గదిని చల్లబరిచే ఏసీలు ప్రమాదకరంగా మారతాయా? ప్రాణాలు తీస్తాయా?

ఏసీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, వికాస్ త్రివేది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈనెల ఒకటో తేదీ రాత్రి చెన్నైకి చెందిన దంపతులు, ఎనిమిదేళ్ల బాలుడు ఇంట్లో ఏసీ వేసుకుని నిద్రపోయారు. అయితే, తెల్లవారేసరికి ఆ ముగ్గురూ గదిలోనే చనిపోయి ఉన్నారు.

పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం, ఏసీ నుంచి వెలువడిన విషవాయు కారణంగానే వాళ్లు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ రోజు రాత్రి కరెంటు లేకపోవడంతో ఇన్వర్టర్‌‌తో ఏసీని ఆన్ చేసి వాళ్లు నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో కరెంట్ వచ్చింది. అప్పుడు ఏసీ చెడిపోయి విషవాయువు విడుదలవ్వడంతో వాళ్లు చనిపోయారు.

ఇలా ఏసీ వల్ల ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఏసీ కంప్రెసర్ పేలడంతో మరణించిన ఘటనలు ఉన్నాయి. ఏసీల నుంచి విష వాయువులు వెలువడటంతో కార్యాలయాల్లో సిబ్బంది ఊపిరాడక ఇబ్బందులుపడ్డ సందర్భాలూ ఉన్నాయి.

మరి గదిని చల్లబరిచే ఈ యంత్రాలు ప్రమాదకరంగా మారడానికి కారణాలేంటి? ఈ ప్రమాదాలను నివారించేందుకు ఇళ్లలో, కార్యాలయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వీడియో క్యాప్షన్, వీడియో: ఏసీల ప్రమాదాలను నివారించేందుకు ఏం చేయాలి?

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్‌ఈ)లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేస్తున్న అవికల్ సోమవంశి బీబీసీతో మాట్లాడుతూ...

"ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త తరం ఏసీల్లో, రిఫ్రిజిరేటర్లలో చాలా తక్కువ ప్రమాదకరమైన R-290 గ్యాస్ వాడుతున్నారు. భారత్‌లో ఎక్కువగా వినియోగంలో ఉన్నది ఈ గ్యాసే. పాతరకం ఏసీలలో R-12 (క్లోరో ఫ్లోరో కార్బన్స్) వినియోగించేవారు. దాని వల్ల ఓజోన్ పొర దెబ్బతినే ప్రమాదం కూడా ఉండేది. దానికి ముగింపు పలికేందుకు దాదాపు 15 ఏళ్లు పట్టింది. ఆ తర్వాత R-21 (హైడ్రో క్లోరో ఫ్లోరో కార్బన్స్) వినియోగంలోకి వచ్చింది. ఇప్పుడు దాని వాడకమూ తగ్గుతోంది" అని వివరించారు.

"మరోవైపు పరిశుద్ధమైన గ్యాస్‌‌ వాడే ఎయిర్ కండిషనర్ల తయారీని కూడా కొన్ని కంపెనీలు ప్రారంభించాయి. అలాగే, సహజ వాయువును వాడే ఏసీల తయారీ దిశగానూ ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని సోమవంశి చెప్పారు.

ఏసీలు

ఫొటో సోర్స్, BBC/vikas

"క్లోరో ఫ్లోరో కార్బన్స్ ప్రభావం శరీరంపై నేరుగా పడదు. కానీ, అది లీకై గాలిలో కలవడం ప్రమాదకరం, దాని వల్ల శ్వాసకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది" అని దిల్లీకి చెందిన ఓ ప్రైవేటు వైద్యుడు తెలిపారు.

"ఏసీల నుంచి గ్యాస్ లీకవ్వడం వల్ల తలనొప్పి వస్తోందన్న ఫిర్యాదులు చూస్తుంటాం. కానీ, చనిపోయిన ఘటనలు మాత్రం చాలా తక్కువే" అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ చెబుతోంది.

ఏసీ నుంచి గ్యాస్ లీకేజీని గ్రహించడం కష్టమైన పని. ఎందుకంటే, ఆ గ్యాస్‌కు ప్రత్యేకమైన వాసనేమీ ఉండదు. కానీ, ఏసీని తరచూ పరిశీలిస్తుండటం ద్వారా గ్యాస్ లీకయ్యే అవకాశం ఉందేమో గుర్తించవచ్చు.

  • ఏసీ సరిగ్గా ఫిట్‌ చేసి ఉందో లేదో చూడాలి.
  • పైపులు సరిగా ఉన్నాయా? పగిలిపోయాయా? చూసుకోవాలి.
  • పాత ఏసీ ట్యూబులు తుప్పు పట్టకుండా చూడాలి.
  • గదిని ఏసీ సరిగా చల్లబరుస్తోందా లేదా పరిశీలించాలి.
ఏసీలు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి గుర్తుంచుకోండి

  • ఏడాదికోసారి ఏసీ సర్వీస్ చేయించాలి.
  • నమ్మకమైన సర్టిఫైడ్ మెకానిక్‌తోనే సర్వీస్ చేయించాలి.
  • రోజుకు కనీసం ఒక్కసారైనా గది కిటికీలు, తలుపులు తెరవాలి.
  • గ్యాస్ నాణ్యతనూ పరిశీలిస్తూ ఉండాలి.
  • నాసిరకం గ్యాస్ వల్ల సమస్యలు రావచ్చు.
  • గ్యాస్ వెళ్లే పైపులు సరిగా పనిచేస్తుండాలి.
  • విండో ఏసీ కంటే స్ప్లిట్ ఏసీ వైపు మొగ్గుచూపాలి.
ఏసీ, కార్టూన్

ఉష్ణోగ్రత ఎంత ఉండాలి?

ఎండలో తిరిగి ఇంట్లోకి రాగానే చాలామంది రిమోట్ అందుకుని ఏసీ ఉష్ణోగ్రతను 18 డిగ్రీలకు తగ్గిస్తుంటారు.

సీఎస్‌ఈ ప్రకారం, అలా చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఉష్ణోగ్రత 25 నుంచి 26 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి. మధ్యాహ్నం పూట కంటే రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు.

అలా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడంతో పాటు కరెంట్ బిల్లు కూడా తగ్గించుకోవచ్చు.

"ఏసీలో ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెంచడం వల్ల 6 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతను 21 డిగ్రీలకు బదులు 24 డిగ్రీలకు సెట్ చేయడం వల్ల 18 శాతం విద్యుత్ ఆదా అవుతుంది" అని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ కొన్ని నెలల క్రితం చెప్పారు.

ఏసీల్లో ఉష్ణోగ్రత చైనాలో 26 డిగ్రీలు, జపాన్‌‌లో 28 , హాంగ్‌కాంగ్‌లో 25.5, బ్రిటన్‌లో 24 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంచాలని అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించాయి. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయా దేశాలు ఇలా నిర్ణయం తీసుకున్నాయి.

భారత్‌లో వినియోగించే ఏసీలలో ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌ దగ్గర ఉంటే బాగుంటుందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)