ఉత్తర, దక్షిణ కొరియా కుటుంబాలు: 60 ఏళ్ల కిందట యుద్ధంతో విడిపోయారు.. ఇప్పుడు కలుస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధం ముగిసింది. ఒక దేశం రెండుగా విడిపోయింది. కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఇది ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల కథ. 1950-53 సంవత్సరాల మధ్య కొరియా యుద్ధం జరిగింది. ఆ సమయంలో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. తల్లీబిడ్డలు, భార్యాభర్తలు, బంధువులు.. విసిరేసినట్లు చెల్లాచెదురయ్యారు.
యుద్ధం ముగిసి ఆరు దశాబ్దాలు గడిచాయి. కానీ ఉత్తర కొరియా ప్రజలు దేశం వదిలిపోవడానికి వీలు లేదు. అలా.. దక్షిణ కొరియాలోని తమ బంధువులకు దూరమయ్యారు. ఈ 65 ఏళ్ల కాలంలో కొందరు దక్షిణ కొరియా ప్రజలు మొదటిసారిగా ఉత్తర కొరియాలోని తమ బంధువులను కలుసుకుంటున్నారు. వీరిలో 101 సంవత్సరాల వృద్ధురాలు కూడా ఉన్నారు.
ఇప్పటికీ యుద్ధవాతావరణంలోనే ఉన్న ఈ రెండు దేశాలు ఇలాంటి కలయిక కార్యక్రమాలను గతంలో కూడా నిర్వహించాయి. కానీ గడిచిన మూడేళ్లలో ఇలాంటి కార్యక్రమాన్ని తొలిసారి నిర్వహిస్తున్నారు. దక్షిణ కొరియా ప్రజలను లాటరీ ద్వారా ఎన్నుకుంటారు. వీరిలో చాలా మందికి తమ బంధువులను కలుసుకోవడం ఈ ఆరు దశాబ్దాల కాలంలో ఇదే మొదటిసరి, ఆఖరుసారి కూడా!
ఈ సమావేశానికి ఎవరొస్తారు?
ఈ కార్యక్రమంలో 83 మంది ఉత్తర కొరియా ప్రజలు, 89 మంది దక్షిణ కొరియా ప్రజలు హాజరవుతారు.
ఒక్కో దేశం నుంచి 100 మందికి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కింది. వీరిలో కొందరు, ఉత్తర కొరియాలోని తమ బంధువులు జీవించి లేరని తెలుసుకుని, ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు.
92 ఏళ్ల ఒక వృద్ధురాలు.. యుద్ధం తర్వాత తన కొడుకును తొలిసారి చూడబోతున్నానని రిపోర్టర్లకు తెలిపారు. యుద్ధ సమయంలో తన 4 ఏళ్ల కొడుకు, భర్త తప్పిపోయారని ఆమె ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు.
''ఇలాంటి రోజు వస్తుందని నేనెన్నడూ ఊహించలేదు. నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా నాకు తెలీదు'' అని ఆ తల్లి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''నా వయసు 90 ఏళ్లకు పైనే. నేను ఎప్పుడు చనిపోతానో తెలీదు. ఈ సారి నాకు అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు గాలిలో తేలుతున్నట్లు ఉంది'' అని తన చెల్లెళ్లను చూడబోతున్న మరో వృద్ధురాలు రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు.
ఈ కార్యక్రమానికి ఎందుకంత ప్రాధాన్యం?
రెండు దేశాలు గత 18 ఏళ్లలో ఇలాంటి కార్యక్రమాలను 20 సార్లు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో కొందరికి మాత్రమే అవకాశం దక్కుతుంది. గతంలో నిర్వహించిన కార్యక్రమాల్లో అన్నాచెల్లెళ్లు, తల్లీబిడ్డలు, భార్యాభర్తలు ఒకరినొకరు కలుసుకున్నారు. అవి అత్యంత భావోద్వేగ క్షణాలు.
ఈసారి ఏడుగురికి మాత్రమే తమ తల్లిదండ్రులు లేదా తమ పిల్లలను కలవనున్నారు. తక్కినవారు తమ దగ్గరి బంధువుల కోసం వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
వీరు ఎలా వస్తారు?
దక్షిణ కొరియా ప్రజలు బస్సు ద్వారా కట్టుదిట్టమైన భద్రత మధ్య సరిహద్దు దాటి, ఉత్తర కొరియాలోని మౌంట్ కుమ్‌గాంగ్ టూరిస్ట్ రిసార్ట్‌కు చేరుకుంటారు.
