భారత్‌కు ఎస్-400: ‘ఇంతకన్నా మెరుగైన గగనతల రక్షణ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు’

ఎస్-400

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రజనీష్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రష్యా తయారీ ఎస్-400 ట్రిమ్ఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసేందుకు భారత్ సన్నాహాలు పూర్తి చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో రెండు దేశాలూ ఈ ఒప్పందంపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.

భారత్-రష్యా మధ్య జరగనున్న ఈ ఒప్పందం అమెరికా ఆగ్రహానికి కూడా కారణమయ్యింది. భారత్-అమెరికా మధ్య జరిగిన 'టూ-ప్లస్-టూ' సమావేశాల్లో జరిగిన చర్చలు ప్రధానంగా ఈ ఒప్పందం చుట్టూనే తిరిగాయి.

రష్యా-భారత్ మధ్య ఈ రక్షణ ఒప్పందం జరగడం అమెరికాకు ఇష్టం లేదు

గత నెల సెప్టెంబర్ 6న న్యూ దిల్లీలో జరిగిన 'టూ-ప్లస్-టూ' సమావేశాల్లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, అమెరికా రక్షణ మంత్రి జిమ్ మేటిస్‌తో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చర్చలు జరిపారు.

రష్యాతో ఈ ఒప్పందం జరిగితే.. అమెరికా భారత్‌పై ఆర్థిక ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

అయినా, రష్యా నుంచి ఐదు ఎస్-400లు కొనుగోలు చేయాలనుకుంటున్న భారత్ ఈ ఒప్పందాన్ని ఆఖరి దశకు తీసుకువచ్చింది.

ఎస్-400

ఫొటో సోర్స్, Getty Images

సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్

ఎస్-400ను ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా భావిస్తారు. ఇది శత్రువుల క్షిపణి దాడులను అడ్డుకుంటుంది.

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు ముందే నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ ఒప్పందంపై చర్చించారని రష్యా ప్రభుత్వ సమాచార సంస్థ స్పుత్నిక్ తెలిపింది.

5 బిలియన్ డాలర్లకు పైగా వ్యయంతో రష్యా నుంచి ఐదు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలుకు మంత్రి మండలి సమావేశంలో ఆమోదముద్ర వేశారని చెప్పింది.

2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని ఆరోపించిన అమెరికా ఆ దేశానికి వ్యతిరేకంగా 2017 ఆగస్టులో 'కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీజ్ త్రూ శాంక్షన్స్ యాక్ట్'(సీఏఏటీఎస్ఏ) చట్టం అమలు చేసింది.

సీఏఏటీఎస్ఏ 2018 జనవరి నుంచి అమలులో ఉంది. కానీ రష్యాతో ఉన్న సుదీర్ఘ సంబంధాల దృష్ట్యా ఈ చట్టం నుంచి తమను మినహాయించాలని భారత్ డిమాండ్ చేస్తోంది.

అమెరికా చేసిన ఈ చట్టం రష్యాతో ఆయుధ ఒప్పందాలు చేసుకునే దేశాలన్నింటినీ అడ్డుకుంటుంది.

కానీ, అమెరికా ఇటీవలే 'యూఎస్ నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్'(ఎన్‌డీఏఏ) కూడా తీసుకొచ్చింది. దీని ప్రకారం రష్యాతో సుదీర్ఘ కాలం నుంచీ సంబంధాలున్న దేశాలకు సీఏఏటీఎస్ఏ నుంచి మినహాయింపు లభిస్తుంది.

ఎస్-400

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా ఆగ్రహం

ఎన్‌డీఏఏ ప్రకారం రక్షణ ఒప్పందం 1.5 కోట్ల డాలర్లకు పైగా ఉండకూడదు.

కానీ ఎస్-400 ట్రిమ్ఫ్ ఒప్పందం ఎన్‌డీఏఏ పరిధిని దాటింది. ఒక అంచనా ప్రకారం ఈ ఒప్పందం విలువ 5.5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే.

రష్యా 1960 దశకం నుంచి భారత్‌కు అతిపెద్ద రక్షణ ఉత్పత్తుల సరఫరాదారుగా ఉంది.

స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం 2012 నుంచి 2016 మధ్య భారత్ మొత్తం రక్షణ దిగుమతుల్లో 68 శాతం రష్యా నుంచే జరిగాయి.

సుదూర గగనతల రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఎస్-400 చాలా అవసరం అని భారత్ చాలాకాలం నుంచీ భావిస్తోంది.

2016లో కూడా ఎస్-400 కొనుగోలుపై రష్యాతో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అక్టోబర్ 4, 5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగే చర్చల్లో ఇవి కొలిక్కి రావచ్చు.

ఈ ఒప్పందానికి అమెరికా ఆంక్షలు అడ్డం కాకూడదని కూడా భారత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎస్-400

ఫొటో సోర్స్, Getty Images

అయితే, రష్యా నుంచి భారత్ ఎన్ని ఎస్-400 కొనుగోలు చేయబోతోంది అనేది ఇప్పటివరకూ స్పష్టం కాలేదు.

