అద్దెకు సమాధులు: ఆస్ట్రేలియాలోని వివాదాస్పద చట్టంపై సమీక్ష

స్మశానం

ఫొటో సోర్స్, AFP

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌లో సమాధి స్థలాలను లీజుకిచ్చే వీలు కల్పిస్తున్న వివాదాస్పద చట్టాన్ని సమీక్షిస్తున్నారు.

'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' కథనం ప్రకారం.. న్యూసౌత్‌వేల్స్‌లోని స్మశానవాటికల చట్టంలో రెండు నెలల కిందట 'సమాధి స్థలాల అద్దె విధానం' ప్రవేశపెట్టారు.

అయితే, దీనిపై ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వస్తుండడం, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో దీన్నిప్పుడు సమీక్షించనున్నారు.

ఈ చట్టం ప్రకారం ఎవరైనా తమవారి శాశ్వత సమాధి స్థలాల లీజు మొత్తాలు చెల్లించడం భారమనుకున్న పక్షంలో ఆ స్థలాన్ని వేరేవారికి 25 నుంచి 99 ఏళ్లకు లీజుకివ్వొచ్చు. ఈ పద్ధతి కొనసాగించాలా వద్దా అన్నది విచారణ అనంతరం నిర్ణయించనున్నారు.

రెన్యువల్ చేసుకోకపోతే రెంటుకిచ్చేస్తారు

న్యూసౌత్‌వేల్స్‌లో సమాధి స్థలాల లీజు మొత్తాలు 2,970 ఆస్ట్రేలియా డాలర్ల నుంచి 4,800 ఆస్ట్రేలియా డాలర్ల వరకు ఉంటాయి.

ఇప్పుడున్న చట్టం ప్రకారం ఏదైనా సమాధి స్థలాన్ని మృతుడి బంధువులు ఫీజు చెల్లించి రెన్యువల్ చేసుకోకపోతే రెండేళ్ల వరకు వేచి చూస్తారు. ఆ తరువాత ఆ సమాధిని తొలగించి స్థలాన్ని ఇతరులకు అద్దెకిచ్చేస్తారు.

అయితే.. యూదులు వంటి కొన్ని మత వర్గాలకు దీన్నుంచి మినహాయింపు ఉంది. ఒకరిని సమాధి చేసిన స్థలాన్ని వేరొకరికి మళ్లీ ఉపయోగించే అవకాశం ఆ మతంలో లేకపోవడంతో ఈ అద్దె విధానం నుంచి వారిని మినహాయించారు. అంటే, యూదుల సమాధి స్థలాలకు ఎలాంటి ముప్పూ లేదన్నమాట.

ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆటాడుకుంటోందని.. సంబంధిత ఫీజులను చెల్లించలేనివారు తమ వారి సమాధులను కోల్పోవాల్సి వస్తుందని ఆస్ట్రేలియాలోని విపక్ష నేతలు అంటున్నారు.

ఇలాంటి విధానం వల్ల డబ్బున్నోళ్లకే సమాధులుండే పరిస్థితి వస్తుందని.. డబ్బు లేనివారు మృతిచెందిన తమ కుటుంబ సభ్యుల స్మారకాలను చూసుకునే అవకాశం కూడా ఉండదని విమర్శిస్తున్నారు.

ఈ చట్టంపై సెప్టెంబరు 7 వరకు ప్రజాభిప్రాయం తెలుసుకోనున్నారు. ఆ తరవాత నెలలో ఈ చట్టాన్ని ఇలాగే కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)