'డోలీలో గర్భిణి' కథనానికి స్పందన.. కొండ కింద హెల్త్ సెంటర్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సాలూరు మండలంలో గర్భిణిని డోలీలో తీసుకెళ్తుండగా ఆమె మార్గమధ్యలో ప్రసవించిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. అక్కడ కొండ కింద ఓ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
గర్భిణిని డోలీలో తీసుకురావడం.. ఆమె మార్గమధ్యలో ప్రసవించిన వార్తను ఇటీవల బీబీసీ తెలుగు అందించింది. ఈ ఘటనపై అధికారులు స్పందించారు.
కొండ కింద ప్రాంతంలో ఒక 'ఆరోగ్య కేంద్రాన్ని' ఏర్పాటు చేసి, కొండ మీద ఉండే గ్రామాల గర్భిణులను తొమ్మిదో నెల ఆరంభంలోనే ఇక్కడకు తీసుకొస్తామని పార్వతీపురం ఐటీడీఏ అధికారి లక్ష్మీషా బీబీసీ తెలుగుకు తెలిపారు.
అసలు ఏం జరిగింది?
సాలూరు మండలంలో కొదమ పంచాయతీ ఎం. చింతలవలస అనే గిరిజన గ్రామానికి చెందిన మహిళ పురిటి నొప్పులు పడుతున్నప్పుడు ఆమెను డోలీలో కూర్చోపెట్టుకొని కొండ కింద 12 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు గ్రామస్థులు బయల్దేరారు.
ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో దారి లోనే కాన్పు చేయాల్సి వచ్చింది. అదే గ్రామానికి చెందిన సూరి ఇదంతా వీడియో తీసి వారి కష్టాలను బయటి ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో కాన్పు తర్వాత బొడ్డు తాడును రాతితో కోయడం కూడా కనిపించింది.

ఫొటో సోర్స్, Suraiah
ఈ ఘటనపై ఐటీడీఏ అధికారి లక్ష్మీషా బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ- ''మేము పాఠం నేర్చుకున్నాం. ఈ ఆరోగ్య కేంద్రాన్ని సెప్టెంబర్ 17న ప్రారంభించాం. గర్భిణుల ఇబ్బందులను తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. కొండపైన ఉండే గ్రామాలకు రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. గర్భిణులు సౌకర్యవంతంగా ఉండాలనేదే మా ఉద్దేశం'' అని చెప్పారు.

ఈ హెల్త్ సెంటర్ను సాలూరులో యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ గాలి వెలుతురు వచ్చే విధంగా ఒక కామన్ రూమ్‌లో 30 పడకల గది, ఒక వంట గది, సరిపడా టాయిలెట్లు, స్నానగదులు ఏర్పాటు చేశామని ఐటీడీఏ అధికారి తెలిపారు.

వారికి ఎల్లపుడూ సహాయంగా ఉండేందుకు ఇద్దరు ఆశా వర్కర్లను నియమించారు. ఇప్పటి వరకు ఈ సౌకర్యాన్ని 23 మంది గిరిజన మహిళలు ఉపయోగించుకున్నారని, అందులో ఏడుగురికి కాన్పు జరిగి ఇంటికి వెళ్లిపోయారని ఆయన వివరించారు.
రోడ్డు సౌకర్యం లేని కొండ ప్రాంతాల్లోని గర్భిణులను గుర్తించి వారిని ఈ హెల్త్ శిబిరాలకు తీసుకొచ్చే బాధ్యతను ఐటీడీఏ ఆశా వర్కర్లకు అప్పగించింది.
ఇవి కూడా చదవండి:
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- భారత్లో షాడో బ్యాంకింగ్ సంక్షోభం.. రూ.88504 కోట్ల అప్పుల్లో ఐఎల్ఎఫ్ఎస్
- ఆస్ట్రేలియా గనిలో అద్భుతం: రెండు రాళ్లలో 100 కిలోలకుపైగా బంగారం
- ఏలియన్స్ ఉన్నాయా? లేవా?: అన్వేషణకు నాసా భారీ టెలిస్కోప్
- టీమిండియాను ఉత్సాహపరిచే అభిమాన 'సైన్యం' భారత్ ఆర్మీ
- C/o కంచరపాలెం: తెలుగు సినిమా ఎదుగుతోంది
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
- ’టాటూ లేని వారిని అంటరానివారిగా చూస్తారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