"రష్యా సైన్యంలో ఒక ఎస్-400ను రెండు బెటాలియన్లకు పంచుతారు. దానిని రెండు బ్యాటరీల ద్వారా విభజిస్తారు" అని 'ద డిప్లొమేట్' మేగజీన్ సీనియర్ ఎడిటర్ ఫ్రాన్స్-స్టీఫెన్ గైడీ తెలిపారు.

ఎస్-400 ఒక బ్యాటరీని 12 ట్రాన్స్‌పోర్టర్ ఇరెక్టర్ లాంచ్సర్స్‌తో తయారు చేస్తారు. దీనిని నాలుగు, ఎనిమిదితో కూడా చేస్తారు. అన్ని బ్యాటరీల్లో ఒక ఫైర్ కంట్రోల్ రాడార్ సిస్టమ్ ఉంటుంది. దానితోపాటు ఒక అదనపు రాడార్ సిస్టమ్, ఒక్కో కమాండ్ పోస్ట్ కూడా ఉంటుంది.

ఎస్-400తో క్షిపణిని ధ్వంసం చేసే సామర్థ్యం గతంలో కంటే రెండున్నర రెట్లు పెరిగింది. దీంతో ఒకేసారి 36 ప్రాంతాల్లో గురి పెట్టవచ్చు. అంతే కాదు, దీన్లో స్టాండ్-ఆఫ్ జామర్, ఎయిర్ క్రాఫ్ట్, ఎయర్ బోర్న్ వార్నింగ్, కంట్రోల్ సిస్టమ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉన్నాయి. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ఇది మధ్యలోనే ధ్వంసం చేయగలదు అని గైడీ తెలిపారు.

ఎస్-400 రోడ్ మొబైల్‌గా ఉంటుంది. ఆదేశాలు అందగానే 5 నుంచి 10 నిమిషాల్లో దీనిని మోహరించవచ్చు అని చెబుతున్నారు. అమెరికా తయారుచేసిన అత్యున్నత డిఫెన్స్ సిస్టమ్ 'టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్'(టీహెచ్ఎఎడి), ఎంఐఎం-104 కంటే ఎస్-400లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ఎస్-400

ఫొటో సోర్స్, Getty Images

ఆధునిక టెక్నాలజీతో లాంచ్

ఎస్-400లో వర్టికల్ లాంచింగ్ సిస్టమ్ ఉంటుంది. దీనిని నేవీలోని మొబైల్ ప్లాట్‌ఫాం నుంచి ప్రయోగిస్తారు. దీన్లో సింగిల్ స్టేజ్ ఎస్ఎఎం ఉంటుంది. దీని అంచనా లక్ష్యం 150 కిలోమీటర్లు. భారత్‌ అత్యాధునిక ఎస్-400 కొనుగోలు చేస్తుందని భావిస్తున్నారు. వీటిలో అత్యున్నత స్థాయి ఎస్ఎఎం, 40N6E ఉన్నాయి.

ప్రధానంగా ఎస్-400లో 40N6E అనేది ఒక బలమైన భాగం. అది దీని సామర్థ్యాన్ని మరింత పెచుతుంది. ఎస్-400ను తయారు చేసే కంపెనీ అల్మాజ్-ఎంత్యే గ్రూప్ 40N6E అత్యున్నత రేంజ్ 400 కిలోమీటర్లు అని చెబుతోంది. ఇది 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న తన లక్ష్యాన్ని ఛేదించగలదు" అంటోంది.

అయితే రష్యా-భారత్ మధ్య ఈ ఒప్పందం ఖరారైతే.. ఎప్పటిలోగా ఎస్-400 భారత్‌కు చేరుకుంటాయి అనేది ఇంకా స్పష్టం కాలేదు. రక్షణ విశ్లేషకులు మాత్రం ఎస్-400 కొనుగోలు వల్ల భారత సైన్యం మరింత బలోపేతం అవుతుందని చెబుతున్నారు.

"రష్యా ఎస్-400 ట్రిమ్ఫ్‌ను చైనాకు ఎప్పుడో అందించింది. అప్పటి నుంచీ భారత్ వీటిని కొనేందుకు రష్యాతో ఒప్పందం చేసుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన ఒప్పందం. భారత్ వీటిని దక్కించుకోవడం కోసం అమెరికా భయానికి లొంగదనే అనిపిస్తోంది" అని ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్‌కు చెందిన లక్ష్మణ్ కుమార్ బెహరా తెలిపారు.

ఎస్-400

ఫొటో సోర్స్, Getty Images

రూపాయి-రూబుల్ స్నేహం

భారతీయ సైన్యం విషయానికి వస్తే ఇది చాలా కీలకమైన ఒప్పందం అని రక్షణ నిపుణులు రాహుల్ బేడీ చెప్పారు.