వీరు మూడు రోజులపాటు ఉత్తర కొరియాలో ఉంటారు. కానీ మూడు రోజులకుగాను 11 గంటలు మాత్రమే తమవారితో గడుపుతారు. వీరి కలయికపై నిఘా ఎక్కువగా ఉంటుంది.
ఉత్తర కొరియాలో పేదరికం ఎక్కువ. అందుకని దక్షిణ కొరియా ప్రజలు తమవారిని చూడటానికి వచ్చినపుడు కొత్తబట్టలు, చాక్లెట్లు, మందులు, ఆహారం లాంటివి తీసుకువస్తారు.
''నేను మా అన్నను చూడటానికి వచ్చాను. జీర్ణశక్తి పెరగడానికి, తలనొప్పి తగ్గడానికి, బలానికి ఇంట్లోనే కొన్ని మందులు తయారు చేసి తెచ్చాను'' అని 76 ఏళ్ల వృద్ధుడు రాయిటర్స్‌తో అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే వృద్ధులను కొందరు డాక్టర్లు పర్యవేక్షిస్తుంటారు.

ఫొటో సోర్స్, EPA
మరి.. అవకాశం దక్కనివారి పరిస్థితి?
కొరియా యుద్ధంలో లక్షల మంది ప్రజలు విడిపోయారు. వారిలో వేల సంఖ్యలో ఇంకా దక్షిణ కొరియాలో జీవించి ఉన్నారు. ఉత్తర కొరియాలోని తమవారిని కలవడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి.
'ఇంటర్ కొరియా సెపరేటెడ్ ఫ్యామిలీ అసోసియేషన్’ లేదా కొరియా రెడ్ క్రాస్ లాంటి సంస్థలు ఇలాంటి ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించాయి.
తమవారు కొరియా దేశాలలో కాకుండా విదేశాల్లో ఉంటే వారిని కలిసేందుకయ్యే ఖర్చును దక్షిణ కొరియా ప్రభుత్వం భరిస్తుంది.
ఉత్తర కొరియా ప్రజలు తమవారిని కలిసేందుకు చైనా బ్రోకర్లను ఆశ్రయిస్తారు. ఇలా అనధికారికంగా కలవడానికి లక్షకు పైగా ఖర్చవుతుంది. ఈ విధానంలో పని వేగంగానే అవుతుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ వాతావరణం ఈ మార్గంపై ఎక్కువ ప్రభావం చూపదు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కార్యక్రమానికి నాంది ఎక్కడ?
గత ఏప్రిల్, మే నెలల్లో ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్, దక్షణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ సమావేశమయ్యారు. ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం. ఆ సందర్భంలో ఇరు దేశాధినేతలు ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
కిమ్ జాంగ్, డొనాల్డ్ ట్రంప్ మధ్య గత జూన్ నెలలో సమావేశం జరిగింది. ఇరు దేశాధినేతలూ అణు నిరాయుధీకరణ దిశగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశం వెనుక దక్షిణ కొరియా కీలకపాత్ర పోషించింది.
ఇవి కూడా చదవండి
- బ్యాగరి మహిళలు: శవాల మధ్య బతుకు పోరాటం
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- ఆ రాజ్యానికీ రాజుకూ ఈ అందమైన, బలమైన మహిళా సైనికులే రక్ష
- 'ఈ చర్చలతో కిమ్‌లో మార్పు రాదు': ఉత్తర కొరియా కళాకారులు
- ఉత్తర కొరియాకు మిత్రదేశాలు ఎన్ని?
- ఉత్తర కొరియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఇవే!
- క్రీడల్లో భారత్ కంటే ఉత్తర కొరియానే ముందు!!
- 'ఉత్తర కొరియా జైలులో నేను శవాల్ని పూడ్చిపెట్టాను'
- అసలు ఎవరీ కిమ్?ఉత్తర కొరియా పాలకుడెలా అయ్యారు?
- ‘ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర కొరియాను సందర్శిస్తారా?’
- ఉత్తర కొరియా: ప్రజల కూలి డబ్బుతో ప్రభుత్వ పాలన
- ఉత్తర కొరియా క్రీడా చరిత్ర: ఒకసారి బాంబులు.. మరోసారి రాయబారాలు
- ‘విదేశాలకు వెళ్లాలంటే వీసా చాలు.. ఉత్తర కొరియా వెళ్లాలంటే ధైర్యం కూడా కావాలి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)











