#MeToo: మీడియా ప్రపంచంలో లైంగిక వేధింపులపై గొంతెత్తిన మహిళా జర్నలిస్టులు

జర్నలిస్టుల మీ టూ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"నా మీద జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడ్డానికి నేనేమీ సిగ్గుపడను. నిజానికి, బాహాటంగా మాట్లాడడం ద్వారానే సిగ్గుపడాల్సిన అవసరం లేదనే భావన కలుగుతుంది. అది నా తప్పు కానే కాదని చెప్పుకున్నట్లవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా, నన్ను వేధించిన వ్యక్తిని నలుగురి ముందూ నిలబెట్టినట్లవుతుంది."

అనూ భుయాన్... 'ది వైర్' న్యూస్ వెబ్ సైట్ రిపోర్టర్. తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో రాస్తున్న మహిళల్లో ఆమె ఒకరు.

లైంగిక వేధింపులు అంటే... వద్దని చెబుతున్నా తాకడం, లైంగిక సుఖం కావాలని అడగడం, అసభ్య వ్యాఖ్యలు చేయడం, పోర్నోగ్రఫీ చూపించడం లేదా ప్రత్యక్ష లేదా పరోక్ష లైంగిక అనుచిత ప్రవర్తన.

ఇవన్నీ భారత్‌లో సర్వసాధారణమై పోయాయి. ఎంతో మంది మహిళలు వ్యక్తిగత స్థాయిలో లేదా పని చేసే ప్రదేశాల్లో ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. చాలా మంది మహిళలు ఇప్పుడు ధైర్యంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పడానికి ముందుకు వస్తున్నారు. శుక్రవారం సోషల్ మీడియాలో #MeToo పేరుతో వచ్చిన ట్వీట్స్ వెల్లువ చూస్తే అది అర్థమవుతుంది.

నటి తనుశ్రీ దత్తా నానా పటేకర్‌పై ఆరోపణలు, కామిక్ ఆర్టిస్ట్ ఉత్సవ్ చక్రవర్తి లైంగిక వేధింపులపై ఎంతోమంది మహిళలు మాట్లాడిన తర్వాత ఇలాంటి ఎన్నో గొంతులు సోషల్ మీడియాలో బలంగా వినిపించాయి.

తనుశ్రీ దత్తా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నటి తనుశ్రీ దత్తా

జర్నలిజంలో వినిపించిన గొంతుకలు

వీరిలో చాలా గొంతులు మీడియా ప్రపంచం నుంచే వినిపించాయి. ఎంతో మంది మహిళలు ఆ పురుషులు ఎవరో చెప్పారు. మరికొందరు వారి పేర్లు చెప్పకుండా రాశారు.

వీటిలో కొన్ని పోస్టులు పని చేసే ప్రాంతాల్లో తమ అనుమతి లేకుండా ఎదుర్కున్న సెక్సువల్ ప్రవర్తన గురించి ఉంటే, మరికొన్ని లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని, ఇంకొన్ని పోర్నోగ్రఫీ చూపించడం గురించి చెప్పాయి.

చాలా మంది తమతోపాటు పనిచేసే పురుషులు లేదా బాస్‌ తప్పుడు ప్రవర్తన గురించి ప్రస్తావించారు.

వీటిలో ఒక లాంటి కోపం కనిపించింది. ఊగిసలాట కూడా ఉంది. జంకూగొంకూ లేకుండా తమ మాటను చెప్పగలిగే ధైర్యం కూడా బయటపడింది.

బిజినెస్ స్టాండర్డ్స్ వార్తాపత్రిక విలేఖరి మయాంక్ జైన్ పేరు చెబుతూ అను, అతడు తనతో సెక్స్ చేయాలని కోరినట్లు చెబుతూ ట్వీట్ చేశారు. ఎందుకంటే, ఆయనకు "అను అలాంటి అమ్మాయి అనిపించింది". అందుకే అను తను నిజంగానే అలాంటి దానినా అని ఆలోచిస్తూ ఉండిపోయింది.

అను అలా రాసిన తర్వాత ఫెమినిజం ఇన్ ఇండియా పేరుతో ఉన్న వెబ్‌సైట్ నడిపే జప్లీన్ పస్రిచాతోపాటు చాలా మంది మహిళలు జైన్‌ గత కొంతకాలంగా తమతో ఎలా ప్రవర్తించారనేదానిపై చాలా ఆరోపణలు చేశారు.

