కొరియా సంభాషణలు: ఎలా జరుగుతాయి? ఏం చర్చిస్తారు?

ఫొటో సోర్స్, Getty Images
కిమ్ జాంగ్ ఉన్ ఓ కొత్త అధ్యాయానికి తెరతీయనున్నారు. 1953లో కొరియా యుద్ధం ముగిశాక దక్షిణ కొరియాలో అడుగుపెట్టనున్న తొలి ఉత్తర కొరియా పాలకుడిగా కిమ్ నిలవనున్నారు.
ఏప్రిల్ 27న ప్రారంభం కానున్న ఇంటర్ కొరియా సమ్మిట్‌లో రెండు కొరియా దేశాల నాయకులు పాల్గొననున్నారు.
భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 6గం.కు సరిహద్దు రేఖ దగ్గర దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ స్వయంగా వెళ్లి కిమ్ జాంగ్‌ను కలుస్తారని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు.
ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ చేపడుతుందన్న సూచనలు వస్తున్న క్రమంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ సమావేశాల కోసం రెండు కొరియా దేశాల మధ్య ఉన్న అధికారిక సరిహద్దు రేఖను దాటి కిమ్ ‘డీమిలిటరైజ్డ్ జోన్’లోకి వెళ్తారు.
దాదాపు దశాబ్దం క్రితం రెండు కొరియాల నాయకులు కలిశారు. అప్పటితో పోలిస్తే అణ్వాయుధ, మిసైల్ టెక్నాలజీలో ఉత్తర కొరియా చాలా ముందుకొచ్చింది. అందుకే ఈ చర్చల అనంతరం ఉత్తర కొరియా అణ్వాయుధాలను త్యజిస్తుందని ఊహించడం కష్టమేనన్న భావన నెలకొంది.
‘అణ్వాయుధాలను వదిలిపెట్టే విషయంలో ఇద్దరు నాయకులు ఏ మేరకు ఒప్పుకుంటారో?!’ అని దక్షిణ కొరియా అధ్యక్షుడి అధికార ప్రతినిధి ఇమ్ జాంగ్ సోక్ తెలిపారు.
చాలా నెలలుగా రెండు కొరియా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతూ వస్తున్నాయి. ఆ ఫలితంగానే 2000, 2007 తరవాత మళ్లీ ఇప్పుుడు ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. మెరుగవుతున్న ఈ సంబంధాలే కిమ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సమావేశానికి కూడా మార్గం సుగమం చేశాయి. కిమ్-ట్రంప్ ప్రతిపాదిత సమావేశం మే లేదా జూన్‌లో జరుగనుంది.
కొన్నాళ్లపాటు అణు ప్రయోగాలను నిలిపేస్తున్నట్లు ఉ.కొరియా పాలకుడు కిమ్ గత వారం ప్రకటించారు. దక్షిణ కొరియాతోపాటు అమెరికా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. మరోపక్క చైనాకు చెందిన అధ్యయనకర్తలు మాత్రం గతంలో చేసిన అణు పరీక్ష కారణంగా ఉత్తర కొరియా అణుప్రయోగ కేంద్రం దెబ్బతిందనీ, అది మళ్లీ వినియోగానికి పనికిరాకపోవచ్చనీ పేర్కొన్నారు.
ఉత్తర కొరియా అణు ప్రయోగాలతోపాటు సామాజిక, ఆర్థికపరమైన విషయాలనూ రెండు దేశాల నేతలు చర్చిస్తారని భావిస్తున్నారు. ఈ చర్చలు 1950-53 మధ్య జరిగిన కొరియా యుద్ధానికి లాంఛనంగా ముగింపు పలకొచ్చు.
ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక రోజు పాటు తమ వార్షిక సైనిక విన్యాసాలను నిలిపేస్తున్నట్లు అమెరికా, దక్షిణ కొరియా ప్రకటించాయి.