"భారత్‌కు ఎస్-400 అందితే, అమెరికాకు కోపం రావడం సహజమే. రష్యా నుంచి ఎస్-400 కొనుగోలు చేసినప్పుడు, అది చైనాపై కూడా ఆంక్షలు విధించింది. ఈ విషయంలో భారత్‌కు అమెరికా మినహాయింపు ఇస్తుంది అనిపించడం లేదు. ఆ ఆంక్షల వల్ల చైనాపై పెద్దగా ప్రభావం పడలేదు. కానీ భారత్‌పై ఆ ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది" అని బేడీ అన్నారు.

భారత్ సైన్యం అమ్ములపొదిలో ఎస్-400 చేరితే, పాకిస్తాన్‌లో ఆందోళన పెరుగుతుందా?

ఈ ప్రశ్నకు జవాబుగా "పాకిస్తాన్‌కు ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. ఎస్-400 వచ్చాక భారత్, పాకిస్తాన్‌ భారం మరింత పెరుగుతుంది" అని బేడీ తెలిపారు.

"నిజానికి భారత్ అమెరికా నుంచి ఆయుధాలు కొనడం ప్రారంభించగానే, రష్యా-పాక్ రక్షణ సంబంధాలు మెరుగవడం మొదలైంది. అలాంటి సమయంలో రష్యా ఆ దేశానికి ఎస్-400 ఇస్తుందేమో అని భారత్‌లో భయం ఉంటుంది".

అందుకే పాకిస్తాన్‌కు ఎస్-400 అమ్మకూడదని భారత్ ఈ ఒప్పందంలో రష్యాకు షరతులు కూడా విధిస్తుంది అని బేడీ చెప్పారు.

"పాకిస్తాన్‌కు రష్యా ఎస్-400 ఇవ్వకపోతే, దానికి ఇక వేరే ప్రత్యామ్నాయం ఉండదు. దానికి పోటీగా అమెరికా, యూరప్ ఏదైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్‌కు ఇస్తాయని నాకు అనిపించడం లేదు. అయినా, పాకిస్తాన్ దగ్గర వాటిని కొనేంత డబ్బు కూడా లేదు".

"భారత్-రష్యాపై అమెరికా ఒత్తిడి ఇప్పుడు పెద్దగా పనిచేయదు. ఎందుకంటే ఈ రెండు దేశాలు గత రెండు మూడు నెలలుగా రూపాయి, రూబుల్‌ ట్రేడ్ ప్రారంభించాయి. 1960 దశకంలో సోవియట్ యూనియన్‌తో భారత్ అలా చేసేది. ఈ ఒప్పందం కోసం సెప్టెంబర్‌లో నాలుగు కోట్ల డాలర్లను అందించారు" అని బేడీ వివరించారు.

ఎస్-400

ఫొటో సోర్స్, Getty Images

టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఉండదు

రష్యాతో జరిగే ఒప్పందంలో టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, అంటే 30 శాతం ఆఫ్‌సెట్ పార్ట్‌నర్ లాంటి అంశాలు ఉండవు.

"టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ లాంటి వాటి వల్ల డెలివరీ ఆలస్యం అవుతుంది, ధర కూడా పెరిగిపోతుందని రష్యా చెబుతోంది" అని రాహుల్ బేడీ తెలిపారు.

"ఎస్-400 ఒక సమర్థమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ప్రపంచంలో ఇప్పుడు దీనికంటే మెరుగైన ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఎక్కడా లేదు" అన్నారు.

భారత్-రష్యా మధ్య ఈ ఒప్పందాన్ని అడ్డుకోడానికి అమెరికాకు చాలా కారణాలు ఉన్నాయని రష్యా ప్రభుత్వ సమాచార సంస్థ స్పుత్నిక్ ఒక రిపోర్టులో తెలిపింది.

రక్షణ విశ్లేషకులతో మాట్లాడిన స్పుత్నిక్ "భారత్‌కు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందితే, తన మిత్ర దేశాలైన కతర్, సౌదీ, టర్కీ కూడా రష్యా నుంచి వాటి కోసం సంప్రదింపులు జరుపుతాయని అమెరికా భావిస్తుంది, ఆ ప్రభావం తమ ఆయుధ వ్యాపారంపై పడుతుందని అనుకుంటుందని" తెలిపింది.

స్పుత్నిక్ రిపోర్ట్ ప్రకారం "భారత్ ఎస్-400 దక్కించుకుంటే పాకిస్తాన్, చైనా బలంపై కూడా ఆ ప్రభావం పడుతుంది.

ఈ డిఫెన్స్ సిస్టం వల్ల పాకిస్తాన్ గగనతల దాడులను, ముఖ్యంగా యుద్ధ విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్ల ప్రమాదాన్ని అడ్డుకోవచ్చు. ఎందుకంటే దీని ట్రాకింగ్ రేంజ్ 600 కిలోమీటర్లు వరకూ ఉంటుంది.

ఎస్-400కు 400 కిలోమీటర్ల వరకూ ధ్వంసం చేసే సామర్థ్యం ఉంటుంది. కేవలం మూడు ఎస్-400లు ఉంటే చాలు పాక్ సరిహద్దులన్నిటినీ భారత్ ఒక కంట కనిపెట్టచ్చు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)