ఇటు ఆన్‌లైన్ న్యూస్ వెబ్‌సైట్ స్క్రోల్ తన ఒక కథనంలో "మయాంక్ ఆమెతోపాటు పనిచేస్తున్న సమయంలో ఆయనపై లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేసినట్టు చెప్పింది. ఫిర్యాదుదారు అధికారిక ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించుకుంది. దాంతో మయాంక్‌కు లిఖిత హెచ్చరిక ఇచ్చి వదిలేశారు" అని తెలిపింది.

బీబీసీ ఈ ఆరోపణల గురించి బిజినెస్ స్టాండర్డ్ నుంచి స్పందన అడిగినపుడు, వారు "ఈ విషయం గురించి మేం ఎప్పుడు మాట్లాడాలో, అప్పుడు అందరూ మాట్లాడుతారు" అని చెప్పారు.

మీ టూ

ఫొటో సోర్స్, AFP

ఆఫీసుల్లో వేధింపులు

బీబీసీతో మాట్లాడిన జప్లీన్ పస్రీచా తన అనుభవం గురించి ట్వీట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎందుకంటే ఈ విషయంపై మాట్లాడుతున్న మిగతా మహిళలకు అండగా నిలబడడం అవసరం అన్నారు.

ఆమె "నేను రెండేళ్లుగా ఏం ఫర్వాలేదులే, ఒక మాటే కదా అనుకుంటూ వచ్చా. కానీ, అందరూ మాట్లాడ్డం మొదలు పెట్టినపుడు, ఇలా ఎంతమంది మహిళలకు జరిగిందనే విషయం తెలిసింది. #MeToo ఆ నిశ్శబ్దం బ్రేక్ చేసేందుకు, వాటిని వెలుగులోకి తెచ్చేందుకే ఉంది" అన్నారు.

ఆమెరికాలో సుమారు ఏడాది క్రితం #MeToo ఉద్యమం ప్రారంభమైంది. అక్కడ సుప్రీంకోర్టులో జడ్జి పదవి కోసం పరుగులో ఉన్న బ్రెట్ కావెనాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. జర్మనీలో ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి.

అదే సమయంలో కొన్ని గొంతులు మినహా భారత్‌లో లైంగిక వేధింపులపై నిశ్శబ్దమే కొనసాగింది. అది కూడా వీటికి వ్యతిరేకంగా భారత్‌లో చట్టం తీసుకొచ్చినప్పుడు జరిగింది.

2012లో జ్యోతి సింగ్‌పై జరిగిన సామూహిక అత్యాచారం తర్వాత లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చేసిన చట్టాన్ని మరింత విస్తృతం చేశారు. అందులో లైంగిక వేధింపుల కోసం మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా జోడించారు.

పని చేస్తున్న ప్రాంతాల్లో లైంగిక వేధింపుల కోసం 1997లో రూపొందించిన మార్గనిర్దేశాలకు 2013లో చట్ట రూపం ఇచ్చారు. దాని ప్రకారం సంస్థలకు ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేసే బాధ్యతలు అప్పగించారు.

ఈ చట్టం ప్రకారం ఒక సంస్థలో లైంగిక వేధింపులపై ఫిర్యాదు వస్తే, ఆ సంస్థకు ఒక ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. దానికి ఒక మహిళ అధ్యక్షత వహించాలి. అందులో సగానికి పైగా మహిళా సభ్యులు ఉండాలి. లైంగిక వేధింపుల అంశంపై పనిచేస్తున్న ఏదైనా బయటి ప్రభుత్వేతర సంస్థ ఒక ప్రతినిధి కూడా ఆ కమిటీలో ఉండాలి.

ఇలాంటి ఎన్నో కమిటీల్లో బయటి ప్రతినిధిగా ఉన్న ఫెమినిస్ట్ లక్ష్మీ మూర్తి చెప్పిన దాని ప్రకారం ఈ చట్టం చాలా కీలకమైనది. ఎందుకంటే ఇది మహిళలు తాము పనిచేస్తున్న ప్రాంతంలోనే ఉన్న అపరాధికి ఏదో ఒక శిక్ష వేయించే మార్గం అందిస్తుంది.

అంటే, జైలు, పోలీసులు అనే కఠిన మార్గాల నుంచి వెళ్లకుండా భిన్నమైన న్యాయం కోసం ఒక మధ్యే మార్గాన్ని తెరవాలి.

మీ టూ

ఫొటో సోర్స్, Getty Images

శిక్ష పాత నిర్వచనం మారుతోంది.

కానీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న జర్నలిస్టులు ఈ కమిటీల మార్గం అంత ప్రభావం చూపించడం లేదని చెబుతున్నారు.

సంధ్యా మెనన్ పదేళ్ల ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు చెందిన కేఆర్ శ్రీనివాస్ గురించి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అతడిపై ఫిర్యాదు చేసినప్పుడు, కమిటీ ఆయనను 'పట్టించుకోవద్దని' తనకు సలహా ఇచ్చిందని చెప్పారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఆ ఆరోపణల గురించి విచారిస్తున్నామని చెప్పింది. అయితే, వారి కమిటీ తీరు గురించి బీబీసీ అడిగిన ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదు. అటు జర్నలిస్ట్ కేఆర్ శ్రీనివాస్ తన ట్వీట్‌లో ఈ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.

బీబీసీతో మాట్లాడిన సంధ్యా మెనన్ "నాకు ఆ సమయంలో చాలా ఒంటరిగా అనిపించింది. కొన్ని నెలల తర్వాత ఆయన ఉద్యోగం కూడా వదిలేశారు. కానీ గత కొన్నేళ్లుగా నేను ఆ వ్యక్తికి వ్యతిరేకంగా అలాంటి ఎన్నో ఆరోపణలు విన్నాను. ఇక నేను దాని గురించి రాయాలి అని నిర్ణయించుకున్నాను" అన్నారు.

శిక్ష అనే పాత నిర్వచనం ఇప్పుడు పూర్తిగా మారుతోంది. మహిళలు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. అదే స్ఫూర్తితో మాట్లాడుతున్నారు.

"ఈ కమిటీల ద్వారా న్యాయం లభించడానికి చాలా సమయం పడుతుంది. గత కొన్ని ఘటనల్లో సంస్థలు మహిళ పట్ల తరచూ సున్నితంగా వ్యవహరించకపోవడాన్ని మేం చూశాం. అలాంటప్పుడు ఒక వ్యక్తి తప్పుడు ప్రవర్తన గురించి బహిరంగంగా హెచ్చరించడం మెరుగైన మార్గమే కావచ్చు" అన్నారు.

మీ టూ

వీటివల్ల ఏం లభిస్తుంది?

ఎన్ని సంస్థలు ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేశాయి, అనే దాని గురించి ఎవరూ ఎలాంటి వివరాలూ బహిర్గతం చేయడం లేదు.

కమిటీలు ఏర్పాటు చేసిన చోట ఎన్నో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. విచారణ కమిటీ ఏర్పాటు అనేది సంస్థ బాధ్యత, దాని సభ్యులను కూడా అదే ఎన్నుకుంటుంది. అలాంటప్పుడు ఈ ప్రక్రియపై సంస్థ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ప్రతి కమిటీ పక్షపాత ధోరణితో వ్యవహిస్తుందని చెప్పలేం. కానీ, ఫిర్యాదు ఎవరైనా ప్రముఖ వ్యక్తి మీద ఉంటే, ఆ మహిళపై ఒత్తిడి వాతావరణం ఉన్నట్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తిగత అనుభవాలను పోస్ట్ చేసి ఏం సాధిస్తాం?

"అలా చేయడం వల్ల సంస్థలు తమ దగ్గర పనిచేస్తున్న పురుషుల నుంచి మెరుగైన ప్రవర్తన ఆశించాలని అర్థం చేసుకుంటాయి. అలా జరగకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది" అని సంధ్య చెప్పారు.

'ది న్యూస్ మినిట్' వెబ్‌సైట్ ఎడిటర్, ధన్యా రాజేంద్రన్ బీబీసీతో "గత కొన్నేళ్లుగా మహిళా జర్నలిస్టులు ఇలాంటి అనుభవాల గురించి తమలో తామే పంచుకుంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రారంభమైన ఈ చర్చ తర్వాత కొంత మంది అలాంటి విషయాలను బహిర్గతం చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నారు" అన్నారు.

"ఇప్పుడు ఈ విషయాలు బయటికొస్తే, ఇలా జరగడం తప్పు, వీటిని ఆపడానికి ఏదో ఒకటి చేయాలి అని సంస్థలు అర్థం చేసుకుంటాయి. ఇది ప్రారంభం మాత్రమే. మహిళలకు కార్యాలయాల్లో మెరుగైన వాతావరణం కల్పించే దిశగా ఇది తొలి అడుగు" అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)