ఫొటో సోర్స్, Getty Images
సమావేశాలు సాగే తీరిదీ..
ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌తో పాటు వచ్చే తొమ్మిది మంది అధికారులను సరిహద్దు రేఖ వద్ద దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ కలుస్తారని దక్షిణ కొరియా అధ్యక్షుడి అధికార ప్రతినిధి ఇమ్ జాంగ్ సోక్ విలేకరులకు తెలిపారు.
ఆ తరవాత దక్షిణ కొరియా గార్డులు సాదరంగా ఉత్తర కొరియా నాయకులను పన్ముంజోమ్‌లోని సదస్సు ప్రారంభ వేడుకలు జరిగే ప్రాంతానికి తీసుకెళ్తారు. రెండు కొరియా దేశాల మధ్య చర్చలు తరచూ పన్ముంజోమ్‌లోనే జరుగుతుంటాయి.
భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు పన్ముంజోమ్‌లోని శాంతి సౌధం(పీస్ హౌస్)లో అధికారిక చర్చలు ప్రారంభమవుతాయి.
తొలి విడత చర్చలు పూర్తయ్యాక కిమ్, మూన్ విడివిడిగా భోజనానికి వెళ్తారు. ఉత్తర కొరియా బృందం భోజనం కోసం తమ భూభాగంలోకి వెళ్తుంది.

మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో ఇద్దరు నేతలు కలిసి ‘పైన్ ట్రీ’ని నాటుతారు. ఉత్తర, దక్షిణ కొరియాల శాంతి, సౌభాగ్యాలను కాంక్షిస్తూ రెండు దేశాలకు చెందిన మట్టినీ, నీటినీ వాడుతూ ఈ మొక్కను నాటుతారు.
ఆ కార్యక్రమం అనంతరం ఇద్దరూ కలిసి మరో విడత చర్చల్లో పాల్గొనేందుకు వెళ్తారు. రాత్రి విందుకు ముందు నాయకులిద్దరూ ఒప్పందంపై సంతకం చేసి, సంయుక్త ప్రకటన విడుదల చేయడంతో ఈ సదస్సు ముగుస్తుంది.
ఎవరెవరు వస్తారు?
కిమ్‌తోపాటు ఆయన సోదరి కిమ్ యో జాంగ్‌తో సహా తొమ్మిది మంది అధికారులు వస్తారు. ఉత్తర కొరియా అధినేత (హెడ్ ఆఫ్ స్టేట్) కిమ్ యోంగ్-నామ్ కూడా హాజరవుతారు.
గతంలో జరిగిన కొరియా సదస్సులకు భిన్నంగా మిలిటరీ అధికారులు, దౌత్యవేత్తలు కూడా ఈ సదస్సులో భాగం కానున్నారు.
వాళ్లు కూడా అణ్వాయుధాలను వదిలిపెట్టడమే మంచిదని భావిస్తున్నారనీ, శాంతి వైపు మొగ్గు చూపుతున్నందునే సైనికాధికారులనూ సదస్సుకు పంపుతున్నారనీ ఇమ్ జాంగ్ సోక్ అభిప్రాయపడ్డారు.
‘వాళ్లు కొరియా సదస్సుతో పాటు తరవాత అమెరికాతో జరగబోయే చర్చలకు ప్రాధాన్యిమిస్తున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయాలు తీసుకున్నారు’ అని ఆయన అన్నారు.
అధ్యక్షుడు మూన్‌తో పాటు మరో ఏడుగురు అధికారులు దక్షిణ కొరియా తరఫున చర్చల్లో పాల్గొంటారు.

ఫొటో సోర్స్, Getty Images
సదస్సుకు మార్గం ఇలా
రెండు దేశాల మధ్య చాలాకాలంపాటు గంభీరమైన వాతావరణం నెలకొంది. దానికి తెర దించుతూ ఈ జనవరిలో తాను దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధం అని కిమ్ జాంగ్ ప్రకటించడంతో ఈ సదస్సుకు మార్గం సుగమమైంది.
ఆ తరవాత వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో రెండు దేశాలూ ఒకే జెండాతో కవాతు నిర్వహించాయి.
మార్చిలో దక్షిణ కొరియా అధికారులు కిమ్‌ను కలిసి ఈ సదస్సుపై చర్చించారు.
చర్చలకు కిమ్ చూపిన చొరవను సదస్సుకు ముందు ఉత్తర కొరియా మీడియా కీర్తించింది.
‘ఇదొక చరిత్రాత్మక ఘట్టం. శాంతికీ, చర్చలకూ మనం చేస్తున్న ప్రయత్నాలివి’ అని ఉత్తర కొరియా పాలక పక్షం వర్కర్స్ పార్టీకి చెందిన ‘ద రోడొంగ్ సిన్మన్’ పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









