజులకు భార్య ఫ్రాన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనిపించకుండాపోయిన కమ్యూనిస్ట్ పార్టీ అధికారుల భార్యలు అరుదుగా ఇలా చేస్తారు. చాలా తీవ్రమైన శిక్ష విధిస్తారన్న భయం ఉంటే తప్ప వారు ఇలా చేయరు. చైనా కారణంగానే ఆయన కనిపించకుండా పోయినట్లయితే అందుకు కారణమెవరు? అంతర్జాతీయ స్థాయిలో ఇంత కీలక పదవిని వదులుకుని వెళ్లడానికి కారణమేంటి? అనేది తెలియాల్సి ఉంది'' అన్నారు.

కాగా, మెంగ్ అదృశ్యం వ్యవహారంపై వివరణ ఇవ్వాలని చైనాను ఇంటర్‌పోల్ కోరింది. ఈ మేరకు సెక్రటరీ జనరల్ జుర్గెన్ స్టాక్ పేరిట ఒక ప్రకటనను ఇంటర్‌పోల్ వెబ్‌సైట్‌ ప్రచురించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)