దక్షిణకొరియా సరిహద్దుల్లో మూగబోయిన లౌడ్ స్పీకర్లు!

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కొరియా సరిహద్దుల వద్ద లౌడ్ స్పీకర్ల ద్వారా చేసే ప్రచారాన్ని దక్షిణ కొరియా నిలిపేసింది. ఈ వారం ఇరుదేశాల మధ్య జరగనున్న ఉన్నతస్థాయి సమావేశాల నేపథ్యంలో ఈ చర్యను చేపట్టారు.
దక్షిణకొరియా సరిహద్దుల్లో డజన్ల కొద్దీ లౌడ్ స్పీకర్ల ద్వారా పాప్ మ్యూజిక్ నుంచి ఉత్తరకొరియాలోని ముఖ్యమైన పరిణామాల విశ్లేషణల వరకు ప్రసారం చేస్తుంటారు.
ఈ ప్రసారాలన్నీ ఉత్తర కొరియా సైన్య బలగాలకూ, సరిహద్దుల్లో ఉండే ప్రజలకు స్పష్టంగా వినిపిస్తుంటాయి.
దక్షిణ కొరియాకు దీటుగా ఉత్తరకొరియా కూడా తన సరిహద్దుల్లో దక్షిణ కొరియా, దాని మిత్రదేశాలను విమర్శిస్తూ స్పీకర్ల ద్వారా ప్రచారం చేస్తుంటుంది. అయితే దక్షిణ కొరియా చర్యకు ప్రతిగా ఉత్తర కొరియా కూడా తన స్పీకర్లను కట్టేసిందా, లేదా అన్నది ఇంకా తెలియలేదు.
''ఇరు కొరియాల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగేందుకే లౌడ్ స్పీకర్లను నిలిపేశాం'' అని దక్షిణకొరియా ప్రతినిధి చొయి హోయి-హ్యున్ మీడియాకు వెల్లడించారు.
చర్చలతో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో నూతన అధ్యాయం మొదలవుతుందని ఆయన అన్నారు.
కొరియా యుద్ధం జరిగినప్పటి నుంచి దక్షిణ కొరియా సరిహద్దుల్లో ఇలా లౌడ్ స్పీకర్ల ప్రచారాన్ని చేస్తోంది. అయితే మధ్యమధ్యలో దానికి విరామం కూడా ఇస్తుంటుంది. ఉత్తరకొరియా సైనికులకు తమ నేతల మాటలపై అనుమానం వచ్చేలా చేయడమే ఈ ప్రచార యుద్ధం లక్ష్యం.
సరిహద్దుల్లో స్పీకర్ల సంఖ్య ఇరుదేశాల మధ్య పరిస్థితులను బట్టి పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది.
2004లో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం ఈ ప్రచారాన్ని నిలిపేశారు.
కానీ 2015లో మిలటరీరహిత జోన్‌లో ఉత్తరకొరియా పాతిపెట్టిన బాంబుల కారణంగా దక్షిణకొరియా సైనికులు కొందరు గాయపడ్డంతో మళ్లీ లౌడ్ స్పీకర్ల ప్రచారం ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Getty Images
గత వారాంతంలో అణు, క్షిపణి పరీక్షలను నిలిపేస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. దక్షిణ కొరియా, అమెరికాలతో చారిత్రాత్మక చర్చలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరకొరియా ప్రకటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే-యిన్ ఈ ప్రకటనను స్వాగతిస్తూ, దీని వల్ల కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడ్డారు.
మూన్‌ను కిమ్ జోంగ్-ఉన్ శుక్రవారం పాన్‌మున్‌జమ్ గ్రామంలో కలవనున్నారు. సుమారు దశాబ్దం అనంతరం ఉభయ కొరియాల అధినేతల మధ్య జరుగుతున్న సమావేశం ఇది.
కిమ్ జూన్ నాటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కూడా కలిసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








