అసోం ఎన్ఆర్‌సీ జాబితా: త్రిశంకు స్వర్గంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వలసదారులు

అసోంలో ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదలై దాదాపు రెండు నెలలు కావస్తోంది. ఈ జాబితాలో పేర్లు లేని వేల మంది తమ భవిష్యత్తు గురించి తల్లడిల్లుతున్నారు. ముస్లింల కంటే హిందువులే పౌరసత్వం విషయంలో మరింత అనిశ్చితిలో ఉన్నట్లు ఇప్పుడు స్పష్టమవుతోంది.
అక్రమ వలసదారుల్లో ఎక్కువ మంది ముస్లింలేనని చెబుతున్న బీజేపీకి ఇది ఇబ్బంది కలిగిస్తుందా? బీబీసీ ప్రతినిధి ఫైసల్ మహ్మద్ అలీ అందిస్తున్న కథనం.
భారత్-మియన్మార్ సరిహద్దులో సైనాకీ గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన లోఖీ గట్వర్ అనే మహిళ పేరు ఎన్ఆర్సీ జాబితాలో లేదు.
‘‘నా పేరు ఎన్ఆర్సీ జాబితాలో లేదు. రేషన్ కార్డు, పాన్ కార్డు ఉన్నాయి. నా ఓటరు కార్డు నేను పని చేసే యజమాని వద్ద ఉంది’’ అని ఆమె చెప్తున్నారు.
సావిత్రి గట్వర్ అనే మరో మహిళ కూడా ‘‘దుమ్కా నుంచి మా తాత ఇక్కడకు వచ్చారు. గతంలో నా పేరు ఓటర్ల జాబితాలో ఉండేది. ఇక్కడకు వచ్చిన తరువాత దాన్ని తొలగించారు’’ అని తెలిపారు.
బ్రిటిష్ పాలనలో అసోం టీ తోటల్లో పని చేసేందుకు... జార్ఖండ్, ఛత్తీస్‌గడ్ నుంచి గిరిజనులను తీసుకొచ్చారు. 1862 తరువాత వచ్చిన వారి వారసుల్లో వేలాది మంది పేర్లు ఎన్‌ఆర్‌సీ జాబితాలో లేవు.
'గ్రో మోర్ ఫుడ్' ఉద్యమం సమయంలో బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి వ్యవసాయ కూలీలుగా అసోంకు వచ్చిన ప్రజల పేర్లు కూడా ఎన్‌ఆర్‌సీలో కనిపించడం లేదు.
పౌరసత్వ జాబితాలో పేర్లు లేని వారిలో బెంగాలీ హిందువులు కూడా ఉన్నారు.

ఎన్ఆర్సీ రెండో ముసాయిదా విడుదలైన తరువాత కూడా, 40 లక్షల మంది అక్రమంగా ఉన్నట్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అంటున్నారు. అయితే NRCలో పేరు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తామని కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ హామీ ఇచ్చారు.
మరోవైపు పేర్లు లేని హిందువులు ఆందోళనపడనక్కర్లేదని బీజేపీ సీనియర్ నాయకుడు అంటున్నారు.
అయితే కొందరు మాత్రం పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన ఏ హిందువుకైనా పౌరసత్వం ఇవ్వాలని ఆ బిల్లు చెబుతోంది.
‘‘హిందువులు కావొచ్చు. ముస్లింలు కావొచ్చు. బీజేపీకి నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు. కానీ వలసదారులు ఉండటానికి లేదనేది అస్సామీల మనోగతం’’ అని ప్రంతిక్ పత్రిక ఎడిటర్ ప్రదీప్ బారువా పేర్కొన్నారు.

ఇక్కడ మతప్రాతిపదిక రాజకీయాలకు గల అవరోధాలను బీజేపీ గుర్తించిందని దిబ్రుగర్ యూనివర్సిటీకి చెందిన కౌస్తుబ్ దేకా అంటున్నారు. అందువల్ల మూల అస్సామీలకు ప్రత్యేక హక్కులు ఇవ్వాలన్న ఆలోచనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది.
‘‘ఆ దిశగా ప్రయత్నం అయితే జరుగుతోంది. ముస్లింలు ఎక్కువగా ఉన్నారని చెప్పడానికి అవకాశాలు పెద్దగా లేనందువల్ల, మూల అస్సామీలకు ప్రత్యేక హక్కులు కల్పించే మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది’’ దిబ్రుగర్ యూనివర్సిటీకి చెందిన కౌస్తుబ్ దేకా చెప్పారు.
అక్రమ వలసదారుల్లో ఎక్కువ మంది ఓ వర్గానికి చెందిన వారే అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం విజయవంతం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
అయితే చెద పురుగుల మాదిరిగా కోట్లాది అక్రమ వలసదారులు దేశాన్ని తింటున్నారన్న అమిత్ షా మాటలు మరోచోట పని చేయొచ్చు.
ఇవి కూడా చదవండి:
- గాంధీజీ 150వ జయంతి: మహాత్ముడి గురించి ఆయన వారసులు ఏమంటున్నారు?
- అసోం: అనుమానిత ఓటరు జాబితాలో కార్గిల్ యుద్ధ సైనికులు.. పౌరసత్వంపై ప్రశ్నలు
- అస్సాం: భారతీయులుగా నిరూపించుకునేందుకు పోరాటం
- అస్సాం: ‘అడవుల్ని ఆక్రమిస్తున్న టీ తోటలు’.. మనుషుల్ని చంపుతున్న ఏనుగులు
- బిగ్ బాస్-2: ’’ఈక్వల్ గేమ్ ఎలా అవుతుంది‘‘- బాబు గోగినేని
- చరిత్ర: బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యహంకారం’.. కళ్లకు కడుతున్న ఫొటోలు
- పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు... 32 ఏళ్లుగా బాధను భరిస్తూనే ఉన్నాను
- బిగ్ బాస్: పోటీదారులను ఎలా ఎంపిక చేస్తారు? నిబంధనలేంటి?
- #HisChoice: ‘నేను మగ సెక్స్ వర్కర్‌ను... శరీరంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే...’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









